దిల్లీలో అది ఒక సోమరి శీతాకాలపు మధ్యాహ్నం. జనవరి సూర్యుడు వరండాలో స్వాగతించిన అతిథిలా కూర్చునివున్నప్పుడు కమర్ అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నివసిస్తోన్న తన తల్లికి ఫోన్ చేశారు. 75 ఏళ్ళ వయసున్న షమీమా ఖాతూన్‌ను ఆ పట్టున బిహార్‌లోని సీతామఢీ జిల్లా, బర్రీ ఫుల్వరియా గ్రామంలోని తన చిన్ననాటి ఇంటికి తీసుకువెళ్ళారు.

ఆ మధ్యాహ్నం టెలిఫోన్ లైన్‌కి ఇరువైపులా మాట్లాడుకుంటోన్న ఆ గొంతులు మీకు వినిపించి ఉంటే మీరు ఖచ్చితంగా ఒక వింతను గమనించి ఉండేవారు. కమర్ స్పష్టమైన ఉర్దూలో అడిగారు, “ అమ్మీ, జరా యే బతాయియేగా, బచ్‌పన్‌మేఁ జో మేరే సర్ పే జఖమ్ హోతా థా నా ఉస్కా ఇలాజ్ కైసే కర్తే థే? ” (అమ్మా, నా చిన్నప్పుడు నా తలమీద కనిపించిన దద్దుర్లను ఎలా నయం చేశావో చెప్పు?)

శీర్ మేఁ జో హో జాహాయి – తోరొహూ హోలా రహా – బత్‌ఖోరా కహా హాయి ఒకో ఇధర్. రేహ్, చికినీ మిట్టీ లగాకే ధోలియా రహా, మగర్ లగా హాయి బహుత్. త ఛూట్ గెలాయి [నెత్తి మీద కనిపించేది – అది నీకు కూడా వచ్చింది – దాన్నిక్కడ బత్‌ఖోరా అంటారు. నేను నీ తలను రే హ్ (చవిటి మట్టి), చికినీ మి ట్టి(మట్టి)తో కడిగాను, కానీ అది చాలా బాధపెడుతుంది. చివరకి, దాన్ని నువ్వు వదిలించుకున్నావు,]" ఆమె తన ఇంటి వైద్యం గురించి వివరిస్తూ ఆనందంగా నవ్వారు. అయితే ఆమె మాట్లాడే భాష కమర్‌ మాట్లాడే భాషకు భిన్నంగా ఉంది.

వారి సంభాషణలో అసాధారణమైనది ఏమీ లేదు. కమర్, ఆయన తల్లి ఎప్పుడూ ఒకరితో ఒకరు వేర్వేరు భాషల్లోనే మాట్లాడుకుంటారు.

"నేను ఆమె మాండలికాన్ని అర్థం చేసుకుంటాను, కానీ తిరిగి మాట్లాడలేను. ఉర్దూ నా ‘మాతృభాష’ అని నేను చెప్తుంటాను కానీ మా అమ్మ మాట్లాడే భాష వేరేగా ఉంటుంది," ఈ సంగతినంతా ఆ మర్నాడు మేమందరం PARIభాషా సమావేశంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రాయవలసిన అంశంపై చర్చిస్తున్నప్పుడు కమర్ చెప్పారు. "ఆమె భాష పేరేమిటో ఎవరికీ తెలియదు. అమ్మీ కి లేదా నా కుటుంబంలో మరెవరికీ, చివరకు దాన్ని మాట్లాడేవారికి కూడా తెలియదు," అన్నారాయన. తనతో సహా, పనికోసం వెతుక్కుంటూ గ్రామం నుండి వలస వచ్చినవాళ్ళెవరూ, తన తండ్రి, సోదరుడు కూడా ఎప్పుడూ ఈ భాష మాట్లాడలేదు. కమర్ పిల్లలు దీన్నించి మరింత దూరమయ్యారు; వారు తమ నాయనమ్మ మాట్లాడే భాషను అర్థం చేసుకోలేరు.

A board at the entrance to the w restling school in rural western Maharashtra says taleem (Urdu for education). But the first thing you see within is an image of Hanuman, the deity of wrestlers (pehelwans) here. It's an image that speaks of a syncretic blend of cultures
PHOTO • P. Sainath

గ్రామీణ పశ్చిమ మహారాష్ట్రలోని ఒక మల్లయుద్ధ పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఉన్న బోర్డుపై తాలీమ్ (విద్య కోసం ఉర్దూ) అని ఉంది. కానీ మీరు లోపలకు వెళ్ళగానే ఇక్కడ కనిపించే మొదటి విషయం, మల్లయోధుల (పహిల్వాన్ల) దేవుడైన హనుమంతుని చిత్రం. సంస్కృతుల సమకాలీన సమ్మేళనం గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది

"నేను ఈ భాష గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాను," అన్నారు కమర్. "అలీఘర్ ముస్లిమ్ విశ్వవిద్యాలయానికి చెందిన భాషా శాస్త్రవేత్త మొహమ్మద్ జహాఁగీర్ వార్సీ దీనిని 'మైథిలీ ఉర్దూ' అని పిలుస్తారు. జెఎన్‌యులో పనిచేసే మరొక ప్రొఫెసర్ రిజ్వానూర్ రెహ్మాన్ మాట్లాడుతూ, బిహార్‌లోని ఈ ప్రాంతానికి చెందిన ముస్లిములు ఉర్దూను అధికారికంగా తమ మాతృభాషగా నమోదు చేస్తారని, అయితే ఇంట్లో వేరే మాండలికంలో సంభాషిస్తారని చెప్పారు. మా అమ్మ మాట్లాడే భాష - ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ, మైథిలీల మిశ్రమం - ఆ ప్రాంతంలోనే ఉద్భవించినట్లు అనిపిస్తోంది."

తరం తర్వాత తరానికి క్షయమైపోతోన్న ఒక మాతృభాష!

అంతే! కమర్ మమ్మల్ని పదాల వేటకు పంపారు. మేమందరం మా స్వంత మాతృభాషలో మరుగైపోయిన కొన్ని పదాల పాదముద్రలను వెతకాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణాన్ని అనుసరించి, జరిగిన నష్టాన్ని వివరించే జాడలను తెలుసుకుంటాం. మాకు తెలియకముందే మేం బోర్జెస్ అలెఫ్‌ (ఎటువంటి వక్రీకరణలు, గందరగోళం లేకుండా విశ్వంలోని ప్రతిదాన్నీ ప్రతి కోణం నుండి) లోకి చూస్తున్నాం.

*****

మొదట రాజా మాట్లాడారు. "తమిళంలో ఒక ప్రసిద్ధ జాతీయం గురించి ఒక తిరుక్కుఱళ్ ద్విపద ఉంది," అన్నారాయన.

"మయిర్ నీప్పిన్ వాళా కవరిమా అన్నార్
ఉయిర్‌నీప్పర్ మాణం వరిన్” [ కుఱ ళ్ # 969 ]

దీని అనువాదం ఇలా ఉంటుంది: జింక శరీరం మీంచి వెంట్రుకలను పెరికితే అది చనిపోతుంది. అదేవిధంగా తమ గౌరవాన్ని పోగొట్టుకున్న మనుషులు అవమానంతో చనిపోతారు.

“ఈ ద్విపద మనిషి ఆత్మగౌరవాన్ని జింక వెంట్రుకలతో పోలుస్తోంది. కనీసం, ము. వరదరాసనార్ చేసిన అనువాదం సూచిస్తున్నది అదే,” రాజా ఒక తటపటాయింపుతో చెప్పారు. “అయితే వెంట్రుకలు పీకితే జింక ఎందుకు చనిపోతుంది? తర్వాత ఇండాలజిస్ట్ (భారతదేశం, దాని ప్రజలు, సంస్కృతి, భాషలు, సాహిత్యం గురించి విద్యాపరమైన అధ్యయనం చేసేవారు) ఆర్. బాలకృష్ణన్ కథనం, సింధు లోయలోని తమిళ గ్రామాల పేర్లు చదివినప్పుడు, ఆ ద్విపదలో ప్రస్తావించింది తమిళంలో ' కవరిమా ' అని పిలిచే జడలబర్రెను తప్ప ' కవరిమాన్ ,' అని పిలిచే జింకను గురించి కాదని నాకు అర్థమైంది.

“జడలబర్రె? కానీ ఎగువ హిమాలయాల్లో కనిపించే ఈ జంతువు తమిళ కవిత్వంలో, అది కూడా దేశంలోని ఇంకో చివరన ఉండే ప్రజలు మాట్లాడే భాషలో, ఏం చేస్తోంది! ఆర్. బాలకృష్ణన్ ఈ విషయాన్ని నాగరికత వలసల ద్వారా వివరిస్తారు. ఆయన చెప్పిన ప్రకారం- సింధు లోయ ప్రజలు వారి స్థానిక పదాలు, జీవనశైలి, స్థానిక పేర్లతో పాటే దక్షిణాదికి వలస వచ్చారని."

A full grown Himalayan yak (left) and their pastoral Changpa owners (right). Kavarima, a word for yak, missing in modern Tamil dictionaries, is found in Sangam poetry
PHOTO • Ritayan Mukherjee
A full grown Himalayan yak (left) and their pastoral Changpa owners (right). Kavarima, a word for yak, missing in modern Tamil dictionaries, is found in Sangam poetry
PHOTO • Ritayan Mukherjee

పూర్తిగా ఎదిగిన హిమాలయాల జడలబర్రె (ఎడమ) వాటి యజమానులైన చాంగ్పా పశుపోషకులు (కుడి). జడలబర్రెకు తమిళ పదమైన కవరిమా అనే పదం ఆధునిక తమిళ నిఘంటువులలో లేదు, కానీ సంగం కవిత్వంలో కనిపిస్తుంది

"మరొక పండితుడు వి. అరసు ఇలా వాదించారు: భారత ఉపఖండం చరిత్రను ఇప్పటి జాతీయ-రాజ్యం లేదా దేశం అనే ఆలోచన నుండి మనం ఊహించకూడదు. ఇది సాధ్యమే. భారత ఉపఖండం మొత్తం ప్రాకృతిక దృశ్యం ఒకప్పుడు ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలతో నిండి ఉండేది. ఉత్తరాన ఉన్న సింధు లోయ నుండి దక్షిణాన ఉన్న శ్రీలంక వరకు మొత్తం భూభాగంలో నివసించిన తమిళులకు, హిమాలయాల్లో నివసించే జంతువు గురించి ఒక పదాన్ని కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు."

కవరిమా - ఒక ఆశ్చర్యకరమైన పదం!” అబ్బురపడుతూ అన్నారు రాజా. "ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రసిద్ధ తమిళ నిఘంటువైన క్రియ లో కవరిమా అనే పదం లేదు."

*****

మనలో చాలామందికి నిఘంటువులలో ఇంకెంతమాత్రం లేని పదాల గురించిన కథలు ఉన్నాయి. దానికి - ప్రామాణీకరణ రాజకీయాలు - అని జాషువా పేరు పెట్టారు.

“శతాబ్దాలుగా, బెంగాల్ రైతులు, కుమ్మరులు, గృహిణులు, కవులు, నైపుణ్య కళాకారులు - రాఢీ, బరేంద్రి, మాన్‌భూమి, రంగ్‌పురి మొదలైన తమ తమ ప్రాంతీయ భాషలలోనే మాట్లాడారు, రాశారు. కానీ, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన బెంగాల్ పునరుజ్జీవనోద్యమం వలన బంగ్లా భాష తన ప్రాంతీయ, అరబో-పర్షియన్ ప్రత్యేక పదకోశాన్ని కోల్పోయింది. ప్రామాణీకరణ, ఆధునీకరణ వంటి వరుసగా లేచిన కెరటాలు సంస్కృతీకరణ, ఆంగ్లోఫోనిక్, యూరోపీకరణ అయిన పదాల, జాతీయాల ప్రవాహంతో కలిసి సాగాయి. ఇది బంగ్లా భాష బహుళ స్వభావాన్ని దోచుకుంది. అప్పటి నుండి, ఆదివాసీ భాషలైన సంతాలి, కుఢ్మలి, రాజ్‌బన్శి, కురుఖ్ మొదలైన వాటి నుండి లోతుగా పాతుకుపోయిన లేదా అరువు తెచ్చుకున్న పదాలు తొలగించబడుతున్నాయి.”

ఈ కథ బెంగాల్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. భారతదేశంలోని ప్రతి భాషలో ఒక పాత సామెత ఉంటుంది, " బార్ గౌ ఎ బోలీ బదలే " (ప్రతి 12-15 కిలోమీటర్లకు ఒక వేరే పలుకు వినబడుతుంది). వలసవాద కాలంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఆ తరువాత భాషాపరంగా రాష్ట్రాల విభజన సమయంలోనూ భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ఇదే విధమైన క్షయాన్ని ఎదుర్కొంది. భారతదేశం రాష్ట్ర భాష కథ కూడా చారిత్రాత్మకంగా సాంస్కృతిక, రాజకీయ చిక్కులతో నిండి ఉన్నదే.

"నేను బాఁకురా నుండి వచ్చాను," అన్నారు జాషువా. "ఇది పూర్వపు మల్లభూమ్ రాజ్యానికి హృదయభూమి. ఈ ప్రాంతంలో బహుళ జాతి భాషా సమూహాలు భాగస్వామ్యాన్ని కలిగివున్నాయి. దీని ఫలితంగా భాష, ఆచారాలు, ఇంకా మరెన్నింటిలోనో దాదాపు నిరంతర మార్పిడి జరుగుతూనేవుంటుంది. ఈ ప్రాంతంలోని ప్రతి భాషలో కుర్మలి, సంతాలి, భూమిజ, బీర్‌హొడీ నుండి బదులు తెచ్చుకున్న అనేక పదాలు, ప్రత్యయాలు ఉన్నాయి.

The story of the state language in India is historically fraught with cultural and political implications
PHOTO • Labani Jangi

భారతదేశ రాజ్య భాష కథ చారిత్రాత్మకంగా సాంస్కృతిక, రాజకీయ చిక్కులతో కూడి ఉంది

“కానీ ప్రమాణీకరణ, ఆధునికీకరణ పేరుతో అడా (భూమి), జుమ్డాకుచా (కాల్చిన కలప), కక్తీ (తాబేలు), జోడ్ (స్ట్రీమ్), అగ్డా (బోలు), బిలాతీ బెగున్ (టమోటా) వంటి మరెన్నో పదాలు వలసరాజ్యాల కలకత్తాలోని ఉన్నత-తరగతి, ఉన్నత-కులాల కూటమికి చెందిన ప్రజలు అభివృద్ధి చేసినన అత్యంత సంస్కృతీకరించిన, యూరోపీకరణ పదబంధాలతో క్రమంగా భర్తీ చేయబడుతున్నాయి."

*****

కానీ ఒక పదం అదృశ్యమైనప్పుడు పోయేదేమిటి? మొదట మాయమయ్యేది పదమా లేక అర్థాలా? భాషలో శూన్యాన్ని సృష్టించే సందర్భమా? కానీ ఈ నష్టం వల్ల మిగిలిపోయిన ఖాళీ ప్రదేశాలలో ఏదైనా కొత్తది రాదా?

ఒక కొత్త పదం, ‘ ఉడాల్‌పూల్ ’ (ఎగిరే వంతెన), ఫ్లైఓవర్‌కు సమానమైన కొత్త బంగ్లా పదంగా మారినప్పుడు - మనం ఏదైనా కోల్పోతామా లేదా ఏదైనా కొత్తగా పొందగలమా? ప్రక్రియలో కోల్పోయినది మనం ఇప్పుడు జోడించిన మొత్తం కంటే చాలా ఎక్కువగా ఉంటుందా? స్మిత పైకే ఆలోచిస్తున్నారు.

