"ప్రతి సంవత్సరం బడ్జెట్‌పై జరిగే ఈ హంగామా మా జీవితాలను కొద్దిగానైనా మారుస్తుందా?" అని ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి కె. నాగమ్మ అడిగారు. ఆమె భర్త 2007లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ మరణించారు. ఈ విషాదం ఆమెను సఫాయి కర్మచారి ఆందోళన్ వారి చెంతకు చేర్చగా, ఇప్పుడామె దాని కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె పెద్ద కుమార్తె శైల నర్సు గాను, చిన్న కూతురు ఆనంది తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఉన్నారు.
“మాకు ‘బడ్జెట్’ అనేది కేవలం ఒక అలంకార పదం మాత్రమే. మేం సంపాదించేదానితో మా ఇంటి బడ్జెట్‌ను కూడా నిర్వహించలేం, అలాగే ప్రభుత్వ ప్రణాళికలలో కూడా మాకు చోటు ఉండదు. అయినా ఈ బడ్జెట్ ఏంటి? నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి అదేమైనా సహాయం చేస్తుందా?”
నాగమ్మ పుట్టకముందే ఆమె తల్లిదండ్రులు చెన్నైకి వలస రావటంతో, ఆమె చెన్నైలోనే పుట్టి పెరిగారు. నాగమ్మ తండ్రి, స్వగ్రామమైన నాగులాపురంలో నివాసముంటోన్న తన సోదరి కుమారుడితో 1995లో నాగమ్మకు వివాహం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పామూరు సమీపంలోని ఆ గ్రామంలో ఆమె భర్త కణ్ణన్ తాపీ మేస్త్రీగా పని చేసేవారు. మాదిగ సముదాయానికి చెందిన ఈ కుటుంబాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నాయి. "2004లో, ఇద్దరు పిల్లలు పుట్టాక, మా ఆడపిల్లల చదువుల కోసం చెన్నైకి రావాలని నిర్ణయించుకున్నాం," అని నాగమ్మ గుర్తు చేసుకున్నారు. అలా వచ్చిన మూడేళ్ళకే కణ్ణన్ చనిపోయారు.




