“నేను కట్టే ప్రతి ఝోపడీ (గుడిసె) కనీసం 70 సంవత్సరాల వరకు నిలుస్తుంది.”

కొల్హాపుర్ జిల్లా జాంభళీ గ్రామంలో నివసించే విష్ణు భోస్లేకు ఒక అరుదైన నైపుణ్యం ఉంది – ఆయన ఝోపడీ (సంప్రదాయక గుడిసె)ని నిర్మిస్తారు.

చనిపోయిన తన తండ్రి గుండు దగ్గర కొయ్య చట్రం, గడ్డి పైకప్పుతో గుడిసెను నిర్మించే కళను నేర్చుకున్నారు 68 ఏళ్ళ విష్ణు. ఇప్పటి వరకు అతను కనీసం 10 గుడిసెలకు పైగా నిర్మించారు; అంతే సంఖ్యలో గుడిసెల నిర్మాణానికి సహకరించారు. “పొలాల్లో పెద్దగా పని ఉండదు కనుక, మేం (సాధారణంగా) వేసవికాలంలో మాత్రమే వాటిని నిర్మిస్తాం. అప్పట్లో జనాలు గుడిసెలు నిర్మించడంలో భలే ఉత్సాహం చూపించేవారు,” అని అతను గుర్తుచేసుకున్నారు.

దాదాపు 1960ల వరకు, జాంభళీలో అలాంటి గుడిసెలు వందకు పైగా ఉండేవని విష్ణు గుర్తుచేసుకున్నారు. సమీపంలో దొరికే వస్తువులను ఉపయోగించి, గుడిసెల నిర్మాణంలో స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకునేవారని ఆయన చెప్పారు. "గుడిసె నిర్మాణానికి మేం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఖర్చు చేసే స్తోమత ఎవరికీ లేదు. గుడిసెల కోసం ప్రజలు మూడు నెలల వరకు కూడా వేచి ఉండడానికి సిద్ధంగా ఉండేవారు. అందుకు కావలసిన సాహిత్య (ముడిసరుకు) సమకూరినప్పుడే నిర్మాణాన్ని ప్రారంభించేవారు.” అన్నారాయన

శతాబ్దం చివరి నాటికి, 4,963 మంది జనాభా (2011 జనగణన ప్రకారం) ఉన్న ఈ గ్రామంలో, కొయ్య-గడ్డి నిర్మాణాల స్థానంలో ఇటుక, సిమెంట్, రేకుల నిర్మాణాలు వచ్చాయి. మొదట్లో స్థానిక కుమ్మరులు తయారుచేసే ఖాపరీ కౌలు (ఇంటి పైకప్పున వేసే పెంకులు) లేదా కుంభారీ కౌలు ల నుండి; ఆ తరువాత మెరుగైన బలం, మన్నిక కలిగి, యంత్రాలతో తయారయ్యే బెంగళూరు కౌలు ల నుండి ఎదురైన పోటీని ఈ గుడిసెలు తట్టుకోలేకపోయాయి.

గడ్డి ఝోపడీ నిర్మాణానికి అవసరమయ్యే శ్రమతో పోలిస్తే, పెంకుల నిర్వహణ తేలిక; వాటితో ఇళ్ళను సులభంగా, వేగంగా కూడా నిర్మించవచ్చు. చివరగా, సిమెంట్-ఇటుకలతో పక్కా గృహాల నిర్మాణం మొదలయ్యాక, ఝోపడీ ల నిర్మాణం తగ్గుముఖం పట్టింది. జాంభళీలోని ప్రజలు తమ ఝోపడీ లను వదిలేయటం మొదలయింది. ప్రస్తుతం కొన్ని ఝోపడీలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి.

“ఇప్పుడు ఊరిలో చాలా అరుదుగా ఝోపడీలు కనబడతాయి. మున్ముందు శ్రద్ధ వహించే వాళ్ళు ఉండరు కాబట్టి, మరి కొన్నేళ్లలో ఈ సంప్రదాయ గుడిసెలు కనుమరుగవుతాయి,” అంటూ విష్ణు నిట్టూర్చారు.

*****

Vishnu Bhosale is tying the rafters and wooden stems using agave fibres. He has built over 10 jhopdis and assisted in roughly the same number
PHOTO • Sanket Jain
Vishnu Bhosale is tying the rafters and wooden stems using agave fibres. He has built over 10 jhopdis and assisted in roughly the same number
PHOTO • Sanket Jain

వాసాలను, కొయ్య మట్టలను నారకలబంద నారతో కడుతున్న విష్ణు భోస్లే. ఈయన పదికి పైగా ఝోపడీలను స్వయంగా నిర్మించారు, దాదాపు పది ఝోపడీల నిర్మాణంలో సహాయం చేశారు


విష్ణు భోస్లే స్నేహితుడు, పొరుగింటివాడైన నారాయణ్ గైక్వాడ్ గుడిసెను కట్టుకోవాలనుకున్నప్పుడు, సహాయం కోసం విష్ణు వద్దకు వచ్చారు. వారిద్దరూ రైతులు; భారతదేశంలో నిర్వహించిన అనేక రైతుల నిరసనలలో కలిసి పాల్గొన్నారు. చదవండి: జాంభళీ రైతు: విరిగిన చేయి, తరగని స్పూర్తి

జాంభళీలో విష్ణుకు ఒక ఎకరం, నారాయణ్‌కు దాదాపు 3.25 ఎకరాల భూమి ఉంది. వీరిద్దరూ జొన్న, ఎర్ర గోధుమలు (emmer wheat), సోయాబీన్స్, చిక్కుళ్ళు, చెరకుతో పాటు బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలను కూడా పండిస్తారు.

ఒక దశాబ్దం క్రితం, ఔరంగాబాద్ జిల్లాలో వ్యవసాయ కూలీలను కలుసుకొని, వారి స్థితిగతుల గురించి తెలుసుకున్నప్పుడు, తానూ ఒక గుడిసెను నిర్మించుకోవాలనే కోరిక నారాయణ్‌కు కలిగింది. అక్కడే ఒక వృత్తాకార ఝోపడీ (చుట్టు గుడిసె)ని చూసి, “ అగదీ ప్రేక్షణీయ్ (చాలా అందంగా ఉంది). త్యాచం గురుత్వాకర్షణ్ కేంద్ర అగదీ బరోబర్ హోతం (గురుత్వాకర్షణ కేంద్రం కూడా సరిగ్గా సమతుల్యంగా ఉంది),” అనుకున్నానని ఆయన తెలిపారు.

వరి గడ్డితో కట్టిన ఆ గుడిసె ప్రతి భాగం సక్రమంగా వచ్చిందని నారాయణ్ గుర్తుచేసుకున్నారు. ఈ విషయమై మరింత విచారిస్తే, తనకు పరిచయం లేని ఒక వ్యవసాయ కూలీ దానిని నిర్మించారని ఆయన తెలుసుకున్నారు. సంబంధిత వివరాలను నారాయణ్ గైక్వాడ్(76) ఒక పుస్తకంలో రాసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఆసక్తికరమైన విషయాలను విస్తారంగా నమోదు చేసుకుంటున్నారు. నలభై రకాల డైరీల (పాకెట్ సైజు నుండి ఏ4 పరిమాణం వరకు) లోని వేలాది పేజీలలో ఇలాంటి ఎన్నో విషయాలను ప్రాంతీయ మరాఠీ భాషలో రాసుకున్నారాయన.

ఒక దశాబ్ద కాలం తర్వాత, తన 3.25 ఎకరాల పొలంలో అలాంటి గుడిసెను కట్టాలనుకున్నారు, కానీ అందుకు అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. వాటిలో ప్రధానమైనది – గుడిసె కట్టేవారిని కనిపెట్టడం.

అప్పుడాయన గుడిసెల తయారీలో నిష్ణాతుడైన విష్ణు భోస్లేను సంప్రదించారు. వారిద్దరి భాగస్వామ్యపు ఫలితం, కొయ్య-గడ్డితో నిర్మించిన గుడిసె రూపంలో ఇప్పుడు కనబడుతోంది- చేతితయారీ వాస్తుశిల్ప నైపుణ్యానికి ఒక చిహ్నంగా.

“ఈ ఝోపడీ ఉన్నంత కాలం, వేల సంవత్సరాల నాటి కళను యువతరానికి గుర్తు చేస్తుంటుంది,” అని నారాయణ్ అభిప్రాయపడ్డారు. “మరి నా పనితనం గురించి ప్రజలకు ఇంకెలా తెలుస్తుంది?” అంటూ ఆయన నిర్మాణ భాగస్వామి అయిన విష్ణు నవ్వారు.

