ఆయన మృదువుగా వినిపించే మోసకారి మాను గుడ్లగూబ(ఉడ్ ఔల్) కూతను, నాలుగు రకాల జిట్ట(బాబ్లర్) పిట్టల అరుపులను గుర్తించగలరు. ఆయనకు వలసజాతి ఊలుమెడ కొంగలు ఏ రకమైన కొలనుల్లో గుడ్లుపెడతాయో కూడా తెలుసు.
బి. సిద్దన్ బడి చదువును మధ్యలోనే మానేశారు, కానీ తమిళనాడు రాష్ట్రం నీలగిరులలోని తన ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షి జాతుల గురించి ఆయనకున్న జ్ఞానం ఏ పక్షి శాస్త్రవేత్తకూ తీసిపోదు.
"మా గ్రామంలో సిద్దన్ పేరుతో ముగ్గురు కుర్రాళ్ళు ఉండేవారు. ఎవరైనా సిద్దన్ కోసం అడిగితే, 'ఆ కురువి సిద్దన్ - ఎప్పుడూ పక్షుల వెంట పిచ్చిగా పరిగెడ్తాడు, ఆ కుర్రాడే', అని మా గ్రామస్థులు చెబుతారు," అంటూ సగర్వంగా నవ్వుతూ చెప్తారాయన.
అతని అసలు పేరు బి. సిద్దన్. కానీ ముదుమలై చుట్టుపక్కల అడవులూ గ్రామాల్లో అతన్ని కురువి సిద్దన్ అని పిలుస్తారు. తమిళంలో, 'కురువి' అనేది పాస్సెరిఫార్మీస్ క్రమానికి (order) చెందిన పక్షులైన పాస్సురైన్లను సూచిస్తుంది. పక్షి జాతులలో సగానికి పైగా ఇదే క్రమానికి చెందుతాయి.
"పశ్చిమ కనుమలలో మీరెక్కడికి వెళ్ళినా, ఓ నాలుగైదు పక్షులు పాడటాన్ని మీరు వింటారు. మీరు చేయాల్సిందల్లా వినటం నేర్చుకోవటమే" అంటుంది, 28 ఏళ్ల విజయ సురేశ్. ఈమె నీలగిరి పర్వతపాదంలో ఉన్న ఆనకట్టి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని. తాను పక్షుల గురించిన విలువైన సమాచారాన్ని సిద్దన్ నుంచే నేర్చుకున్నానని ఆమె చెప్పారు. ముదుమలై టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల నివసించే చాలామంది కుర్రాళ్ళకు సిద్దన్ ఒక మార్గదర్శి. విజయ తన చుట్టుపక్కల ప్రాంతంలోని 150 వరకూ పక్షులను గుర్తించగలదు.
















