'ఎవరికి తెలుసు, సరికొత్త ముసుగులో ఎమర్జెన్సీ మళ్ళీ రావచ్చు
ఈనాటి నిరంకుశాధిపత్యం ప్రజాస్వామ్యంగా పేరు మార్చుకుంటుంది’
భిన్నాభిప్రాయాలను అణచివేసి, అసమ్మతివాదుల నోరు నొక్కడమో లేదా నిర్బంధించటమో లేదా రెండూనో జరుగుతోన్న ఈ కాలంలో, పైపైకి ఎగరేసిన ఎరుపు, ఆకుపచ్చ, పసుపు జెండాలతో రైతులు, వ్యవసాయ కూలీలు - కిసాన్, మజ్దూర్ - రామ్‌లీలా మైదానంలోకి నడిచి వస్తుండగా ఆ నిరసన గీతంలోని ఈ పంక్తులు మరోసారి నిజమయ్యాయి.
ఎఐకెఎస్ (అఖిల భారత కిసాన్ సభ), బికెయు (భారతీయ కిసాన్ యూనియన్), ఎఐకెకెఎమ్ఎస్ (ఆల్ ఇండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంగఠన్), ఇతర సంస్థలు, సమూహాలకు చెందిన వ్యవసాయదారులు మార్చి 14, 2024న జరిగిన కిసాన్ మజ్దూర్ మహా పంచాయితీలో పాల్గొనేందుకు ఎస్‌కెఎమ్ (సంయుక్త కిసాన్ మోర్చా) ఏకీకరణ వేదిక క్రింద ఈ చారిత్రక మైదానంలో సమావేశమయ్యారు.
“మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది, కానీ అవి ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పుడు వారు ఆ హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలి. వర్నా హమ్ లడేంగే, ఔర్ లడ్తే రహేంగే [వారు ఈ హామీలను నెరవేర్చకపోతే, మేం పోరాడుతాం, పోరాడుతూనే ఉంటాం],” అని కలాఁ గ్రామానికి చెందిన మహిళా రైతు ప్రేమమతి PARIతో చెప్పారు. ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం; రైతుల ఉత్పత్తి వాణిజ్యం మరియు వర్తకం (ప్రమోషన్ మరియు సులభతరం చేయటం) చట్టం, 2020; నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం, 2020 గురించి ఆమె ఇక్కడ ప్రస్తావించారు.
"మూడు సంవత్సరాల క్రితం జరిగిన నిరసనలప్పుడు కూడా మేమిక్కడ ఉన్నాం," అని ఆమె జోడించారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా నుంచి మహాపంచాయత్‌కు వచ్చిన ముగ్గురు మహిళల్లో ప్రేమమతి ఒకరు. వారు రైతుల సంఘమైన భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు)తో జతకట్టారు. "ఈ ప్రభుత్వం వర్ధిల్లుతోంది, కానీ వారు రైతులను మాత్రం నాశనం చేశారు," అని ఆమె ఆగ్రహంతో అన్నారు.
PARIతో మాట్లాడిన మహిళలందరూ 4-5 ఎకరాల భూమిపై పనిచేసుకునే చిన్న రైతులు. భారతదేశ వ్యవసాయంలోని 65 శాతం పనిని మహిళా రైతులు, కూలీలు చేస్తారు, కానీ కేవలం 12 శాతం మంది మహిళా రైతుల పేరున మాత్రమే భూమి ఉంది.
















