ఇక్కడ బాగా వినిపించే పేరు ‘విరాట్ కోహ్లీ’. డూంగ్రా ఛోటాలో ఆ భారత క్రికెట్ దిగ్గజానికి చాలామంది అభిమానులు ఉన్నారు.

శీతాకాలపు ఉదయం 10 గంటలు దాటింది, డజనుమందికి పైగా యువజనం ఆటలో నిమగ్నమై ఉన్నారు. చూట్టూ పచ్చపచ్చని మొక్కజొన్న పొలాలు ఉన్న మైదానం మనకు క్రికెట్ మైదానంలా అనిపించదు, కానీ బాంస్‌వారా జిల్లాలోని ఈ గ్రామంలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు పాపింగ్ క్రీజ్ నుంచి బౌండరీ లైన్ వరకు ప్రతి అడుగూ తెలుసు.

క్రికెట్ అభిమానులతో సంభాషించడానికి అత్యంత మేలైన మార్గం, వాళ్ళ అభిమాన ఆటగాళ్ళ గురించి అడగడం అని అందరికీ తెలుసిందే. ఇక్కడ మనం దీన్ని విరాట్ కోహ్లితో ప్రారంభించవచ్చు, కానీ ఆ తర్వాత మనం ఇతరుల పేర్లను కూడా వింటాం - రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్…

చివరగా, 18 ఏళ్ళ శివమ్ లబానా, “నాకు స్మృతి మంధానా అంటే ఇష్టం,” అన్నాడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, భారత మహిళా టి20 జట్టు మాజీ కెప్టెన్ అయిన స్మృతి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరు.

కానీ ఈ మైదానంలో చర్చించేది కేవలం ఆ ఎడమచేతి బ్యాటర్ గురించి మాత్రమే కాదని మాకు త్వరలోనే తెలిసింది.

ఔత్సాహిక బౌలర్లు, బ్యాటర్ల మాటల సందడి మధ్య - అందరూ అబ్బాయిలే - ఒక అమ్మాయి మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. కేవలం తొమ్మిదేళ్ళ వయసున్న హితాక్షి రాహుల్ హడక్శీ తెల్లటి బూట్లు, బ్యాటింగ్ ప్యాడ్స్, థై గార్డ్, ఎల్‌బో గార్డ్‌లతో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా నిలబడింది.

PHOTO • Swadesha Sharma
PHOTO • Priti David

తొమ్మిదేళ్ళ వయసున్న క్రికెటర్ హితాక్షి హడక్శీ . రాజస్థాన్‌లోని బాంస్‌వారా జిల్లా, కుశల్‌గఢ్ తహసీల్‌లో చుట్టూ పచ్చపచ్చని మొక్కజొన్న పొలాలున్న ఈ బహిరంగ ప్రదేశంలో ఇతర ఉత్సాహవంతులైన క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తోంది

PHOTO • Swadesha Sharma

మాట్లాడటానికి అంతగా ఆసక్తి చూపని హితాక్షి, క్రీజులో నిలబడి తన ఆటను ప్రదర్శించడానియితే సిద్ధంగా ఉంటుంది!

“నేను బ్యాట్స్‌మన్‌ కావాలనుకుంటున్నాను. మేరేకో సబ్సే అచ్ఛీ లగ్తీ హై బ్యాటింగ్ [నాకు అన్నిటి కంటే బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం],” అని ఆమె PARIకి చెప్పింది. " మైఁ ఇండియా కే లియే ఖేల్‌నా చాహూంగీ [నేను భారత్ తరఫున ఆడాలనుకుంటున్నాను]," అని ఆమె ప్రకటించింది. మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపని హితాక్షి క్రీజులో నిలబడి తన ఆటను ప్రదర్శించడానికి సిద్ధమైంది. గట్టిగా ఉన్న పిచ్ పైకి నడుచుకుంటూ వెళ్ళి, ఆమె కొన్ని సీజన్ బాల్ డెలివరీలను నెట్‌లాగా పనిచేస్తోన్న గొలుసుకట్టు కంచెలోకి కొట్టింది.

భారతదేశం తరఫున ఆడాలనే హితాక్షి కోరికను ఆమెకు కోచ్‌గా కూడా ఉన్న ఆమె తండ్రి సమర్థించారు. ఆమె తన షెడ్యూల్‌ను ఇలా వివరించింది: “నేను బడి నుంచి ఇంటికి వచ్చాక ఒక గంటసేపు నిద్రపోతాను. ఆ తర్వాత నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు [సాయంత్రం] శిక్షణ తీసుకుంటాను." వారాంతాలు, ఈ రోజువంటి సెలవు దినాలలో, ఆమె ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ తీసుకుంటుంది.

“మేం ఇప్పటికి దాదాపు 14 నెలల నుంచి నిరంతరం శిక్షణ తీసుకుంటున్నాం. ఆమెతో పాటు నేను కూడా శిక్షణ తీసుకోవాలి,” అని రాజస్థాన్‌లోని బాంస్‌వారా జిల్లా డూంగ్రా బడాలోని వాహన గ్యారేజ్ యజమాని అయిన ఆమె తండ్రి రాహుల్ హడక్శీ చెప్పారు. తన కుమార్తె సామర్థ్యాలపై గర్వం, నమ్మకంతో ఉన్న ఆయన ఇలా అన్నారు: “ శాన్‌దార్ ప్లేయింగ్ హై [నిజంగా చాలాబాగా ఆడుతుంది]. ఒక తండ్రిగా నేను ఆమెతో కఠినంగా ఉండకూడదు, కానీ నేనలా ఉండక తప్పదు. ”

హితాక్షి బ్యాటింగ్ చేస్తోన్న వీడియో చూడండి

'శాన్‌దార్ ప్లేయింగ్ హై [ఆమె నిజంగా చాలాబాగా ఆడుతుంది],' ఒకప్పటి క్రికెట్ ఆటగాడు, ప్రస్తుతం హితాక్షికి శిక్షకుడైన ఆమె తండ్రి రాహుల్ హడక్శీ అంటారు

ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. "మేం తనకు వారానికి నాలుగుసార్లు గుడ్లు, కొంచెం మాంసం కూడా ఇస్తాం," అని రాహుల్ తెలియజేశారు. "ఆమె ప్రతిరోజూ రెండు గ్లాసుల పాలు తాగుతుంది, అలాగే సలాడ్‌లో దోసకాయ, క్యారెట్‌ తింటుంది."

హితాక్షి పడే కష్టం ఆమె ఆటలో కనిపిస్తుంది. ఆమె, జిల్లా స్థాయిలో ఆడిన డూంగ్రా చోటాకు చెందిన ఇద్దరు అబ్బాయిలు - 18 ఏళ్ళ శివమ్ లబానా, 15 ఏళ్ళ ఆశిష్ లబానా వంటి ఆటగాళ్ళతో ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంది. వాళ్ళిద్దరూ బౌలర్లు. ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా లబానా ప్రీమియర్ లీగ్ (LPL)తో సహా మిగతా టోర్నమెంట్‌లలో పాల్గొంటున్నారు. ఎల్‌పిఎల్‌లో లబానా వర్గానికి చెందిన 60 కంటే ఎక్కువ జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి.

"మేం మొదటిసారి ఎల్‌పిఎల్‌లో పాల్గొన్నప్పుడు, కేవలం అబ్బాయిలే ఆడారు. అప్పుడు మాకు కోచ్‌గా రాహుల్ భయ్యా [హితాక్షి తండ్రి] లేరు,” అని శివమ్ చెప్పాడు. "నేను ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాను."

ఈ రోజున రాహుల్ ఏర్పాటు చేసిన హితాక్షి క్లబ్‌కు కూడా వీళ్ళు ఆడుతున్నారు. "మేం ఆమెకు [హితాక్షి] శిక్షణ ఇస్తున్నాం," అని శివమ్ అన్నాడు. “ఆమె మా జట్టులోకి అడుగుపెట్టాలని మేం కోరుకుంటున్నాం. మా సముదాయంలోని అమ్మాయిలు [క్రికెట్] ఆడరు కాబట్టి ఆమె అలా ఆడటం మంచిదని మేం భావిస్తున్నాం.

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

హితాక్షి 18 ఏళ్ళ బౌలర్ శివమ్ లబానా (ఎడమ)తో కూడా ఆడుతుంది. జిల్లా స్థాయిలో ఆడిన ఆశిష్ లబానా (కుడి) రాహుల్, హితాక్షిలతో పాటు శిక్షణ తీసుకుంటున్నాడు

PHOTO • Swadesha Sharma

ప్రతిరోజూ బడి అయిపోయాక, వారాంతాలలో ఉదయం పూట హితాక్షి శిక్షణ తీసుకుంటుంది

అదృష్టవశాత్తూ హితాక్షి విషయంలో ఆమె తల్లితండ్రులు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఆమె జట్టు సహచరులలో ఒకరు అన్నట్లు: “ ఉన్కా డ్రీమ్ హై ఉస్కో ఆగే భేజేంగే [ఆమెను ముందుకు పంపాలని వాళ్ళు కలలు కంటున్నారు]”.

ఈ క్రీడకు ఆదరణ ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రికెట్‌ ఆడించేందుకు వెనకాడుతున్నారు. 15 ఏళ్ళ తన సహచరుడి ఇదే విధమైన పరిస్థితిని గురించి ప్రస్తావిస్తూ శివమ్, “అతను చాలాసార్లు రాష్ట్రస్థాయిలో ఆడాడు, దాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వదిలేయాలని ఆలోచిస్తున్నాడు. బహుశా అతని కుటుంబం అతన్ని కోటాకు పంపొచ్చు," అన్నాడు. కోచింగ్ తరగతులు, ఉన్నత విద్యకు పేరెన్నిక గన్న కోటాకు వెళ్ళటమంటే ఇక క్రికెట్‌కు దూరమైనట్లే.

హితాక్షి తల్లి శీలా హడక్శీ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు హిందీ బోధిస్తారు. వారి కుటుంబంలో అందరిలాగే ఆమె కూడా పెద్ద క్రికెట్ అభిమాని. “భారత జట్టులోని ప్రతి ఆటగాడి పేరు నాకు తెలుసు, నేను వాళ్ళందరినీ గుర్తు పడతాను. నాకు రోహిత్ శర్మ అంటే ఎక్కువ ఇష్టం,” చిరునవ్వుతో చెప్పారామె..

PHOTO • Swadesha Sharma
PHOTO • Priti David

హితాక్షి తల్లిదండ్రులు ఆమెకు బాగా అండగా ఉంటారు. ఔత్సాహిక క్రికెట్ ఆటగాడిగా తాను ఆడిన రోజులను గుర్తుచేసుకుంటోన్న రాహుల్ హడక్శీ (ఎడమ). తాను ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు బడిచెప్పని సమయాలలో శీలా హడక్శీ (కుడి) తమ కుటుంబానికి చెందిన వాహన గ్యారేజిని చూసుకుంటారు

ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే ఆమె, మేమామెను కలిసిన వాళ్ళ సొంత గ్యారేజీని కూడా నిర్వహిస్తున్నారు. “ప్రస్తుతం, మన రాజస్థాన్ నుంచి క్రికెట్ ఆడే అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఎక్కువమంది లేరు. అందుకే మేం మా అమ్మాయి కోసం కొంత ప్రయత్నం చేశాం, చేస్తూనే ఉంటాం.’’

తొమ్మిదేళ్ళ హితాక్షి ఇంకా చాలా దూరమే వెళ్ళాల్సి ఉంది, అయితే ఆమె తల్లిదండ్రులు "ఆమెను నైపుణ్యం కలిగిన క్రికెటర్‌గా తయారుచేసేందుకు అవసరమైనదంతా చేయాలి," అని నిశ్చయించుకున్నారు.

"భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు" అని రాహుల్ అన్నారు. "కానీ ఒక తండ్రిగా, మంచి క్రీడాకారుడిగా, ఆమె భారతదేశానికి ఆడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను."

అనువాదం: రవి కృష్ణ

Swadesha Sharma

Swadesha Sharma is a researcher and Content Editor at the People's Archive of Rural India. She also works with volunteers to curate resources for the PARI Library.

Other stories by Swadesha Sharma
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna