ముంబైలోని ప్రతి మూలా మెట్రోకు, ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుసంధానించి ఉండగా, దాము నగర్ నివాసితులు చాలా తక్కువ దూరం ప్రయాణించడానికే ఇబ్బంది పడుతున్నారు. అంటే: వారు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేసే ప్రాంతం గుండా వెళ్ళాల్సి రావడం. వారు ఒక అడుగు ఎత్తున్న గోడ మీదుగా అడుగు పెట్టి, ఆపైన మల పదార్థపు గాఢమైన వాసనతో నిండివున్న చెత్త కుప్పల మీదుగా నడవాలి. ఇది ఎండిన గడ్డితో ఉన్న ఒక బహిరంగ మైదానం. ఇక్కడ ఉన్న కొన్ని చెట్లు కొంత చాటును, కొద్దిగా నీడను అందిస్తుంటాయా?
ఎంతమాత్రం కాదు. “ఇక్కడ చాటు అంటూ ఏమీ లేదు," దాము నగర్‌లో చాలాకాలంగా నివసిస్తోన్న 51 ఏళ్ళ మీరా యేడే అన్నారు. "ఆడవాళ్ళం మేం ఏదైనా అడుగుల చప్పుడు వినబడితే వెంటనే లేచి నిలబడాలి." గత కొన్నేళ్ళుగా ఈ భూమి పేరుకు మాత్రం మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఉపయోగించేందుకు వరుసగా ఎడమ, కుడి భాగాలుగా విభజించబడింది. కానీ, "వీటి మధ్య దూరం చాలా తక్కువ. కొన్ని మీటర్ల దూరం ఉండవచ్చు. అయినా దానిని కొలిచిందెవరు?" రెండు విభాగాల మధ్య ఏదైనా అవరోధం గానీ, గోడ గానీ లేదు.
అనేకమంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మొదటి లేదా రెండవ తరం వలసదారులైన దాము నగర్ నివాసులకు ఇది ముంబై ఉత్తరం నియోజకవర్గంలోని ఈ భాగంలో జరిగే ఎన్నికలకు మించిన సమస్య. భారతదేశం తన 18వ లోక్‌సభకు 543 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి దశలవారీ వోటింగ్‌ను జరుపుతున్నప్పటికీ ఇది వారిని ఇబ్బంది పెట్టే సమస్యే. "ఈ రోజు దేశంలో జరుగుతోన్న ప్రతిదీ మంచిదేననే ఒక కథనం పుట్టింది," అంటారు, మీరా కుమారుడు ప్రకాశ్ యేడే. ప్రకాశ్ తన ఇంటి గుమ్మం వద్ద మాతో మాట్లాడుతున్నారు. ఆ ఇంటి రేకుల పైకప్పు బహుశా లోపల వేడిని కొన్ని డిగ్రీల మేర పెంచుతుంది.
“దేశంలోని ఈ ప్రాంతాల్లోని నిజమైన సమస్యల గురించి ఎవరూ మాట్లాడరు," అని 30 ఏళ్ళ ప్రకాశ్ అంటున్నారు. దాము నగర్‌లోని 11,000 మందికి పైగా నివాసితులు మరుగుదొడ్లు, నీరు, విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్ల తలెత్తే అసౌకర్యాన్నీ, ప్రమాదాలనూ ఎలా ఎదుర్కొంటున్నారో అతను దృష్టికి తెచ్చారు. జనాభా గణనలో భీమ్ నగర్ అని కూడా పిలిచే దాము నగర్ మురికివాడలో బలహీనమైన గోడలు, టార్పాలిన్లు, రేకుల పైకప్పులను కలిగివున్న 2,300కు పైగా ఇళ్ళున్నాయి. ఇవి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని ఒక కొండపై ఉన్నాయి. ఈ ఇళ్ళను చేరాలంటే, ప్రవహించే మురుగుకాలువ నీటిలోకి అడుగు పెట్టకుండా ఇరుకైన, ఎగుడుదిగుడు రాతి దారుల గుండా కొండపైకి ఎక్కాలి.





















