"మేం కొన్ని తరాలుగా రెండే పనులు చేస్తున్నాం - పడవ నడపటం, చేపలు పట్టటం. ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులను చూసినప్పుడు, నా పిల్లలు ఈ పనుల్లోనే కొనసాగాల్సి వస్తుందని నాకనిపిస్తోంది," అంటారు విక్రమాదిత్య నిషాద్. ఆయన గత 20 ఏళ్ళుగా వారణాసికి వచ్చే తీర్థయాత్రికులను, పర్యాటకులను గంగానది ఒక ఘాట్ (ఒడ్డు) నుంచి మరోదానికి తన పడవపై తిప్పుతుంటారు.
వెయ్యి కిలోమీటర్ల మేర గంగానది ప్రవహించే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ళలో నిరుద్యోగం 50 శాతం దగ్గర నిలిచిపోయిందని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 తెలియజేసింది.
“మోదీజీ ‘వోకల్ ఫర్ లోకల్’, ‘విరాసత్ హై వికాస్ [వారసత్వ సంపదే అభివృద్ధి]’ కోసం ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ విరాసత్ [వారసత్వ సంపద] ఎవరి కోసం ఉందో చెప్పండి? మా కాశీ [వారణాసి] ప్రజల కోసమా లేక బయటివాళ్ళ కోసమా?” అని అడిగారతను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుండి మూడవసారి ఎన్నికయ్యారు, అతని ప్రచారం చేదు రుచిని మిగిల్చిందని అంటోన్న నిషాద్, "ఆ అభివృద్ధి ఏదో మనం తప్పక చూడాలి," అన్నారు.






