జంబో పాదముద్రల కోసం కొండలూ పొలాల చుట్టూ తిరుగుతున్నాం.
భోజనం పళ్ళేల కంటే పెద్దవీ, మెత్తని నేలమీద లోతుగా పాతుకున్న పాద ముద్రలు మాకు పుష్కలంగా కనిపించాయి. పాతవి మెల్లగా మాసిపోతున్నాయి. కొందరు ఆ జంతువు చేసిన పనిని ఎత్తిచూపుతారు: కాస్త తీరుబాటు నడక, మంచి భోజనం, బోలెడంత పేడ. అది విసిరికొట్టిన వస్తువుల జాడ: రాతి స్తంభాలు, వైరు కంచెలు, చెట్లు, గేట్లు…
మేం ఏనుగుతో ముడిపడివున్న ప్రతిదాన్నీ ఫోటో తీయడానికి ఆగిపోతున్నాం. పాదముద్రల ఫోటోనొకదాన్ని నేను నా ఎడిటర్‌కి పంపాను. "అక్కడ ఏనుగు ఉందా?" అని ఆయన ఆశగా అడుగుతూ జవాబిచ్చారు. ఆయన ఆశలు అడియాసలు కావాలని ప్రార్థిస్తున్నాను.
ఎందుకంటే, నేను విన్నదాని ప్రకారం కృష్ణగిరి జిల్లా గంగనహళ్లి కుగ్రామంలో, ఏనుగులు అరటిపండ్లు తిని తలపై దీవెనలు కురిపించే అవకాశం తక్కువ. అలా చేయటం గుడి ఏనుగుల అలవాటు కావచ్చు. ఇవి వాటి అడవి దాయాదులు. సాధారణంగా ఆకలితో ఉంటాయి.
డిసెంబర్ 2021లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని రాగులు పండించే రైతులను కలవడానికి నేను చేసిన యాత్ర, అనుకోకుండా నన్ను ఏనుగుల దారిలోకి నడిపించింది. వ్యవసాయ ఆర్థికశాస్త్రం గురించి చర్చలు ఉంటాయని నేను అనుకున్నాను. ఖచ్చితంగా కొన్నైతే ఉన్నాయి. కానీ చాలావరకూ, పొలం తర్వాత పొలంలో, వారు తమ ఇళ్లలో వాడకానికి మాత్రమే సరిపడేలా రాగులను (ఫింగర్ మిల్లెట్) పండించడానికి కారణం ఏనుగులే అని నేను విన్నాను. చాలా తక్కువ ధర పలకడం (లాభం లేదా నష్టం లేని స్థితిలో ఉంచే 35 నుండి 37 రూపాయలకు బదులుగా, కిలో 25 నుండి 27 రూపాయల ధర ఉండటం), వాతావరణ మార్పులు, అసాధారణమైన భారీ వర్షాల మధ్య రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు ఏనుగుల తొండాలూ, దంతాలూ. ఇవే దాదాపుగా, రైతుల వెన్ను విరిచిన అతి పెద్ద విషయాలు.
“ఏనుగులకు చాలా ప్రతిభ ఉంటుంది. తీగల తాళ్ళను కిందికి వంచి, తీగ కంచెలను ఎలా దాటుకోవాలో అవి నేర్చుకున్నాయి. విద్యుత్ కంచెలపై చెట్లను ప్రయోగించి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేయటం వాటి తెలుసు,” అని ఆనందరాము రెడ్డి వివరించారు. "అవి ఎప్పుడూ మంద కోసం వెతుక్కుంటుంటాయి." అన్నారాయన. ఆనంద - అని అందరూ పిలిచే ఈయన తేన్కనికోట్టై తాలూకాలోని వడ్ర పాళైయమ్‌కు చెందిన ఒక రైతు. మేలగిరి రిజర్వ్ ఫారెస్ట్ అంచుల వరకు ఆయన మమ్మల్ని నడిపించారు. అది ఉత్తర కావేరి వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక భాగం.


















