హరియాణా ప్రభుత్వ యాజమాన్యంలోని రోడ్డు రవాణా శాఖలో గుమాస్తాగా పదవీ విరమణ చేసిన తరువాత, భగత్ రామ్ యాదవ్ విశ్రాంత జీవితాన్ని ఎంచుకొని ఉండవచ్చు. “కానీ నాలో ఒక జునూన్ (అమితోత్సాహం) కలిగింది,” ఆదర్శవంతుడూ, ఎన్నో పతకాలు సాధించిన ఉద్యోగీ అయిన 73 ఏళ్ళ ఈ వృద్ధుడు అన్నారు.
ఈ అమితోత్సాహం ఆయనకు తన చిన్నతనంలో తండ్రి గుగ్గన్ రామ్ యాదవ్ నేర్పించిన చార్‌పాయిలు (నులక మంచాలు), పిడ్డాల (నులక అల్లిన ఎత్తుపీటలు) తయారీ కళను కొనసాగించేలా చేసింది.
అతని ఈ అభ్యాసం అర్ధ శతాబ్దం క్రితం ప్రారంభమైంది. అప్పటికి పదిహేనేళ్ళ వయసున్న భగత్, తన ముగ్గురు సోదరులతో కలిసి కూర్చుని, తమ ఇంటి వాడకం కోసం తండ్రి చాలా నైపుణ్యంతో చార్‌పాయిలు తయారుచేయడాన్ని చూస్తుండేవారు. అతని తండ్రి 125 ఎకరాల భూస్వామి. కానీ ఆయన గోధుమ పంట కోతల తరువాత వచ్చే వేసవికాలాన్నంతా ఈ దృఢమైన నులక మంచాల తయారీకి అంకితం చేసేవారు. చేతితయారీ సన్ (కట్టె) జనపనార ( క్రోటలేరియా జన్సియా ), సూత్ (పత్తి దారం), సాల్ (గుగ్గిలం చెట్టు/ షోరియా రోబస్టా ) చెట్టు చెక్క, శీశమ్ (ఇరిడి- ఉత్తరభారత రోజ్‌వుడ్ ) చెట్ల కలపను వీటి కోసం ఉపయోగించేవారు. జనాలు, పశువులు రోజులో ఎక్కువ భాగం గడిపే బహిరంగ ఆవరణ అయిన వారి బైఠక్ ఆయన పని ప్రదేశంగా ఉండేది.
భగత్ రామ్ తన తండ్రిని ఏక్ నంబర్ కా ఆరీ - గొప్ప నైపుణ్యకళాకారుడు- గానూ, తన పనిముట్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారిగానూ గుర్తుచేసుకున్నారు. “ చార్‌పాయిల తయారీ నైపుణ్యాన్ని నేర్చుకోమని మా నాన్న మమ్మల్ని ప్రోత్సహించేవారు. 'రండి, ఇది నేర్చుకోండి; ఇది మీకు భవిష్యత్తులో సహాయం చేస్తుంది ' అని ఆయన అనేవారు,” భగత్ రామ్ గుర్తు చేసుకున్నారు.
కానీ దాన్నొక విసుగుపుట్టించే పనిగా భావించిన ఆ అబ్బాయిలంతా ఆ పనిని తప్పించుకుని ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ వంటి ఆటలు ఆడటానికి పరుగులుతీసేవారు. “మా నాన్న మమ్మల్ని తిట్టేవారు, దెబ్బలు కూడా కొట్టేవారు. కానీ మేం పట్టించుకునేవాళ్ళంకాదు,” అన్నారతను. “మేం ఉద్యోగం సంపాదించుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించాం. మా నాన్నకు భయపడి మాత్రమే ఆ కళను నేర్చుకున్నాం. ఎక్కడయినా తెలియక ఆగిపోయినప్పుడు నులక తాడుతో డిజైన్‌ను ఎలా రూపొందించాలో తరచుగా ఆయన్ని అడిగేవాళ్ళం.”
జీవనోపాధికి సంపాదించాల్సిన వయసు రాగానే భగత్ రామ్ ఉద్యోగంలో చేరారు. మొదట రాజస్థాన్‌లోని ఒక ప్రైవేట్ బస్ సర్వీస్‌లో కండక్టర్‌గా, అటుపై 1982లో హరియాణా రహదారుల శాఖలో గుమాస్తాగా ఆయన పనిలో చేరారు. “ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పూ చేయకూడదు" అనే సూత్రాన్ని తాను పాటించినట్టు ఆయన తెలిపారు. అది ఆయనకు మూడు అవార్డులను సంపాదించిపెట్టింది; అలా తను అందుకున్న ఉంగరాలలో ఒకదానికి ఆయన ఇప్పటికీ గర్వంగా ధరిస్తారు. 2009 డిసెంబరులో, 58 ఏళ్ళ వయసులో ఆయన పదవీ విరమణ చేశారు. తనకు కుటుంబ ఆస్తిగా వచ్చిన 10 ఎకరాల భూమిలో పత్తి పంటను పండించడానికి ఆయన కొన్ని రోజులు ప్రయత్నించారు, కానీ ఆయన వయసుకు ఆ పని చాలా భారంగా పరిణమించింది. దాంతో ఆయన యుక్తవయసులో తాను నేర్చుకున్న కళను 2012లో తిరిగి ప్రారంభించారు.
ప్రస్తుతం, అహిర్ సామాజిక వర్గానికి (రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతిగా జాబితా చేయబడింది) చెందిన భగత్ రామ్ మాత్రమే తన గ్రామంలో చార్‌పాయిలు తయారుచేసే ఏకైక వ్యక్తిగా మిగిలారు.
*****
హరియాణా రాష్ట్రం, హిసార్ జిల్లాలోని ధానాఖుర్ద్ గ్రామంలో నివసించే భగత్ రామ్ ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటిస్తారు. ప్రతీ ఉదయం దాదాపు 6 గంటల సమయంలో నిద్రలేచే ఆయన, రెండు సంచులను – ఒకటి బాజ్రా (సజ్జలు)తో, మరొకటి చపాతీల తో - నింపుతారు. ఆ తరువాత తన పొలానికి వెళ్ళి, పావురాలకు గింజలు జల్లుతారు; చీమలు, కుక్కలు, పిల్లులకు చపాతీలు పెడతారు.
“అదయ్యాక, నా హుక్కాను సిద్ధం చేసుకొని ఉదయం 9 గంటల కల్లా నా పనికి సిద్ధమవుతాను,” భగత్ తెలిపారు. అత్యవసరమైన ఆర్డర్ లేని పక్షంలో ఆయన మధ్యాహ్నం వరకు పని చేస్తారు. “మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు ఇంకో గంట పని చేస్తాను.” తన గదిలో, తానే తయారుచేసిన నులక మంచం మీద కూర్చొనివున్నారాయన. కిటికీల నుండి వెలుతురు ప్రసరిస్తోంది, ఆయన పక్కన హుక్కా ఉంది; ఆయన అప్పుడప్పుడూ సావకాశంగా ఒక దమ్ము కొడుతుంటారు.
చల్లని గాలులు వీస్తోన్న ఒక జూలై మాసపు ఉదయాన PARI ఆయనను కలిసినప్పుడు, భగత్ రామ్ ఒక పిడ్డా ను తన ఒడిలో ఉంచుకొని ఎంతో ఏకాగ్రతతో పనిచేస్తున్నారు. “నేను దీన్ని ఒక రోజులో పూర్తి చేయగలను,” ప్రగాఢ విశ్వాసంతో అన్నారతను. ఇరిడి చెక్కతో చేసిన చట్రం మీద పడుగు (నిలువు అల్లకం), పేక (అడ్డం అల్లకం) పద్ధతిలో తాళ్ళను ఒక ఆకృతిగా మలుస్తున్న ఆయన చేతులు అలవాటైన రీతిలో అలవోకగా కదులుతున్నాయి.