కొంత గాలీ వెలుతురు కోసం ఇంటి పైకప్పు క్రింద ఉంచే సంప్రదాయ గవాక్షాలకు  పేరైన ఘుల్‌ఘులీ అనే పాత బంగ్లా పదాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. "మాకు ఇప్పుడవి లేవు," అన్నారామె. “సుమారు 10 శతాబ్దాల క్రితం, ఖనా అనే ఒక తెలివైన మహిళ, తన ఖనార్ బచన్‌ అనే సామెతరూపంలో ఉండే బెంగాలీ ద్విపదలో వ్యవసాయం, ఆరోగ్యం, వైద్యం, వాతావరణ శాస్త్రం, ఇంటి నిర్మాణం గురించి ఆశ్చర్యకరమైన వ్యావహారికజ్ఞానంతో రాశారు

అలో హవా బెధో నా
రోగే భోగే మరో నా.

గాలీ వెలుతురూ లేని గదిని కట్టొద్దు
అనారోగ్యంతో నువ్వు చనిపోవనూ వద్దు

పిడే ఉఁఛొ మెఝే ఖాల్
తార్ దుఃఖో సర్బొకాల్

బయటి భూమి కంటే లోన నేల పల్లం
ఎన్నడూ దాచలేవు దాని దిగులూ దుఃఖం

"మా పూర్వీకులు ఖనా తెలివితేటలను విశ్వసించారు, మా ఇళ్ళల్లో ఘుల్‌ఘులీ కోసం ఖాళీని ఏర్పాటు చేసేవారు,” అని స్మిత మరి కొన్ని మాటలను జోడించారు. "కానీ రాష్ట్ర సామాజిక భద్రత ద్వారా ప్రారంభించబడిన వివిధ గృహనిర్మాణ పథకాల క్రింద సామాన్యులు పొందే ఆధునిక-కాల సజాతీయ గృహాల ప్రాజెక్టులలో, సంప్రదాయ వివేకానికి తావు లేదు. అరలు బిగించిన గోడలతో, కులుంగి అని పిలిచే వసారాలు, చాతాల్ అని పిలిచే బహిరంగ ప్రదేశాలు ఇవన్నీ పాతవైపోయిన ఆలోచనలు. ఘుల్‌ఘులీలు కనుమరుగైపోయాయి, అలాగే జనాదరణ పొందిన పరిభాషలో ఈ పదం కూడా కనుమరుగైపోయింది,” అంటారామె.

Changing architectural designs mean that words in Bangla like ghulghuli ( traditional ventilator), kulungi ( shelves) and alcoves embeded in walls, and chatal ( open spaces), are no longer part of our daily lexicon
PHOTO • Antara Raman

నిర్మాణశిల్పాల ఆకృతులను మార్చడం అంటే బంగ్లా భాషలో ఘుల్‌ఘులీలు (సంప్రదాయ గవాక్షాలు), కులుంగి (వసారాలు) అరలు బిగించిన గోడలు, చాతాల్ (బహిరంగ ప్రదేశాలు) వంటి పదాలు ఇకపై మన రోజువారీ పరిభాషలో భాగం కావని అర్థం

అయితే ఇళ్ళే పావురాళ్ళ గూళ్ళుగా మారిన ఈ కాలంలో ఆమె విలపిస్తున్నది కేవలం ఘుల్‌ఘులీ అనే మాట కోసం కాదు. ఒకప్పుడు ఇతర జీవులతో, ప్రకృతితో, ఆ గవాక్షాలలో చిన్న చిన్న గూళ్ళు కట్టుకున్న అసంఖ్యాకమైన ఇంటి పిచ్చుకలతో మనకు ఉండిన ఆ సున్నితమైన అనుబంధం తెగిపోయిందని కూడా స్మిత దుఃఖిస్తున్నారు.

*****

"మొబైల్ టవర్ల విధ్వంసం, బయటి ప్రపంచం నుండి వేరైపోయిన పక్కా ఇళ్ళు, మన మూతపడిన వంటశాలలు, మన పొలాల్లో గుల్మనాశనుల, పురుగుమందుల మితిమీరిన వినియోగం- మన ఇళ్ళు, తోటలు, పాటల నుండి పిచ్చుకలు లేకుండా పోవడానికి ఇవన్నీ కారణమని చెప్పాలి..." కమల్‌జిత్ అంటారు.

ఇక్కడే ఆమె భాష, పర్యావరణ వైవిధ్యం మధ్య ఉన్న ఒక ముఖ్యమైన సంబంధాన్ని వివరించారు. పంజాబీ కవి వారిష్ షా కవిత్వం నుండి రెండు పంక్తులను ఉటంకిస్తూ ఆమె ఇలా అంటారు:

"చిడీ చూకతీ నాల్ జా తురే పాంథీ,
పైయాఁ దూధ్ దె విచ్ మదాణియాఁ ని

పిచ్చుకల కిలకిలలతో ప్రయాణం మొదలు,
పెరుగు చిలికి అమ్మ వెన్న తీసినట్లే.

ఒకప్పుడు పిచ్చుకల కిలకిలారావాలతోనే రైతులు తమ రోజును మొదలుపెట్టిన సమయం, బాటసారులు తమ ప్రయాణాన్ని ప్రారంభించిన సమయం ఉండేవి. అవి మన సహజ సూక్ష్మ మేలుకొలుపు వ్యవస్థలు. ఈ రోజున నేను నా ఫోన్‌లో రికార్డ్ చేసి పెట్టుకున్న పిచ్చుకల కిలకిలల ధ్వనికే మేల్కొంటాను. తమ పక్షుల ప్రవర్తన ఆధారంగానే రైతులు ఋతువులను అంచనా వేసేవారు, వారి పంట-చక్రాలను గురించి ప్రణాళికను సిద్ధం చేసుకునేవారు. పక్షుల ఒక విధమైన రెక్కల కదలికలను శుభప్రదంగా భావించేవారు - కిసానీ కా షగున్ .

ఛిడియాఁ ఖంభ్ ఖిలేరే,
వస్సణ్ మీహ్ఁ బహుతేరే

పిచ్చుక తన రెక్కలను అల్లార్చినప్పుడల్లా
ఆకాశపు స్వర్గం వర్షాన్ని కురిపిస్తుంది”

House sparrows were once routinely spotted in our homes, fields and songs. Movement of their wings were auspicious – kisani ka shugun
PHOTO • Atharva Vankundre

పిచ్చుకలు ఒకప్పుడు మన ఇళ్ళల్లో, పొలాల్లో, పాటల్లో నిత్యం కనిపించేవి. వాటి రెక్కల కదలికలు శుభప్రదమైనవి - కిసానీ కా షగున్

మనం మన భాష, సాంస్కృతిక వైవిధ్యంలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలోనే, కనుమరుగవుతున్న మొక్కలు, జంతువులు, పక్షి జాతుల భారీ జీవ వినాశనం మధ్యలో మనం ఉండటమనేది యాదృచ్ఛికమేమీ కాదు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2010 నివేదికలో భారతదేశంలో గత 60 ఏళ్ళలో దాదాపు 250 భాషలు అతి వేగంగా అంతరించిపోతున్నాయని డాక్టర్ గణేశ్ దేవీ పేర్కొన్నారు.

పంజాబ్‌లో గణనీయంగా తగ్గిపోతోన్న పిచ్చుకల సంఖ్య పై పక్షి శాస్త్రవేత్తలు గళం విప్పినప్పుడు, పెళ్ళి సమయాల్లో పాడే ఒక పాత జానపద గీతాన్ని కమల్‌జిత్ గుర్తు చేసుకున్నారు.

సదా ఛిడియాఁ దా చంబా వే,
బాబుల్ అసాఁ ఉడ్ జాణా

పిచ్చుకల్లాగే మనం కూడా, మనం కూడా,
గూడు విడిచి దూరంగా ఎగరిపోవాలీ పోవాలీ

“మా జానపద పాటలలో పిచ్చుకలు తప్పకుండా కనిపిస్తాయి. కానీ అయ్యో, ఇకపై కనిపించవు,” అన్నారు కమల్‌జిత్

*****

కనుమరుగవుతోన్న జీవనోపాధులు కూడా వాతావరణ సంక్షోభం, వలసల మాదిరిగానే భాషతో ముడిపడి ఉన్నాయని పంకజ్ గమనించారు. “ప్రస్తుతం రంగియా, గోరేశ్వర్‌లలోని అన్ని చోట్లా బజార్లలో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న యంత్రంపై తయారై చౌకగా లభించే గమోసాలు (సాంప్రదాయికంగా తువ్వాలు, కండువా లేదా తలపాగాగా ఉపయోగించే సన్నని, ముతక నూలు వస్త్రం), సాదర్-మేఖెలాలు (సాంప్రదాయికంగా మహిళలు నడుము చుట్టూ చుట్టుకునే ఒక వస్త్రం, పైన ఓణీలా వేసుకునే మరో వస్త్రం) వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలో సంప్రదాయ చేనేత పరిశ్రమ అంతరించిపోతుండటంతో, దానితో పాటే మా స్థానిక ఉత్పత్తులు, నేతకు సంబంధించిన పదాలు కూడా అంతరించిపోతున్నాయి,” అని పంకజ్ చెప్పారు.

అస్సామ్‌లోని బెహబరి గ్రామంలో, ఇప్పటికి కూడా చేనేత పనిచేస్తోన్న కుటుంబానికి చెందిన 72 ఏళ్ళ అక్షయ్ దాస్, నైపుణ్యం అంతరించిపోయిందని చెప్పారు. యువకులు పని కోసం గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గువాహటీకి వలస వెళతారు. నేత సంప్రదాయానికి దూరంగా ఉన్న వారికి సెరెకి వంటి పదాలు తెలియవు. అక్షయ్ జొతొర్ అనే రాట్నం సహాయంతో ఒక మొహూరా (పంటె కోల) చుట్టూ చిన్న ఉచ్చులలో దారాన్ని చుట్టడానికి ఉపయోగించే వెదురు పట్టీ గురించి ప్రస్తావిస్తున్నారు.

Distanced from the traditional weaving practice, the young generation in Assam don't know words like sereki , or what it means to 'dance like a sereki' when we sing a Bihu song
PHOTO • Priyanka Borar

సంప్రదాయ నేత పద్ధతికి దూరమైన అస్సాంలోని యువతరానికి సెరెకి వంటి పదాలు తెలియవు, లేదా మనం ఒక బిహు పాట పాడినప్పుడు 'సెరెకిలా నృత్యం చేయడం' అంటే ఏమిటో తెలియదు

"నాకు ఒక బిహు పాట గుర్తుకొస్తోంది," పంకజ్ అన్నారు, " సెరెకి ఘురాది నాస్ [వడికే సెరెకి లాగా నాట్యం చేయండి]. సందర్భం తెలియనప్పుడు ఏ యువకుడైనా ఏం చేయగలడు? అక్షయ్ వదినగారైన [మరణించిన అతని అన్నయ్య నారాయణ్ దాస్ భార్య] 67 ఏళ్ళ బిలాతీ దాస్, మరొక పాట పాడుతున్నారు:

తెతెలీర్ తొలొతే, కపూర్ బొయి అసిలు, సొరయె సిగిలె హుతా
నేను చింత చెట్టు క్రింద నేస్తున్నప్పుడు, పక్షులు దారాలను తెంపేశాయి

పడుగులను(నేతలో నిలువు పోగులు) నేసే విధానాన్ని ఆమె నాకు వివరించారు. కొత్త ఉపకరణాలు, యంత్రాలు మార్కెట్‌ను ముంచెత్తడంతో అనేక స్థానిక ఉపకరణాలు, సాంకేతికతలు ఉనికిని కోల్పోతున్నాయని ఆమె చెప్పారు.

*****

"మనమిప్పుడు సర్వనాశ్ సాంకేతికతలో ఉన్నాం," నిర్మల్ నిగూఢంగా నవ్వుతూ చెప్పారు.

"ఇటీవల, నేను ఛత్తీస్‌గఢ్‌లోని మా గ్రామమైన పతందాదర్‌లో ఒక రకమైన అన్వేషణాయాత్రను చేశాను," నిర్మల్ తన కథను చెప్పడం మొదలుపెట్టారు: “నేను మా ఇంట్లో జరిగే ఒక పూజ కోసం దూబ్ [గరిక గడ్డి] గురించి వెదకుతున్నాను. మొదట ఇంటి వెనుక ఉన్న ఉన్న పెరటి తోటకు వెళ్ళాను, కానీ ఒక్క పరక దూబ్ [ సైనోడాన్ డాక్టిలాన్ ] కూడా దొరకలేదు. అందుకే పొలాల్లోకి వెళ్లాను

"ఇది పంట కోతలకు కొన్ని నెలల ముందు జరిగింది. అప్పుడే పుట్టిన వరి కంకులు తీపి రసాల పాలను నింపుకుంటాయి, రైతులు తమ పొలాలకు పూజలు చేయడానికి వస్తారు. వాళ్ళు కూడా పూజలో అదే పవిత్రమైన గడ్డిని ఉపయోగిస్తారు. నేను పొలాల గుండా నడిచాను, కానీ గడ్డి కుచ్చుల మీద మెరిసే మంచు బిందువులతో, ముకమల్ పట్టులాగా మెత్తగా ఉండవలసిన నేల నా పాదాల కింద పొడిగా బిరుసుగా తగిలింది. గరిక గడ్డి, మామూలు గడ్డి, కాందీ [పచ్చి మేత] అన్నీ మాయమయ్యాయి. ప్రతి పోచా వాడిపోయింది, నుసినుసిగా కాలిపోయింది!

"నేను పొలంలో పని చేసుకుంటోన్న ఒకతని అడిగాను.  అతను 'సర్వనాశ్' డాలా గయా హై, ఇస్‌లియే [ఎందుకంటే డూమ్‌ని చల్లాం] అని చెప్పాడు." అతను ఒక నిర్దిష్ట బ్రాండ్ పేరుతో ఉన్న ఏదో గుల్మనాశని గురించి చెప్తున్నాడని గుర్తించడానికి నాకు కొంత సమయం పట్టింది. అతను ఛత్తీస్‌గఢీలో చెప్పేటట్టుగా నిందా నాశక్ [కలుపు నాశని] అనో, లేదా మేం తరచుగా మాట్లాడే ఒడియాలో లాగా ఘాస్ మరా అనో, లేదా కొన్ని హిందీ మాట్లాడే ప్రాంతాలలో లాగా ఖర్‌పత్వార్ నాశక్, చరామార్ అనో చెప్పలేదు. ఆ మాటలన్నింటి స్థానంలో ఇప్పుడు ' సర్వనాశ్ ' అనే పదం వచ్చిచేరింది!

Increasing use of pesticides, chemical fertilisers and technologies have come to dominate agriculture, destroying India's rich diversity that farmers like Syed Ghani Khan, in Karnataka's Kirigavalu is trying to preserve. His house walls (right) are lined with paddy flowers with details about each variety. A loss of agricultural diversity can be seen to be linked to the loss in linguistic diversity
PHOTO • Sanket Jain
Increasing use of pesticides, chemical fertilisers and technologies have come to dominate agriculture, destroying India's rich diversity that farmers like Syed Ghani Khan, in Karnataka's Kirigavalu is trying to preserve. His house walls (right) are lined with paddy flowers with details about each variety. A loss of agricultural diversity can be seen to be linked to the loss in linguistic diversity
PHOTO • Manjula Masthikatte

పెరిగిపోతోన్న పురుగుమందులు, రసాయనిక ఎరువులు, సాంకేతికతల వినియోగం వ్యవసాయంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. కర్ణాటకలోని కిరగావలుకు చెందిన సయ్యద్ ఘనీ ఖాన్ వంటి రైతులు సంరక్షించడానికి ప్రయత్నిస్తోన్న భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని ఇవి నాశనం చేస్తున్నాయి. అతని ఇంటి గోడలు (కుడి) వరిలోని ప్రతి రకానికి చెందిన వరి కంకులతో, వాటి గురించిన వివరాలతో నిండి ఉంటాయి. వ్యవసాయ వైవిధ్యానికి జరిగే నష్టం భాషా వైవిధ్యానికి జరిగే నష్టంతో ముడిపడి ఉండటాన్ని చూడవచ్చు

ప్రతి అంగుళం భూమిని ఉపయోగంలోకి తేవడం, మన మనుగడ కోసం దానిని ఒక ఉత్పాదక క్షేత్రంగా మార్చడం అనే మానవకేంద్రీకృత తర్కం రసాయన ఎరువులు, పురుగుమందులు, సాంకేతికతలు వ్యవసాయంపై ఆధిపత్యం చెలాయించడానికి దారితీసింది. కేవలం ఒక ఎకరం మాత్రమే ఉన్న రైతు కూడా సంప్రదాయ పనిముట్లను ఉపయోగించడం కంటే ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని నిర్మల్ చెప్పారు.

“పగలు, రాత్రి గొట్టపు బావులు నీటిని తోడుతూ, మన నేల తల్లిని ఊసర క్షేత్రంగా మార్చేస్తున్నాయి. మాటీ మహతారీ , గర్భం [పై మట్టి] ప్రతి ఆరునెలలకు ఒకసారి బలవంతంగా గర్భం దాల్చేలా చేస్తోంది,” నిర్మల్ బాధ నిండిన స్వరంతో చెప్పారు. “ సర్వనాశ్ వంటి విష రసాయనాలను ఆమె ఎంతకాలం భరించగలదు? విషంతో నిండిన పంటలు త్వరలోనే మానవ రక్తంలోకి ప్రవేశిస్తాయి. నేను మన కడపటి వినాశనం దగ్గరపడటాన్ని అనుభూతి చెందుతున్నాను.

"భాష విషయానికొస్తే," నిర్మల్ కొనసాగించారు, " నాగర్ [నాగలి], బఖర్ [కలుపు తీసే సాధనం], కోపర్ [మట్టి గడ్డలను పగలగొట్టేందుకు ఉపయోగించే చెక్క దిమ్మెస] - వంటి వాటి పేర్లు కూడా ఎవరికీ తెలియవని ఒక మధ్య వయస్కుడైన రైతు నాకు ఒకప్పుడు చెప్పాడు. డౌఁరి బెలన్ [ఎద్దుతో లాగించే నూర్పిడి పొత్రం] అయితే పూర్తిగా మరొక లోకానికే చెందినది.

"అచ్చం మేటికంబ లాగా," అన్నారు శంకర్.

"కర్ణాటక రాష్ట్రం, ఉడిపిలోని వండ్సే గ్రామంలోని మా ఆవరణలో ఈ స్తంభం, మేటికంబ , ఉండేదని నాకు గుర్తుంది" అని ఆయన గుర్తు చేసుకున్నారు. "ఇది అక్షరాలా వ్యవసాయానికి మూల స్తంభం అని అర్థం. దానికి ఒక బెంచీని - హడిమంచా ని కట్టేవాళ్ళం. వరి కంకుల నుండి వడ్లను వేరు చేయడానికి వాటిని దానిపై కొట్టేవాళ్ళం. దానికి ఒక ఎద్దును కట్టి వరి గడ్డి మీదుగా దాన్ని తిరిగేలా చేసి మిగిలిన గింజలను కూడా తీసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్తంభం మాయమైపోయింది; ఆధునిక నూర్పిళ్ళ యంత్రాలతో ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది,” అని శంకర్ చెప్పారు.

“ఒకరి ఇంటి ముందు మేటికంబ ఉండటం చాలా గర్వపడే విషయంగా ఉండేది. ఏడాదికి ఒకసారి మేం దానికి పూజ చేసేవాళ్ళం, మంచి ఆహారంతో విందు చేసేవాళ్ళం! ఆ స్తంభం, ఆ పూజ, ఆ విందు, ఆ పదం- ఈ ప్రపంచమంతా ఇప్పుడు లేదు. పోయింది."

*****

"భోజ్‌పురిలో ఒక పాట ఉంది," స్వర్ణ కాంత అన్నారు. " హర్దీ హరిద్‌పూర్ జైహా ఏ బాబా, సోనే కే కుదాలీ హర్దీ కొరీహా ఏ బాబా [నాన్నా, దయచేసి నాకు హరద్‌పూర్ నుండి పసుపు తీసుకురండి, నేలలోంచి పసుపును బంగారు పారతో తవ్వండి]. ఇది భోజ్‌పురి మాట్లాడే ప్రాంతాలలో జరిగే వివాహాలలో ఉబటన్ [పసుపు రాయటం] వేడుకలో పాడేవారు. పూర్వం ప్రజలు తమ బంధువుల ఇళ్ళకు వెళ్లి జాఁతా [సానె] ఉపయోగించి పసుపు రుబ్బేవారు. ఇప్పుడు వారి ఇళ్ళల్లో సానెలు లేవు, ఆ ఆచారం కూడా పోయింది.

In Bhojpuri they sing a song during ubtan (haldi) ceremony in a wedding, 'hardi hardpur jaiha e baba, sone ke kudaali hardi korih e baba, [ father, please bring me turmeric from Hardpur, dig the turmeric up with a golden spade ]
PHOTO • Ritayan Mukherjee

వివాహ సమయంలో ఉబటన్ (హల్దీ) వేడుకలో భోజ్‌పురిలో వారు ఒక పాట పాడతారు, 'హర్దీ హరిద్‌పూర్ జైహా ఏ బాబా, సోనే కే కుదాలీ హర్దీ కొరీహా ఏ బాబా' [నాన్నా, దయచేసి నాకు హరద్‌పూర్ నుండి పసుపు తీసుకురండి, నేలలోంచి పసుపును బంగారు పారతో తవ్వండి]

There are no silaut ( flat grinding stone), no lodha ( type of pestle), no khal-moosal ( mortar and pestle) in modern, urban kitchens nor in our songs
PHOTO • Aakanksha
There are no silaut ( flat grinding stone), no lodha ( type of pestle), no khal-moosal ( mortar and pestle) in modern, urban kitchens nor in our songs
PHOTO • Aakanksha

ఆధునిక, పట్టణ వంటశాలలలో గానీ మన పాటలలో గానీ సిలౌట్ (సన్నికల్లు), లోఢా (ఒక రకం రోకలి), ఖల్-మూసల్ (రోలు రోకలి) లేవు

"మొన్నామధ్య ఒక రోజు నా దూరపు బంధువు భార్య, నేను ఉబటన్ పాటతో అనేక భోజ్‌పురి పదాలు ఎలా ముడిపడి ఉన్నాయో గమనించాం - కొదాల్ [పార], కోర్నా [తవ్వడం], ఉబటన్ [పసుపుతో స్నానం చేయడం], సిన్హోరా [కుంకుమ భరిణె], దూబ్ [గరిక గడ్డి] - ఇకపై వినబడవు," అని స్వర్ణ కాంత, పట్టణ భారతదేశంలో సాంస్కృతిక క్షయాన్ని అనుభవిస్తోన్న తీరు గురించి చెప్పారు.

*****

మనమందరం మన స్వంత విభిన్న, వ్యక్తిగత, ప్రాదేశిక, సాంస్కృతిక, వర్గ స్థానాల నుండి మాట్లాడుతున్నాం. ఇంకా మనమందరం అదే పదాల నష్టం, వాటి కుంచించుకుపోతున్న సహజార్థాల గురించి, అవి మన స్వంత మూలాలతో, పర్యావరణంతో, ప్రకృతితో, మన గ్రామాలతో, మన అడవులతో బలహీనపడుతున్న మన సంబంధాలతో చేతులు కలిపిన విధానం గురించి ఆందోళన చెందుతున్నాం. ఎక్కడో మనం 'ప్రగతి' అనే విభిన్నమైన ఆటను ఆడటం ప్రారంభించాం.

ఆటల గురించి తీసుకుంటే, అవి కూడా కాలక్రమేణా లేకుండాపోయాయి. సుధామయి, దేవేశ్‌లు ప్రత్యేకించి వాటి గురించే సంభాషణలో మునిగిపోయారు. "పిల్లలు ఇక ఆడటం మానేసిన ఆటల గురించి మీరు నన్ను అడిగితే," సుధామయి చెప్పింది, "నేను మీకు ఒక జాబితాయే ఇవ్వగలను. గచ్చకాయలు లేదా వల్లంచి - గులకరాళ్ళను గాలిలోకి విసిరి వాటిని తిరగేసిన మీ అరచేతిపై పట్టుకునే ఆట; రెండు వరుసలలో 14 రంధ్రాలు లేదా గుంటలు అమర్చిన బల్ల మీద గవ్వలతోనో చింతగింజలతోనో ఆడే ఓమనగుంటలు ; కళ్ళకు గంతలు కట్టుకుని మిగిలినవారిని పట్టుకునే కళ్ళగంతలు ఆట, ఇంకా మరెన్నో,” అంటూ చెప్పింది సుధామయి.

"నాకు ' సతీలో ' వంటి ఆటలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి," అని దేవేశ్ చెప్పారు. ఇందులో రెండు జట్లు ఉంటాయి. ఏడు రాళ్ళను ఒకదానిపై ఒకటి ఉంచి, ఒక జట్టు ఆ రాతి పేర్పును పడగొట్టడానికి ఒక బంతిని గురిపెట్టి విసురుతుంది, మరొక జట్టు ఔట్ కాకుండా ఆ రాళ్ళను మళ్ళీ పేర్చాలి. ఏదో ఒక సమయంలో మేం అబ్బాయిలం విసుగు చెందినప్పుడు, గేనా భడ్‌భడ్ అనే ఆటను కనిపెట్టాం. దీనికి అంతం ఉండదు, జట్లూ ఉండవు. అందరూ బంతితో ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటారు! ఇలా ఆడటం వల్ల ఎవరైనా గాయపడవచ్చు, కాబట్టి దీనిని 'అబ్బాయిల ఆట' అని పిలుస్తారు. ఆడపిల్లలు గేనా భడ్‌భడ్‌ ను ఆడరు.”

సుధామయి ఇలా అంటోంది, “నేను చెప్పిన ఆటలేవీ నేను ఎప్పుడూ ఆడలేదు, వాటి గురించి మా అమ్మమ్మ గాజులవర్తి సత్యవేదం ద్వారా విన్నాను. ఆమె మా సొంత ఊరు కొలకలూరుకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న చినగాదెలవర్రు అనే ఊరినుండి వచ్చారు. నాకు ఆమె గురించిన వివరాలు పెద్దగా గుర్తులేవు కానీ నాకు అన్నం తినిపిస్తూ, నన్ను నిద్రపుచ్చుతూ మా అమ్మమ్మ చెప్పిన కథల గురించీ, ఈ ఆటల గురించీ నాకు ప్రత్యేకంగా గుర్తుంది. నేనీ ఆటల్ని ఎందుకు ఆడలేకపోయానంటే, బహుశా నేను బడికి వెళ్ళవలసి వచ్చినందుకనుకుంటాను!”

"మా ప్రాంతంలోని అమ్మాయిలు గులకరాళ్ళతో ' గుట్టె ' అనే ఆట ఆడేవారు," అన్నారు దేవేశ్. "లేదా 'బిష్-అమృత్' [విషం-అమృతం] - దీని లక్ష్యం ఇతర జట్టును పట్టుకోవడం లేదా రక్షించడం. నేలమీద గీసిన తొమ్మిది చతురస్రాల్లోకి ఒంటికాలిపై దూకుతూ ఆడే 'లంగ్డీ టాంగ్ ' (కుందుళ్ళు ఆటలాంటిది) అనే ఆట కూడా నాకు గుర్తుంది. ఇది తొక్కుడుబిళ్ళ ఆటలో ఒక రకం.

“పిల్లలు తమ చేతుల్లో వారి బాల్యాన్నీ, వారి భాషనూ రెండింటినీ దోచుకునే డిజిటల్ పరికరాలతో పెరగలేదు. ఈ రోజు బఖిరాలో ఉండే ఐదేళ్ళ నా మేనల్లుడు హర్షిత్, గోరఖ్‌పూర్‌లో ఉండే ఆరేళ్ళ నా మేనకోడలు భైరవిలకు ఈ ఆటల పేర్లు కూడా తెలియవు," అన్నారు దేవేశ్.

Devesh has a vivid memory of playing sateelo as a child, but his young niece and nephew today do not even know the name of the game
PHOTO • Atharva Vankundre

దేవేశ్‌కి చిన్నతనంలో సతీలో ఆడిన మంచి జ్ఞాపకం ఉంది, కానీ ఈ రోజు అతని చిన్నారి మేనకోడలు, మేనల్లుడు ఇద్దరికీ ఆ ఆట పేరు కూడా తెలియదు

Young boys in Kivaibalega village of Chattisgarh playing horse riding. The game is known as ghodondi in the Halbi and Gondi languages
PHOTO • Purusottam Thakur

ఛత్తీస్‌గఢ్‌లోని కివైబలేగా గ్రామంలో గుర్రపు స్వారీ చేస్తున్న యువకులు. ఈ ఆటను హల్బీ, గోండి భాషల్లో ఘోడోండి అంటారు

*****

అయితే కొంత మొత్తంలోనైనా నష్టం తప్పదా? ప్రణతి తన మనసులో చర్చిస్తూనే ఉన్నారు. నిర్దిష్ట రంగాలలో కలిగిన మార్పులు మన భాషను స్వతస్సిద్ధంగాగానే మార్చలేదా? శాస్త్రీయ పరిజ్ఞానంలో వేగవంతమైన పురోగతి- ఉదాహరణకు అనేక వ్యాధులు, వాటి కారణాలు, నివారణ గురించి - ప్రజలలో ఆ అవగాహనా వ్యాప్తి వారు వాటిని చూసే విధానాన్ని, లేదా కనీసం వారు వాటిని గుర్తించే విధానాన్ని మారుస్తుంది. ఒరిస్సాలోని స్థానిక భాషల్లోకి ప్రవేశించే నిర్దిష్ట శాస్త్రీయ పదజాలాన్ని ఎవరైనా ఎలా వివరిస్తారు?

"ఒకప్పుడు గ్రామాలలో వ్యాధులకు వేర్వేరు పేర్లుండేవి; మశూచిని బడొ మా (పెద్దమ్మవారు); ఆటలమ్మను చొట్టొ మా (చిన్నమ్మవారు); అతిసారాన్ని బడి, హైజా లేదా అమాసయో ; టైఫాయిడ్ (ఆంత్రజ్వరం)ను ఆంత్రిక జ్వర్ , మధుమేహాన్ని బహుమూత్ర , కీళ్లనొప్పులను - గంఠిబాత, కుష్టు వ్యాధిని - బడా రోగో (పెద్ద రోగం). కానీ నేడు ప్రజలు ఈ ఒడియా పదాలను నెమ్మదిగా పక్కన పెడుతున్నారు, వారి పదజాలంలో ఆంగ్ల పదాలకు చోటిస్తున్నారు. ఇది విచారపడే కారణమా? నాకు ఖచ్చితంగా తెలియదు."

మనం భాషావేత్తలమైనా కాకపోయినా, భాష స్థిరమైనది కాదని మనకు తెలుసు. ఇది ఒక నది. ఎప్పటికీ ప్రదేశం, సామాజిక సమూహాలు, సమయం- ఈ అంతటా ప్రవహిస్తుంటుంది; ఎల్లప్పుడూ మారుతూ, వ్యాప్తి చెందుతూ, సమ్మిళితం చేస్తూ, కుదించబడుతూ, మసకబారుతూ, కొత్తగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నష్టం గురించీ జ్ఞాపకశక్తి గురించీ ఎందుకూ గొడవ గొడవ చేయటం? కొంత మరిచిపోవడం మంచిది కాదా?

*****

“మన భాషల వెనుక పొంచి ఉండే అనేక సామాజిక నిర్మాణాల గురించి నేను ఆలోచిస్తున్నాను. ముర్దాద్ మటన్ లాంటి పదాన్నే చూడండి,” అంటారు మేధ. “ఏదైనా మాటకు గానీ, పరిస్థితికి గానీ చలించకుండా 'మొండి'గా ఉండేవారి గురించి మేం ఈ మాటను తరచుగా ఉపయోగిస్తాం. ముర్దాద్ మటన్ అంటే, చాలా గ్రామాలలో దళితులు తినక తప్పని చనిపోయిన జంతువుల మాంసం. ఈ పదం అక్కడి నుండే వచ్చింది.”

రాజీవ్ మలయాళం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. "ఒకప్పుడు కేరళలో అట్టడుగు కులాల ప్రజల నివాసాన్ని చెట్టా అని పిలిచేవారు, అంటే ఒక పూరిల్లు. అలాంటి ఇళ్ళలో నివసించే అట్టడుగు కులాల ప్రజలను ఉద్దేశించి ఇది ఒక తిట్టు పదంగా కూడా మారింది. ఉన్నత కులాలవారి ఇళ్ళను పిలిచే పురా లేదా వీడు అనే పేర్లతో తమ నివాసాలను పిలుచుకోవడానికి వారికి అనుమతి లేదు. వారింట్లో అప్పుడే పుట్టిన శిశువులు ఉన్నత కులాల వారిపిల్లల్లా ఉణ్ణి కాదు; వీరిని చెక్కన్ అంటే ఆకతాయిలు అని పిలవొచ్చు. అగ్రవర్ణ ప్రజల సమక్షంలో వారు తమను తాము అడియన్‌ గా, అంటే ‘మీ విధేయుడైన సేవకుడు’ అని పిలుచుకోవాల్సి ఉంటుంది. ఈ పదాలు ఇప్పుడు ఉపయోగంలో లేవు,” అని అతను చెప్పారు.

Unjust social structures are also embeded in our languages. We need to consciously pull out and discard the words that prepetrate injustice from our vocabulary
PHOTO • Labani Jangi
Unjust social structures are also embeded in our languages. We need to consciously pull out and discard the words that prepetrate injustice from our vocabulary
PHOTO • Labani Jangi

అన్యాయమైన సామాజిక నిర్మాణాలు కూడా మన భాషల్లో ఇమిడి ఉన్నాయి. మన పదజాలం నుండి అన్యాయాన్ని జరిగించే పదాలను మనం చైతన్యంతో బయటకు తీసి తొలగించాలి

"కొన్ని పదాలు, వాడుకలు శాశ్వతంగా పోవడమే మంచిది" అంటారు మేధ. “మరాఠ్వాడాకు చెందిన దళిత నాయకుడు, అడ్వకేట్ ఏక్‌నాథ్ అవాడ్ తన ఆత్మకథలో [జెర్రీ పింటో అనువదించిన Strike a blow to change the world ] తాను, తన స్నేహితులు సృష్టించిన భాష గురించి మాట్లాడారు. వారంతా మాతంగ్, ఇంకా ఇతర దళిత కులాలకు చెందినవారు. ఆహారాన్ని దొంగిలిస్తూ పేదరికంలో జీవించారు. వారి రహస్య భాష వారు మనుగడ సాగించడానికి, ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవడానికి, పట్టుబడకముందే పారిపోవడానికి ఉపయోగపడింది. అందరూ ప్రేమగా ' జీజా ' అని పిలుచుకునే ఈయన, "ఈ భాషని మరచిపోవాలి. ఇది ఎవరికీ తెలియకూడదు, దానిని మళ్ళీ ఉపయోగించాల్సిన అవసరం రాకూడదు," అన్నారు

“దీపాలి భుస్నార్, సోలాపూర్ జిల్లాలోని సంగోలాకు చెందిన న్యాయవాది నితిన్ వాఘ్మారే కాయ్ మాంగ్ గారుడ్య సరఖా రహాతుయ్ [మీరు మాంగ్ లేదా గారుడిలా ఎందుకు కనిపిస్తున్నారు?] వంటి అనేక పదాలను, సామెతలను జాబితా చేశారు. ఈ వాడుక తీవ్రమైన పేదరికం, కుల వివక్ష మధ్య జీవిస్తోన్న దళితులలో వ్యక్తిగత శ్రద్ధ, పరిశుభ్రతా లోపాన్ని సూచిస్తుంది. కానీ కులాల సోపానంలో పాతుకుపోయిన భాషలో ఒక వ్యక్తిని పారిధి, మాంగ్, మహర్‌ తో సమానం చేయడమంటే ఘోరమైన అవమానం. మనం అలాంటి పదాలను తొలగించాలి."

*****

రక్షించవలసినది ఏదో ఒకటి ఉండాలి. మన భాషల సంక్షోభం ఊహాత్మకమైనది కాదు. పెగ్గీ మోహన్ చెప్పినట్లు 'బొగ్గుగనిలో మొదటి కానరీ' లాగా ఉంటే, ఇంతకంటే దారుణం రాబోతుందా? మనం మన వైవిధ్యాన్ని మనుషులంగా, సంస్కృతిగా సామూహికంగా అంతరించిపోయే దిశగా వెళ్తున్నామా? దాని ప్రారంభాన్ని ఇక్కడ భాషలలో కనుగొనగలమా? అది ఎక్కడ ముగుస్తుంది, విముక్తి ఎక్కడ?

“మన సొంత భాషల్లో తప్ప మరెక్కడా?" 69 ఏళ్ళ జయంత్ పర్మార్ అంటున్నారు.  ఆయన ఉర్దూలో రాసే దళిత గుజరాతీ కవి

"మా అమ్మ మాట్లాడే గుజరాతీలో చాలా ఉర్దూ పదాలుంటాయి," అని ఆయన తనకు, తన తల్లి దహిబెన్ పర్మార్‌కు భాషతో ఉన్న సంబంధం గురించి చెప్పారు. "నన్ను ఫలానా పాత్ర తీసుకురమ్మని అంటూ, 'జా, కదో లై ఆవ్ ఖావా కడు ,' అంటుంది. మేం అన్నం కలుపుకుని తినే అటువంటి పాత్రలు ఇంకా ఉన్నాయో లేవో ఖచ్చితంగా చెప్పలేను. గాలిబ్‌ను చదివిన తర్వాత ఆ పదం కదా అని నాకు అర్థమైంది,” అని ఆయన చెప్పారు.

There was a time when people from all communities lived together inside the walled cities; the climate was not communal, and there was a lot of give and take that reflected in cultures, architecture, literature and language
PHOTO • Jayant Parmar

అన్ని వర్గాల ప్రజలు కోటవంటి నగరాల్లో కలిసి జీవించిన కాలం ఒకటి ఉండేది; వాతావరణం మతపరమైనది కాదు. సంస్కృతులు, వాస్తుశిల్పం, సాహిత్యం, భాషలలో ప్రతిబింబించేవాటిని ఇచ్చిపుచ్చుకోవటం చాలా ఉంది

" తారా 'దీదార్' తో జో " (నువ్వెలా ఉన్నావో చూసుకో), " తరు 'ఖమీస్' ధోవా ఆప్ [మీ చొక్కాను ఉతకనివ్వండి], " మోఁహ్‌మతి ఏక్ 'హరఫ్' కఢ్తో న థీ [నీ నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేవా?]” వంటి అనేక వాక్యాలు ఉన్నాయి. లేదా ఆమె ఇలా అంటుంది, “ ముల్లానే త్యాఁతి 'గోష్' లై ఆవ్ [ముల్లా ఇంటి నుండి కొంచెం మాంసం తీసుకురా, వెళ్ళు]. అసలుకు ఆ పదం గోష్ట్ , కానీ మాట్లాడే భాషలో మనం దానిని గోష్ అని పిలుస్తాం. మా బోలీ లో భాగమైన ఈ మాటలు ఇప్పుడు చెరిగిపోతున్నాయి. ఉర్దూ పద్యాల్లో ఈ పదాలను చూసినప్పుడల్లా నాకు అక్కడ మా అమ్మ చిత్రం కనిపిస్తుంది.

ఇప్పుడు వాతావరణం, నగర భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. “అప్పుడు అన్ని వర్గాల ప్రజలు అహ్మదాబాద్ కోట గోడల నగరంలో కలిసి జీవించారు; సంస్కృతి మతపరమైనది కాదు. దీపావళి సందర్భంగా మా ముస్లిమ్ స్నేహితులు మా ఇంటి నుండి వెళ్ళే మిఠాయిలను, రుచికరమైన పదార్థాలను స్వీకరించేవారు. మేం ఒకరినొకరం కౌగిలించుకునేవాళ్ళం. ముహర్రం సమయంలో మేమంతా వెళ్ళి తాజియా ఊరేగింపును చూసేవాళ్ళం. వాటిలో కొన్ని యక్షిణుల కోసం అందంగా, చక్కగా అలంకరించిన గోపురాలు. చిన్నపిల్లలు వాటి కిందకి వెళ్ళి తమకు ఆనందం, ఆరోగ్యం కావాలని అడుగుతారు,” అని ఆయన చెప్పారు.

అప్పుడు నిజమైన, స్వేచ్ఛ అయిన ఆదాన్-ప్రదాన్ (ఇచ్చిపుచ్చుకోవటం) ఉండేది. "మనం ఇప్పుడు భిన్నమైన వాతావరణంలో జీవించడం లేదనే సంగతి మన భాషలలో తెలుస్తుంది" అని ఆయన చెప్పారు. “కానీ కవిత్వంపై ఆశ ఉంది. నాకు మరాఠీ, పంజాబీ, బెంగాలీ తెలుసు. వీటి నుండి అనేక పదాలను ఉర్దూలోకి తెస్తున్నాను. ఎందుకంటే కవిత్వంలో మాత్రమే వీటిని కాపాడగలమని నేను నమ్ముతున్నాను.

పదాలంటే ఇసుక రేణువులో ఇమిడివున్న ప్రపంచాలు కాక మరేమిటి?.

అనేకమంది PARIభాషా సభ్యుల సహకారంతో ఈ బహుళప్రదేశాల రచన సాధ్యమైంది - దేవేశ్ (హిందీ), జాషువా బోధినేత్ర (బంగ్లా), కమల్‌జిత్ కౌర్ (పంజాబీ), మేధా కాళే (మరాఠీ), మహ్మద్ కమర్ తబ్రేజ్ (ఉర్దూ), నిర్మల్ కుమార్ సాహు (ఛత్తీస్‌గఢి), పంకజ్ దాస్ (అస్సామీ), ప్రణతి పరిదా (ఒడియా), రాజాసంగీతన్ (తమిళం), రాజీవ్ చెలనాట్ (మలయాళం), స్మితా ఖటోర్ (బంగ్లా), స్వర్ణ కాంత (భోజ్‌పురి), శంకర్ ఎన్. కెంచనూరు (కన్నడ), సుధామయి సత్తెనపల్లి (తెలుగు).

జయంత్ పర్మార్ (ఉర్దూలో రాస్తోన్న గుజరాతీ దళిత కవి), ఆకాంక్ష, అంతరా రామన్, మంజులా మస్తికట్టె, పి. సాయినాథ్, పురుషోత్తం ఠాకూర్, ఋతాయన్ ముఖర్జీ, సంకేత్ జైన్‌లకు మా ధన్యవాదాలు

ఈ కథనానికి పి. సాయినాథ్, ప్రీతి డేవిడ్, స్మితా ఖటోర్, మేధా కాళేల సహకారంతో ప్రతిష్ఠ పాండ్య సంపాదకత్వం వహించారు. అనువాద సహకారం: జాషువా బోధినేత్ర. ఫోటో ఎడిటింగ్, లేఅవుట్: బినయ్‌ఫర్ భరూచా.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

PARIBhasha Team

ভারতীয় ভাষাজগৎ ঘিরে আমাদের অনন্য বিভাগটির নাম পারিভাষা। বিভিন্ন ভারতীয় ভাষায় প্রতিবেদন রচনা তথা প্রতিবেদনের বহুভাষিক অনুবাদের কাজ সম্পন্ন হয় পারিভাষা বিভাগের সহায়তায়। পারিতে প্রকাশিত প্রতিটি কাহিনির নিজস্ব যাত্রাপথ নির্ধারণে বহুভাষিক তর্জমার প্রক্রিয়াটি মুখ্য ভূমিকা পালন করে। ভাষা সম্পাদক, অনুবাদক এবং স্বেচ্ছাকর্মীদের নিয়ে গঠিত পারিভাষা এদেশের সাংস্কৃতিক এবং ভাষাগত বৈচিত্র্যের পরিচায়ক। দেশ-গাঁয়ের যে আম জনতার কথা-কাহিনি ঘিরে পারি'র দুনিয়া, সেসব মানুষের কাছে তাঁদের কাহিনি পৌঁছে দেওয়ার গুরুত্বপূর্ণ কাজটি সুনিশ্চিত করেন পারিভাষাকর্মীরা।

Other stories by PARIBhasha Team
Illustrations : Atharva Vankundre

মুম্বই নিবাসী গল্পকার ও চিত্রশিল্পী অথর্ব বনকুন্দ্রে ২০২৩ সালের জুলাই থেকে অগস্ট পারি’তে ইন্টার্ন ছিলেন।

Other stories by Atharva Vankundre
Illustrations : Labani Jangi

২০২০ সালের পারি ফেলোশিপ প্রাপক স্ব-শিক্ষিত চিত্রশিল্পী লাবনী জঙ্গীর নিবাস পশ্চিমবঙ্গের নদিয়া জেলায়। তিনি বর্তমানে কলকাতার সেন্টার ফর স্টাডিজ ইন সোশ্যাল সায়েন্সেসে বাঙালি শ্রমিকদের পরিযান বিষয়ে গবেষণা করছেন।

Other stories by Labani Jangi
Illustrations : Priyanka Borar

নিউ-মিডিয়া শিল্পী প্রিয়াঙ্কা বোরার নতুন প্রযুক্তির সাহায্যে ভাব এবং অভিব্যক্তিকে নতুন রূপে আবিষ্কার করার কাজে নিয়োজিত আছেন । তিনি শেখা তথা খেলার জন্য নতুন নতুন অভিজ্ঞতা তৈরি করছেন; ইন্টারেক্টিভ মিডিয়ায় তাঁর সমান বিচরণ এবং সেই সঙ্গে কলম আর কাগজের চিরাচরিত মাধ্যমেও তিনি একই রকম দক্ষ ।

Other stories by Priyanka Borar
Illustrations : Jayant Parmar

Jayant Parmar is a Sahitya Akademi Award winning Dalit poet from Gujarat, who writes in Urdu and Gujarati. He is also a painter and calligrapher. He has published sevel collections of his Urdu poems.

Other stories by Jayant Parmar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli