ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి, తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
పొలమైతే ఉంది, కానీ పనిచేస్తున్నవారిలో ఇది, ఏ ఒక్కరి సొంతమూ కాదు
భూ యజమానికి తనను ఫోటో తీయడం గర్వంగా ఉంది. అతని పొలంలో పనిచేస్తున్న తొమ్మిది మంది మహిళా కూలీలు నడుము వంచి నాట్లు వేస్తుండగా, అతను నిటారుగా నిలబడి ఉన్నాడు. వారికి రోజుకు రూ. 40 చెల్లిస్తానని అతనన్నాడు. ఆ తర్వాత మాతో మాట్లాడిన మహిళలు, అతనిచ్చింది రూ. 25 అని చెప్పారు. వారంతా ఒడిశాలోని రాయగడకు చెందిన భూమిలేని కూలీలు.
భారతదేశంలో భూస్వామ్య కుటుంబాలకు చెందిన స్త్రీలకు కూడా భూమిపై హక్కు లేదు. వారి తల్లిదండ్రుల ఇంట్లోనే కాదు; వారి భర్త, అత్తమామల ఇంట్లో కూడా. ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయినవారు లేదా విడాకులు తీసుకున్న మహిళలు చివరకు వారి బంధువులకు చెందిన పొలాల్లో కూలీలుగా మారిపోవచ్చు.