*****

Vishnu Bhosale (standing on the left) and Narayan Gaikwad are neighbours and close friends who came together to build a jhopdi
PHOTO • Sanket Jain

ఇరుగుపొరుగువారు, సన్నిహిత స్నేహితులైన విష్ణు భోస్లే (ఎడమవైపు నిలబడిన వ్యక్తి), నారాయణ్ గైక్వాడ్‌లు. వారిద్దరూ కలిసి ఒక ఝోపడీని నిర్మించారు

Narayan Gaikwad is examining an agave plant, an important raw material for building a jhopdi. 'This stem is strong and makes the jhopdi last much longer,' explains Vishnu and cautions, 'Cutting the fadyacha vasa [agave stem] is extremely difficult'
PHOTO • Sanket Jain

ఝోపడీ నిర్మాణంలో ముఖ్యమైన ముడిపదార్థమైన నారకలబంద మొక్కను పరిశీలిస్తున్న నారాయణ్ గైక్వాడ్. ‘ఈ కాండం బలంగా ఉంటుంది, ఝోపడీని ఎక్కువ కాలం నిలబడేలా చేస్తుంది’ విష్ణు వివరించారు. 'ఫడ్యాచా వాస (నారకలబంద కాండం)ను కత్తిరించడం చాలా కష్టం'

Narayan Gaikwad (on the left) and Vishnu Bhosale digging holes in the ground into which poles ( medka ) will be mounted
PHOTO • Sanket Jain

స్తంభాలు (మేడకం) అమర్చేందుకు భూమిలో గోతులు తవ్వుతున్న నారాయణ్ గైక్వాడ్ (ఎడమవైపు), విష్ణు భోస్లేలు

గుడిసె తయారీలో మొదటి దశ, దాని వినియోగాన్ని గుర్తించడం. “గుడిసె పరిమాణం, నిర్మాణం వంటివి దీనిపైనే ఆధారపడతాయి,” విష్ణు తెలిపారు. ఉదాహరణకు, పశుగ్రాసం నిల్వ చేసే గుడిసెలు సాధారణంగా త్రిభుజాకారంగా ఉంటాయి. అదే ఒక చిన్న కుటుంబం కోసం కట్టే ఒంటి గది అయితే, 12x10 అడుగుల దీర్ఘచతురస్రాకార నిర్మాణం సరిపోతుంది.

నారాయణ్ నిరంతర చదువరి. తాను చదువుకోవడానికి ఒక చిన్న గది పరిమాణంలో ఉన్న గుడిసెను కట్టుకోవాలని ఆయన కోరుకున్నారు. తన పుస్తకాలను, పత్రికలను, వార్తాపత్రికలను అందులో ఉంచుతానని ఆయన చెప్పారు.

గుడిసెను ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అనుకున్నాక, కొన్ని కర్రలతో ఒక సూక్ష్మ నమూనాను విష్ణు తయారుచేశారు. ఆయన, నారాయణ్ కలిసి 45 నిమిషాలకు పైగా చర్చించి, మరిన్ని వివరాలను, ఆకృతిని ఖరారు చేశారు. నారాయణ్ పొలంలో అనేకసార్లు తిరిగి చూశాక, తక్కువ గాలి పీడనం ఉన్న ఒక ప్రదేశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు.

“కేవలం వేసవికాలాల గురించీ, శీతాకాలాల గురించీ ఆలోచించి ఝోపడీ ని నిర్మించకూడదు. ఇది చాలా దశాబ్దాల పాటు ఉండాలి కాబట్టి అనేక అంశాల గురించి మనం ఆలోచించాలి,” అన్నారు నారాయణ్.

మట్టిలో రెండు అడుగుల లోతున గుంతలు తవ్వడంతో గుడిసె నిర్మాణం ప్రారంభమైంది. ఝోపడీ కట్టబోయే ప్రదేశపు అంచుల్లో, ఒకదానికొకటి 1.5 అడుగుల దూరంలో ఉండేలా ఒక్కో గుంత తవ్వారు. 12x9 అడుగుల గుడిసె నిర్మాణానికి, అటువంటి 15 గుంతలు అవసరం; వాటిని తవ్వడానికి సుమారు గంట సమయం పట్టింది. ఆ గుంతలను పాలిథిన్ లేదా ప్లాస్టిక్ సంచులతో కప్పారు. “ఈ గుంతలలో నిలబెట్టే కొయ్యలు తడవకుండా ఈ ప్లాస్టిక్ కాపాడుతుంది,” అని విష్ణు వివరించారు. కొయ్యకు ఏదైనా జరిగితే, గుడిసె మొత్తం శిథిలమయ్యే ప్రమాదం ఉంది.

ఒకదానికొకటి బాగా దూరంగా ఉన్న రెండు గుంతలలోనూ, మధ్యలో ఉన్న గుంతలోనూ ఒక మేడకంను విష్ణు, తాపీ మేస్త్రీ అయిన ఆయన స్నేహితుడు అశోక్ భోస్లేలు జాగ్రత్తగా నిలబెట్టారు. మేడకం అనేది చందన్ (Santalum album - చందనం), బాభూళ్ (Vachellia nilotica - నల్ల తుమ్మ), లేదా కడు నింబా (Azadirachta indica - వేప) చెక్కతో, Y ఆకారంలో దాదాపు 12 అడుగులుండే ఒక కొమ్మ.

సమాంతరంగా ఉండే కొయ్య కొమ్మలను నిలిపేందుకు మేడకం చివరన ఉన్న ‘Y’ ఆకారపు కొన ఉపయోగపడుతుంది. “మధ్యలో పైకప్పుకు ఆధారంగా ఉండే రెండు మేడకంలను ఆడు అని పిలుస్తారు. ఇవి కనీసం 12 అడుగుల పొడవు ఉంటాయి. మిగిలినవి 10 అడుగుల పొడవు ఉంటాయి,” నారాయణ్ వివరించారు.

Left: Narayan digging two-feet holes to mount the base of the jhopdi.
PHOTO • Sanket Jain
Right: Ashok Bhosale (to the left) and Vishnu Bhosale mounting a medka
PHOTO • Sanket Jain

ఎడమ: ఝోపడీకి పునాది కట్టడం కోసం రెండు అడుగుల లోతున గుంతలు తవ్వుతోన్న నారాయణ్. కుడి: మేడకంను పాతుతున్న అశోక్ భోస్లే (ఎడమవైపున ఉన్నవారు), విష్ణు భోస్లేలు

Narayan and Vishnu (in a blue shirt) building a jhopdi at Narayan's farm in Kolhapur’s Jambhali village.
PHOTO • Sanket Jain
Narayan and Vishnu (in a blue shirt) building a jhopdi at Narayan's farm in Kolhapur’s Jambhali village.
PHOTO • Sanket Jain

కొల్హాపుర్, జాంభళీ గ్రామంలోని నారాయణ్ పొలంలో ఒక ఝోపడీని నిర్మిస్తోన్న నారాయణ్, విష్ణులు (నీలం చొక్కాలో)

తరువాత, ఈ కొయ్యల నిర్మాణం మీద గడ్డి కప్పుతారు; వర్షపు నీరు ఇంటి లోపలికి రాకుండా నేల మీదికి జారిపోయేలా ఈ రెండడుగుల పొడవుండే మేడకం ఉపయోగపడుతుంది.

అటువంటి ఎనిమిది మేడకం లను నిటారుగా నిలబెడితే, ఝోపడీ పునాది సిద్ధమవుతుంది. ఈ మేడకంలను గుంతలో పాతి నిలబెట్టడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఈ మేడకం ల నుండి ఝోపడీ రెండు చివరలను కలిపేందుకు ఒక రకమైన స్థానిక వెదురుతో తయారుచేసిన విళూ అని పిలిచే తీగలు సహాయపడతాయి.

“చందనం, బాభూళ్ చెట్లు దొరకడం ఇప్పుడు కష్టంగా ఉంది. ఈ ముఖ్యమైన (దేశవాళీ) చెట్ల స్థానాన్ని చెరకు పంట లేదా భవనాలు భర్తీ చేసేశాయి,” విష్ణు విచారం వ్యక్తం చేశారు.

కొయ్యతో చేసిన ఈ నిర్మాణం సిద్ధమైన తరువాత, పైకప్పు లోపలి నిర్మాణంలో భాగంగా వాసాలు పెడతారు. ఈ గుడిసె కోసం, 44 వాసాలను – దూలానికి రెండు వైపులా 22 చొప్పున – కడదామనుకున్నారు విష్ణు. ప్రాంతీయ మరాఠీలో ఫడ్యాచా వాసా అని పిలిచే నారకలబంద కాండంతో వీటిని తయారుచేస్తారు. నారకలబంద కాండం దాదాపు 25-30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ కాండం చాలా బలమైనదిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది.

“ఈ కాండం బలంగా ఉంటుంది. ఝోపడీ ని ఎక్కువకాలం నిలబడేలా సహాయపడుతుంది,” విష్ణు వివరించారు. వాసాలు ఎన్ని ఉంటే అంత బలమన్నమాట. “కానీ ఫడ్యాచా వాసా ను కోయటం చాలా కష్టం,” అని అతను హెచ్చరించారు.

ఇక ఇప్పుడు నారకలబంద నారను ఉపయోగించి నిలువుగా ఉండే కొయ్య చట్రాన్ని కడతారు - అవి అసాధారణంగా మన్నుతాయి. నారకలబంద ఆకుల నుండి నారను తీయడం చాలా కష్టమైన పని. నారాయణ్‌కు ఇందులో చక్కని నేర్పు ఉంది. కొడవలిని ఉపయోగించి నారను తీయడానికి అతనికి 20 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది. “నారకలబంద ఆకుల లోపల పీచు ఉంటుందని జనానికి తెలియదు,” అతను నవ్వుతూ అన్నారు.

పర్యావరణ అనుకూలమైన బయోడిగ్రేడబుల్ (బిఒదెగ్రదబ్లె) తాళ్ళను తయారుచేయడానికి కూడా ఈ నారను ఉపయోగిస్తారు. (చదవండి: కనుమరుగవుతోన్న భారతదేశపు గొప్ప తాళ్ళ తయారీ మాయాజాలం )

Ashok Bhosale passing the dried sugarcane tops to Vishnu Bhosale. An important food for cattle, sugarcane tops are waterproof and critical for thatching
PHOTO • Sanket Jain

ఎండిన చెరకు ఆకులను విష్ణు భోస్లేకు అందిస్తున్న అశోక్ భోస్లే. ఎండిని చెరకు ఆకులు పశువులకు ముఖ్యమైన ఆహారం; నీటిని చొరబడనివ్వవు, పైకప్పుగా వేసేందుకు కీలకమైనవి కూడా

Building a jhopdi has become difficult as the necessary raw materials are no longer easily available. Narayan spent over a week looking for the best raw materials and was often at risk from thorns and sharp ends
PHOTO • Sanket Jain

అవసరమైన ముడి పదార్థాలు సులభంగా అందుబాటులో లేకపోవడంతో, ఝోపడీని నిర్మించడం కష్టంగా మారింది. మెరుగైన ముడి పదార్థాల కోసం నారాయణ్ ఒక వారం రోజుల పాటు వెతికారు. ఈ వెతుకులాటలో ఆయన తరచూ ముళ్ళు, పదునైన ఆకు కొనల బారినపడ్డారు

కొయ్య ఫ్రేములు అమరిన తరువాత కొబ్బరాకులు, చెరకు ఆకులతో గోడలు కడతారు. వీటితో కడితే కొడవలిని కూడా సులభంగా అందులో దూర్చిపెట్టవచ్చు.

ఇప్పుడు కనిపించే నిర్మాణం సిద్ధమయ్యాక ఇక పైకప్పుపై దృష్టి పెడతారు. పచ్చి చెరకు పై చివర ఉండే లేత ఆకులను, ఇంకా తీపి నింపుకోని చెరకు గడ పైభాగాన్నీ ఉపయోగించి పైకప్పు తయారుచేస్తారు. “అప్పట్లో, పశువులు లేని రైతుల నుండి మేం వీటిని సేకరించేవాళ్ళం,” నారాయణ్ తెలిపారు. చెరకు ఆకులు పశువులకు ముఖ్యమైన దాణా. అందుకని వాటినిప్పుడు రైతులు ఉచితంగా ఇవ్వడం లేదు.

జొన్న, ఎర్ర గోధుమల ఎండిన చొప్పను కూడా పైకప్పును కప్పడానికి - ఖాళీగా కనిపిస్తున్నచోట్ల కప్పడానికీ, ఝోపడీ ని అందంగా మార్చడానికీ - ఉపయోగిస్తారు. “ప్రతి ఝోపడీ కి కనీసం ఎనిమిది బిందాలు (దాదాపు 200-250 కిలోల చెరకు లేత ఆకులు) అవసరం,” నారాయణ్ అన్నారు.

పైకప్పు వేయడం శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఇందుకు సుమారు మూడు రోజులు పడుతుంది. అందుకోసం రోజుకు ఆరు-ఏడు గంటల సమయాన్ని ముగ్గురు వ్యక్తులు వెచ్చించవలసి ఉంటుంది. “ప్రతి దంటును జాగ్రత్తగా అమర్చాలి. లేదంటే వర్షపు నీరు లోపలికి వచ్చేస్తుంది,” అని విష్ణు వివరించారు. ప్రతి 3-4 సంవత్సరాలకు ఈ కప్పును తిరగేయాలి – మరాఠీలో దీన్ని ఛప్పర్ శాకర్నే అంటారు - ఇది గుడిసె ఎక్కువకాలం నిలిచేలా చేస్తుంది.

“సంప్రదాయకంగా, జాంభళీలో పురుషులు మాత్రమే ఝోపడీలు కడతారు. కానీ ముడి పదార్థాలను తీసుకొచ్చి, మట్టిని చదును చేయడంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు,” అని విష్ణు భార్య, అరవయ్యో పడిలో ఉన్న అంజన తెలిపారు.

ఈ నిర్మాణం పూర్తి కావడంతో, బాగా నీళ్లు పోసి, దిగువన ఉన్న మట్టిని దున్నుతారు. ఆ తరువాత, ఒక మూడు రోజులపాటు దీనిని ఆరనిస్తారు. “ఇది మట్టిలో ఉండే జిగురు స్వభావాన్ని వెలికితీయడంలో సహాయపడుతుంది,” అని నారాయణ్ వివరించారు. అది పూర్తయిన తరువాత, తన రైతు స్నేహితుల నుండి తెచ్చిన పాంఢరీ మాటి (తెల్లని మట్టి)ని అలుకుతారు. ఇనుము, మాంగనీసులను తొలగించడ వల్ల ఈ “తెల్ల” మట్టి లేత రంగులో ఉంటుంది.

Before building the jhopdi , Vishnu Bhosale made a miniature model in great detail. Finding the right place on the land to build is critical
PHOTO • Sanket Jain
Before building the jhopdi , Vishnu Bhosale made a miniature model in great detail. Finding the right place on the land to build is critical
PHOTO • Sanket Jain

ఝోపడీని నిర్మించడానికి ముందు, విష్ణు భోస్లే చాలా వివరంగా ఒక సూక్ష్మ నమూనాను తయారుచేశారు. గుడిసెను నిర్మించడానికి నేలపై సరైన స్థలాన్ని వెతకడం చాలా కష్టమైన పని

Ashok Bhosale cuts off the excess wood to maintain a uniform shape.
PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

సమంగా కనిపించడం కోసం ఎక్కువతక్కువగా ఉన్న కొయ్యను కోస్తున్న అశోక్ భోస్లే. కుడి: ఈ Y-ఆకారపు మేడకంపై కొయ్య కొమ్మలను అడ్డంగా అమరుస్తారు

ఈ తెల్ల మట్టిని దిట్టంగా చేయడానికి గుర్రాల, ఆవుల, ఇతర పశువుల పేడతో కలుపుతారు. దీన్ని నేలపై అలికి, ధుమ్మస్ అనే చెక్క సాధనాన్ని ఉపయోగించి మగవాళ్ళు నేలను అణగగొడతారు. ఒక్కోటీ కనీసం 10 కిలోల బరువుండే ఈ సాధనాన్ని అనుభవజ్ఞులైన వడ్రంగులు తయారుచేస్తారు.

నేలను అణగగొట్టడం పూర్తయిన తర్వాత, మహిళలు దానిని బడవణ తో సమం చేస్తారు. క్రికెట్ బ్యాట్‌ను పోలి ఉండి, మూడు కిలోల బరువుండే ఈ బాభూళ్ (తుమ్మ) చెక్క సాధనానికి పొట్టి చేతి పిడి ఉంటుంది. కాలక్రమేణా, నారాయణ్ తన బడవణా ను పోగొట్టుకున్నారు కానీ అదృష్టవశాత్తూ అతని అన్నయ్య సఖారామ్ (88), తన బడవణా ను సురక్షితంగా దాచుకున్నారు.

నారాయణ్ భార్య కుసుమ్, తమ ఝోపడీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారు. “మా వ్యవసాయ పనుల నుండి తీరిక దొరికినప్పుడల్లా, మేం ఇక్కడి నేలను చదును చేశాం,” అని 68 ఏళ్ల కుసుమ్ తెలిపారు. ఇది చాలా కష్టమైన పని అవటం వలన తమ కుటుంబ సభ్యులు, స్నేహితులందరూ వంతులవారీగా సహాయం చేశారని చెప్పారామె.

నేలంతా సమానంగా చేయటం పూర్తయిన తర్వాత, మహిళలు నేలను ఆవు పేడను అలకడంలో మునిగిపోతారు. ఈ పేడ దోమలను నివారించడంలో సహాయపడటమే కాక, మంచి బైండింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.

ద్వారం లేని ఇల్లు ఏదో కోల్పోయినట్టు కనబడుతుంది. సాధారణంగా దేశీయంగా పండే జొన్న చొప్ప, చెరకు ఆకులు, లేదా ఎండిన కొబ్బరాకులను ఉపయోగించి ఈ తలుపులను తయారుచేస్తారు. అయితే జాంభళీలోని రైతులెవరూ దేశవాళీ పంటలను సాగు చేయకపోవడంతో, నిర్మాణదారులకు ఇదొక సవాల్‌గా మారింది.

“ప్రతి ఒక్కరూ హైబ్రిడ్ రకానికి మారారు. దీని నుండి వచ్చే పశుగ్రాసం అంత పోషకమైనది కాదు, దేశీయ పంటలకు లాగా ఎక్కువ కాలం మన్నదు,” అన్నారు నారాయణ్.

