“బడికి పోయే ముందే నేనీ పనులన్నీ చేయాలి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు?” తల్లి పాలు తాగటానికి దూడను వదులుతూ 15 ఏళ్ల కిరణ్ అడిగింది. అప్పుడు సమయం పొద్దున్నే 5 గంటలు. అనారోగ్యంగా ఉన్న ఆమె తల్లి, ఆమె తమ్ముడు రవి, వారి ఒంటిగది ఇంట్లో ఇంకా నిద్రపోతూనేవున్నారు. ఇల్లు శుభ్రం చేసుకునే ముందు ఆమె దూడను మళ్ళీ కట్టేశాక, ఆమె తాత వచ్చి ఆవు పాలు పిండుతారు.
కిరణ్ రోజూలాగే పెందలాడే నిద్ర లేచింది. కానీ ఈ రోజు పని చేయటానికి కానీ, బడికి వెళ్లటానికి కానీ ఆమె సిద్ధంగా లేదు. అలసట ఎక్కువగా ఉండే రోజుల్లో ఒకటైన బహిష్టు మొదటి రోజు అది. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుండి ఆమెకు కడుపులో కండరాలు తిమ్మిరిపట్టేయడం ఇంకా అధ్వాన్నం అయింది. అలా ఉన్నాకూడా ఆమె తన పనులను తప్పనిసరిగా ఉదయం 6:30కల్లా ముగించేసేయాలి. “ఉదయపు ప్రార్థన 7 గంటలకు మొదలవుతుంది. బడికి నడిచి వెళ్లటానికి నాకు 20-25 నిమిషాలు పడుతుంది,” అంటుందామె.
కిరణ్ దేవి 11వ తరగతి చదువుతున్న ప్రభుత్వ బడి ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లా కర్వీ తెహసిల్‌లో ఉన్న ఆమె ఇంటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె, తన తమ్ముడు రవి, 40 సంవత్సరాల తల్లి పూనమ్ దేవి, 67 సంవత్సరాల తాత ఖుషీరామ్‌తో కలిసి అక్కడ జీవిస్తోంది. ఇంటి వెనుకనే ఉన్న 800 చదరపు అడుగుల పొలాన్ని వాళ్ల తాత చూసుకొంటారు. ఆ స్థలంలో వాళ్లు గోధుమ, శనగ, ఒక్కోసారి ఆయా కాలాల్లో పండే కూరగాయలను పండిస్తారు. పూనమ్‌కు మణికట్టులో, మోకాళ్ళలో విపరీతమైన నొప్పి ఉంది. ఆ నొప్పి ఆమెను ఇంటిపనులు చేయనివ్వదు. అందువలన కిరణ్ ఎక్కువ బాధ్యతలతో తలమునకలు అవుతోంది.
కిరణ్ రోజువారీ చేసేపని ఇప్పుడు నొప్పి కలిగించే కసరత్తుగా మారింది. “ఈ చిన్న చిన్న పనులు చేయటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ బహిష్టు కండరాల తిమ్ముర్లు వచ్చినపుడు మాత్రం సమస్య అవుతుంది.”












