“ మై తేజ్ దౌడ్ కే ఆఊంగా, ఔర్ కూనో మే బస్ జాఊంగా (నేను పరుగు పరుగున వచ్చి కూనోలో స్థిరపడతాను).”
వినాలనుకునేవారు, లేదా చదవగలిగేవారితో ‘చింటూ’ అనే చిరుత ఒక పోస్టర్ ద్వారా ఇదే చెబుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఆరు నెలల క్రితం ఈ పోస్టర్‌ని విడుదల చేసింది. పోస్టర్‌లో ఉన్న ‘స్నేహపూర్వక చిరుత’ చింటూ, ఇక నుండి ఆ అటవీ ప్రాంతంలోనే ఉండబోతుందన్న సందేశం, కూనో జాతీయ ఉద్యానవనం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ చేరింది.
చింటూ ఉండాల్సింది తన తోటి 50 ఆఫ్రికన్ చిరుతలతోనే కానీ, బాగ్చా గ్రామంలో ఉండే 556 మంది మనుషులతో కాదు. ఈ ఆదివాసులను వారి ఆవాసాల నుంచి తొలగించి వేరొకచోటికి మార్చబోతున్నారు. ఈ ప్రవాసం, ప్రధానంగా అడవులతో పెనవేసుకుపోయి జీవించే సహరియా ఆదివాసుల జీవనోపాధికీ, వారి దైనందిన ఉనికికీ విఘాతం కలిగించబోతోంది.
ఇతర దేశాల నుండి తెచ్చిన చిరుతలను చూసేందుకు, ఎంతైనా ఖర్చు పెట్టి మరీ సఫారీ రైడ్‌లను ఏర్పాటు చేసుకోగలిగిన పర్యాటకులు మాత్రమే ఈ జాతీయ ఉద్యానవనానికి వస్తుంటారు. ఇది సహజంగానే ఎక్కువమంది దారిద్య్రరేఖకు దిగువగా ఉండే స్థానిక నివాసితులను అక్కడినుంచి తొలగిస్తుంది..
ఇదిలా ఉంటే, ‘ప్రియమైన’ ఈ మచ్చల పిల్లి పోస్టర్లను, కార్టూన్లను చూసి, అభయారణ్యానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైరా జాటవ్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల సత్యన్ జాటవ్ లాంటి పిల్లలు గందరగోళంలో పడ్డారు. “ఇది మేకనా?” అని ఆ అబ్బాయి తన తండ్రిని అడిగాడు. నాలుగేళ్ళ వయసున్న అతని తమ్ముడు అనురోధ్, అదొక రకమైన కుక్క అయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
చింటూ గురించిన ప్రకటన తర్వాత, పోస్టర్ల రూపంలో రెండు వివరణాత్మక హాస్య రచనలు (కామిక్స్) వచ్చాయి. మింటు, మీను అనే పిల్లల పాత్రలు చిరుతపై సమాచారాన్ని అందించాయి. అది మనుషులపై ఎప్పుడూ దాడి చేయదని, స్థానిక చిరుతపులి కంటే సురక్షితమైనదని ఆ పాత్రలు వివరించాయి. వాస్తవానికి, మింటు దానితో పరుగు పందానికి సిద్ధపడుతున్నట్టు కూడా ఆ కామిక్స్ తెలిపాయి.
పొరపాటున ఆ చిరుత ఎదురైతే, ఈ జాటవ్ పిల్లలు దానిని ప్రేమగా నిమరడానికి ప్రయత్నించరని ఆశిద్దాం.
ఎందుకంటే, ఇక్కడే అసలు కథంతా ఉంది; అందులో అంత ముద్దొచ్చే విషయం కూడా ఏమీ లేదు!
అసినానిక్స్ జూబటస్ అనే ఈ ఆఫ్రికన్ చిరుత, ఒక అమిత ప్రమాదకరమైన పెద్దక్షీరదం, భూమిపై జీవించే అమిత వేగవంతమైన జంతువు. క్షీణిస్తున్న జీవరాశుల్లో ఒకటైన ఈ జంతువు, భారతదేశానికి చెందినది కాదు. ఇప్పుడు వందలాది స్థానిక కుటుంబాలను వారి ఆవాసాలకు దూరం చేయబోతోంది.
*****
బల్లూ ఆదివాసి, 40, తన బాగ్చా గ్రామం అంచున ఉన్న కూనో అడవిని చూపిస్తూ ఇలా గుర్తు చేసుకున్నారు: “మార్చి 6న, అధికారులు ఫారెస్ట్ చౌకీ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం జాతీయ ఉద్యానవనంగా మారింది కనుక మేమక్కడ్నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని, అందులో ప్రకటించారు.”
మధ్యప్రదేశ్‌లోని శివ్‌పుర్ జిల్లాకు పశ్చిమాన ఉన్న బాగ్చా, సహరియా ఆదివాసుల గ్రామం. విశేషించి దుర్బలమైన గిరిజన సమూహంగా (particularly vulnerable tribal group - PVTG) వీరు గుర్తింపు పొందారు. వీరిలో 42 శాతం మంది అక్షరాస్యులు. విజయపుర్ బ్లాక్‌లో ఉన్నఈ గ్రామంలో, 556 మంది ఆదివాసులు ఉన్నారు (2011 గణాంకాల ప్రకారం). వీళ్ళు ఎక్కువగా మట్టితో, ఇటుకలతో నిర్మించి, రాతి పలకల పైకప్పు కలిగిన ఇళ్ళలో నివసిస్తారు; ఊరి చుట్టూ జాతీయ ఉద్యానవనం (దీనినే కూనో పాల్పూర్ అని కూడా పిలుస్తారు) ఉంది; అక్కడే కూనో నది ప్రవహిస్తోంది.
సహరియాలు చిన్న చిన్న చెలకలలో వర్షాధార వ్యవసాయం చేస్తారు. కలపేతర అటవీ ఉత్పత్తులు (NTFP) అమ్మడానికి కూనోపై ఆధారపడతారు
కల్లో ఆదివాసికి ఇప్పుడు 60 ఏళ్ళు. ఆమె వైవాహిక జీవితమంతా బాగ్చాలోనే గడిచింది. “మా భూమి ఇక్కడే ఉంది, మా అడవి ఇక్కడే ఉంది, మా ఇల్లూ ఇక్కడే ఉంది; ఇక్కడ ఉన్నదంతా మాదే. అలాంటిది, ఇప్పుడు మేము బలవంతంగా వెళ్ళిపోవాల్సి వస్తోంది. ఇందులో మాకు చిరుత తెచ్చిపెట్టే మంచి ఏముంటుంది?” అని ఆమె ప్రశ్నిస్తారు. ఆమె ఒక రైతు; అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. తనకు ఏడుగురు పిల్లలు. మనవరాళ్లు / మనవళ్లతో సహా అందరూ ఆమెతోపాటే కలిసే నివసిస్తున్నారు.
బాగ్చాకు వెళ్ళాలంటే, ముందుగా శివ్‌పుర్ నుండి సిరోని పట్టణానికి వెళ్ళే హైవే దాటాలి. తర్వాత, కర్ధయీ (పసి చెట్టు/సిరి మాను)- ఖైర్ (చండ్ర)- సలాయి (గుగ్గులు) లాంటి చెట్లుండే దట్టమైన ఆకురాలు అడవి గుండా వెళ్ళే మట్టి రోడ్డుపై, పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించాలి. అప్పుడు ఎత్తైన ప్రదేశంలో కనిపించే ఆ గ్రామ శివార్లలో, మందలు మందలుగా పశువులు మేస్తూ కనబడతాయి. సమీప ప్రజారాగ్య కేంద్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది; నెట్‌వర్క్ ఉండి, ఫోన్ లైన్లు పని చేస్తుంటే కనుక, ఈ ఆరోగ్య కేంద్రం ‘108’కి అందుబాటులో ఉంది. బాగ్చాలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఐదవ తరగతి తర్వాత మాత్రం, 20 కిలోమీటర్ల దూరంలో ఓచ్చాలో ఉన్న మాధ్యమిక పాఠశాలలో వారమంతా ఉండి చదువుకోవాలి.
సహరియాలు చిన్న చిన్న చెలకలలో వర్షాధార వ్యవసాయం చేస్తుంటారు; కలపేతర అటవీ ఉత్పత్తులు (NTFP) అమ్మడానికి కూనోపై ఆధారపడ్డారు.ఇక్కడినుంచి వెళ్ళిపోతే, ఇవన్నీ అదృశ్యమవుతాయి. చిర్ చెట్ల నుండి సేకరించిన రెసిన్ ( గోంద్ - జిగురు వంటి పదార్థం) వంటి కలపేతర అటవీ ఉత్పత్తి (NTFP) ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇతర రెసిన్లు, తెందూ (బీడీ/తునికి) ఆకులు, పండ్లు, వేర్లు, మూలికలు కూడా. అన్ని సీజన్లూ బాగుంటే, వీటి నుండి సహరియాలు గడించే వార్షిక ఆదాయం ఒక్కో ఇంటికి (సగటున 10 మంది కలిగిన) దాదాపు రూ. 2-3 లక్షల వరకు ఉంటుంది. అంత గొప్పగా భద్రత లేకున్నా, BPL (దారిద్య్ర రేఖకు దిగువ) కార్డులపై వచ్చే రేషన్, వీళ్ళకి కొంత ఆహార స్థిరత్వాన్ని ఇస్తుంది.
అడవిని వదిలి వెళ్ళిపోతే, ఇదంతా ముగిసిపోతుంది. “అడవిలో ఉండే సౌఖ్యం పోతుంది; ఉప్పు, నూనెలు కొనుక్కోవడానికి మేము సేకరించి అమ్ముతున్న చిర్ , ఇతర గోందుల కు దూరం అవుతాం. మేము సంపాదించుకోడానికి కూలి పని మాత్రమే మిగిలి ఉంటుంది,” అని బాగ్చా నివాసి హరేత్ ఆదివాసి బాధపడ్డారు.