Narayan carries a 14-feet tall agave stem on his shoulder (left) from his field which is around 400 metres away. Agave stems are so strong that often sickles bend and Narayan shows how one of his strongest sickles was bent (right) while cutting the agave stem
PHOTO • Sanket Jain
Narayan carries a 14-feet tall agave stem on his shoulder (left) from his field which is around 400 metres away. Agave stems are so strong that often sickles bend and Narayan shows how one of his strongest sickles was bent (right) while cutting the agave stem
PHOTO • Sanket Jain

400 మీటర్ల దూరంలో ఉన్న తన పొలం నుండి 14 అడుగుల పొడవైన నారకలబంద మొక్క కాండాన్ని తన భుజంపై (ఎడమ) మోసుకొస్తున్న నారాయణ్. నారకలబంద మొక్క కాండం ఎంత బలంగా ఉంటుందంటే, దాన్ని కోసేటప్పుడు తరచూ కొడవళ్ళు కూడా వంగిపోతుంటాయి. నారకలబంద మొక్క కాండాన్ని కోసేటప్పుడు అతని బలమైన కొడవళ్ళలో ఒకటి (కుడి) ఎలా వంగిందో చూపిస్తున్న నారాయణ్

వ్యవసాయ విధానాలు మారడంతో, ఝోపడీ తయారీ వేగాన్ని హెచ్చించవలసి వచ్చింది. ఇంతకుముందు వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండని వేసవికాలంలో వీటిని కట్టేవారు. అయితే, ఇప్పుడు పొలాలు బీడుగా మిగిలిపోయే పరిస్థితి లేదని విష్ణు, నారాయణ్‌లు అంటున్నారు. "ఇంతకుముందు ఏడాదికి ఒకసారి మాత్రమే సాగు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏడాదికి రెండు-మూడుసార్లు సాగుచేసినా కూడా మేం బతకడానికి కష్టంగా ఉంది," అన్నారు విష్ణు.

ఒకవైపు వారి వారి వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా నారాయణ్, విష్ణు, అశోక్, కుసుమ్‌లు 300 గంటలకు పైగా సామూహికంగా శ్రమ పడితే, వారి ఝోపడీ నిర్మాణం ఐదు నెలల్లో పూర్తయ్యింది. “ఇది బాగా అలవగొట్టే ప్రక్రియ. ముడి పదార్థాల కోసం వెతకడం ఇప్పుడు చాలా కష్టం,” ఒక వారం పాటు జాంభళీలోని వివిధ ప్రాంతాల నుండి ముడి పదార్థాలను సేకరించిన నారాయణ్ తెలిపారు.

ఝోపడీ ని కడుతున్నప్పుడు ముళ్ళు, పుడకల వల్ల బాధాకరమైన గాయాలయ్యాయి. “ఈ బాధకు అలవాటుపడకపోతే మనం రైతులమెలా అవుతాం?” గాయపడిన తన వేలిని చూపిస్తూ ప్రశ్నించారు నారాయణ్.

ఎట్టకేలకు ఝోపడీ సిద్ధమైంది. దాని నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అలసిపోయారు, కానీ అది కళ్ళముందు అలా నిలిచి ఉండటం చూసి ఆనందించారు. మొత్తంగా పరిస్థితులను చూసుకుంటే బహుశా జాంభళీ గ్రామంలో కట్టే చివరి ఝోపడీ ఇదే కావచ్చు. ఎందుకంటే, విష్ణు చెప్పినట్లు, అతి తక్కువ మంది మాత్రమే దీని నిర్మాణ పనులను నేర్చుకోవడానికి వచ్చారు. కానీ నారాయణ్ అతనిని ఓదార్చారు. “ కోణ్ యేవూ దే కింవా నాహీ యేవూ దే, ఆపత్యాలా కాహీహీ ఫరక్ పడత్ నాహీ (జనాలు వచ్చినా రాకపోయినా మరేమీ పర్వాలేదు).” తన వంతు సహాయం తాను చేసి కట్టుకున్న ఝోపడీ లో ప్రశాంతంగా నిద్ర పడుతోందనీ, దానిని గ్రంథాలయంగా మార్చాలనుకుంటున్నాననీ ఆయన తెలిపారు.

“నా ఇంటికి ఎవరైనా స్నేహితులు, లేదా అతిథులు వచ్చినప్పుడు, నేను వారికి ఈ ఝోపడీ ని గర్వంగా చూపిస్తాను. పైగా, సంప్రదాయ కళను సజీవంగా ఉంచినందుకు ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రశంసిస్తారు,” అన్నారు నారాయణ్ గైక్వాడ్.

Vishnu Bhosale shaves the bamboo stems to ensure they are in the proper size and shape. Narayan extracting the fibre from Agave leaves which are used to tie the rafters and horizontal wooden stems
PHOTO • Sanket Jain
Vishnu Bhosale shaves the bamboo stems to ensure they are in the proper size and shape. Narayan extracting the fibre from Agave leaves which are used to tie the rafters and horizontal wooden stems
PHOTO • Sanket Jain

వెదురు కర్రను సరైన పరిమాణంలో, ఆకారంలో ఉండేలా చెక్కుతోన్న విష్ణు భోస్లే. నారకలబంద ఆకుల నుండి నారను తీస్తున్న నారాయణ్. వీటిని వాసాలను, అడ్డంగా వేసే కొయ్య కొమ్మలను కట్టడానికి ఉపయోగిస్తారు

The women in the family also participated in the building of the jhopdi , between their work on the farm. Kusum Gaikwad (left) is winnowing the grains and talking to Vishnu (right) as he works
PHOTO • Sanket Jain
The women in the family also participated in the building of the jhopdi , between their work on the farm. Kusum Gaikwad (left) is winnowing the grains and talking to Vishnu (right) as he works
PHOTO • Sanket Jain

కుటుంబంలోని మహిళలు కూడా తమ పొలం పనుల నుండి తీరిక దొరికినప్పుడు ఝోపడీని కట్టడంలో పాల్గొన్నారు. పనిచేస్తున్న విష్ణు (కుడి)తో, గింజలను తూర్పారబడుతూ మాట్లాడుతున్న కుసుమ్ గైక్వాడ్ (ఎడమ)

Narayan Gaikwad attending a call on his mobile while digging holes for the jhopdi
PHOTO • Sanket Jain

ఝోపడీ కోసం గుంతలు తవ్వుతూ తన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్న నారాయణ్ గైక్వాడ్

Narayan’s grandson, Varad Gaikwad, 9, bringing sugarcane tops from the field on the back of his cycle to help with the thatching process.
PHOTO • Sanket Jain

పైకప్పు నిర్మాణం కోసం తన వంతు సాయంగా, పొలం నుండి చెరకు మొక్కల లేత ఆకులను తన సైకిల్ వెనుక పెట్టుకొని  తీసుకువస్తున్న తోమిదేళ్ళ వయసున్న నారాయణ్ మనవడు వరద్ గైక్వాడ్

Narayan’s grandson, Varad hangs around to watch how a jhopdi is built
PHOTO • Sanket Jain

ఝోపడీని ఎలా కడుతున్నారో చూడడానికి ఉత్సాహపడుతున్న నారాయణ్ మనవడు వరద్

The jhopdi made by Narayan Gaikwad, Kusum Gaikwad, Vishnu and Ashok Bhosale. 'This jhopdi will last at least 50 years,' says Narayan
PHOTO • Sanket Jain
The jhopdi made by Narayan Gaikwad, Kusum Gaikwad, Vishnu and Ashok Bhosale. 'This jhopdi will last at least 50 years,' says Narayan
PHOTO • Sanket Jain

నారాయణ్ గైక్వాడ్, కుసుమ్ గైక్వాడ్, విష్ణు, అశోక్ భోస్లేలు నిర్మించిన ఝోపడీ. ‘ఈ ఝోపడీ కనీసం 50 ఏళ్లు ఉంటుంది’ అంటారు నారాయణ్

Narayan Gaikwad owns around 3.25 acre on which he cultivates sugarcane along with sorghum, emmer wheat, soybean, common beans and leafy vegetables like spinach, fenugreek and coriander. An avid reader, he wants to turn his jhopdi into a reading room
PHOTO • Sanket Jain

నారాయణ్ గైక్వాడ్‌కు సుమారు 3.25 ఎకరాల స్వంత భూమి ఉంది. అందులో ఆయన జొన్నలు, ఎర్ర గోధుమలు, సోయాబీన్, చిక్కుళ్ళు, చెరకుతో పాటు బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను కూడా పండిస్తున్నారు. నిరంతర చదువరి అయిన ఆయన తన ఝోపడీని రీడింగ్ రూమ్‌గా మార్చాలనుకుంటున్నారు


ఈ కథనం, సంకేత్ జైన్ గ్రామీణ కళాకారులపై రూపొందించిన వరుస కథనాలలో ఒకటి. ఇది మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ మద్దతుతో రాయబడింది .

అనువాదం: వై కృష్ణ జ్యోతి

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Photo Editor : Sinchita Maji

Sinchita Maji is a Senior Video Editor at the People’s Archive of Rural India, and a freelance photographer and documentary filmmaker.

Other stories by Sinchita Maji
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi