పని కోసం తాను తిరిగిన ప్రతి ఊరూ గుర్తుంది మంగళ హరిజన్ కు. “కంచుర్, కురుగుండ్, క్యతనకేరి... ఒక ఏడాది నేను రత్తిహళ్ళికి కూడా వెళ్లాను,” అన్నది ఆమె తిరిగిన ఊరి పేర్లను ఏకరువు పెడుతూ. ఇవన్నీ కర్ణాటకలో, హవేరి జిల్లాలో హిరేకేరూర్ తాలూకాలో ఉన్నాయి. వ్యవసాయ కూలీగా మంగళ, రోజూ 17-20 కిలోమీటర్లు తన కుగ్రామం నుండి పనికోసం ప్రయాణిస్తుంది.
“నేను రెండేళ్లుగా కొణనతలికి వెళ్తున్నాను,”అని ఆమె చెప్పింది. కొణనతలి, మంగళ ఊరైన మెనాశినహల్, ఈ రెండూ హవేరి జిల్లా రాణిబెన్నూర్ తాలూకాలో ఉన్నాయి. హిరేకేరూర్ తాలూకా, మంగళ, మిగిలిన ఆడవారు ఉండే మెనాశినహల్ మాదిగ కేరి(దళితుల కాలనీ)కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ 8-10 మంది మహిళలు ఒక బృందంగా ప్రయాణిస్తారు.
వారికి రోజూ 150 రూపాయిలు వస్తాయి. ఇవి కొద్ధి నెలలు మాత్రమే. వారు చేతి పరాగసంపర్కారలు(Hand Pollinators)గా పని చేసినప్పుడు, 90 రూపాయిలు ఎక్కువ వస్తాయి. ఈ పని కోసం వారు జిల్లాను దాటి వెళ్ళాలి. రైతులు వీరిని పనికి పెట్టుకున్నప్పుడు, ఆటోలలో వారిని ఇంటివద్ద నుండి పని ప్రదేశానికి తీసుకువచ్చి, మళ్లీ పని పూర్తయ్యాక ఇంటి వద్ద దింపుతారు. “ఆటో డ్రైవర్లు రోజుకు 800-900 రూపాయిలు తీసుకుంటారు. అందుకని వాళ్లు మాకు వచ్చే కూలీలో 10 రూపాయిలు మినహాయించి ఇస్తారు. అంతకు ముందు ఆటోలు దొరికేవి కాదు, మేము నడుచుకుంటూ వెళ్లేవాళ్లము,” అన్నది మంగళ.
కాస్త చిన్న ఆకారంతో , ఉండవలసిన దాని కన్నా తక్కువ బరువుతో ఉన్న 30 ఏళ్ళ మంగళ, తన భర్తతో ఒక గది ఉన్న పూరింటిలో ఉంటుంది. ఆమె భర్త కూడా రోజు కూలీగా పనిచేస్తాడు. వారికి నలుగురు పిల్లలు. ఒక బల్బ్ వారి గుడిసెలో వెలుగుతోంది. గదిలో ఒక మూలని వారి వంటగదిగా వాడుకుంటున్నారు. ఇంకొ మూల వారి బట్టలున్నాయి. ఇంకో గోడవైపుకు ఒక విరిగిన స్టీల్ అలమారా ఉంది. ఇక గదిలో వీటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వారు తినడానికి, నిద్రపోవడానికి వాడతారు. బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమి కడగడానికి బయట ఒక బండరాయి ఉంది.










