ఈ రోజు మనం 170 మంది వ్యక్తులతో కూడిన, PARI ఏకైక అనువాద బృందంలో అద్భుత విజయాలు జరుపుకుంటున్నాము. ఇందులో ప్రతీ నెల కనీసం 45 మంది క్రియాశీలకంగా పాల్గొంటారు. ఇలా మేమంతా ఈ సంస్థలో ఉన్నతమైన ఉద్దేశాలతో పనిచేస్తున్నాము. ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 30 వ తేదీని అంతర్జాతీయ అనువాద దినంగా ప్రకటించింది.
ఈ రోజు, అనువాదకుల గురించి UN, "భాషా నిపుణుల పనికి నివాళి అర్పించడానికి ఒక అవకాశం, ఇది దేశాలను ఒకచోట చేర్చడంలో, సంభాషణ, అవగాహన మరియు సహకారాన్ని సులభతరం చేయడంలో, అభివృద్ధికి దోహదం చేయడం ..." ఇంకా చాలా పనులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని తెలియ చెప్పింది. కాబట్టి ఈ రోజు, వేరే ఏ ఇతర జర్నలిజం వెబ్సైట్లోను మాకు సమానమైన అనువాద బృందం లేదని మేము నమ్ముతూ వారికి వందనం అర్పిస్తున్నాము.
మా అనువాదకులలో వైద్యులు, భౌతిక శాస్త్రవేత్తలు, భాషావేత్తలు, కవులు, గృహిణులు, ఉపాధ్యాయులు, కళాకారులు, పాత్రికేయులు, రచయితలు, ఇంజనీర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లు ఉన్నారు. మా అనువాదకులలో అతి పెద్దవారి వయసు 84 అయితే అతి చిన్నవారి వయసు 22. ఇందులో కొందరు ప్రవాస భారతీయులు అయితే మరి కొందరు దేశంలోని మారుమూల ప్రదేశాలలో, చాలా తక్కువ అంతర్జాల కనెక్టివిటీతో నివసిస్తున్న వారు ఉన్నారు.
PARI యొక్క భారీ అనువాద కార్యక్రమం, తనకున్న పరిమితులు, స్థాయిలతో, ఈ దేశాన్ని కూడగట్టి, దేశపు భాషల పట్ల గౌరవాన్ని, సమానమైన స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. PARI సైట్లోని ప్రతి కథనం 13 భాషల్లో అందుబాటులో ఉంది - లేదా అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ 13 భాషలలో ఒక సాధారణ PARI ప్రచురణ ఉంది: మన స్వాతంత్ర్యాల కై భగత్ సింగ్ జుగ్గియన్ పోరాటం. ఇప్పటిదాకా మా బృందం దాదాపు 6,000 ప్రచురణలు చేసింది, వాటిలో చాలా ప్రచురణలు మల్టీమీడియా ద్వారా జరిగాయి.



