నిర్మానుష్య పీఠభూమి మీద ఉన్న ఓ దర్గా, మళగావ్‌వాసులకు చాలా కాలంగా ఉపయోగపడుతోంది. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో శతాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రార్థనాస్థలం, ఎప్పుడూ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది.
స్కూల్ పిల్లలు దర్గాకు ఆనుకుని ఉన్న చెట్టు కింద తమ హోమ్‌వర్క్ చేసుకుంటారు. యువతీ యువకులు, మండు వేసవిలో చల్లని గాలి వచ్చే దాని ప్రవేశద్వారం వద్ద సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతారు. పోలీసులు కావాలనుకునే ఔత్సాహికులు దాని చుట్టూ ఉన్న బహిరంగ ప్రదేశంలో కఠినమైన దేహదారుఢ్య శిక్షణను పొందుతుంటారు.
గ్రామంలో 15 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతు 76 ఏళ్ళ వినాయక్ జాదవ్, "మా తాతయ్యకు కూడా దాని [దర్గా] గురించి కథలు తెలుసు," అంటారు. “ఇక ఇదెంత పురాతనమైనదో ఊహించండి. దాన్ని హిందువులు, ముస్లిములు కలిసి నిర్వహించారు. ఇది శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది.’’
కానీ సెప్టెంబరు 2023లో పరిస్థితులు మారిపోయాయి. ఎంతోమందికి ఆరాధనీయమైన ఈ మళగావ్ ప్రార్థనాస్థలం కొత్త అర్థాన్ని సంతరించుకుంది- ఆ దర్గాను ఆక్రమించుకున్న స్థలంలో కట్టారని కొంతమంది యువకుల బృందం పేర్కొంది. వాళ్ళ గుంపు చిన్నదే కానీ నోళ్ళు పెద్దవి. వాళ్ళకు హిందుత్వ గ్రూపుల వత్తాసు ఉంది.
మళగావ్‌లో నివాసముండే 20-25 సంవత్సరాల మధ్య వయసున్న ఈ హిందూ యువకులు ఆ "అక్రమ ఆక్రమణను" తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిపాలనా విభాగానికి ఒక లేఖ రాశారు. అప్పటికే వారిలో కొందరు పక్కనే ఉన్న నీళ్ళ ట్యాంకును ధ్వంసం చేశారు. "ముస్లిములు దాని చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించాలనుకుంటున్నారు," అని వాళ్ళు తమ లేఖలో ఆరోపించారు. "ఈ ప్రార్థనాస్థలాన్ని గ్రామ పంచాయితీ అభీష్టానికి వ్యతిరేకంగా నిర్మించారు."













