ఠేలూ మహతో, నేను రాసిన పుస్తకం, ది లాస్ట్ హీరోస్లో కనిపించే, అప్పటికీ సజీవంగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులలో బహుశా అతి పెద్దవయసువారు, గురువారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పురులియా జిల్లాలోని పిరాహ్ గ్రామంలో తన ఇంటిలో మరణించారు. పుస్తకాన్ని ప్రచురించినప్పటికి జీవించి ఉండి, దాన్ని అందుకున్నవారిలో అతను మొదటివారు. ఇప్పుడంతా మరచిపోయినా, 1942లో పురులియాలోని 12 పోలీసు స్టేషన్లపై జరిగిన చారిత్రాత్మకమైన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారిలో ప్రాణాలతో ఉన్న చివరి వ్యక్తి ఈయనే. ఠేలూ వయస్సు 103 నుండి 105 సంవత్సరాల మధ్య ఉంటుంది.
ఈయన మరణంతో మనం, మన స్వతంత్రం కోసం పోరాడి, భారతదేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా నిలబెట్టడంలో సహాయపడిన ఒక బంగారు తరాన్ని కోల్పోవటంవైపుగా మరో అడుగు ముందుకేశాం. మన దేశంలోని కొత్త తరాలవారు భారత దేశ స్వాతంత్ర్య సమరయోధుల గురించి వినే, చూసే, మాట్లాడే అవకాశాన్ని పొందలేరు. వాళ్ళెవరో, ఎందుకోసం పోరాడారో- స్వతంత్రం కోసమే వారెందుకు పోరాడారో మరి వారికిక చెప్పేవాళ్ళుండరు.
ఠేలూ మహతో, ఆయన జీవితకాల సహచరుడు లక్ఖీ మహతో తమ కథను చెప్పటానికి చాలా ఆసక్తితో ఉండేవారు. తాము తమ దేశం కోసం నిలబడ్డారనీ, అలా చేసినందుకు చాలా గర్వపడుతున్నారనీ ఇప్పటి యువతరం, కొత్త తరాలవాళ్ళు తెలుసుకోవాలని చాలా ఆతృతపడేవారు. ఠేలూ ఇక తన కథను చెప్పలేరు. రానున్న ఐదారేళ్ళలో ఆయన తరానికి చెంది, జీవించి ఉన్న మిగిలినవారు కూడా తమ కథలను చెప్పలేరు.
అది భావి యువ భారతీయులకు ఎంత నష్టం కాబోతోంది! మన కాలపు ఠేలూలు, వారి త్యాగాలు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి వారి కథలు ఎందుకు చాలా ముఖ్యమైనవి అనే దాని గురించి చాలా తక్కువ తెలిసిన, ఇంకా నేర్చుకునే అవకాశం కూడా లేని మన ప్రస్తుత తరాలకు ఇది ఇప్పటికే ఎంతో నష్టం.
ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను ఒక కల్పిత కథగానూ, కనిపెట్టినదిగానూ, బలవంతంగా రుద్దినదిగానూ తిరిగి రాయబడని యుగంలో. బహిరంగ ప్రసంగాలలో, మీడియాలోని ముఖ్యమైన విభాగాల విషయాలలో, మరింత భయంపుట్టించే విధంగా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ హత్యకు సంబంధించిన కీలకమైన నిజాలు బడిపిల్లల పాఠ్య పుస్తకాలలో క్రమంగా చెరిపివేయబడుతున్న సమయంలో…