వయసు పెరిగే కొద్దీ తన వేగం తగ్గిపోతుండటాన్ని గమనించినట్టు చెప్పారాయన. “నేను మళ్ళీ చార్‌పాయి లను తయారుచేయటాన్ని మొదలుపెట్టినప్పుడు నా చేతులు, శరీరం చాలా చురుకుగా పనిచేసేవి. ఇప్పుడు, నేను ఒకే బిగిన రెండు-మూడు గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నాను.”
రెండు వైపులా ఒకటే నమూనా ప్రతిబింబించేందుకు ఆయన, ఒక వైపు అల్లిక పూర్తిచేసిన తర్వాత అదే పద్ధతిలో మరోవైపు అల్లడానికి ఎత్తుపీటను వెలికిల తిప్పారు. “ పిడ్డా లో రెండు వైపులా భరాయీ (అల్లికతో నింపటం) చేయాలి. అప్పుడే అది దృఢంగా ఉండి చాలాకాలం మన్నుతుంది. కానీ, చాలామంది కళాకారులు ఇలా చేయరు,” వివరించారాయన.
ఒక వైపు పేక పద్ధతిలో నేయడాన్ని పూర్తి చేసిన ప్రతిసారీ, తాళ్ళ అమరిక సమంగా ఉండేలా చేయడానికి ఖుట్టీ లేదా ఠోక్నా ను – చేతి ఆకారంలో మలచిన పనిముట్టు – భగత్ ఉపయోగిస్తున్నారు. ఠోక్నా లయబద్దంగా చేసే థక్ థక్ థక్ లకు జతగా, దానికి కట్టిన ఘుంగ్రూ (చిన్న లోహపు గంటలు) చేస్తోన్న ఛణ్ ఛణ్ ఛణ్‌ల ధ్వనులు ఒక స్వరసమ్మేళనాన్ని సృష్టిస్తున్నాయి.
రెండు దశాబ్దాల క్రితం తన గ్రామంలో నివసించే ఒక శిల్పకారుడు చేసిన ఠోక్నా అది. ఒక తొలిచిన పువ్వు, ఘుంగ్రూలు ఆ పనిముట్టుకి అతను చేసిన చేర్పులు. మాకు చూపించడానికి మరిన్ని పిడ్డా లను తీసుకురమ్మని బడికి వెళ్ళే తన ఇద్దరు మనవళ్ళకు చెప్పిన ఆయన తన రహస్యాన్ని మాకు చెప్పేందుకు ముందుకు వంగారు; తాను తయారుచేసే ప్రతి పిడ్డా కి ఐదు ఘుంగ్రూ లను తెలివిగా అల్లుతారాయన. అవి చాలావరకు వెండి లేదా ఇత్తడితో చేసినవి. “నాకు చిన్నప్పటి నుండి ఘుంగ్రూ శబ్దమంటే చాలా ఇష్టం,” అంటారు భగత్ రామ్.
ప్రతి ఎత్తుపీటను కనీసం రెండు ప్రకాశవంతమైన రంగుల తాళ్ళ అల్లికతో రూపొందిస్తారు. “మీకు మార్కెట్‌లో ఇలాంటి రంగురంగుల పిద్దాలు దొరకవు,” అన్నారాయన.
గుజరాత్, భావ్‌నగర్ జిల్లాలోని మహువ పట్టణంలో ఉండే ఒక సరఫరాదారు నుండి తాళ్ళను ఆర్డర్ చేస్తారతను. షిప్పింగ్ ఛార్జీలతో కలిపి కిలో తాడు రూ.330 పడుతుంది. ఆయన ఎక్కువగా, ఐదు నుండి ఏడు క్వింటాళ్ళ బరువుండే వివిధ రంగుల తాళ్ళను ఆర్డర్ చేస్తారు.
అతని వెనుకనున్న బల్ల మీద కొన్ని తాళ్ళ కట్టలు ఉన్నాయి. ఆయన లేచి, తన అసలైన సేకరణను – రంగురంగుల తాళ్ళతో నిండిన ఒక బట్టల బీరువా - చూపించారు
ఎంత “ ములాయం ” (మృదువు)గా ఉందో అనుభూతి చెందమని ఒక తాడును ఆయన మాకు అందించారు. ఆ తాడు దేనితో తయారయిందో అయనకు తెలియనప్పటికీ, అది తెగిపోదని మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఆయన దగ్గర రుజువు కూడా ఉంది. ఒకసారి ఒక వినియోగదారుడు ఆయన తయారుచేసే తాళ్ళ మంచాలు, ఎత్తుపీటల నాణ్యతపై అనుమానం వ్యక్తం చేశారు. అందుకు సమాధానంగా, తన చేతులతో తాళ్ళను చీల్చమని భగత్ ఆ వినియోగదారునికి సవాలు విసిరారు. ఇలా వాటి నాణ్యతను ఒకసారి కాదు, రెండుసార్లు నిరూపించారాయన. సదరు వినియోగదారుడే కాక, సోను పెహల్వాన్ అనే పోలీసు కూడా అవి నాసిరకం వస్తువులని నిరూపించడంలో విఫలమయ్యాడు.
చార్‌పాయి తయారీలో తాడు మన్నిక ప్రధానమైనది. ఇది మంచానికి అవసరమైన ఊతాన్ని, దీర్ఘకాల మన్నికనూ అందిస్తూ మంచానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. తాడు నాణ్యత విషయంలో రాజీపడితే అది అసౌకర్యానికి, తెగిపోవటానికీ దారితీయవచ్చు.
భగత్ రామ్‌కి తాడు బలాన్ని పరీక్షించడం అంటే అతని అపారమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి కూడా ఒక సవాలే అన్నట్టు. పందెం గెలిచినందుకు ఏం కావాలని భగత్‌ని పోలీసు అధికారి ప్రశ్నించినప్పుడు, “నీ వైఫల్యాన్ని నువ్వు ఒప్పుకున్నావు, అదే చాలు,” అని భగత్ సమాధానమిచ్చారు. అయితే, ఆ పోలీసు అధికారి అతనికి రెండు పెద్ద గోహానా కి జలేబీ (జిలేబీలు) కొనిచ్చాడని, అవి ఎంత పెద్దవో సూచించడానికి నవ్వుతూ చేతులు చాపి చూపిస్తూ, భగత్ గుర్తుచేసుకున్నారు..
ఆ రోజు, ఆ పోలీసు అధికారి మాత్రమే కాక భగత్ రామ్ కూడా ఒక విషయం నేర్చుకున్నారు. హస్తకళల ప్రదర్శనలను సందర్శించే పెద్ద వయసు మహిళలకు ఎత్తు తక్కువగా ఉండే అటువంటి పిడ్డా లపై కూర్చోవడం అసౌకర్యంగా ఉందని, వారి మోకాళ్ళ నొప్పులకు అవి కారణమవుతున్నాయని ఆయన గుర్తించారు. “సుమారు 1.5 అడుగుల ఎక్కువ ఎత్తులో ఉన్న పిడ్డా లను తయారుచేయమని వారు నన్ను అడిగారు,” స్టీల్ ఫ్రేముతో ఇప్పుడు తను తయారుచేస్తున్న పొడవైన ఎత్తుపీటలను మాకు చూపిస్తూ తెలిపారు భగత్ రామ్.
వర్షం పడటం మొదలవటంతో, అతని భార్య కృష్ణాదేవి గబగబా ఆరుబయట ఉన్న పిడ్డా లను ఇంటిలోపలికి చేరవేశారు. డెబ్బై ఏళ్ళ ఈ వృద్ధురాలు దరీలు (రగ్గులు) నేసేవారు. కానీ, ఐదేళ్ళ క్రితం ఆ పని ఆపేశారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, పశువుల బాగోగులను చూసుకుంటూ ఇప్పుడు తన రోజులను గడుపుతున్నారామె.
భగత్ రామ్ కుమారులైన జస్వంత్ కుమార్, సునహరా సింగ్‌లు ఆయన అడుగుజాడల్లో నడవలేదు. హిసార్ జిల్లా కోర్టులో టైపిస్టుగా సునహరా పనిచేస్తుంటే, జస్వంత్ కుటుంబ భూమిలో గోధుమలు, కూరగాయలు పండిస్తున్నారు. “ఈ కళపై మాత్రమే ఆధారపడి ఎవరూ బతకలేరు; నాకు నెలకు రూ.25,000 పెన్షన్ వస్తోంది కాబట్టి నేను నిభాయించుకోగలుగుతున్నాను,” అన్నారతను.
*****
భగత్ రామ్ చేసే ఒక్కో పిడ్డా ధర రూ.2,500 నుండి 3,000 వరకు ఉంటుంది. తాను ప్రతీ చిన్న అంశంపై శ్రద్ధ వహించి చేయటం వల్లనే ధర ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. “ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే హాంసీ నుండి కొనుగోలు చేసే పాయె (కోళ్ళు)తో సహా, ప్రతి వస్తువునూ ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తాం. దానిని మేం పైడీ , మోటా పేడ్ , డాట్ అని పిలుస్తాం. తర్వాత దానిని తొలిచి, మా వినియోగదారులకు చూపిస్తాం. వారు ఆమోదం తెలిపిన తరువాతే, నేను దానికి మెరుగుపెడతాను,” అన్నారాయన.
చార్‌పాయిలు తయారు చేసేటప్పుడు కూడా ఇంతే ఖచ్చితత్వంతో ఉంటారు. ఒకే రంగు మంచాలు పూర్తిచేయడానికి మూడు నుండి నాలుగు రోజులు పడుతుంది. అయితే, ఒక డిజైనర్ చార్‌పాయి చేయడానికి 15 రోజులు పట్టవచ్చు.
చెక్క చట్రం లోపల ఒక అడుగు ఖాళీని వదిలి, తాళ్ళను రెండు వైపులా అడ్డంగా కట్టి, వాటికి ప్రతి వైపునా రెండు నుండి మూడు ముడులను గట్టిగా వేసి చార్‌పాయి తయారీని ప్రారంభించారు భగత్ రామ్. తరువాత తాళ్ళను పొడవుగా కట్టి పడుగులను ఏర్పాటుచేశారు. అదే సమయంలో, చార్‌పాయి ని మరింత దృఢంగా ఉంచడానికి, కుండ అనే పనిముట్టు సహాయంతో గుండి అనే నిర్దిష్ట పద్ధతిలో తాడును అల్లారు.
“ చార్‌పాయి ని తయారుచేసేటప్పుడు గుండి అవసరం. ఎందుకంటే, ఇది తాళ్ళు వదులుకాకుండా చేస్తుంది,” భగత్ రామ్ వివరించారు.
పడుగు తాళ్ళను సిద్ధం చేశాక, డిజైన్‌లను రూపొందించడానికి రంగురంగుల తాళ్ళతో అడ్డంగా అల్లడం మొదలుపెట్టారతను. ఈ తాళ్ళను కూడా గుండి పద్ధతిని ఉపయోగించి అంచుల వద్ద కట్టేశారు. ఈ విధంగా, ఒక నులక మంచం తయారీలో దాదాపు పది నుండి పదిహేను కిలోగ్రాముల తాళ్ళను ఉపయోగిస్తారు.
వేరే రంగు తాడును జోడించిన ప్రతిసారీ, ఆ రెండింటి కొసలను కలుపుతూ సూదీదారంతో కుడతారు. ఒక తాడు చివరికి రాగానే దాని కొసను మరో తాడుతో కలిపి, అదే రంగు దారాన్ని ఉపయోగించి కుడతారు. “నేను ముడి మాత్రమే వేస్తే, అది చెనా (శనగ గింజ) లాగ గుచ్చుకుంటుంది," అన్నారతను.
తన గ్రామంలోనూ, హరియాణాలోని ఇతర ప్రాంతాలలో నివసించే తన బంధువులను సందర్శించినప్పుడు వారి ఇళ్ళ గోడలపై ఉండే వర్ణచిత్రాలు, పాత ఇళ్ళపై ఉండే చెక్కడాలు, చార్‌పాయిల రూపకల్పనలో ఆయనకు ఎక్కువగా ప్రేరణనిచ్చాయి. “నేను నా ఫోన్‌లో వాటిని ఫోటో తీసుకుంటాను. నా చార్‌పాయి లపై వాటి ప్రతిరూపకల్పన చేస్తాను,” అంటూ తన ఫోన్‌లో స్వస్తిక , చౌపడ్ ఆట డిజైన్ ఉన్న ఒక చార్‌పాయి ఫోటోను చూపించారు భగత్ రామ్. నులక మంచం లేదా ఎత్తుపీటను తయారుచేశాక, గుగ్గిలం చెట్టు చెక్కతో తయారుచేసిన దాని బాయె (నిలువు పట్టెలు), శేరూ (అడ్డ పట్టెలు)లను, అలాగే ఇరిడి చెక్కతో చేసిన వాటి పాయె (కోళ్ళు)ను చిన్న చిన్న ఇత్తడి ముక్కలతో అలంకరిస్తారు.
సాధారణంగా, భగత్ రామ్ తయారుచేసే నులక మంచం ధర రూ.25,000 నుంచి రూ.30,000 వరకూ ఉంటుంది; ఆ ధర వాటి పరిమాణంపై – 8x6 అడుగులు, 10x8 అడుగులు, లేదా 10x10 అడుగులు – ఆధారపడి ఉంటుంది. ప్రతి చార్‌పాయి లేదా పిడ్డా కు అతను రోజుకు రూ.500 కూలీగా తీసుకుంటారు; అంటే, నెలకు దాదాపు రూ.5,000 నుండి 15,000 వరకు సంపాదిస్తారు. “ యే సర్కార్ కా మోల్ తో హై నహీ, మేరే మన్ కా మోల్ హై (ఇది ప్రభుత్వ ధర కాదు; అది నా సొంత ధర),” అన్నారు భగత్ రామ్.
ప్రభుత్వ అధికారిక హస్తకళల జాబితాలో చార్‌పాయి లను చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారతను. “ఒక స్థానిక వార్తా ఛానెల్‌లోని వీడియోలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేను ఈ విషయం గురించి విజ్ఞప్తి కూడా చేశాను,” తన మొబైల్ ఫోన్‌లోని క్లిప్‌ను గర్వంగా PARIకి చూపించారాయన.
తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఆయన, తన గ్రామం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో ప్రతి ఏటా నిర్వహించే హస్తకళల మేళాకు రెండుసార్లు వెళ్ళారు. 2018లో మొదటిసారి వెళ్ళినప్పుడు, కళాకారుల గుర్తింపు కార్డు లేకపోవడంతో, పోలీసులు ఆయనను అక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పారు. అయితే, అదృష్టం అతని వైపు ఉంది. ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ అతన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ల కోసం రెండు చార్‌పాయిలు ఇవ్వమని అడిగాడు. ఆ తరువాత ఎవరూ అతన్ని ఇబ్బంది పెట్టలేదు. “ తావూ తో డిఎస్‌పి సాహబ్ కా బహుత్ తగ్డా జాన్‌కార్ హై (పెదనాన్నకు డిఎస్‌పిలతో మంచి అవగాహన ఉంది) అని అందరూ అనుకున్నారు,” భగత్ నవ్వుతూ చెప్పారు.
అయితే, కళాకారుల గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, చార్‌పాయి లను హస్తకళగా జౌళి మంత్రిత్వ శాఖ గుర్తించలేదని ఆయనకు తెలిసింది. కార్డుపై ఉండే ఫోటో కోసం దరీ నేతకారుడిగా పోజివ్వమని రేవారీలోని స్థానిక అధికారులు ఆయనకు సూచించారు.
2019లో, అతను తనతో తీసుకువెళ్ళిన కార్డ్ అదే. మేళాలో అతని చార్‌పాయి లను అందరూ మెచ్చుకున్నప్పటికీ, పోటీలో పాల్గొనటానికి గానీ, తన హస్తకళా నైపుణ్యానికి బహుమతిని గెలిచే అర్హత గానీ ఆయన పొందలేకపోయారు. “నా కళాకృతిని ప్రదర్శించి, నేనూ బహుమతిని గెలవాలనుకున్నాను. అందుకే బాధపడ్డాను,” అన్నారు భగత్ రామ్.
*****
ఒక ప్రత్యేకమైన ఆర్డర్‌ను మాత్రం ఆయన ఎన్నటికీ మరచిపోలేరు. అది 2021లో ఏడాది పొడవునా జరిగిన రైతుల నిరసనల కోసం ఆయన తయారుచేసిన 12x6.5 అడుగుల చార్‌పాయి . (PARI పూర్తి కవరేజీని ఇక్కడ చదవండి). కిసాన్ ఆందోళన్ (రైతుల నిరసన) గురించి చార్‌పాయి పై అల్లికపని చేయాలని భగత్‌ను కోరారు.
ఆయన చేసిన 500 కిలోల బరువున్న అతిపెద్ద చార్‌పాయి కి రూ.1,50,000 ధర పలికింది. “నా గదిలో చోటు సరిపోకపోవడంతో, దానిని ఆరుబయట ఆవరణలో ఉంచి, అక్కడే పని చేయాల్సివచ్చింది,” భగత్ గుర్తు చేసుకున్నారు. తస్వీర్ సింగ్ అహ్లావత్ ఆర్డర్ చేసిన ఆ మంచం, అహ్లావత్ బృందంతో పాటు భగత్ గ్రామం నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరియాణాలోని డీఘల్ టోల్ ప్లాజా వరకు ప్రయాణించింది.
దిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకలోని వినియోగదారులకు కూడా ఆయన కళా నైపుణ్యం పరిచయమైంది.
“ఇదొక షౌక్ (లాలస), అందరికీ ఉండదు,” హరియాణాలోని పశువుల పెంపకందారుడైన ఒక రైతు రూ.35,000కి ఒక చార్‌పాయి ని కొన్న సంఘటనను నెమరువేసుకుంటూ భగత్ రామ్ అన్నారు. “అతను కేవలం పశువుల పెంపకందారుడని తెలుసుకున్న తరువాత నేను అతని డబ్బును అతనికి తిరిగి ఇవ్వజూపాను. అయితే, లక్ష రూపాయలు ఖరీదు చేసినా కూడా తాను దానిని కొనుగోలుచేసేవాడినని చెప్పి అతను ఆ డబ్బును తీసుకోలేదు.”
ఇదిలా ఉండగా, 2019లో రెండవసారి వెళ్ళిన తరువాత, ఆ వార్షిక హస్తకళల ఉత్సవానికి భగత్ రామ్ హాజరు కావడంలేదు. దాని నుండి ఏమంత ఆదాయం రాకపోవటంతో ఆయన వెళ్ళటం మానేశారు. ఇంటి దగ్గరే తగినంత పని అందుబాటులో ఉంది; పైగా కొత్త కొత్త ఆర్డర్లతో ఆయన ఫోన్ నిరంతరం మోగుతూనే ఉంటుంది. “ చార్‌పాయి , లేదా పిడ్డా కావాలని ఎప్పుడూ ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు,” అన్నారాయన గర్వంగా.
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి