"యమునతోనే మా బంధం. మేమెప్పుడూ నదితోనే వున్నాం."
అలా తమ కుటుంబానికి యమునానదితో వున్న బంధాన్ని వివరిస్తోన్నది, విజేందర్ సింగ్. మల్లాహ్ (పడవ నడిపేవారు) సామాజిక వర్గానికి చెందిన వీరు తరతరాలుగా దిల్లీలోని యమునా నదికి ఆనుకుని ఉన్న వరద మైదానాల పక్కనే నివసిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. 1376 కిలోమీటర్ల పొడవైన యమునానది, దేశ రాజధాని పరిసరాల్లో 22 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. 97 చదరపు కిలోమీటర్ల పరిధిలో దాని వరద మైదానాలు వ్యాపించి వున్నాయి.
విజేందర్ వంటి 5000 మందికి పైగా రైతులకు 99 ఏళ్ళ వరకు ఆ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారు.
అదంతా బుల్‌డోజర్లు అక్కడకు రాక ముందరి సంగతి.
జనవరి 2020 లోని ఎముకలు కొరికే చలికాలంలో, ప్రతిపాదిత జీవవైవిధ్య ఉద్యానవనం (బయోడైవర్సిటీ పార్కు) కోసం మున్సిపాలిటీ అధికారులు వాళ్ళ భూముల్ని, అందులో ఉన్న పంటలతో సహా, బుల్‌డోజర్లతో తొక్కించేసారు. విజేందర్ వెంటనే తన కుటుంబాన్ని పక్కనే వున్న గీతా కాలనీలో అద్దె ఇంటికి మార్చాల్సి వచ్చింది.
రాత్రికి రాత్రే ఈ 38 ఏళ్ళ రైతు తన జీవనోపాధిని కోల్పోయారు. భార్య, 10 ఏళ్ల లోపున్న ముగ్గురు పిల్లలున్న తన కుటుంబాన్ని పోషించడానికి ఇప్పుడతను నగరంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇలా మారింది అతనొక్కరే కాదు. తమ భూమినుంచీ, జీవనోపాధి నుంచీ తరిమివేయబడిన ఆ రైతులంతా రంగులు వేసేవారిగా, తోటమాలులుగా, సెక్యూరిటీ గార్డులుగా, మెట్రో స్టేషన్‌లలో స్వీపర్లుగా చెల్లాచెదరయ్యారు.
"మీరుగనక లోహా పూల్ నుంచి ఐటిఒ వరకు ఉన్న రోడ్డుని గమనిస్తే, సైకిల్‌పై కచోరిలు అమ్ముకునేవాళ్ళు ఎక్కువయ్యారని తెలుస్తుంది. వాళ్లంతా రైతులు. ఒకసారి భూమిని కోల్పోయాక, ఒక రైతు ఇంతకన్నా ఇంకేం చెయ్యగలడు?" అడిగారతను.










