అస్సామ్ ఖోల్ డ్రమ్ముల శబ్దం బెంగాలీ ఖోల్ శబ్దం కంటే మంద్రస్థాయిలో ఉంటుంది. నెగెరా కంటే ఢోల్ స్థాయి హెచ్చుగా ఉంటుంది. ఈ విషయం గిరిపద్ బాద్యకార్‌కు బాగా తెలుసు. తట్టు వాయిద్యాలను తయారుచేసే ఈయన, తన రోజువారీ పనులలో ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
అస్సామ్‌లోని మాజులీలో ఉండే ఈ అనుభవజ్ఞుడైన కళాకారుడు మాట్లాడుతూ, “అబ్బాయిలు తమ స్మార్ట్‌ఫోన్‌లను నాకు చూపించి, ట్యూనింగ్‌ను నిర్దిష్ట స్థాయికి సర్దుబాటు చేయమని అడుగుతుంటారు," అన్నారు. "అందుకు మాకు యాప్ అవసరం లేదు."
ట్యూనర్ యాప్‌తో కూడా, ఈ ప్రక్రియను అనేక విధాలుగా ప్రయత్నించి చివరకు సాధించడమేనని గిరిపద్ వివరించారు. ఇందుకు తట్టు వాయిద్యపు తోలు పొరను సరిగ్గా అమర్చి, బిగించడం అవసరం. "అప్పుడే ట్యూనర్ యాప్ పని చేస్తుంది."
గిరిపద్, ఆయన కొడుకు పదుమ్‌లు సుదీర్ఘమైన వాద్యకారుల శ్రేణికి చెందినవారు. ధులి లేదా శబ్దకార్ అనే పేరుతో పిలిచే ఈ సముదాయం, సంగీత వాద్యాలను తయారుచేయటానికీ, మరమ్మత్తులు చేయటానికీ ప్రసిద్ధి చెందింది. త్రిపుర రాష్త్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా అయివుంది.
పదుమ్, గిరిపద్‌లు ప్రధానంగా ఢోల్, ఖోల్, తబలాలను తయారుచేస్తారు. "ఇక్కడ సత్రాలు ఉండటంవలన, మాకు ఏడాది పొడవునా పని ఉంటుంది," అన్నాడు పదుమ్. "అందువల్ల మాకు సరిపోయేంత సంపాదన కూడా ఉంటుంది."













