2023 మాకు తీరికలేని సంవత్సరం.
భారత దేశం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు ప్రతి రోజూ ప్రకృతి ప్రకోప సంఘటనలను ఎదుర్కొంది. లోక్‌సభ, రాష్ట్రాల విధానసభలలోకి ఎక్కువ మంది మహిళలను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ను లోక్‌సభ ఆమోదించింది. కానీ ఈ బిల్లు 2029లో మాత్రమే అమలుకానుంది! ఇదిలా ఉండగా, 2022లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 445,256గా దేశీయ నేర నమోదుల బ్యూరో విడుదల చేసిన డేటా చూపించింది. ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్ట్ బెంచ్ స్వలింగ వివాహాల కు చట్టపరమైన గుర్తింపునివ్వడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ, లింగ మూస పద్ధతులను ఎదుర్కోవడం పై సుప్రీంకోర్టు ఒక కరదీపిక (హ్యాండ్‌బుక్)ను ఆగస్టులో విడుదల చేసింది. అందులో కొన్ని 'మూసపద్ధతుల ప్రమోటింగ్' నిబంధనలకు ప్రత్యామ్నాయాలను సూచించింది. తొమ్మిది రాష్ట్రాలు తమ రాష్ట్ర విధానసభలకు ఎన్నికలు నిర్వహించాయి. మతపరమైన, కులాలవారీగా చెలరేగిన మంటలు వార్తల వలయంలో ఆధిపత్యం చెలాయించాయి. మార్చి 2022 నుండి జూలై 2023 మధ్య, భారతదేశంలో కోట్లకు పడగలెత్తినవారి సంఖ్య 166 నుండి 174కి పెరిగింది. 15-29 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులలో సగటు నిరుద్యోగం రేటు ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 17.3 శాతంగా ఉంది.
*****
ఏడాది పొడవునా దేశమంతా ఎన్నెన్నో జరుగుతున్నందున, సంబంధిత నివేదికలను క్రోడీకరించడానికి, వాటిని భద్రపరచడానికి గ్రంథాలయం పనిచేసింది.
వీటిలో చట్టాలు, న్యాయాలు, పుస్తకాలు, ఒడంబడికలు, శాసనపత్రాలు, వ్యాసాలు, సంకలనాల నుండి పారిభాషిక పదకోశాల వరకూ, ప్రభుత్వ నివేదికలు, కరపత్రాలు, సర్వేలు, కథనాలు - మా స్వంత కథనాలలో ఒకదాని కామిక్ పుస్తక అనుసరణ కూడా - ఉన్నాయి!
ఈ సంవత్సరం మా కొత్త ప్రాజెక్ట్‌లలో గ్రంథాలయ బులెటిన్ ఒకటి - నిర్దిష్ట సమస్యలపై PARI కథనాలనూ వనరులనూ గురించిన సారాంశం. ఈ సంవత్సరం వీటిలో నాలుగింటిని - మహిళల ఆరోగ్యం , కరోనా ప్రభావిత కార్మికులు , దేశంలో క్వీర్ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, గ్రామీణ భారతదేశంలోని విద్యా స్థితిపై - ప్రచురించాము.
మా గ్రంథాలయంలోని కొన్ని నివేదికలు వాతావరణ మార్పులతో పోరాడే బాధ్యత అసమానంగా పంపిణీ అయిందని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది మొత్తం విడుదలయ్యే కార్బన్ ఉద్గారాల లో దాదాపు సగానికి పైగా ఎలా దోహదపడుతున్నారో, ఆ విధంగా భూతాపాన్ని నియంత్రించడానికి అవసరమైన పరిమితులను వారెలా అతిక్రమిస్తున్నారో ఈ నివేదికలు తెలియజేస్తాయి. విపత్కరమైన వాతావరణ తీవ్రతలను నివారించడానికి పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.5° లోపుకు సగటు ప్రపంచ ఉష్ణోగ్రతను పరిమితం చేయాలనే 2015 పారిస్ ఒప్పందం చాలా బలమైన నిబద్ధతతో ఉన్నప్పటికీ ఇది జరిగింది. మనం దారి తప్పామని ఈ విధంగా స్పష్టమవుతోంది.
అదేవిధంగా 2000 నుండి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు 40 శాతం పెరిగాయి . దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది నివసించే ఇండో-గంగా మైదానాలు ఇప్పుడు భారతదేశంలో అత్యంత కలుషితమైన ప్రాంతాలు గా మారాయి. ప్రపంచంలోని అన్ని పెద్ద నగరాలతో పోలిస్తే, దిల్లీలోని గాలి అత్యంత కలుషితమైనదిగా గుర్తింపుపొందింది. భారతదేశం మొత్తం వాతావరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఝార్ఖండ్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి హానికి లోనయ్యేవి గా ఉన్నాయని మా డెస్క్‌కు చేరుకున్న అనేక నివేదికలు సూచిస్తున్నాయి.
వాతావరణ సంబంధిత ప్రమాదాల కారణంగా 2020లో దేశంలోని దాదాపు 2 కోట్ల మంది ప్రజలు వలస వెళ్ళవలసి వచ్చింది. దేశంలోని 90 శాతం శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నందున, సమర్థవంతమైన సామాజిక భద్రతా విధానాల అవసరం చాలా ఉందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక పేర్కొంది.
అసంఘటిత రంగంలో ఉపాధి, వలసల సమస్యలు అనివార్యంగా తమ కుటుంబాలతో పాటు వలస వెళ్ళే పిల్లల విద్యతో ముడిపడి ఉంటాయి. దిల్లీ ఎన్‌సిఆర్, భోపాల్‌లలోని వలస కుటుంబాల పై జరిపిన అధ్యయనంలో వలస కుటుంబాలకు చెందిన 40 శాతం మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళటంలేదని తేలింది.
నిరుద్యోగిత రేటు, అలాగే శ్రామిక శక్తి పంపిణీ నిష్పత్తులను గురించి, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో కార్మికుల భాగస్వామ్యం గురించి నియమితకాల శ్రామిక శక్తి సర్వే వెలువరించిన త్రైమాసిక బులెటిన్‌లు విలువైన సమాచారం అందించడాన్ని కొనసాగించాయి.
మారుతున్న మీడియా తీరు ఈ సంవత్సరం కలవరం కలిగించే అంశంగా మారింది. భారతీయులలో మూడింట ఒక వంతు మంది ప్రతిరోజూ టెలివిజన్ చూస్తున్నారని, అయితే కేవలం 14 శాతం మంది మాత్రమే ప్రతిరోజూ వార్తాపత్రికలను చదువుతున్నారని ఒక పరిమిత సర్వే లో తేలింది. మరో నివేదిక ప్రకారం 72 కోట్ల 90 లక్షలమంది భారతీయులు చురుకైన ఇంటర్నెట్ వినియోగదారులుగా ఉన్నారు. ఆన్‌లైన్‌లో స్థానిక వార్తలను చదివేవారిలో 70 శాతం మంది తమ మాతృభాషలోనే చదువుతున్నారు.
విభిన్న లింగ గుర్తింపు ఉన్న వ్యక్తులు తమ హక్కులను పొందటం వంటి కథనాలు న్యాయమైన చట్టపరమైన వ్యవస్థను ప్రోత్సహించే సంభాషణను బలపరిచాయి. ఈ సంవత్సరంలో ప్రచురించిన పారిభాషిక పదకోశాలు , కరదీపికలు విభిన్న లింగ గుర్తింపుల గురించి మరింత సమగ్రమైన భాషను ఎలా ఉపయోగించాలో చూపించాయి.
సంక్లిష్టమైన శాస్త్రీయ పరిభాషకు, సాధారణ ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం ద్వారా, వాతావరణం గురించి మరింత సరళంగా మాట్లాడడంలో వాతావరణ నిఘంటువు (క్లైమేట్ డిక్షనరీ) మాకు సహాయపడింది. ప్రపంచంలోని భాషా వైవిధ్యం ఎలా కుంచించుకుపోతోందో చూపించే ఈ పటం , నేడు భారతదేశంలో క్షీణిస్తున్న దాదాపు 300 భాషల గురించి నమోదుచేసింది.
ఇప్పుడు PARI గ్రంథాలయంలో 'భాష' దాని స్వంత స్థానాన్ని పొందింది! ఇక్కడ డజన్ల కొద్దీ ఉన్న నివేదికలలో మొదటి చరిత్ర పాఠాలు ఉన్నాయి. ఇది బంగ్లా భాష, దాని మాండలికాలు, వాటి చరిత్రలో వచ్చిన మార్పులను గుర్తించడం ద్వారా భాషకూ అధికారానికీ మధ్య ఉన్న సమీకరణాలను మన ముందుకు తెచ్చింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలకు కూడా గ్రంథాలయం చోటివ్వడం ప్రారంభించింది. ఇప్పటికే ఒక నివేదిక ఉండగా, మరిన్ని వచ్చే ఏడాది రానున్నాయి.
2023 సంవత్సరం ఎంత తీరిక లేకుండా గడిచిందో 2024 సంవత్సరం కూడా మరింత తీరికలేకుండా గడవనుంది. కొత్తవాటిని తెలుసుకోవడానికి గ్రంథాలయాన్ని సందర్శిస్తూవుండండి!
PARI గ్రంథాలయంతో కలిసి స్వచ్ఛందంగా పనిచేయడానికి [email protected] కు రాయండి
మేం చేసే పని మీకు ఆసక్తి కలిగిస్తే, మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి [email protected]కు మాకు రాయండి. మాతో కలిసి పనిచేయడానికి ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర రచయితలు, రిపోర్టర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్ర నిర్మాతలు, అనువాదకులు, సంపాదకులు, ఇలస్ట్రేటర్‌లు, పరిశోధకులను మేం స్వాగతిస్తున్నాం.
PARI లాభాపేక్ష లేనిది. మా బహుభాషా ఆన్‌లైన్ జర్నల్‌ను, ఆర్కైవ్‌ను అభిమానించే వ్యక్తుల నుండి వచ్చే విరాళాలపై మేం ఆధారపడతాం. మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి DONATE పై క్లిక్ చేయండి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి