పని కోసం తాను తిరిగిన ప్రతి ఊరూ గుర్తుంది మంగళ  హరిజన్ కు. “కంచుర్, కురుగుండ్, క్యతనకేరి... ఒక ఏడాది నేను రత్తిహళ్ళికి కూడా వెళ్లాను,” అన్నది ఆమె తిరిగిన ఊరి పేర్లను ఏకరువు పెడుతూ. ఇవన్నీ కర్ణాటకలో, హవేరి జిల్లాలో హిరేకేరూర్ తాలూకా లో ఉన్నాయి. వ్యవసాయ కూలీగా మంగళ, రోజూ 17-20 కిలోమీటర్లు తన కుగ్రామం నుండి పనికోసం ప్రయాణిస్తుంది.

“నేను రెండేళ్లుగా కొణనతలికి వెళ్తున్నాను,”అని ఆమె చెప్పింది. కొణనతలి, మంగళ ఊరైన మెనాశినహల్, ఈ రెండూ హవేరి జిల్లా రాణిబెన్నూర్ తాలూకా లో ఉన్నాయి. హిరేకేరూర్ తాలూకా, మంగళ, మిగిలిన ఆడవారు ఉండే మెనాశినహల్ మాదిగ కేరి(దళితుల కాలనీ)కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ 8-10 మంది మహిళలు ఒక బృందంగా ప్రయాణిస్తారు.

వారికి రోజూ 150 రూపాయిలు వస్తాయి. ఇవి కొద్ధి నెలలు మాత్రమే.  వారు చేతి పరాగసంపర్కారలు(Hand Pollinators)గా పని చేసినప్పుడు, 90 రూపాయిలు ఎక్కువ వస్తాయి. ఈ పని కోసం వారు జిల్లాను దాటి వెళ్ళాలి. రైతులు వీరిని పనికి పెట్టుకున్నప్పుడు, ఆటోలలో వారిని ఇంటివద్ద నుండి పని ప్రదేశానికి తీసుకువచ్చి, మళ్లీ పని పూర్తయ్యాక ఇంటి వద్ద దింపుతారు. “ఆటో  డ్రైవర్లు రోజుకు 800-900 రూపాయిలు తీసుకుంటారు. అందుకని వాళ్లు మాకు వచ్చే కూలీలో 10 రూపాయిలు మినహాయించి ఇస్తారు. అంతకు ముందు ఆటోలు దొరికేవి కాదు, మేము నడుచుకుంటూ వెళ్లేవాళ్లము,” అన్నది మంగళ.

కాస్త చిన్న ఆకారంతో , ఉండవలసిన దాని కన్నా తక్కువ బరువుతో ఉన్న 30 ఏళ్ళ మంగళ, తన భర్తతో ఒక గది ఉన్న పూరింటిలో ఉంటుంది. ఆమె భర్త కూడా రోజు కూలీగా పనిచేస్తాడు. వారికి నలుగురు పిల్లలు. ఒక బల్బ్ వారి గుడిసెలో వెలుగుతోంది. గదిలో ఒక మూలని వారి వంటగదిగా  వాడుకుంటున్నారు. ఇంకొ మూల వారి బట్టలున్నాయి. ఇంకో గోడవైపుకు ఒక విరిగిన స్టీల్ అలమారా ఉంది. ఇక గదిలో వీటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వారు తినడానికి, నిద్రపోవడానికి వాడతారు. బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమి కడగడానికి బయట ఒక బండరాయి ఉంది.

Mangala Harijan (left) and a coworker wear a plastic sheet to protect themselves from rain while hand pollinating okra plants.
PHOTO • S. Senthalir
Mangala and other women from Menashinahal village in Ranibennur taluk, working at the okra farm in Konanatali, about 12 kilometres away
PHOTO • S. Senthalir

ఎడమ: మంగళ హరిజన(ఎడమ), ఆమెతో పాటే పని చేసే ఇంకో వ్యక్తి, వారిని వర్షం నుండి రక్షించుకోవడానికి ఒక ప్లాస్టిక్ షీట్ ని కప్పుకున్నారు. కుడి: మంగళ, రాణిబెన్నూర్ తాలూకాకు మెనాశినహాల్ చెందిన మహిళలు, పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొణనతలిలోని బెండకాయ తోటలో పనిచేస్తున్నారు

“ఈ ఏడాది మాత్రమే మాకు 240 రూపాయిలు క్రాసింగ్ పనికి ఇస్తున్నారు. పోయిన ఏడాది దాకా , మాకు 10 రూపాయిలు తక్కువ వచ్చేవి,”  అన్నది మంగళ. ఆమెవంటి కూలివాళ్ళు, పంటలకు చేతి ద్వారా పరాగ సంపర్కం (విత్తనాల కోసం పండించే పంటలకు) చేసేవారు, ఈ పనిని క్రాస్ లేదా క్రాసింగ్ అంటారు.

వర్షాకాలం, చలికాలాల్లో, చేతి పోలినేషన్ పని అందుబాటులో ఉన్నప్పుడు మంగళకు నెలలో 15-20 రోజులు సంపాదన ఉంటుంది. ఆమె టమోటా, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయల హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఆమెకు పని ఇచ్చిన రైతులు, సీడ్ కంపెనీల కొరకు ఉత్పత్తి చేస్తారు. నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NSAI) ప్రకారం, భారతదేశంలో, మంగళ క్షేత్ర స్థాయిలో నిమగ్నమైన అయిన ఈ హైబ్రిడ్ వెరైటీ కూరగాయ విత్తన పరిశ్రమ విలువ 2,600 కోట్ల రూపాయిలు (349 మిలియన్ డాలర్లు). ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక అత్యధిక ఉత్పత్తిదారులు. కర్ణాటకలో హవేరి, కొప్పల్ జిల్లాలు కూరగాయ విత్తన ఉత్పత్తి కేంద్రాలు.

గ్రామీణ హవేరిలో, ఆడవారు దూరాలు వెళ్లి వారి  గ్రామ పొలాలలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ సంపాదించడానికి మొగ్గుచూపుతున్నారు. హింసాత్మకమైన పెళ్లిని వదులుకుని 28 ఏళ్ళ రజియా అల్లాద్దీన్ షేఖ్ సన్నది తన తల్లిదండ్రుల గ్రామమైన కుడాపలి చేరినప్పుడు ఆమెకు తన ఇద్దరు కూతుళ్లను పోషించే బాధ్యత ఆమె ఒక్కదాని పైనే ఉన్నది.

ఆమె గ్రామంలో, రైతులు గోధుమ, పత్తి, వేరుశెనగ, వెల్లుల్లి పండిస్తారు. “మాకు రోజుకు 150 రూపాయిలు మాత్రమే వస్తాయి(పొలం పనిలో). మేము దానితో ఒక లీటర్ నూనె కూడా కొనుక్కోలేము. అందుకే మేము పని కోసం వేరే ప్రదేశాలకు వెళ్తాము,” అన్నది రజియా. ఆమె పక్కింటివారు చేతి సంపర్కం చేసే వారి బృందంలో ఆమెని కలవమంటే, ఆమె వెంటనే ఒప్పుకున్నది. “ఆమె నేను ఇంట్లో  ఉండి ఏం చెయ్యాలనుకుంటున్నానో అడిగింది. అందుకని ఆమె నన్ను తనతో పనికి తీసుకువెళ్ళింది. ఈ పని చేస్తే మాకు రోజుకు 240 రూపాయిలు వస్తాయి.”

Rajiya Aladdin Shekh Sannadi harvesting the crop of hand-pollinated tomatoes in Konanatali village in Haveri district
PHOTO • S. Senthalir
Rajiya Aladdin Shekh Sannadi harvesting the crop of hand-pollinated tomatoes in Konanatali village in Haveri district
PHOTO • S. Senthalir

రజియా అలాద్దీన్ షేఖ్ సన్నది, హవేరి జిల్లాలో కొణనతలి గ్రామంలోని  పొలంలో చేతి సంపర్కం ద్వారా పండిన పంటను కొస్తోంది

సన్నగా పొడుగ్గా ఉండే రజియా చూడగానే చక్కగా కనిపిస్తుంది. ఆమెకు 20 ఏళ్ళు ఉండగానే ఒక తాగుబోతుతో పెళ్లిచేశారు. ఆమె, గదాగ్ జిల్లాలో  శిరహట్టి తాలూకా లో ఉండే తన భర్తతో, కలిసి బ్రతకడానికి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రులు వారికి వీలైనంత ఇచ్చినా కూడా ఆమె వరకట్న వేధింపులు భరించవలసి వచ్చింది. “మా తల్లిదండ్రులు నాకు మూడు సవర్ల బంగారాన్ని, 35,000 నగదుని ఇచ్చారు. మా వాళ్లలో చాలా గిన్నెలు, బట్టలు కూడా ఇస్తారు. మా ఇంట్లో ఏమి మిగలలేదు, అన్ని ఇచ్చేశారు”, అన్నది రజియా. “నా పెళ్లవక ముందు నుండే, నా భర్త ఒక ఆక్సిడెంట్ కేసులో ముద్దాయి, కోర్ట్ లో అయ్యే ఖర్చులకోసం 5,000 కానీ 10000 కానీ తెమ్మని పోరేవాడు,” అన్నది.

భార్య చనిపోయిందని చెప్పి ఆమె భర్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లల జరుగుబాటు ఖర్చుల కోసం అతని పై ఆమె నాలుగు నెలల క్రితం కేసు వేసింది. “అతను తన పిల్లలను ఒకసారి కూడా వచ్చి చూడలేదు,” అంది ఆమె. రజియాకు మహిళా కమీషన్ లేదా మహిళా శిశు సంక్షేమ విభాగాలకు సహాయం కోసం వెళ్లవచ్చని అసలు తెలీదు. గ్రామంలో ఆమెకు రైతు కూలీలకు ప్రభుత్వ నుండి వచ్చే సంక్షేమ పథకాల గురించి చెప్పేవారెవరు లేరు. ఎందుకంటే ఆమెను రైతుగా ఎవరూ పరిగణించరు.

“బడిలో వంట చేసే ఉద్యోగం వస్తే, నాకు ఒక నికరమైన ఆదాయం ఉంటుంది”. అని రజియా చెప్పింది నాకు. “కానీ బాగా తెలిసినవారికి మాత్రమే ఈ ఉద్యోగం వస్తుంది. నాకెవరూ  తెలీదు. ప్రతి ఒక్కరు అంతా బాగయిపోతుంది అంటారు. కానీ నేను అన్ని ఒంటరిగా చేసుకోవాలి, నాకు సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు.”

రజియా యజమాని ఒక పెద్ద బహుళ జాతీయ సంస్థకు పనిచేస్తున్నాడు. దాని సంవత్సరాదాయం 200 కోట్ల నుండి 500 కోట్ల వరకు ఉంటుంది. కానీ రజియాకు ఇందులో అతి  సూక్ష్మ భాగం లభిస్తుంది. “ఇక్కడ  ఉత్పత్తి చేసిన విత్తనాలు నైజీరియా, థాయిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, యు.ఎస్ కి ఎగుమతి చేయబడతాయి.” అన్నారు అక్కడ విత్తన కంపెనీ లో పని చేసే వ్యక్తి. ఈయన రాణిబెన్నూర్ తాలూకా లో 13 గ్రామాలలో జరిగే విత్తనాల ఉత్పత్తిని పర్యవేక్షిస్తారు.

Women from Kudapali village in Haveri's Hirekerur taluk preparing to harvest the 'crossed' tomatoes in Konanatali. They are then crushed to remove the seeds.
PHOTO • S. Senthalir
Leftover pollen powder after the hand-pollination of tomato flowers
PHOTO • S. Senthalir

ఎడమా: హవేరి హిరేకేరూర్ తాలూకాలో కూడపలి గ్రామంలో మహిళలు క్రాస్ చేసిన  టమోటోల పంటని కోయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరవాత వాటిని నలిపి విత్తనాలను తీస్తారు. కుడి: టమోటా పూల పరాగ సంపర్కం చేశాక మిగిలిపోయిన పుప్పొడి

అంతర్గత వలస కూలీలైన మంగళ వంటివారు విత్తన ఉత్పత్తి శ్రామికశక్తిలో కీలకమైనవారు. NSAI మొత్తం దేశపు విత్తన పరిశ్రమ విలువ, వారి అంచనా ప్రకారం 22,500 కోట్ల రూపాయిలు(3 మిలియన్ డాలర్లు) అని తెలిపింది. అంతర్జాతీయంగా ఇది ఐదవ స్థానంలో ఉన్నది. మొక్కజొన్న, మినుములు, పత్తి, కూరగాయల పంటలు, హైబ్రిడ్ వరి, నూనెగింజల విత్తనాలతో కూడిన హైబ్రిడ్ విత్తన పరిశ్రమ వాటా రూ.10,000 కోట్లు ($1.33 బిలియన్లు).

ప్రభుత్వ విధానాల సహాయంతో ప్రైవేట్ రంగం గత కొన్ని సంవత్సరాలుగా విత్తన పరిశ్రమలో ముఖ్యమైన పాత్రగా మారింది. ఈ ఏడాది మార్చిలో లోక్‌సభకు వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, దేశంలో 540 ప్రైవేట్ విత్తన కంపెనీలు ఉన్నాయి. వీరిలో 80 మంది పరిశోధన మరియు అభివృద్ధి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. భారతదేశంలో విత్తనోత్పత్తిలో ప్రైవేట్ రంగం వాటా 2017-18లో 57.28 శాతం నుండి, 2020-21 నాటికి 64.46 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బిలియన్ డాలర్ల విత్తన రంగం వృద్ధి, హవేరీలోని మంగళ మరియు ఇతర మహిళా వ్యవసాయ కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చలేదు. మంగళ పొరుగు ఇంట్లో ఉండే 28 ఏళ్ల దీపా దోనెప్ప పూజార్ ఇలా అంటోంది: “కిలో కూరగాయల గింజలకు, వారు [రైతులు] 10,000 నుండి 20,000 రూపాయలు పొందవచ్చు. 2010లో కిలోకు 6,000 రూపాయలు వచ్చేది, కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో చెప్పలేదు. వారు అదే మొత్తం అని చెప్పారు.” తనలాంటి కార్మికులకు జీతాలు రావాలని ఆమె అన్నారు. “మా దినసరి వేతనం పెరగాలి. మేము చాలా కష్టపడతాము కాని పొదుపు చేయలేకపోతున్నాము. మా చేతులలో డబ్బు నిలవడం లేదు.”

చేతి సంపర్కం పని చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వివరించింది దీప . “అది చాలా కష్టమైన పని. మేము వంటచెయ్యాలి, ఊడ్చుకోవాలి, గిన్నెలు తోముకోవాలి...మేము పనంతా చెయ్యాలి.”

“మేము క్రాసింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు రైతులు సమయాన్ని మాత్రమే చూస్తారు. మేము కొంచెం ఆలస్యంగా వెళ్లినా, మేము 240 రూపాయిలు ఎలా అడగగలమని దబాయిస్తారు. మేము పొద్దున్న 5.30 కి బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి 7.30 అవుతుంది.” అన్నది దీప. “ఆ తరువాత మేము ఇల్లు శుభ్రం చేసుకోవాలి, టీ తాగాలి, వంట చెయ్యాలి. మేము నిద్రపోయేసరికి అర్ధరాత్రి అవుతుంది. మాకు ఇక్కడ పని దొరకదు కాబట్టి అక్కడ పనికే వెళ్ళవలసి వస్తుంది. పైగా పూవు కీలాగ్రము(stigma) చాలా సన్నగా వెంట్రుకలా ఉంటుంది” అందువల్ల వాళ్ళ కళ్లు కూడా అలిసిపోతాయని చెప్పింది దీప.

A woman agricultural labourer peels the outer layer of an okra bud to expose the stigma for pollination.
PHOTO • S. Senthalir
Deepa Doneappa Pujaar (in grey shirt) ties the tomato plants to a wire while preparing to pollinate the flowers at a farm in Konanatali
PHOTO • S. Senthalir

ఎడమ: ఒక మహిళా వ్యవసాయ కూలి బెండకాయ మొగ్గలోని బయట పొరను వలిచి, ఆందులోని కీలాగ్రాన్ని పరాగ సంపర్కానికి సిద్ధం చేస్తోంది. కుడి: దీప దొన్నెప్ప పూజారి(బూడిద రంగ చొక్కా) కొణనతలిలోని తోటలో, టమోటా మొక్కలను వైర్ తో  కట్టేసి పూవులను పరాగ సంపర్కానికి సిద్ధం చేస్తున్నది

ఏడాదిలో, చేతి పరాగ సంపర్కపని అవసరం కొద్ధి కాలానికే ఉంటుంది కాబట్టి, ఈ మహిళలు మిగిలిన సమయంలో తక్కువ వేతనం లభించే పనులు చేస్తారు. “మేము మళ్లీ రోజుకు 150 రూపాయిలు వచ్చే పని చేస్తాం” అన్నది దీప. “దానిలో మాకు వచ్చేదెంత? ఒక కిలో పళ్లు 120 రూపాయిలున్నాయి. మేము ఇంటికి వెచ్చాలు కొనుక్కోవాలి, పిల్లలకి చిరుతిండ్లు కొనాలి, వచ్చిన చుట్టాలను చూసుకోవాలి. మేము కనక సంతే (సంత)కు వెళ్లకపోతే, ఇక ఆ వారం ఏమి కొనలేకపోతాము. అందుకని మేము బుధవారాలు పనిచేయము. మేము 2.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న తుమ్మినకట్టి సంత వరకు నడుచుకుంటూ వెళ్లి వారానికి సరిపడా సరుకులు తెచ్చుకుంటాము.”

ఈ కూలీల రోజువారీ దినం ఎప్పుడు ఒకేలాగా నడవదు. ఇది ప్రతి ఋతువుకు, పంట పంటకు  మారుతుంటుంది. “మేము గోధుమ పంట కోసం, నాలుగింటికి లేచి ఐదింటికి పొలం వద్ద  ఉంటాము. కొన్నిసార్లు రోడ్డు సరిగ్గా లేకపోతే, ఆటోలు రావు, మేము నడవవలసి వస్తుంది, అందుకని మేము మొబైల్  ఫోన్ లో ఫ్లాష్ లైట్ పెట్టుకుని కాని, బ్యాటరీ టార్చి పట్టుకుని గాని వెళ్తాము. మేము మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వచ్చేస్తాము.” వేరుశెనగ చేలో పనికి, ఉదయం 3 గం. లేచి మధ్యాహ్నానికే ఇంటికి వచ్చేస్తారు. “వేరుశనగ పంటకు మాకు రోజుకు 200 రూపాయిలు ఇస్తారు. కానీ ఈ  పని ఒక నెల  మాత్రమే ఉంటుంది.” రైతులు కొన్నిసార్లు వారి పొలాలవరకు రావడానికి వాహనాలు పంపిస్తారు. “లేదంటే మమ్మల్నే ఎలాగోలా రమ్మంటారు.”

కానీ ఎంత పని చేసిన అక్కడ మౌలిక సౌకర్యాలు కానరావు. “అసలు టాయిలెట్లు ఉండవు. మేమే ఎవరూ మమ్మల్ని చూడని ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది.” అన్నది దీప. ఇక్కడి యజమానులు అన్ని ఇంటి దగ్గరే ముగించుకుని రమ్మంటారు. పని గంటలలో అలా వెళ్లడం దండగ అనుకుంటారు. రుతుస్రావం సమయాల్లో వారికి ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. “మేము ఒక లావు బట్ట  గాని సానిటరీ పాడ్ కానీ పెట్టుకుని వెళ్తాము. పని అయి ఇంటికి వచ్చేవరకు అక్కడ పాడ్ మార్చుకునే అవకాశం ఉండదు. రోజంతా నించోవాలంటే చాలా నొప్పి పుడుతుంది.”

వారి పరిస్థితిలోనే  తప్పు ఉంది అని నమ్ముతుంది దీప. “ మా ఊరు చాలా వెనకబడి ఉంది. అది ఎందులోనూ ముందు సాగడం లేదు.” అని  చెబుతుంది. లేకపోతే మేము ఇలా పని చేయవలసిన అవసరం ఎందుకుంటుంది?”

అనువాదం: అపర్ణ తోట

S. Senthalir

S. Senthalir is a Reporter and Assistant Editor at the People's Archive of Rural India.

Other stories by S. Senthalir
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota