"నన్ను అనేకసార్లు ఏనుగులు తరుముకొస్తుంటాయి, కానీ నేనెప్పుడూ గాయపడలేదు," నవ్వుతూ చెప్పారు రవి కుమార్ నేతామ్.
ఈ 25 ఏళ్ళ గోండు ఆదివాసీ అర్సికన్హార్ శ్రేణిలోని అడవి బాట వెంట నడుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్‌లో ఏనుగుల జాడలు తీసే (tracker) పనిచేస్తున్న ఈయన, ఆ దళసరి చర్మపు జంతువులను వాటి విసర్జక పదార్థాలు, పాదముద్రల ద్వారా పసిగడతారు.
"నేను పుట్టిందీ పెరిగిందీ అడవిలోనే. ఈ విషయాలు నేర్చుకోవడానికి నాకు ఏ బడికీ వెళ్ళాల్సిన అవసరంలేదు," ధమ్‌తరీ జిల్లా, ఠేనాహీ గ్రామానికి చెందిన రవి చెప్పారు. 12వ తరగతి వరకూ చదివిన ఆయన అటవీ శాఖలో ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగానికి మారక ముందు ఫైర్ గార్డుగా సుమారు నాలుగేళ్ళ పాటు పనిచేశారు.
ట్రాకర్లు మమ్మల్ని అడవిలోకి తీసుకెళ్తుండగా, పురుగుల మృదువైన ఝుంకారాలు, సాల్ ( షోరియా రోబస్టా ), టేకు ( టెక్టోన గ్రాండిస్ ) చెట్ల ఆకుల్లోంచి దూసుకుపోతున్న గాలి చేస్తోన్న మర్మరధ్వని తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడూ ఒక పక్షి కూత, పుటుక్కున విరిచిన రెమ్మ చప్పుడూ వినిపిస్తున్నాయి. ఈ ఏనుగుల జాడలు తీసేవారు వినవచ్చే శబ్దాల పట్లా, కనిపించే ఆధారాలను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలి.
ఏనుగులు ఈ మధ్యకాలం నుంచే ఈ అడవికి వస్తున్నాయి. అవి మూడేళ్ళ క్రితం ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చాయి. అటవీ అధికారులలో సికాసెర్ ఏనుగుల మందగా తెలిసిన ఇవి, ఒక్కో బృందంలో 20 ఏనుగుల చొప్పున రెందు బృందాలుగా విడిపోయాయి. ఒక బృందం గరియాబంద్ వెళ్ళిందని దేవ్‌దత్ తారామ్ చెప్పారు. మరో బృందాన్ని ఇక్కడి స్థానికులు గమనిస్తున్నారు. అటవీ గార్డుగా ఉద్యోగం ప్రారంభించిన దేవ్‌దత్ (55) ఇప్పుడు రేంజర్‌గా పనిచేస్తున్నారు. 35 ఏళ్ళకు పైగా అనుభవమున్న ఆయనకు ఈ అడవిలోని అణువణువూ విపులంగా తెలుసు.
"అడవిలో ఉన్న నీటి గుంటలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని ఆనకట్టల వలన కూడా ఇక్కడ నీరు పుష్కలంగా లభిస్తుంది," పెద్ద పెద్ద జంతువులు ఈ ప్రాంతంలో ఉండేందుకు ఎందుకు ఇష్టపడతాయో వివరించారు దేవ్‌దత్. అడవినిండా ఏనుగులకు అమిత ఇష్టమైన మహువా (ఇప్ప) పండ్ల వంటి ఆహార నిల్వలున్నాయి. మానవ సంచారం కూడా ఎక్కువగా ఉండదు. "అడవి దట్టంగా ఉంటుంది, ఖనిజాల తవ్వకాల వంటి కార్యకలాపాలు కూడా లేవు. ఈ ప్రాంతంలోని ఈ పరిస్థితులు ఏనుగులకు అనువుగా ఉంటాయి," అన్నారు దేవ్‌దత్.
ఏనుగుల ట్రాకర్లు బదిలీ (షిఫ్ట్) పద్ధతిలో రాత్రీ పగలూ, అన్ని కాలాల్లోనూ పనిచేస్తారు. కాలినడకన ఏనుగుల జాడలు తీస్తూ, వాటి కదలికలను కనిపెట్టేందుకు గ్రామాలకు వెళ్తుంటారు. తాము చూసిన విషయాలను అప్పటికప్పుడు ఎలిఫెంట్ ట్రాకర్ యాప్‌లో నమోదు చేస్తుంటారు.
"ఈ అప్లికేషన్‌ను FMIS (ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన వన్యప్రాణి విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఏనుగులు ఉన్న ప్రాంతానికి 10 కి.మీ పరిధిలో నివాసముండేవారిని అప్రమత్తం చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు," అని ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ ఉప సంచాలకులు వరుణ్ కుమార్ జైన్ చెప్పారు.
ఏనుగుల జాడలను తీసే బృందానికి నిర్ణీత పని గంటలు ఉండవు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నెలకు రూ.1500 వేతనంతో, గాయపడినప్పుడు బీమా రక్షణ కూడా లేకుండా పనిచేస్తారు. “ఏనుగులు రాత్రిపూట వస్తే, ఈ ప్రాంతానికి నేనే కాపలాదారుడ్ని కాబట్టి, మేం కూడా రాత్రిపూట రావాల్సివుంటుంది. అది నా బాధ్యత,” అని గోండు ఆదివాసీ సముదాయానికి చెందిన 40 ఏళ్ళ ఫారెస్ట్ గార్డు నారాయణ్ సింగ్ ధ్రువ్ చెప్పారు.
"ఏనుగులు మధ్యాహ్నం 12-3 గంటల మధ్య నిద్రపోతాయి," అన్నారతను. "ఆ తర్వాత 'నాయక ఏనుగు' [మగ ఏనుగు] పెద్దగా శబ్దం [ఘీంకారం] చేస్తుంది, అప్పుడు మంద మళ్ళీ నడవడం ప్రారంభిస్తుంది. ఏనుగులు ఎవరైనా మనుషులను గమనించినట్లయితే హెచ్చరికగా పిలుచుకుంటాయి, మిగిలిన మందను అప్రమత్తం చేస్తాయి." ఇలా చేయటం వలన ఏనుగులు సమీపంలో ఉన్నాయనే హెచ్చరిక ట్రాకర్లకు కూడా చేరుతుంది. “నేను ఏనుగుల గురించి అధ్యయనం చేసిందేమీ లేదు. వాటి గురించి నేను నేర్చుకున్నది ఏనుగు ట్రాకర్‌గా పనిచేసిన అనుభవం ద్వారానే,” అని ధృవ్ చెప్పారు.
"ఏనుగు రోజుకు 25-30 కిలోమీటర్లు నడిస్తే, అది మాకు శిక్ష లాంటిది," నాథూరామ్ చెప్పారు. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఈయన అడవి లోపల ఒక కుగ్రామంలో, రెండు గదుల కచ్చా ఇంట్లో నివసిస్తున్నారు. అటవీ శాఖలో ఫైర్‌వాచర్‌గా పనిచేసిన ఆయన రెండేళ్ళ క్రితం ఏనుగుల జాడను పట్టుకునే ఈ పనికి మారారు.
*****
రాత్రి వేళల్లో ట్రాకర్ల నుండి హెచ్చరికలు రాగానే, తమ పొలాల్లో మేస్తోన్న ఏనుగులను చూడడానికి గ్రామం తన నిద్రమబ్బును వదుల్చుకుంటుంది. యువకులు, పిల్లలు సురక్షితమైన దూరంలో నిలబడి, తమ ఫ్లాష్‌లైట్ల వెలుగులో ఆ భారీ జంతువులను చూస్తుంటారు
ఆహారం కోసం వరి పొలాల్లో మేయడానికి రాత్రివేళల్లో వచ్చేందుకు ఇష్టపడే ఏనుగులు తమ పొలల్లోకి రాకుండా అరికట్టడానికి గ్రామవాసులు సాధారణంగా రాత్రంతా మంటలు వేస్తారు. అడవిలోని కొన్ని గ్రామాల ప్రజలు రాత్రంతా భోగి మంటలు వేసి, చుట్టూ కూర్చుని కాపలా కాస్తున్నప్పటికీ, తమ పంటలను ఏనుగుల మంద నుండి రక్షించుకోలేకపోతున్నారు.
"ఏనుగులు మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు, అటవీ శాఖకు చెందినవారు చాలా సంతోషించి వాటికి చెరకు, క్యాబేజీ, అరటిపండ్లు వంటి చాలా రకాల పండ్లనూ కూరగాయలనూ అందించారు," అని ఠేనాహీ నివాసి నోహర్ లాల్ నాగ్ చెప్పారు. ఆ ఆనందాన్ని పంచుకోలేని నోహర్ వంటి గ్రామవాసులు ఏనుగుల వల్ల తమ పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.
PARI మరుసటి రోజు ఉదయం ఠేనాహీ గ్రామాన్ని సందర్శించినప్పుడు, ఏనుగులు వదిలిన గుర్తులనూ, చేసిన పంట నష్టాన్నీ చూశాం. కొత్తగా నాటిన పంటలను మంద నాశనం చేసింది. అక్కడ తమ వీపులను రుద్దుకున్న గుర్తుగా చెట్ల కాండాలకు బురద అంటి ఉంది.
అటవీ శాఖ ప్రతి ఎకరానికి రూ.22,249 పరిహారం చెల్లించాలని ఆదేశించినట్టు ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ ఉప సంచాలకులు వరుణ్ కుమార్ జైన్ చెప్పారు. కానీ అధికారిక సంబంధిత "ప్రక్రియ" కారణంగా ఆ డబ్బు సరిగ్గా అందదని ఇక్కడివారు నమ్ముతున్నారు. "ఇప్పుడు మేమేం చేయగలం?" అని వారు అడుగుతున్నారు. "ఏదైనా చేయవలసింది ఫారెస్ట్ అధికారులు మాత్రమే. మాకు తెలిసిందల్లా, ఇక్కడ ఏనుగులు ఉండొద్దని."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి