"మేము ఈ 58 ఒంటెలను జప్తు చేయలేదు," అని అమరావతి జిల్లాలోని తళేగావ్ దశాసర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అజయ్ ఆకరే చెప్పారు. "జంతువులపై క్రూరత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిర్దిష్ట మైన చట్టం లేదు కాబట్టి మాకు అలా చేసే అధికారం లేదు."
"ఈ ఒంటెలు నిర్బంధంలో ఉన్నాయి" అని ఆయన చెప్పారు.
అలాగే ఈ ఒంటెల సంరక్షకులను కూడా అమరావతిలోని స్థానిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు నిర్బంధంలో ఉంచారు. ఈ ఐదుగురు కాపలాదారులు పాక్షిక-సంచార పశుపోషకులు. ఇందులో నలుగురు రబారీ సముదాయానికి చెందినవారైతే ఒకరు మాత్రం గుజరాత్‌లోని కచ్ఛ్‌కు చెందిన ఫకీరానీ జాట్ సముదాయానికి చెందినవారు. ఈ రెండు సామాజిక సమూహాలు తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా సంప్రదాయ ఒంటెల కాపరులుగా ఉన్నాయి. తమను తాము 'జంతు హక్కుల కార్యకర్తలు'గా చెప్పుకుంటోన్న కొందరి ఫిర్యాదుపై పోలీసులు వీరిని అరెస్టు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ఈ ఐదుగురికి తక్షణ, షరతులు లేని బెయిల్ మంజూరు చేశారు.
"నిందితుల వద్ద, ఒంటెల కొనుగోలు గురించి గానీ, వాటి స్వంతదారులని చెప్పడానికి గానీ, వారి స్వంత నివాసానికి సంబంధించిన చట్టపరమైన కాగితాలు గానీ లేవు," అని ఆకరే చెప్పారు. కాబట్టి, సంప్రదాయ పశువుల కాపరులు ఒంటెల గుర్తింపు కార్డులను, వాటి యాజమాన్య పత్రాలను కోర్టుకు సమర్పించాల్సిన ఆసక్తికరమైన పరిస్థితి వచ్చిపడింది. వాటిని ఈ కాపరుల బంధువులు, ఈ రెండు పాక్షిక-సంచార పశుపోషకుల సమూహాలకు చెందిన ఇతర సభ్యులు ఇక్కడకు పంపించారు.
తమ కాపరుల నుండి విడిపోయిన ఒంటెలు ఇప్పుడు ఒక గౌరక్షా కేంద్రంలో, అంటే ఒక గోశాలలో, వాటిని సంరక్షించడం గురించీ, వాటి పోషణ గురించీ ఏమి తెలియని వ్యక్తుల అదుపులో ఉన్నాయి. ఒంటెలు, ఆవులు చాలా భిన్నమైన ఆహారాన్ని తింటాయి. కేసు ఇంకా కొనసాగితే ఆ గోశాలలోని ఒంటెల పరిస్థితి వేగంగా క్షీణించే అవకాశం ఉంది.




















