"నేనొక చిత్రకారిణినని నాకు అనిపించదు. చిత్రకారులకు ఉండే లక్షణాలు నాకు లేవు. అయితే నా దగ్గర కథలున్నాయి. నా కుంచెతో కథలను రాసే ప్రయత్నం చేస్తాను. నా గీతలన్నీ పరిపూర్ణమైనవని నేను చెప్పుకోను. గత రెండుమూడేళ్ళుగా మాత్రమే నేను అనేకమంది చిత్రకారుల కృషిని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాను. లేకుంటే, నాకెటువంటి జ్ఞానమూ లేదు. ఒక కథను చెప్పటానికి నేను చిత్రాలు గీశాను. కథ చెప్పగలిగినందుకు నేను ఆనందపడతాను. నేనొక కథన రచన చేస్తున్నట్టుగా చిత్ర రచన చేస్తాను.“
లావణి పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని ధుబూలియాకు చెందిన ఒక కళాకారిణి, చిత్రకారిణి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ గ్రామంలో ఒక విమానాశ్రయంతో కూడిన సైనిక శిబిరం ఉండేది. బ్రిటిష్‌వారు ఆ శిబిరాన్ని స్థాపించినప్పుడు ఎక్కువగా ముస్లిములు నివాసముండే ఈ గ్రామం చాలా వ్యవసాయ భూమిని కోల్పోయింది. ఆ తరువాత దేశవిభజన జరిగినప్పుడు గ్రామానికి చెందిన చాలామంది సరిహద్దుకు అవతలి వైపుకు వెళ్ళిపోయారు. "కానీ మేం వెళ్ళలేదు," లావణి చెప్పారు. "మా పెద్దలు వెళ్ళిపోవాలనుకోలేదు. మా పూర్వీకులు ఈ భూమిలోనే సమాధి అయ్యారు. మేం జీవించి, చనిపోవాలనుకుంటున్నది ఇక్కడే.” భూమితో ఉన్న ఆ అనుబంధం, ఆ భూమి పేరు మీద జరిగేవన్నీ చిన్నప్పటి నుంచీ ఈ కళాకారిణిలోని సున్నితత్వానికి రూపునిచ్చాయి.
చిత్రలేఖనంపై ప్రోత్సాహం ఆమెకు ఆమె తండ్రి నుండి వచ్చింది. ఆయన ఆమెను చిన్నతనంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక ట్యూటర్ వద్దకు తీసుకెళ్ళారు. తన 10 మంది తోబుట్టువులలో ఆమె తండ్రి ఒక్కరే మొదటి తరం అభ్యాసకుడు. అట్టడుగు స్థాయిలో పనిచేసే న్యాయవాది అయిన ఆయన రైతులు, కూలీల కోసం సహకార సంఘాలను ప్రారంభించారు, కానీ పెద్దగా డబ్బు సంపాదించలేదు. "ఆయన ఏమాత్రం డబ్బు సంపాదించినా, దాన్లోంచి నాకొక పుస్తకం కొనేవాడు," అని లావణి చెప్పారు. “మాస్కో ప్రెస్, రాదుగ పబ్లిషర్స్ నుండి చాలా పిల్లల పుస్తకాలు బంగ్లా అనువాదాల రూపంలో మా ఇంటికి వచ్చేవి. ఈ పుస్తకాల్లోని బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. నేను బొమ్మలు వేయడానికి తొలి ప్రేరణ అక్కడి నుంచే వచ్చింది.”
చిన్న వయస్సులోనే తండ్రి ఆమెకు పరిచయం చేసిన చిత్రలేఖనంలో శిక్షణ ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ 2016లో భాష ఆమెను విడిచిపెట్టడం ప్రారంభించినప్పుడు, లావణికి చిత్రలేఖనం పట్ల ప్రేమ తిరిగి వచ్చింది. రాజ్యం ఉదాసీనవైఖరి వలన మైనారిటీలను ఉద్దేశపూర్వకంగా హింసించడం, అటువంటి ద్వేషపూరిత నేరాల పట్ల జనబాహుళ్యం పెడముఖం పెడుతున్న నేపథ్యంలో దేశంలో మూక హత్యలు పెరిగిపోయాయి. అప్పుడే కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పూర్తి చేసిన లావణి ఈ దేశపు వాస్తవికతలను చూసి చాలా కలతపడ్డారు, అయినా దాని గురించి రాయలేకపోయారు.
"చాలా తీవ్రమైన అసౌకర్య భావన ఉండేది," ఆమె చెప్పారు. “నాకు అప్పటి వరకు రాయడమంటే చాలా ఇష్టంగా ఉండేది, బంగ్లాలో కొన్ని వ్యాసాలు రాసి ప్రచురించాను. కానీ అకస్మాత్తుగా భాష పూర్తిగా సరిపోదని అనిపించింది. నేనప్పుడు అన్నిటి నుంచీ పారిపోవాలనుకున్నాను. అప్పుడే బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. దొరికిన ప్రతి చిన్న కాగితంపై సముద్రాన్ని, దాని అన్ని అవస్థలలో, నీటి రంగులలో చిత్రించేదాన్ని. అప్పట్లో[2016-17] ఒకదాని తర్వాత ఒకటిగా సముద్రం మీద చాలా బొమ్మలు వేశాను. అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచంలో శాంతిని వెదుక్కోవడానికి బొమ్మలు వేయడమే నా మార్గంగా ఉండేది.”
ఈనాటికీ లావణి స్వయంబోధిత కళాకారిణిగానే ఉన్నారు.




























