“మిర్చి, లసూన్ (వెల్లుల్లి), అద్రక్ (అల్లం)... సొర, కరేలా (కాకర) ఆకులు,... బెల్లం.”
ఈ మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, కాకరకాయలు ఏదో వంటకం తయారీ కోసమైతే కాదు… పన్నా టైగర్ రిజర్వ్‌ను ఆనుకొని ఉన్న చున్గునా గ్రామంలో, శక్తివంతమైన ఎరువుల, క్రిమిసంహారక మందుల తయారీ కోసం సేంద్రియ రైతయిన గులాబ్‌రాణి ఉపయోగించే పదార్థాలు ఇవి.
సదరు జాబితా విన్న మొదట్లో తను బిగ్గరగా నవ్వానని ఈ 53 ఏళ్ళ మహిళ గుర్తు చేసుకున్నారు. “ఇవన్నీ నేను ఎక్కడ సంపాదించాలి అనుకున్నాను. కానీ, అడవిలో పెంచుతోన్న తీగజాతి మొక్కల సంగతి గుర్తొచ్చింది.” బెల్లం లాంటి పదార్థాలను ఆమె మార్కెట్‌లో కొనుగోలు చేయవలసి వచ్చింది.
ఆవిడ ఏం తయారు చేస్తుందోనన్న అనుమానంతో పొరుగింటివారు ఆమెకి ఎలాంటి సహాయం అందించలేదు. అయితే, జనాలు ఏమనుకుంటున్నారో అని గులాబ్‌రాణి ఎప్పుడూ ఆలోచించలేదు. దాదాపు 500 మంది జనాభా ఉన్న తన గ్రామంలో, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసిన మొదటి వ్యక్తి ఆవిడే అవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
“మనం మార్కెట్‌లో కొనే ఆహారంలో ఏవేవో మందులుంటాయి. పైగా, ఎన్నో రకాల రసాయనాలను కూడా వాటి లోపలికి ఎక్కిస్తారు. అలాంటప్పుడు వాటిని మనం ఎందుకు తినాలి?” నాలుగేళ్ళ క్రితం తన ఇంట్లో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్నారామె.
“అందుకే, సేంద్రియ పద్ధతిని అవలంబించడం ఒక మంచి ఆలోచన అని నా కుటుంబం భావించింది. జైవిక్ (సేంద్రీయ పద్ధతిలో పండించిన) ఆహారాన్ని తింటే, మా ఆరోగ్యాలకి మేలు జరుగుతుందని మేమంతా భావించాం. జైవిక్ ఎరువులను వాడితే, తెగుళ్ళ స్వాస్థ్ (ఆరోగ్యం) దెబ్బతింటుంది; మన ఆరోగ్యం బాగుపడుతుంది,” తన హాస్యాన్ని తానే ఆస్వాదిస్తూ అన్నారామె.
