స్థానభ్రంశం చెందించటం వల్ల జరిగే మానవ, ఆర్థిక వ్యయాలు చాలా ముఖ్యమైనవని ప్రొఫెసర్ అస్మితా కబ్రా చెప్పారు. అస్మిత పరిరక్షణ స్థానభ్రంశ(కన్జర్వేషన్ డిస్‌ప్లేస్‌మెంట్) నిపుణురాలు. ఆమె, 2004లో చేసిన ఒక పరిశోధనలో,అమ్ముకోదగిన అటవీ ఉత్పత్తుల నుండి బాగ్చా గ్రామానికి గణనీయమైన ఆదాయం లభిస్తోందని తేలింది.. “కట్టెలు, కలప, మూలికలు, పండ్లు, మహువా (ఇప్ప పువ్వు) లాంటి వాటినెన్నో అడవి అందిస్తోంది,” అని ఆమె చెప్పారు. దాదాపు 1,235 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న కూనో వన్యప్రాణి విభాగంలో, 748 చదరపు కిలోమీటర్ల భూభాగంలో కూనో జాతీయ ఉద్యానవనం ఉందని అధికారిక వెబ్ సైట్ చెబుతోంది.
అడవి సంపదతో పాటు, తరతరాలుగా నిరంతరం సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని భర్తీ చేయడం కష్టం. “వర్షాలు కురిసినప్పుడు మేము బాజ్రా (సజ్జలు), జోవర్ (జొన్నలు), మక్క (మొక్కజొన్న), ఉరాద్ (మినప), తిల్ (నువ్వులు), మూం గ్ (పెసలు), రమాస్ (అలసందలు) పండిస్తాం. భిండి (బెండకాయ), కద్దూ (సొరకాయ), టోరీ (బీరకాయ) వంటి కూరగాయలను కూడా పండిస్తాం,” అని హరేత్ ఆదివాసి వివరించారు.
కల్లో, ఆమె కుటుంబం 15 బీఘాల (5 ఎకరాల కంటే తక్కువ) భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. “ఇక్కడ మా భూమి చాలా సారవంతమైనది. దీన్ని విడిచి వెళ్ళడం మాకు ఇష్టం లేదు కానీ, వాళ్లు మమ్మల్ని వెళ్ళిపోవాల్సిందేనని బలవంతం చేయవచ్చు.”
చిరుతల కోసం ఈ అడవిని ఎవరూ ప్రవేశించరాని ప్రదేశంగా మార్చడానికి, సరైన పర్యావరణ పరిశోధన చేయకుండా, కీలకమైన ప్రణాళికలు లేకుండా, సహరియాలను అక్కడి నుండి తరలించడం జరుగుతోందని ప్రొఫెసర్ కాబ్రా చెప్పారు. “అడవి నుండి ఆదివాసులను దూరం చేయడం చాలా సులభం. ఎందుకంటే చారిత్రాత్మకంగా, అటవీ శాఖ-ఆదివాసుల మధ్య సంబంధం ఆధిపత్యంతో ముడి పడి ఉంది; వాళ్ళ జీవితంలోని అనేక అంశాలను అటవీ శాఖ నియంత్రిస్తుంటుంది.” అన్నారామె.
రామ్ చరణ్ ఆదివాసీని ఇటీవల జైల్లోకి తోసిన అనుభవం దీనిని ధ్రువీకరిస్తోంది. 50 ఏళ్ళ క్రితం తను పుట్టినప్పటి నుండి అతను అడవుల్లోకి వస్తూ పోతూనే ఉన్నారు. మొదట్లో, తన తల్లి కట్టెలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, ఆమె వెనకే అడవికి వెళ్ళేవారు. కానీ, గత 5-6 సంవత్సరాల్లో, రామ్ చరణ్‌ని, సాటి ఆదివాసులను అటవీ శాఖ ఈ వనరులకు దూరం చేసింది. దీని వల్ల వీళ్ళ ఆదాయం సగానికి పడిపోయింది. “అక్రమ రవాణా చేసి వన్యప్రాణులను చంపామని, వేటాడామని ఫారెస్ట్ రేంజర్లు (గత ఐదేళ్లలో) మాపై దొంగ కేసులు పెట్టారు. మమ్మల్ని (కొడుకు మహేశ్‌ని కూడా) శివ్‌పుర్ జైల్లో ఉంచారు. బెయిల్ కోసం, జరిమానాలు కట్టడానికి మేం రూ. 10,000-15,000 వరకూ సేకరించాల్సివచ్చింది." అని రామ్ చరణ్ అన్నారు.
ఒక పక్క స్థానభ్రంశపు ముప్పు, మరో పక్క దాదాపు ప్రతిరోజూ అటవీ శాఖ అధికారులచే దాడులు పరిపాటిగా మారినప్పటికీ, బాగ్చా నివాసులు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. “మేమింకా మా గ్రామం నుంచి తొలగిపోలేదు. గ్రామసభలో మేము మా డిమాండ్లను చాలా స్పష్టంగా చెప్పాము,” అని చుట్టూ గ్రామస్తులతో కూడివున్న హరేత్ చెప్పారు. ఈ 70 ఏళ్ల వృద్ధుడు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామసభ లో సభ్యుడు; అటవీ శాఖ ఆదేశాల మేరకు, మార్చి 6న, పునరావాసం గురించి చర్చిండానికి దీన్ని ఏర్పాటు చేసినట్టుగా అతను చెప్పారు. అటవీ హక్కుల చట్టం, 2006 [సెక్షన్ 4(2)(ఇ)] ప్రకారం, గ్రామసభ రాతపూర్వకంగా తన సమ్మతిని ఇచ్చినప్పుడు మాత్రమే ఏదైనా తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అందరూ గ్రామపెద్దగా భావించే బల్లూ ఆదివాసి ఇలా అన్నారు: “మీరు(అధికారులు) అర్హులైన వారి పేర్లను 178గా రాసుకున్నారని, అయితే గ్రామంలో పరిహారం పొందేందుకు అర్హులైన వారు 265 మంది ఉన్నారని మేం అధికారులకు తెలియజేశాం. వారు మేం చెప్పిన సంఖ్యకు అంగీకరించలేదు; మీరు మా అందరికీ నష్టపరిహారం చెల్లిస్తామనే హామీ ఇచ్చే వరకు ఇక్కడినుంచి కదలబోమని మేం చెప్పాం. 30 రోజుల్లో పూర్తి చేస్తామని వారు చెప్పారు.”
ఒక నెల తర్వాత, ఏప్రిల్ 7, 2022న ఇంకో సమావేశం జరిగింది. గ్రామస్తులందరూ దానికి హాజరు కావాలని ముందు రోజు సాయంత్రమే చెప్పారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైనప్పుడు, అధికారులు తమను బలవంతం చేయలేదనీ, ఇష్టపూర్వకంగానే బయటకు వెళ్ళడానికి అంగీకరించామనీ ఒప్పుకుంటూ ఒక కాగితంపై మమ్మల్ని సంతకం చేయమన్నారు. పునరావాస పరిహారం కోసం 178 మందిని మాత్రమే అర్హులుగా ఆ జాబితాలో ప్రకటించడంతో, సంతకం చేసేందుకు గ్రామసభ నిరాకరించింది.
1999లో, గుజరాత్ నుండి వచ్చే సింహాల కోసం, కూనో అడవిలో 28 గ్రామాల్లో నివాసముండే 1,650 కుటుంబాలను అటవీ శాఖ అధికారులు హడావుడిగా ఖాళీ చేయించారు. కానీ, వాళ్ళకు చేసిన వాగ్దానాలను ఇంతవరకూ నెరవేర్చలేదు. ఈ సంఘటన తాలూకు బాధాకరమైన జ్ఞాపకాల వల్లే, సహరియాలు ఇంత పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ‘‘ఇప్పటి వరకూ ఆ ప్రజలకిచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. తమ బకాయిల కోసం, ఇప్పటికీ సర్కార్ వెనుక పరుగులు తీస్తున్నారు ప్రజలు. మాకు అలాంటి పరిస్థితి వద్దు,” అని బల్లూ నొక్కి వక్కాణించారు.
కానీ, ఇప్పటికి 22 ఏళ్ళు గడిచినా, ఆ సింహాలెక్కడా అయిపులేవు!
*****
భారతదేశంలోఅంతరించిపోయే వరకు వేటాడబడిన ఆసియాటిక్ చిరుత (అసినానిక్స్ జూబటస్ వెనాటికస్) – పసుపు-గోధుమ రంగులో ఉండే మచ్చల అడవి పిల్లి – చరిత్ర పుస్తకాలు, వేట సంబంధిత పురాణగాథలలో సుపరిచితమే. దేశంలోని చివరి మూడు ఆసియా చిరుతలను 1947లో, అప్పటికి అంతగా ఎవరికీ తెలియని రాచరిక రాజ్యమైన కొరియా(ఇప్పుడిది ఛత్తీస్‌గఢ్‌లో భాగంగా ఉంది) మహారాజు రామానుజ్ ప్రతాప్ సింగ్ దేవ్ కాల్చి చంపారు.
సింహం, పులి, చిరుత, సాధారణ చిరుత, మంచు చిరుత, క్లౌడెడ్ చిరుత(కనుచీకట్లో వేటాడే చిరుత) – ఇలా మొత్తం ఆరు రకాల పెద్ద పిల్లులు నివసించే ఏకైక ప్రాంతంగా పేరుగాంచిన భారతదేశం, ప్రతాప్ సింగ్ దేవ్ చర్యతో, తన అత్యున్నత స్థానాన్ని కోల్పోయింది. వేగానికి, శక్తికి చిహ్నాలైన పెద్ద పిల్లుల (కింగ్స్ ఆఫ్ ది జంగిల్) ఫోటోలు, మన అధికారిక చిత్రాలలో కనబడతాయి. అధికారిక ముద్రలు, కరెన్సీ నోట్లలో ఉపయోగించే అశోక చక్రంలో, ఆసియా సింహం చిత్రం ఉంటుంది. కానీ జాతికి గర్వకారణంగా భావించిన చిరుతలు కనుమరుగవుతుండడంతో, ఈ వన్య ప్రాణుల పరిరక్షణ ప్రభుత్వాల ఎజెండాలో చేరింది.
ఈ ఏడాది జనవరిలో, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) “భారతదేశంలో చిరుతలను ప్రవేశపెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక” పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. “చిరుత” అనే పేరు సంస్కృతం నుండి ఉద్భవించిందని, ఆ పదానికి అర్థం “మచ్చలున్నది” అని ఇది మనకు తెలియజేస్తుంది. అలాగే, మధ్య భారతదేశంలోని నియోలిథిక్ యుగం నాటి గుహ చిత్రాలు చిరుతను వర్ణిస్తాయి. 1970ల నాటికి, భారతదేశంలో చిరుతల జనాభాను పెంచడానికి, కొన్ని ఆసియా చిరుతలను ఇవ్వవలసినదిగా, ఇరాన్ చివరి షా మొహమ్మద్ రెజా పహ్లావితో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది.
2009లో, చిరుతలను దేశంలో ప్రవేశపెట్టవచ్చో లేదో అంచనా వేయమని, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇంకా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను MoEFCC కోరడంతో, సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మిగిలినవున్న కొన్ని ఆసియా చిరుతలు ఇరాన్‌లోనే ఉన్నాయి; అయితే వాటి సంఖ్య చాలా తక్కువ కాబట్టి దిగుమతి చేసుకోలేం. అందుకే, నమీబియా, దక్షిణాఫ్రికాలలో దగ్గరి పోలికతో ఉండే ఆఫ్రికన్ చిరుతను తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆఫ్రికన్ చిరుత పరిణామాత్మక చరిత్ర గమనిస్తే, ఈ రెండు రకాల చిరుతలకు దాదాపు 70,000 సంవత్సరాల వ్యత్యాసం ఉందని తెలుస్తుంది.
2018లో, మధ్య భారతదేశంలో ఉన్న పది అభయారణ్యాలపై ఒక సర్వే నిర్వహించబడింది. సింహాలను ఉంచడానికి 2018లో 748 చదరపు కిలోమీటర్ల కూనో పాల్పూర్ నేషనల్ పార్క్‌గా అప్‌గ్రేడ్ చేయబడిన 345 చదరపు కిలోమీటర్ల కూనో అభయారణ్యం అత్యంత అనుకూలమైనదిగా ఆ సర్వేలో పరిగణించబడింది. అయితే ఒకే ఒక అసౌకర్యం ఉంది: పార్కు ఉన్న ప్రాంతంలో భాగంగా ఉన్న బాగ్చా గ్రామాన్ని తరలించవలసి ఉంటుంది. ఆశ్చర్యకరంగా, జనవరి 2022లో MoEFCC విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన లో, కూనో “ఏ మానవ నివాసాలూ లేని ప్రాంతంగా...”గా వర్ణించబడింది!
చిరుతను కూనో అడవికి పరిచయం చేయడం వల్ల, “పులి, చిరుతపులి, సింహాలు,చిరుతలు గతంలో లాగా సహజీవనం చేయగలుగుతాయని” యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ చెబుతోంది. ఆ ప్రకటనలో రెండు స్పష్టమైన తప్పులు ఉన్నాయి: ఇది ఆఫ్రికన్ చిరుత, భారతదేశంలోని ఏషియాటిక్ చిరుత వంటిదికాదు. 2013లో సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, గుజరాత్ ప్రభుత్వం సింహాలను పంపనందున, ప్రస్తుతం కూనోలో సింహాలు లేవు.
“ఇప్పటికి 22 సంవత్సరాలైనా సింహాలు రాలేదు; భవిష్యత్తులో కూడా రావు,” అని రఘునాథ్ ఆదివాసి అన్నారు. బాగ్చాలో చాలా కాలంగా నివసిస్తున్న రఘునాథ్, తన ఇంటిని కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే, కూనో పరిసరాల్లోని గ్రామాలను నిర్లక్ష్యం చేయడం, నిర్మూలించడం లేదా భూస్థాపితం చేయడం ఇదే మొదటిసారి కాదు!
ఏషియాటిక్ సింహాలలో చివరివి (పాన్థెరా లియో లియో) ఒకే ప్రదేశంలో – గుజరాత్ సౌరాష్ట్ర ద్వీపకల్పంలో – కేంద్రీకృతమై ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణాకారులు వ్యక్తపరచిన ఆందోళన కారణంగా, ఈ ‘అడవి రాజుల’ను వేరే చోటికి మార్చడం అనివార్యమైంది. కెనైన్ డిస్టెంపర్ వైరస్ వ్యాప్తి చెందడం వల్లనో, లేదా దావానలం వ్యాపిస్తేనో, ఇంకా ఇతర ప్రమాదాలేమైనా జరిగితేనో ఈ సింహాలన్నీ చనిపోయే ప్రమాదం ఉంది.
