"మేం చదువుకుందామని కూర్చున్నప్పుడు ఇంటి పైకప్పు నుంచి మా పుస్తకాల మీదకు వాన నీరు బొట్లుబొట్లుగా కారుతుంటుంది. కిందటి సంవత్సరం (2022) జులైలో మా ఇల్లు కూలిపోయింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది," అంటాడు ఎనిమిదేళ్ళ విశాల్ చవాన్ బరువైన రాళ్ళు, వెదురు బొంగులతో కట్టిన తన ఇంటి గురించి మాట్లాడుతూ.
ఆళేగావ్ జిల్లా పరిషత్తు బడిలో మూడవ తరగతి చదువుతున్న విశాల్ కుటుంబం, మహారాష్ట్రలో సంచార తెగగా నమోదయిన బేల్దార్ సముదాయానికి చెందినది.
"వర్షం పడినప్పుడు పాక లోపల ఉండడం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది... నీరు చాలా చోట్ల నుంచి కారుతుంటుంది," అంటాడు విశాల్. అందుకని, శిరూర్ తాలూకా ఆళేగావ్ పాగా అనే ఊరిలో ఉన్న తమ ఇంటిలో చదువుకోడానికి విశాల్, అతని తొమ్మిదేళ్ళ వయసున్న అక్క వైశాలి, పైకప్పు నుంచి నీరు కారని చోటు కోసం వెతుకుతూ ఉంటారు
చదువు మీద ఈ అక్కాతమ్ముళ్ళకున్న మక్కువే 80 ఏళ్ళ వయసున్న వాళ్ళ నాయనమ్మ శాంతాబాయి చవాన్‌ను చాలా గర్వపడేలా చేస్తుంది. "మా మొత్తం ఖాన్‌దాన్ (కుటుంబం)లో ఎవ్వరూ బడికి పోలేదు," అంటారావిడ, "నా మనవడు, మనవరాలే చదవడం రాయడం నేర్చుకున్న మొదటివారు."
తన మనవడు, మనవరాలి గురించి మాట్లాడేటప్పుడు ముడతలు పడిన ఆమె ముఖంలో గర్వంతో కూడిన బాధల నీడలు కనపడతాయి. "వాళ్ళు సౌకర్యంగా చదువుకోవడానికి మాకు పక్కా ఇల్లు లేదు. సరైన వెలుతురు కూడా లేదు," అంటారు, ఆళేగావ్ పాగా వస్తీలోని తమ టార్పాలిన్ పాకలో ఉన్న శాంతాబాయి.












