“నేను కట్టే ప్రతి ఝోపడీ (గుడిసె) కనీసం 70 సంవత్సరాల వరకు నిలుస్తుంది.”
కొల్హాపుర్ జిల్లా జాంభళీ గ్రామంలో నివసించే విష్ణు భోస్లేకు ఒక అరుదైన నైపుణ్యం ఉంది – ఆయన ఝోపడీ (సంప్రదాయక గుడిసె)ని నిర్మిస్తారు.
చనిపోయిన తన తండ్రి గుండు దగ్గర కొయ్య చట్రం, గడ్డి పైకప్పుతో గుడిసెను నిర్మించే కళను నేర్చుకున్నారు 68 ఏళ్ళ విష్ణు. ఇప్పటి వరకు అతను కనీసం 10 గుడిసెలకు పైగా నిర్మించారు; అంతే సంఖ్యలో గుడిసెల నిర్మాణానికి సహకరించారు. “పొలాల్లో పెద్దగా పని ఉండదు కనుక, మేం (సాధారణంగా) వేసవికాలంలో మాత్రమే వాటిని నిర్మిస్తాం. అప్పట్లో జనాలు గుడిసెలు నిర్మించడంలో భలే ఉత్సాహం చూపించేవారు,” అని అతను గుర్తుచేసుకున్నారు.
దాదాపు 1960ల వరకు, జాంభళీలో అలాంటి గుడిసెలు వందకు పైగా ఉండేవని విష్ణు గుర్తుచేసుకున్నారు. సమీపంలో దొరికే వస్తువులను ఉపయోగించి, గుడిసెల నిర్మాణంలో స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకునేవారని ఆయన చెప్పారు. "గుడిసె నిర్మాణానికి మేం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఖర్చు చేసే స్తోమత ఎవరికీ లేదు. గుడిసెల కోసం ప్రజలు మూడు నెలల వరకు కూడా వేచి ఉండడానికి సిద్ధంగా ఉండేవారు. అందుకు కావలసిన సాహిత్య (ముడిసరుకు) సమకూరినప్పుడే నిర్మాణాన్ని ప్రారంభించేవారు.” అన్నారాయన
శతాబ్దం చివరి నాటికి, 4,963 మంది జనాభా (2011 జనగణన ప్రకారం) ఉన్న ఈ గ్రామంలో, కొయ్య-గడ్డి నిర్మాణాల స్థానంలో ఇటుక, సిమెంట్, రేకుల నిర్మాణాలు వచ్చాయి. మొదట్లో స్థానిక కుమ్మరులు తయారుచేసే ఖాపరీ కౌలు (ఇంటి పైకప్పున వేసే పెంకులు) లేదా కుంభారీ కౌలుల నుండి; ఆ తరువాత మెరుగైన బలం, మన్నిక కలిగి, యంత్రాలతో తయారయ్యే బెంగళూరు కౌలుల నుండి ఎదురైన పోటీని ఈ గుడిసెలు తట్టుకోలేకపోయాయి.
గడ్డి ఝోపడీ నిర్మాణానికి అవసరమయ్యే శ్రమతో పోలిస్తే, పెంకుల నిర్వహణ తేలిక; వాటితో ఇళ్ళను సులభంగా, వేగంగా కూడా నిర్మించవచ్చు. చివరగా, సిమెంట్-ఇటుకలతో పక్కా గృహాల నిర్మాణం మొదలయ్యాక, ఝోపడీల నిర్మాణం తగ్గుముఖం పట్టింది. జాంభళీలోని ప్రజలు తమ ఝోపడీలను వదిలేయటం మొదలయింది. ప్రస్తుతం కొన్ని ఝోపడీలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి.
“ఇప్పుడు ఊరిలో చాలా అరుదుగా ఝోపడీలు కనబడతాయి. మున్ముందు శ్రద్ధ వహించే వాళ్ళు ఉండరు కాబట్టి, మరి కొన్నేళ్లలో ఈ సంప్రదాయ గుడిసెలు కనుమరుగవుతాయి,” అంటూ విష్ణు నిట్టూర్చారు.





























