భార్యని పోలీస్ స్టేషన్ ముందే గాయపరుస్తున్నాననే విషయం అతనికి పట్టలేదు. హౌషాబాయి పాటిల్ తాగుబోతు భర్త, హౌషబాయిని కనికరం లేకుండా కొడుతున్నాడు. “నా వీపు విపరీతంగా నొప్పి పుట్టింది ఆ దెబ్బలతో,” ఆమె గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది. “ఇది భవానినగర్‌లో ఉన్న ఒక చిన్న పోలీస్ స్టేషన్ బయట జరిగింది. కానీ నలుగురు పోలీసుల్లో ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. “ఇంకో ఇద్దరు మధ్యాహ్నం భోజనానికని బయటకి వెళ్లారు.” ఇక సోయలో లేని ఆమె తాగుబోతు భర్త ఒక రాయినెత్తాడు. “ఇప్పుడు నిన్ను ఈ రాయి తో బాది చంపేస్తాను”, అని అతను రంకెలసేసాడు.
ఇక దానితో లోపల పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇద్దరు పోలీసులు పరిగెత్తుకుని బయటకు వచ్చారు. “మా గొడవ సర్దడానికి ప్రయత్నించారు.” హౌషాబాయి అక్కడే ఉన్న తన అన్నకి జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆమె మళ్ళీ హింసించే భర్త దగ్గరకి వెళ్లనని చెప్తోంది. “నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ ఇంటి పక్కనే చిన్న స్థలం ఇవ్వమని చెప్పాను. నా భర్త దగ్గరకి వెళ్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేను ఇక్కడే ఉండి ఉన్నదానితో తిని బతుకుతాను. అతనితో దెబ్బలు పడలేను.” అని చెప్పాను. కానీ ఆమె అన్న ఆమెని బతిమాలడం మొదలుపెట్టాడు.
పోలీసులు ఆ దంపతులతో చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు ఆ జంటకు సంధి కుదిర్చి రైలెక్కించి వాళ్ళ ఊరు పంపబోయారు. “చివరికి వాళ్ళు టికెట్లు కూడా తెచ్చి మా చేతిలో పెట్టారు. నా భర్త కి చెప్పారు - నీ భార్య నీతో ఉండాలి అని నువ్వు అనుకుంటే, ఆమెని సరిగ్గా చూసుకో. అంతేగాని కొట్టకు.”
ఇంతలో హౌషాబాయి కామ్రేడ్లు పోలీస్ స్టేషన్ ని లూటీ చేశారు. నాలుగు రైఫిళ్లు ఎత్తుకుపోయారు. దీనికోసమే హౌషాబాయి, ఆమె అబద్ధపు భర్తా, అన్నా అంత నాటకం ఆడి పోలీసుల దృష్టి మళ్లించారు. ఇది 1943 లో జరిగింది, ఆమెకు అప్పటికి 17 ఏళ్ళు, పెళ్లయి మూడేళ్ళయింది. తన కొడుకు సుభాష్ ని వాళ్ళ అత్త దగ్గర వదిలింది. ఎప్పుడు ఆమె బ్రిటిష్ రాజ్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నా కొడుకుని అత్త దగ్గరే వదిలి వెళ్తుంది. ఇప్పటికీ ఆమె కోపంగానే ఉంది.. దగ్గరగా 74 ఏళ్ళు గడిచిపోయినా ఆమె అబద్ధపు భర్త వారి నాటకం నిజం అని నమ్మించడానికి ఆమెను చాలా గట్టిగా కొట్టాడు. ఇప్పుడు ఆమెకి 91 ఏళ్ళు. ఇప్పుడు ఆమె మాకు ఈ కథ ఆమె మాకు, మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో విటా అనే నగరం లో చెప్తోంది. “నా కళ్ళు, చెవులు నన్ను ఇబ్బంది పెట్టి సవాలు చేస్తూనే ఉంటాయి, కానీ అంతా నేనే చెప్తాను.’







