"నా వీపు ఈ ఎండకి కమిలిపోయింది. ఈ మధ్య కాలంలో ఇక్కడ వేడి బాగా పెరిగింది. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది," అని తను పండించిన బాజ్రా (సజ్జలు) దిబ్బల వైపు దీనంగా చూస్తూ బజ్రంగ్ గోస్వామి బాధపడ్డారు. రాజస్థాన్ చూరూ జిల్లా తారానగర్ తహసీల్‌లోని (తాలూకా) గాజువాస్ గ్రామం వెలుపల ఉన్న ఖేజ్రీ (జమ్మి) చెట్ల నీడలో అతను సేద తీరుతూ కనబడ్డారు. ఆ పక్కనే బజ్రంగ్ గోస్వామి, అతని భార్య రాజ్కౌర్ వాటాదారులుగా సాగు చేస్తున్న 22 బిఘాల (దాదాపు 6.6 లక్షల చదరపు గజాలు) భూమిలో ఒక ఒంటె ఎండు గడ్డి తింటూ కనబడింది.
"ఒక పక్క నడినెత్తిపై సూర్యుడు మండుతుంటే, మరో పక్క పాదాల కింద ఇసుక కాలుతోంది," అని తారానగర్‌కు దక్షిణంగా ఉన్న సుజన్‌గఢ్ తహసీల్‌కు చెందిన గీతాదేవి నాయక్ విస్తుపోయారు. “గర్మీ హీ గర్మి పడే హై ఆజ్ కల్ (ఈ మధ్య కాలం లో వేడి చాలా ముదిరిపోయింది),” అన్నది భగ్వాని దేవి. గూడవారి గ్రామంలో భగ్వానీదేవి చౌదరి కుటుంబానికి చెందిన భూమిలో, వితంతువైన గీతాదేవి వ్యవసాయ కూలిగా పని చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల కల్లా అక్కడ తమ పని పూర్తి చేసుకుని, ఇద్దరు మహిళలూ తిరిగి ఇంటికి వెళ్తారు.
ఉత్తర రాజస్థాన్‌లోని చూరూ జిల్లాలో, వేసవి కాలంలో ఇసుక నేల సెగలు కక్కుతుంటే, మే-జూన్‌లలో గాలి నిప్పుల కొలిమిలా మారుతుంది. మండుతున్న ఎండలు, పెరుగుతున్న తాపం గురించి చర్చించుకోవడం ఇక్కడ ప్రజలకు పరిపాటి. ఆ రెండు నెలలూ ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంటుంది. గత నెల మే 26 (2020)న, అది ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంది. ఇదొక ప్రపంచ రికార్డు అని వార్తా కధనాలు కూడా వచ్చాయి.
గత సంవత్సరం (2019) జూన్ ప్రారంభంలో, చూరూలో 51 డిగ్రీల సెల్సియస్ (నీరు మరిగే ఉష్ణోగ్రతకి సగం కంటే కొంచెం ఎక్కువ) నమోదైనప్పుడు, చాలా మందికి ఇదేమంత ప్రాముఖ్యమైన విషయంగా అనిపించలేదు. "ఎందుకంటే సుమారు 30 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది," అని రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడే కాక భూయజమాని కూడా అయిన 75 ఏళ్ల హర్దయాల్జీ సింగ్,, గాజువాస్ గ్రామంలో తన విశాలమైన ఇంటి ఆవరణలో వున్న నవారు మంచంపై విశ్రాంతి తీసుకుంటూ గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే, దేశంలో ప్రధాన మైదాన ప్రాంతాలలో ఒకటైన చూరూలో, డిసెంబర్-జనవరి నెలల్లో సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఫిబ్రవరి 2020 లో ఇక్కడ 4.1 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.


