ఆదివాసులే కాకుండా, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రజలు కూడా జంతువులతో సహజీవనం చేయగలమని అటవీ శాఖకు హామీ ఇచ్చారు. “సింహాల కోసం మేమెందుకు కదలాలని మాకు అనిపించింది. మాకు జంతువుల గురించి తెలుసు; వాటికి భయపడం. మేము అడవిలో పెరిగాం. హమ్ భీ షేర్ హై (మేము కూడా సింహాలమే),” అని ఒకప్పుడు నేషనల్ పార్క్ లో భాగమైన పైరా గ్రామ వాస్తవ్యుడైన 70 ఏళ్ళ రఘులాల్ జాటవ్ తెలిపారు. అతను 50 సంవత్సరాల వరకు అక్కడే నివసించారు; అవాంఛనీయమైనది ఏమీ జరగలేదని చెప్పారు.
మానవులపై చిరుత దాడికి సంబంధించి ఎలాంటి చారిత్రక లేదా సమకాలీన రికార్డులు లేవని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) డీన్-కన్జర్వేషన్ బయాలజిస్ట్ డాక్టర్ యాదవేంద్ర ఝాలా తెలిపారు. “మానవులతో వైరుధ్యం పెద్ద ఆందోళన చెందాల్సినదేమీ కాదు. చిరుతలను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదిత ప్రదేశాలలో నివసించే ప్రజలకు వన్యప్రాణులతో కలిసి జీవించడం అలవాటే. సంఘర్షణ తగ్గించడానికి తగిన జీవనశైలి, పశుపోషణా పద్ధతులు వీళ్ళకు తెలుసు. పశువులు కోల్పోతే కనుక, మిగిలిన బడ్జెట్ ద్వారా ఎలాగోలా సర్దుకుంటారు.”
ఏప్రిల్ 7, 2022న ఒక సమావేశం జరిగింది. గ్రామస్తులందరూ దానికి హాజరు కావాలని ముందు రోజు సాయంత్రమే చెప్పారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైనప్పుడు, అధికారులు తమను బలవంతం చేయలేదనీ, ఇష్టపూర్వకంగానే బయటకు వెళ్ళడానికి అంగీకరించామనీ ఒప్పుకుంటూ రాసివున్న ఒక కాగితంపై వారిని సంతకం చేయమన్నారు
దేశీయులైన ప్రజలనూ, శాస్త్రవేత్తలనూ పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వం జనవరి 2022 పత్రికా ప్రకటనలో ఇలా చెప్పింది: “స్వతంత్ర భారతదేశంలో అంతరించిపోయిన ఏకైక పెద్ద క్షీరద మైన చిరుతను తిరిగి తీసుకురావాలని ప్రాజెక్ట్ చిరుత లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య పర్యావరణ పర్యాటకాన్నీ (ఇకో టూరిజం), దాని అనుబంధ కార్యకలాపాలనూ మరింత అభివృద్ధి చేస్తుంది.”
ఆఫ్రికన్ చిరుత ఆగష్టు 15 నాటికి – స్వాతంత్ర్య దినోత్సవం నాటికి – ఈ ఏడాది భారత్ చేరుకుంటుందని భావిస్తున్నారు.
బాగ్చా గ్రామమే దాని మొదటి వేట!
ఆదివాసులను తొలగించేందుకు సంబంధించిన ప్రణాళికను పర్యవేక్షిస్తున్న జిల్లా అటవీ అధికారి ప్రకాష్ వర్మ మాట్లాడుతూ, చిరుతను తీసుకువచ్చే ప్రాజెక్ట్ కోసం కేటాయించిన బడ్జెట్ రూ. 38.7 కోట్ల నుండి రూ. 26.5 కోట్లు ఆదివాసుల స్థానచలన ఖర్చుల కోసం వినియోగిస్తారు. "చిరుత కోసం ఆవరణను నిర్మించడానికి, నీటి కోసం, రోడ్లను శుభ్రం చేయడానికి, జంతువుతో ఎలా వ్యవహరించాలో అటవీ అధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు" అని చెప్పారు.
ఆఫ్రికా నుండి మొదటగా వచ్చే 20 చిరుతలను ఉంచేందుకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వాచ్‌టవర్‌తో, ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు ఒక చిన్న ఆవరణంతో, మొత్తం 35 చదరపు కిలోమీటర్ల ఆవరణాన్ని నిర్మిస్తారు. చిరుతలు వృద్ధి చెందేలా సాధ్యమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిగ్గా చెప్పాలంటే: ఆఫ్రికాలోని వన్యప్రాణులపై IUCN ఇచ్చిన నివేదిక లో, ఆఫ్రికన్ చిరుత ( అసినానిక్స్ జుబాటస్ ) అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లు పేర్కొనబడింది. ఇతర నివేదికలు కూడా వాటి సంఖ్యలో తీవ్రమైన క్షీణతను నమోదు చేశాయి.
మొత్తానికి, ఒక స్థానికేతరమైన, తీవ్ర ప్రమాదంలో ఉన్న జాతిని వాటికి పరిచయం లేని వాతావరణంలోకి తీసుకురావడానికీ; వాటికి ప్రవేశాన్ని కల్పించడం కోసం స్థానికులూ, ప్రత్యేకించి ప్రమాదకర స్థితిలో ఉన్న ఒక ఆదివాసీ సమూహాన్ని అక్కడినుంచి తొలగించివేసేందుకూ 40 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రణాళిక ఇది. ఇది 'మానవులు-జంతుజాలానికి మధ్య సంఘర్షణ' అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది.
“పరిరక్షణ కోసం ప్రకటించిన ఈ విధానం – మానవులు, జంతువులు కలిసి జీవించలేరు – కేవలం ఊహాజనితమే తప్ప; ఎక్కడా నిరూపించబడలేదు,” అని ప్రొఫెసర్ కాబ్రా తెలిపారు. ఈ ఏడాది జనవరిలో, ‘పరిరక్షణ కోసం ఉన్నవాటిని స్వాధీనం చేసుకోవడం’ అనే అంశంపై ఆమె సహ-రచయితగా ఒక పత్రం ప్రచురించబడింది. అటవీ హక్కుల చట్టం-2006 ద్వారా అటవీ నివాసులకు రక్షణ కల్పిస్తున్నప్పటికీ, భారతదేశంలోని పులుల సంరక్షణాలయాల నుండి 14,500 కుటుంబాలను ఎలా తరలించారని ఆమె ప్రశ్నించారు. గ్రామస్తులు “స్వచ్ఛందంగా” పునరావాసం పొందేందుకు వివిధ రకాల చట్టపరమైన, విధానపరమైన చర్యలను చేపట్టే అధికారులకు అనుకూలంగానే ఎల్లప్పుడూ పాచికలు వేయబడతాయి. ఈ వేగవంతమైన పునరావాసానికి కారణం ఇదేనని ఆమె వాదించారు.
పునరావాస పరిహారంగా అధికారులు రూ.15 లక్షలు ఇస్తామన్నారని బాగ్చా నివాసితులు చెప్తున్నారు. ఈ మొత్తాన్ని వీరు నగదు రూపంలో తీసుకోవచ్చు లేదా ఇల్లు కట్టుకోవడానికి భూమి, డబ్బు రూపంలో పొందవచ్చు. “ఇంటిని నిర్మాణానికి రూ.3.7 లక్షలు, మిగిలిన మొత్తం వ్యవసాయ భూమి రూపంలో కూడా పొందవచ్చు. కానీ, విద్యుత్ కనెక్షన్లు, పక్కా రోడ్లు, చేతి పంపులు, బోర్‌వెల్ పంపులకు అధికారులు అందులోంచే డబ్బులు మినహాయించుకుంటున్నారు” అని రఘునాథ్ వాపోయారు.
బాగ్చా నుండి 46 కిలోమీటర్ల దూరంలో, కరహల్ తహసిల్ లోని గోరస్ దగ్గరున్న బమూరాలో వీళ్ళ కొత్త ఇంటి స్థలాలు ఉన్నాయి. “మాకు చూపించిన కొత్త భూమి ఇప్పుడున్న మా భూమి కంటే నాణ్యత తక్కువది. వాటిలో కొన్ని పూర్తిగా రాతినేలలు, సారహీనమైనవి. భూమి ఉత్పాదకత పెరగడానికి చాలా సమయం పడుతుంది; కానీ, మొదటి మూడు సంవత్సరాలు మమ్మల్ని ఎవరూ ఆదుకోరు,” అని కల్లో బాధపడ్డారు.
*****
ఆఫ్రికన్ చిరుతలను భారతదేశానికి తీసుకురావడానికి గల ప్రాథమిక కారణలలో ‘ పర్యావరణ వ్యవస్థను రక్షించడం ’ ఒకటిగా ప్రాజెక్ట్ చీతా పేర్కొంది. ఇది డా.రవి చెల్లం వంటి వన్యప్రాణుల నిపుణులకు విసుగుతెప్పించే అంశం. “గడ్డి భూముల పరిరక్షణ పేరుతో చిరుతలను భారత్‌కు తీసుకువస్తున్నారు; ఇప్పటికే ఈ గడ్డి భూముల్లో కారకల్, కృష్ణజింక (బ్లాక్ బక్) బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) లాంటి ఆకర్షణీయమైన, అంతరించిపోతున్న జంతువులుండడంవల్ల, ఇప్పుడీ చర్యకు ఒక అర్థం లేదు. ఆఫ్రికా నుండి ఏదైనా తీసుకురావాల్సిన అవసరం ఎక్కడ ఉంది?” అని మెటాస్ట్రింగ్ ఫౌండేషన్ సీఈఓ-వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డా.రవి చెల్లం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న చిరుతల సంఖ్య, 15 సంవత్సరాలలో – 36 – ఏమంత ఆచరణీయమైనది, స్థిరమైనది కాదు; దీనికి జన్యుపరమైన శక్తి లేదు. భారతదేశంలో జీవవైవిధ్య పరిశోధన, పరిరక్షణను ప్రోత్సహించే నెట్‌వర్క్లలో ఒకటైన బయోడైవర్సిటీ కొలాబరేటివ్‌లో సభ్యుడిగా ఉన్న చెల్లం, “ఇది మహిమాన్వితమైన, ఖరీదైన సఫారీ పార్క్ తప్ప మరొకటి కాద”న్నారు.
1999లో, గుజరాత్ నుండి వచ్చే సింహాల కోసం, కూనో అడవిలో 28 గ్రామాల్లో నివాసముండే 1,650 కుటుంబాలను అటవీ శాఖ అధికారులు హడావుడిగా ఖాళీ చేయించారు. కానీ, వాళ్ళకు చేసిన వాగ్దానాలను ఇంతవరకూ నెరవేర్చలేదు. ఈ సంఘటన తాలూకు బాధాకరమైన జ్ఞాపకాల వల్లే, సహరియాలు ఇంత పట్టుదలగా వ్యవహరిస్తున్నారు
ఎప్పుడూ రాని సింహాల కోసం కూనోలోని తన ఇంటి నుండి తరిమివేయబడి, గత 22 సంవత్సరాలుగా తనకు పరిహారంగా లభించిన ఉత్పాదకత లేని భూమిపై ఆధారపడి బతుకుతున్నారు మంగు ఆదివాసి. అతను చెల్లంతో ఏకీభవిస్తున్నారు: “చిరుత ప్రదర్శనార్భాటం కోసం మాత్రమే వస్తోంది. కూనోలో ఇంత గొప్ప పని చేశామని అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రచారం చేసుకోడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్. చిరుతలను (అడవిలోకి) విడిచిపెట్టినప్పుడు, వాటిలో కొన్ని ఇప్పటికే ఉన్న జంతువులచే చంపబడతాయి, కొన్ని వాటికోసం నిర్మించిన ఆవరణంలోనే విద్యుదాఘాతంతో చనిపోవచ్చు. చూద్దాం ఏమౌతుందో!”
విదేశీ జంతువులు తీసుకువచ్చే వ్యాధికారక క్రిముల వల్ల అదనపు ప్రమాదం ఉంది. “ఇక్కడ మనకు తెలిసిన వ్యాధికారక క్రిములు, కొత్తగా వచ్చే చిరుతలపై ఎలాంటి ప్రభావాలను చూపుతాయన్న విషయాన్ని ఈ ప్రణాళిక పరిగణనలోకి తీసుకోలేదు,” అని డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ ప్రయోగశాల కన్జర్వేషన్ బయాలజిస్ట్, ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ కార్తికేయన్, “స్థానిక వన్యప్రాణులు ప్రియాన్ లాంటి వ్యాధులకు గురికావడం, అనుకూలమైన సంతతిని దీర్ఘకాలికంగా కొనసాగించడంలో వైఫల్యం, పర్యావరణంలో ఉండే వ్యాధికారకాలు చిరుతలను ప్రభావితం చేయవచ్చు.” అని హెచ్చరిస్తున్నారు
కొన్ని సాంకేతిక కారణాల వల్ల, గత ఏడాది రావాల్సిన చిరుతలు రాలేదనే విస్తృతమైన పుకార్లు కూడా ఉన్నాయి. భారతదేశ వన్యప్రాణుల (రక్షణ) చట్టం-1972 సెక్షన్ 49B, ఏనుగు దంతాల వ్యాపారం, వాటి దిగుమతులు కూడా ఖచ్చితంగా నిషేధించబడినాయని స్పష్టంగా పేర్కొంది. కానీ అంతరించిపోతున్న జంతుజాలం, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం ( Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora-CITES) కింద, ఏనుగు దంతాల అంతర్జాతీయ వాణిజ్యంపై విధించిన నిషేధం తొలగించడాన్ని భారతదేశం సమర్ధిస్తే తప్ప, నమీబియా చిరుతలను బహుమతిగా ఇవ్వదలచుకోలేదనే పుకార్లు ఉన్నాయి. దీన్ని ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఏ ప్రభుత్వ అధికారీ సిద్ధంగా లేరు.
ఈమధ్యలో బాగ్చా పరిస్థితి నిద్రాణస్థితిలో ఉంది. ముందుగానే సేకరించి పెట్టుకున్న రెసిన్‌ను తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్తోన్న హారెత్ ఆదివాసి ఇలా అన్నారు: “మేము ప్రభుత్వం కంటే పెద్దవాళ్ళం కాము. వాళ్ళు చెప్పినట్టే మేము చేయాల్సివుంటుంది. మా ఇళ్ళు వదిలి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు కానీ, వదిలేసిపోయేలా వారు మమ్మల్ని బలవంతం చేయవచ్చు!”
ఈ వ్యాసాన్నిపరిశోధించడంలో, అనువాదాలతో అమూల్యమైన సహాయం అందించిన సౌరభ్ చౌధురికి రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి