“ఒక్క చిన్న తప్పు చేస్తే చాలు, మీకు కోయ్తా కు బదులు సత్తుర్ వస్తుంది!” రాజేశ్ చాఫేకర్‌కి మాంసం కోసే కత్తికి, కొడవలికి మధ్య తేడా తెలుసు. నిపుణుడైన లోహార్ (కమ్మరి) అయిన అతను మహారాష్ట్రలోని అక్టన్ గ్రామంలోని తన కార్యశాలలో 10,000 కంటే ఎక్కువే ఇనుప పనిముట్లను తయారుచేశారు.
52 ఏళ్ళ రాజేశ్ తన తండ్రి దత్తాత్రేయ చాఫేకర్ నుండి వృత్తిపనిని నేర్చుకున్నారు. వారిది మహారాష్ట్రలోని వ్యవసాయ వర్గానికి చెందిన వినియోగదారులు బాగా విశ్వసించే పాంచాల్ లోహార్ల సుదీర్ఘ వారసత్వం. "ప్రజలు 'అక్టన్ సే హీ హత్యార్ లేకే ఆవో ' [పనిముట్లను అక్టన్ నుంచే తీసుకురండి] అంటారు," అని వసై తాలూకా కు చెందిన ఈ ఏడవ తరం కమ్మరి చెప్పారు. అతనికి 25 కంటే ఎక్కువ రకాల వ్యవసాయ పనిముట్లను తయారుచేసే సామర్థ్యం ఉంది.
బోట్ల తయారీలో కీలక సాధనమైన తాస్ణి కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవీ ముంబైలోని ఉరణ్ నుంచి కస్టమర్లు వచ్చారు. " గిర్‌హాయిక్‌లు [వినియోగదారులు] నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండి, మేం ఆ పనిముట్లను తయారుచేయడాన్ని మొదటి నుంచీ చూసేవాళ్ళు," అని అతను గుర్తు చేసుకున్నారు.
ఇరుకు దారులున్న అక్టన్ గ్రామం సోనార్ (కంసాలి), లోహార్ (కమ్మరి), సుతార్ (వడ్రంగి), చంభార్ (చెప్పులు కుట్టేవాళ్ళు), కుంభార్ (కుమ్మరి) లాంటి సంప్రదాయ కుల ఆధారిత వృత్తులకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోని ప్రజలు తామెప్పుడూ సుప్రసిద్ధ చేతివృత్తుల దేవుడైన విశ్వకర్మ శిష్యులమని చెప్పుకుంటారు. పాంచాల్ లోహార్‌లు 2008 నుండి సంచార జాతుల జాబితాలో ఉన్నారు, దానికి ముందు వారు ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతులు) వర్గంలో ఉండేవాళ్ళు.
తనకు 19 ఏళ్ళ వయసులో కుటుంబ సంప్రదాయమైన కమ్మరి వృత్తిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని రాజేశ్ తెలిపారు. ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణంలో స్టోర్ కీపర్‌గా ఉద్యోగం చేస్తూ అతను నెలకు రూ.1,200 సంపాదించేవారు. కొన్నేళ్ళ తరువాత, వారి పెద్ద ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో అతని తండ్రికి పనిలేకుండా పోయింది. దాంతో ఇంటి పెద్ద కొడుకుగా ఆయన కుటుంబ వృత్తిని చేపట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత, ఆయనొక నిపుణుడైన కమ్మరిగా తయారయ్యారు. ఉదయం 7 గంటల తర్వాత మొదలయ్యే ఆయన పని, ఆ తర్వాత సుమారు 12 గంటల పాటు కొనసాగుతుంది. మధ్యలో అప్పుడప్పుడూ టీ తాగడానికి మాత్రమే ఆయన విరామం తీసుకుంటారు. ఒక్క రోజులో ఆయన మూడు పనిముట్లను తయారుచేయగలరు. ఆయన తయారుచేసిన పనిముట్లను ఉపయోగించుకునేవారిలో వసైలోని భుయిగాఁవ్ సమీపంలో నివసించే బేనాపట్టికి చెందిన ఆదివాసులు, ముంబైలోని గోరాయ్ గ్రామానికి చెందిన కొంతమంది ఉన్నారు.
కోయ్తా (చిన్న కొడవలి), మోర్లీ (కూరగాయలను, మాంసాన్నీ కోసే కత్తిపీట), ఔత్ (నాగలి), తాస్ణి (బాడిస), కాతి (మచ్చుకత్తి), చిమ్టే (పటకార్లు), సత్తుర్ (మాంసం కోసే కత్తి) అతని వద్ద ఎక్కువగా అమ్ముడుపోయే పరికరాలలో కొన్ని.
వినియోగదారులు కావాలని అడిగిన పరికరాలన్నీ రాజేశ్ తయారుచేసి ఇస్తారు. “ప్రతి గ్రామానికి ఈ పనిముట్లకు సంబంధించి స్వతహాగా కొన్ని ఆకృతులు, అవసరాలు ఉంటాయి. చెట్లు ఎక్కేటపుడు తమ కోయ్తాల ను [చిన్న కొడవలి] గట్టిగా పట్టుకోవడానికి కల్లు గీత కార్మికులకు అదనపు పట్టు కావాలి," అంటారు రాజేశ్. అరటి, కొబ్బరి సాగుదారులు తమ పనిముట్లను పదును పెట్టడానికి, మరమ్మత్తు చేయడానికి సంవత్సరం పొడవునా పంపుతుంటారు.
"ప్రతిఫలంగా మాకు బహుమతులు వస్తూనే ఉంటాయి," ఒక స్థానిక సాగుదారుడు తన కొడవలికి పదును పెట్టిచ్చినందుకు బహుమతిగా ఇచ్చిన తాజా కొబ్బరికాయలను చూపిస్తూ చెప్పారతను. "నేను ఒక కాతీ ని (మచ్చుకత్తి) బాగుచేసిస్తే కోళీ సోదరులు ఒకోసారి మా కోసం ఆ రోజు పట్టిన తాజా చేపలను తీసుకువస్తారు," అని జతచేసారు.
పుణేలోని వాఘోలీ నుండి కూడా అతనికి అనేక ఆర్డర్‌లు వస్తుంటాయి ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా తక్కువ మంది కమ్మరులు ఉన్నారు. “ త్యాంచే సత్తుర్ అస్తాత్, బక్రె కాపైలా [వాళ్ల ఆర్డర్‌లో మేక మాంసాన్ని కోసే కత్తులు ఉంటాయి].”
కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఆసక్తితో గట్టిగా ఉండే ఎండు కొబ్బరికాయలను కోయడానికి వీలుగా రాజేశ్ ఒక ప్రత్యేకమైన కొడవలిని తయారుచేశారు, “నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. కానీ వాటిని నేను మీకు చూపించను. అవి నా ప్రత్యేకహక్కు (పేటెంట్!)" అని అతను నవ్వుతూ చెప్పారు. ఎలాంటి ఫొటోలను తీసుకోవడానికి కూడా అనుమతించలేదు.
అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వస్తువులలో మోర్లీ (కత్తిపీట) ఒకటి. ఇది వంటగది అరుగుకు అమర్చగలిగే చిన్న కత్తిపీట. మామూలుగా పెద్దగా ఉండే, నేల మీద పెట్టి కూరగాయలు కోసే కత్తిపీటను ఉపయోగించలేని వృద్ధులకు ఇది ఉపయోగపడుతుంది.
వర్షాకాలంలో రైతులు రోజువారీ కూలీపనుల కోసం నగరానికి వెళ్ళడంతో వాళ్ళ అమ్మకాలు తగ్గిపోయాయి. “కొన్నిసార్లు నేను రోజుకు రూ.100, మరికొన్నిసార్లు కేవలం రూ.10 మాత్రం సంపాదిస్తా. ఒకోసారి రోజుకు రూ. 3,000 లేదా 5,000 సంపాదిస్తా, ఆ మరుసటి రోజు మళ్ళీ ఏమీ ఉండదు. ఏ రోజు ఎలా ఉంటుందో నేను అంచనా వేయలేను,” అని అతను తన సంపాదన గురించి వివరించారు. “ గిర్హాయిక్ అణి మరణ్ కధీ యెతిల్ కాయ్ సాంగతా యెత కా ?[వినియోగదారులు లేదా మరణం ఎప్పుడు మీ తలుపు తడతారో మీరెప్పుడైనా ఊహించగలరా?]."
*****
ఆదివారాలతో సహా ప్రతిరోజూ ఉదయం, రాజేశ్ తన భట్టీ (కొలిమి)లో మంటను రాజేస్తారు.
PARI ఈయనను కలవడానికి వెళ్ళిన రోజున, ఆయన కొలిమి వేడి కావడం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో స్థానికుడు ఒకరు ఒక బంగాళాదుంపతో అక్కడికి వచ్చారు. వాళ్ళేమీ మాట్లాడుకోలేదు. రాజేశ్ బంగాళాదుంపను తీసుకుని, కొలిమిలోని ఒక పక్కన దాన్ని కప్పెట్టారు. "అతనికి బొగ్గులో కాల్చిన బంగాళాదుంపలంటే ఇష్టం, ఇంకో గంట తర్వాత వచ్చి దీన్ని తీసుకుపోతాడు," అని రాజేష్ మాతో అన్నారు.
కొద్దిసేపటి తర్వాత ఆనాటి మొదటి వినియోగదారుడు నాలుగు కొడవళ్ళను పదును పెట్టాలంటూ వచ్చారు. రాజేశ్ అతణ్ని, “ఇదేమీ అత్యవసరం కాదు కదా?” అని అడిగారు. ఆయన అంత వెంటనే అవసరమేమీ లేదని హామీ ఇచ్చి, కొన్ని రోజుల తర్వాత తీసుకుంటానని చెప్పారు.
“మరేం చెయ్యాలి, నేను వాళ్ళను అడగాల్సిందే. నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు," అన్నారు రాజేశ్.
ఆ రోజుకు ఆర్డర్లు రావడం మొదలుకావడంతోనే ఆయన తనకు అవసరమైన ముడి పదార్థాలను ఒకచోటకు చేర్చటం ప్రారంభించారు. కొలిమి వేడెక్కిన తర్వాత, అతనికి ప్రతీది చేతికి దగ్గరలో ఉండాలి కాబట్టి ఇలా చేర్చి పెట్టుకోవటం చాలా కీలకం. అతను ఆరు నుంచి ఎనిమిది కిలోల బరువుండే బొగ్గును ఒక పాత్రలో వేసి, చేతులతోనే వాటిలోని రాళ్ళను వేరుచేయడం ప్రారంభించారు. "చిన్న రాళ్ళు ఉంటే అవి బొగ్గులు వేగంగా కాలకుండా ఆపుతాయి," అంటూ, కొలిమిలో మంటను ఆర్పే ముందు వాటిని తీసేయాలని ఆయన వివరించారు.
అనుభవజ్ఞుడైన ఆ కమ్మరి వెంటనే బొగ్గు పైన కొన్ని చిన్న చిన్న చెక్క ముక్కలను ఉంచుతారు. ఇంతకుమునుపు ధామ్ని (గాలి తిత్తి) అని పిలిచే ఒక భాతా , కొలిమిలో మంట ఆరిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. కొలిమి వేడిగా ఉండడానికి కావాల్సిన గాలిని సరఫరా చేస్తూ గాలి దిశను కూడా ఇది నియంత్రిస్తుంది.
ముడి లోహం వేడెక్కడానికి ఐదు నుండి ఏడు నిమిషాల పాటు కొలిమిలో ఉంచుతారు. ఒకసారి వేడెక్కి, మెరుస్తున్నప్పుడు ఆ లోహాన్ని ఒక ఐరణ్ (ఇనుప దిమ్మె) మీద పెడతారు. రాజేశ్ కొన్ని సెకన్ల పాటు ఆ లోహాన్ని తలక్రిందులుగా ఉంచి, ఘణ్ (సుత్తి)తో వేగంగా దాన్ని కొట్టారు. “లోహం చల్లబడేలోపు ఇలా చేయాలి. లేకుంటే దాని ఆకారం పాడైపోతుంది,” అని అతను వివరించారు.
రాజేశ్ చిన్న సుత్తిని ఉపయోగిస్తోంటే, ఆయన కొడుకు ఓమ్ ఒక పెద్ద సుత్తిని తీసుకున్నాడు. వాళ్ళు కావాలనుకున్న ఆకారం వచ్చే వరకు ఒక గంట పాటు వాళ్ళిద్దరూ ఆ లోహంపై దెబ్బలు వేయడం, దాన్ని మళ్ళీ వేడి చేయడం మళ్ళీ మళ్ళీ చేస్తారు. పనిముట్టు ఆకారం వచ్చాక, మాందళ్ (గోళాకారపు ఉక్కు రింగు)తో దాని చెక్క పిడిని, ఆకారం వచ్చిన లోహాన్ని కలుపుతారు.
పరికరాల అంచులను పదును పెట్టడానికి అతను 80 ఏళ్ళ పురాతనమైన సానెను ఉపయోగిస్తారు. మోగ్రీ సహాయంతో రాజేశ్, చేతితో తయారుచేసిన ఆ పనిముట్టుకు తుది మెరుగులు దిద్దారు. నునుపుగా చేసే ఆ పరికరాన్ని (మోగ్రీ) ఆయనకు ఆయన తండ్రి ఇచ్చారు.
ఆయన కార్యశాల సాధారణంగా పొగతో నిండి ఉంటుంది, అయినా ఇది అతనికి ఇబ్బందిగా అనిపించదు. “నాకు వేడి అంటే ఇష్టం. మజ్జా ఆతా హై మేరే కో [నేను దానిని ఆస్వాదిస్తాను]." కొలిమి సమీపంలో కూర్చోవడం కష్టంగా మారినపుడు, కొంచెం ఉపశమనం కోసం ఆయన కాళ్ళ మీద నీళ్ళను చల్లుకున్నారు.
స్థానిక యూట్యూబర్ ఒకరు అతనిపై తీసిన వీడియో వైరల్ కావడంతో, అతనికి విదేశాలలో నివసిస్తున్న భారతీయుల నుంచి కూడా ఆర్డర్‌లు రావడం ప్రారంభమైంది. కానీ ఆ పనిముట్లను ఆయుధాలుగా పరిగణిస్తారు కాబట్టి, అతను వాటిని రవాణా చేయలేకపోయారు. ఇప్పుడతను తయారుచేసే మాంసం కోసే కత్తుల కోసం ఆస్ట్రేలియా నుండి వినియోగదారులు భారతదేశంలోని అతని కార్యశాలకు తామే స్వయంగా వస్తున్నారు.
ఎప్పుడూ రాజేశ్ దగ్గరకే వచ్చే వినియోగదారులు చాలా మందే ఉన్నారు, కానీ తగినంత మంది సహాయకులు లేనందువల్ల వాళ్ళు అడిగిన పనిముట్లను తయారుచేసి ఇవ్వడం అతనికి కష్టంగా ఉంది. "నా కస్టమర్లను రేపు రమ్మని నేను చెప్పలేను," అని అతను అన్నారు.
అతని సామాజికవర్గానికి చెందిన చాలామంది ఇప్పుడు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ఠాణే, ముంబైలకు దగ్గరగా వెళ్ళారు. వాళ్ళు రైల్వేలో ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. "ఇప్పుడు వ్యవసాయ భూములు లేవు కాబట్టి మనం ఏం చేయగలం?" అంటూ 30 సంవత్సరాల క్రితం తన వీధిలో 10-12 కమ్మరి కార్యశాలలు ఉన్న కాలాన్ని గుర్తు చేసుకున్నారతను. "ఇప్పుడు రెండు మాత్రమే ఉన్నాయి." రాజేశ్ కాకుండా అతని సామాజికవర్గానికి చెందిన మరో బంధువు మాత్రమే ఇప్పుడు కమ్మరి పని చేస్తున్నారు.
రాజేశ్ భార్య, ఉపాధ్యాయురాలైన సోనాలీ కమ్మరి వృత్తిని కొనసాగించాలని తన భర్త తీసుకున్న నిర్ణయానికి గర్విస్తారు. “ఈ రోజు ప్రతి ఒక్కరూ సులభంగా డబ్బు రావాలని కోరుకుంటున్నారు. భట్టీ ముందు కూర్చుని ఘణ్ [సుత్తి]తో కొట్టేదెవరు?” అని ఆమె ప్రశ్నిస్తారు.
20 ఏళ్ళ వయసున్న ఆయన కుమారుడు ఓమ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. “వారాంతాల్లో పనిలో నాకు సాయం చేయమని నేనెప్పుడూ అతణ్ని అడుగుతాను. ఇది మా పని; ఈ వృత్తి నైపుణ్యాన్ని పోగొట్టుకోకూడదు." తాను చనిపోయిన తర్వాత కొడుకు తన పనిముట్లన్నిటినీ భద్రపరచాలని రాజేశ్ కోరుకుంటారు. “నా దగ్గర ఇప్పటికీ మా నాన్న, తాతల పనిముట్లు ఉన్నాయి. మీరు ఒక పనిముట్టును దాన్ని సుత్తితో కొట్టిన పద్ధతిని బట్టి, ఎవరు తయారుచేశారో గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరి సుత్తితో కొట్టే శైలి భిన్నంగా ఉంటుంది.”
కొలిమిని రాజేయడానికి ఉపయోగించే రాక్షసి బొగ్గును సేకరించడం చాలా ఖరీదైన పని: కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) 2023లో హై-గ్రేడ్ బొగ్గు ధరలను ఎనిమిది శాతం పెంచింది. “నేను పని ప్రారంభించినప్పుడు [32 సంవత్సరాల క్రితం] ఇది కిలో దాదాపు 3 రూపాయలుగా ఉండేది. ఈ రోజు కిలో రూ.58కు చేరింది," చెప్పారతను.
ప్రతి రోజూ ఉపయోగించే బొగ్గు ధరకు సమానమైన డబ్బును సంపాదించడం అతిపెద్ద సవాలు. అతను ఒక కొడవలిని రూ. 750కు అమ్ముతారు. రెండు నుంచి మూడు కిలోల బరువున్న రూ.120-140 ఖరీదైన ముడి లోహపు ముక్కతో ఒక కొడవలిని తయారుచేయడానికి అతనికి దాదాపు ఆరు కిలోల బొగ్గు పడుతుంది. ఆ పరికరం చెక్క పిడిని టోకున కొంటే దాని ధర ఒక్కొక్కటి రూ. 15 పడుతుంది, అదే విడిగా కొంటే ఒక్కొక్కటి రూ.60 పడుతుంది.
"నాకు ఎంత మిగులుతుందో లెక్కవేసి మీరే చెప్పండి?" తనకు గిట్టుబాటు అయేది చాలా తక్కువ అనే విషయాన్ని ఎత్తిచూపారాయన.
బొగ్గు ధర పెరగడంతో పాటు, వారి సామాజికవర్గం ఇతర సంబంధిత జీవనోపాధుల వైపుకు తరలివెళ్ళడం వారికి మరో దెబ్బ. ఒకప్పుడు వడ్రంగులు, కమ్మరులు కలిసి ఖర్చులు తగ్గించుకోవడంలో ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళని అతనన్నారు. “ఇప్పుడు మాకు దొరుకుతోన్న బాబుల్ కాకుండా మేం గతంలో ఉపయోగించిన ఖైర్ కలప ఖరీదు ఎక్కువ. వడ్రంగివాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు మా కోసం దాన్ని తెచ్చేవాళ్ళు. బదులుగా మేం వాళ్ళ ఎద్దుల బండి చక్రాలకు ఇరుసు పట్టీలను, బాక్సింగ్ (లోహపు ఇన్సర్ట్స్) లను తయారుచేసి ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా మేం ఒకరికొకరం సహాయం చేసుకున్నాం.”
ఉష్ణంతో, లోహంతో పనిచేయడం వలన ప్రమాదాలు, గాయాలు ఎక్కువగా అవుతుంటాయి. పనిలో భద్రత కోసం మార్కెట్లో రక్షణ పరికరాలు దొరుకుతున్నా, వాటిని ధరించి వేడిగా ఉండే కొలిమి దగ్గర పనిచేస్తుంటే ఊపిరాడదని రాజేశ్ చెప్పారు. కాలిన గాయాల గురించి ఆందోళన చెందే అతని భార్య సోనాలీ, “ఆయన పనిముట్లను తయారుచేస్తూ చాలాసార్లు చేతులు కోసుకుంటాడు. ఓసారి ఆయన పాదాలు కూడా తెగాయి," అన్నారు.
కానీ రాజేశ్ పని చేయడాన్ని ఆపరు. “కూర్చుంటే నా దగ్గరకు పని రాదు. నేను భట్టీ దగ్గర కూర్చోవాలి. కోయిలా జలానా హై మేరే కో [నేను బొగ్గును మండించాలి].”
దశాబ్దాల తన కమ్మరి వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న ఆయన, " ఛల్తా హై ఘర్ [నా ఇంటిని నడుపుకోగలుగుతున్నాను]," అంటారు.
అనువాదం: రవికృష్ణ