తన కడుపులో “గడ్డ” లాంటిదేదో పెరుగుతోందని సునీతా దేవి ఆందోళనపడ్డారు. కడుపు ఉబ్బరంగా అనిపించడంతో ఆమె సరిగ్గా తినలేకపోయేవారు. రెండు నెలలు దాన్ని నిర్లక్ష్యం చేశాక, ఇంటికి దగ్గర్లో ఉన్నఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు, అక్కడ డాక్టర్ చెప్పిన విషయాన్ని ఆమె నమ్మలేకపోయారు: “ఆప్కో బచ్చా ఠహర్ గయా హై (మీరు గర్భవతి).”
అదెలా సాధ్యమైందో ఆమెకు అర్థం కాలేదు – గర్భం రాకుండా కాపర్-టి పెట్టించుకుని ఇంకా ఆరు నెలలు కూడా గడవలేదు!
2019లో జరిగిన ఆ సంఘటనను వివరిస్తున్నప్పుడు, ఆమె ముఖం ఇంకా పాలిపోయి, అలసటగా కనబడింది. ఆమె జుట్టు వెనక్కి ముడి వేసి ఉంది; ఆమె లోతైన కళ్ళు నిస్తేజంగా, నీరసంగా ఉన్నాయి. ఆమె నుదుటిపై ఉన్న ఎర్రటి బిందీ (బొట్టు) మాత్రమే ప్రకాశవంతంగా కనబడుతోంది.
30 ఏళ్ళ సునీతకు (ఆమె అసలు పేరు కాదు) 4-10 ఏళ్ళ వయసులో ఉన్న నలుగురు పిల్లలున్నారు- ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. మే 2019లో, తన చిన్న బిడ్డకు రెండేళ్ళ వయసున్నప్పుడు, ఇంక పిల్లల్ని కనకూడదని సునీత నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించే ఆశా కార్యకర్తను కలిసి, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. వివరాలు పరిశీలించాక, మూడు నెలల పాటు గర్భం రాకుండా ఆపుతుందని చెప్పే “అంతర” అనే ఇంజెక్షన్‌ను ఎంచుకున్నారు. “నేను ఇంజెక్షన్ వేయించుకుందామనుకున్నాను.” అని ఆమె అన్నారు.
తన 8x10 అడుగుల గదిలో పరిచిన చాపపై మేం కూర్చున్నాం. ఆ గదికి ఒక మూలన వున్న ఖాళీ గ్యాస్ సిలిండర్‌పై మరిన్ని చాపలు పేర్చివున్నాయి. ప్రక్క గదిలో సునీత బావగారి కుటుంబం నివసిస్తోంది. మూడో గదిలో బావమరిది ఉంటున్నారు: నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లోని మహేశ్ గార్డెన్ ప్రాంతంలో ఉంది ఆ ఇల్లు.
సునీత ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో గోపాల్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిఎచ్‌సి) ఉంది. “అంతర” ఇంజక్షన్ వేయించుకునేందుకు ఆశా వర్కర్‌తో కలిసి అక్కడికి వెళ్ళారు సునీత. కానీ,పిఎచ్‌సిలోని డాక్టర్ తనకు మరో సలహా ఇచ్చారు. “ఇంజక్షన్ బదులు నాకు కాపర్-టి గురించి వివరించింది డాక్టర్. అది సురక్షితమైనది కనుక పెట్టించుకోమని కోరింది. కానీ, నేను ఆమెను కాపర్-టి గురించి ఎప్పుడూ అడగలేదు,” సునీత నొక్కి చెప్పారు. “కానీ అది బాగుంటుందని డాక్టర్ పట్టుబట్టింది. “నువ్వు ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదనుకుంటున్నావు కదా” అని ఆమె నన్ను అడిగింది!”








