ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

జీవితాలను కూడగట్టుకోవడం

ఆమె పొద్దున్నే 4.30కే లేచారు. ఒక గంట తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా అడవిలో బీడీ ( తెందూ ) ఆకులను తెంపుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆమెవంటి వేలాదిమంది ఆదివాసీలు ఇదే పని చేస్తున్నారు. బీడీలు తయారుచేసే ఈ ఆకులను సేకరించేందుకు కుటుంబమే ఒక యూనిట్‌గా పనిచేస్తుంటారు.

రోజు బాగుంటే, ఆరుగురు సభ్యులుగల వారి కుటుంబం రూ. 90 వరకు సంపాదించవచ్చు. రానున్న మూడు నెలల్లో సంపాదించేదానికంటే ఈ తెందూ ఆకుల మంచి సీజన్ అయిన రెండువారాలలో వారు ఇంకా ఎక్కువే సంపాదిస్తారు. కాబట్టి ఈ ఆకుల కాలం తీరేవరకూ, వారు దాన్ని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఈ ఆరు వారాల్లో, వారు మనుగడ కోసం కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఈ ప్రాంతంలో నివసించే దాదాపు ప్రతి కుటుంబం ఈ సమయంలో అడవిలోనే కనిపిస్తుంది. ఆదివాసీ ఆర్థిక వ్యవస్థకు తెందూ ఆకులు చాలా ముఖ్యమైనవి.

వీడియో చూడండి : ' ఇది చాలా మనోహరంగా ఉంది ... ఆమె ఆకును ఎంచుకొని తన చేతిలోకి విసిరే విధానం '

అలాంటిదే ఇప్ప ( మహువా ) పువ్వులను ఏరడం, లేదా చింతపండు సేకరించడం, లేదా చిరోంజి పప్పు, గుగ్గిలం ( సాల్ ) చెట్టు ఉత్పత్తులని సేకరించడం. దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ఆదివాసీ కుటుంబాలు తమ ఆదాయంలో సగానికి పైగా కలపేతర అటవీ ఉత్పత్తులపై (ఎన్‌టిఎఫ్‌పి: నాన్-టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్) ఆధారపడి ఉన్నాయి. కానీ వారు పొందేది ఉత్పత్తి విలువలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఈ తరహా ఉత్పత్తుల విలువ ఏటా కనీసం రూ.2,000 కోట్లు.

రాజ్యం ఇప్పుడు ఈ అడవులను తన అధీనంలో ఉంచుకొన్నందున ఖచ్చితమైన గణాంకాలు లభించడం కష్టం. కానీ, జాతీయ స్థాయిలో ఎన్‌టిఎఫ్‌టి విలువ సంవత్సరానికి రూ.15,000 కోట్ల కంటే ఎక్కువ.

అందులోంచి ఆదివాసీ మహిళకూ, ఆమె కుటుంబానికీ దక్కేది చాలా కొంచం. అయితే అదే వారికి మనుగడ. ఒకోసారి అందుక్కూడా సరిపోకపోవచ్చు. నిజంగా డబ్బు చేసుకునేవారు మాత్రం మధ్యవర్తులు, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, మరికొంతమంది. అయితే ఎన్‌టిఎఫ్‌పిలను ఎవరు సేకరిస్తారు, ఎవరు ప్రాసెస్ చేస్తారు, ఎవరు మార్కెట్ చేస్తారు? ఆ పనులు చేసేది ప్రధానంగా గ్రామీణ మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బహుళ-బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న ఔషధ మూలికలతో సహా, అటువంటి అటవీ ఉత్పత్తులలో ఎక్కువ భాగాన్ని ఆమే సేకరిస్తుంది. ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆ మహిళ, ఆమె కుటుంబం యొక్క జీవితాలు క్షీణిస్తాయి. ఆమె శ్రమను దోపిడీ చేసే నెట్‌వర్క్‌లు అలా జరిగేలా చూస్తాయి.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

అటవీ భూమి ఎంత తగ్గిపోతే ఈ మహిళల పని కూడా అంతకష్టతరంగా మారుతుంది. వారి నడక, పని గంటలు ఎక్కువవుతాయి. ఆదివాసీ సమాజాలలో పేదరికం పెరుగుతుండటంతో, వారు ఎన్‌టిఎఫ్‌పిలపై ఆధారపడేది కూడా పెరుగుతుంది. దాంతో వారి బాధ్యతలు కూడా. ఒడిశాలో ఈ తరహా పనులు చేస్తున్న మహిళలు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు నడుస్తుంటారు. వారి పనిదినం 15 గంటలు లేదా అంతకంటే ఎక్కువకు విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద ఆదివాసీ మహిళలు కష్టాల కడలిలో మునిగిపోతున్న తమ కుటుంబాలను ఒడ్డుకి చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రక్రియలో వారు ఫారెస్ట్ గార్డులు, వ్యాపారులు, పోలీసులు, దుర్మార్గులైన అధికారులు, తరచుగా అన్యాయమైన చట్టాల నుండి కూడా వేధింపులను ఎదుర్కొంటున్నారు.

చీపుర్లను కట్టలు కడుతున్న ఈ మహిళలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలోనివారు. ఆ రాష్ట్రంలోని అనేక ఆదివాసీ కుటుంబాలు కలపేతర అటవీ ఉత్పత్తులను నేరుగా అమ్మడం ద్వారా తమ ఆదాయంలో సగానికిపైగా  పొందుతున్నారు. ఆదివాసీయేతర పేదలలో కూడా చాలా మందికి మనుగడ కోసం ఈ ఎన్‌టి్ఎఫ్‌పిలు అవసరం.

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన ఈ మహిళ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పని కుండలు తయారుచేయడం, వాటిని మరమ్మతు చేయడం మాత్రమే కాదు. అది ఆమె కుటుంబ వ్యాపారం. ఆమె తాళ్లు, బుట్టలు, చీపుర్లు కూడా తయారుచేస్తారు. ఆమెవద్ద అద్భుతమైన ఉత్పత్తుల సముదాయం ఉంది. అది కూడా దాదాపుగా అడవులు కనుమరుగైన ఆమె నివాసప్రాంతంలో. కొన్ని రకాల మట్టి ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతుందో కూడా ఆమెకు తెలుసు. ఆమె జ్ఞానం, పనిభారం సంభ్రమం కలిగిస్తాయి; అయితే ఆమె కుటుంబ పరిస్థితి మాత్రం కడు దయనీయం.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli