పొలం గట్టుపై నిల్చుని, కుండపోత వర్షం తర్వాత మోకాళ్ల లోతు నీళ్లలో మునిగివున్న తన వెండితెలుపు పంటను చూస్తూ ఉన్నాడతను. విదర్భలోని విజయ్ మరోత్తర్ పొలంలోని పత్తి పంట ధ్వంసమైంది. “నేను దాదాపు రూ.1.25 లక్షలు ఈ పంటపై పెట్టుబడి పెట్టాను. నా పంట దాదాపు పూర్తిగా నాశనమైంది.” అని ఆ 25 ఏళ్ల యువకుడు చెప్పాడు. అది సెప్టెంబర్ 2022, విజయ్‌కిది మొదటి పంట కాలం. ఈసారి, తన సమస్యలను పంచుకోవడానికి అతనికి ఎవరూ లేరు.
అతని తండ్రి, ఘనశ్యామ్ మరోత్తర్ ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించారు, అతని తల్లి రెండేళ్ల క్రితం గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయింది. విదర్భ ప్రాంతంలోని అనేకమంది రైతుల మాదిరిగానే, అస్థిర వాతావరణం వల్ల జరిగిన పంటనష్టం, పెరుగుతున్న అప్పులు అతని తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళన, ఒత్తిడిలోకి నెట్టాయి. వారికి అందిన సాయం కూడా చాలా తక్కువ.
కానీ తన తండ్రిలా కుప్పకూలిపోవటం వల్ల ఏ ఉపయోగం లేదని విజయ్‌కి తెలుసు. అందుకే రెండు నెలల పాటు తన పొలంలో ఉన్న నీటిని ఎత్తిపోసే పనిలో నిమగ్నమయ్యాడు. ప్రతిరోజూ రెండు గంటలపాటు, చేతిలో బకెట్ తప్ప మరేమీ లేకుండా, ట్రాక్ ప్యాంటును మోకాళ్ల వరకు మడుచుకొని, బురదగా ఉన్న తన పొలంలో చెప్పులు లేకుండా పనిచేశాడు. అతని టీ-షర్టు చెమటతో తడిసిపోయింది, ఒళ్లు హూనమైంది. మొత్తం నీటిని అతను తన చేతులతోనే తోడాడు. “నా వ్యవసాయ భూమి ఒక వాలులో ఉంది. అందుకే, అధిక వర్షాల వల్ల నాకు ఎక్కువగా నష్టం జరిగింది. చుట్టుపక్కల పొలాలలోని నీరంతా నా పొలంలోకే వస్తుంది. దీన్ని నివారించడం కష్టం." అన్నాడు విజయ్. ఈ అనుభవం అతన్ని భయపెట్టింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం, సుదీర్ఘంగా కొనసాగిన పొడి వాతావరణం, వడగళ్ల వానలూ వంటివి అపారమైన వ్యవసాయ సంక్షోభానికి కారణమై, రైతుల మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీశాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సాయం చాలా తక్కువ.(చదవండి: విదర్భ: మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వ్యవసాయ సంక్షోభం ). మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్, 2017 ప్రకారం మానసిక ఒత్తిడి, రుగ్మత ఉన్న వ్యక్తుల కోసం అందుబాటులో ఉన్న సేవలు, వాటిని పొందే విధానం గురించి విజయ్‌కి గానీ, అతని తండ్రి ఘనశ్యామ్కు బ్రతికి ఉన్నప్పుడు గానీ తెలీదు, అందలేదు కూడా. అలాగే 1996 జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద నిర్వహించిన ఔట్రీచ్ క్యాంపుల గురించి కూడా వారికి తెలియదు.
నవంబర్ 2014లో, మానసిక సమ్యలు, అందుతున్న చికిత్సకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం 'ప్రేరణా ప్రకల్ప్ ఫార్మర్ కౌన్సెలింగ్ హెల్త్ సర్వీస్ ప్రోగ్రామ్'తో ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టరేట్ ద్వారా యవత్మాల్కు చెందిన స్వచ్ఛంద సంస్థ - ఇందిరాబాయి సీతారామ్ దేశ్‌ముఖ్ బహుద్దేశీయ సంస్థతో కలిసి అందరికి అందుబాటులోకి మానసిక చికిత్సను తేవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రభుత్వ-ప్రైవేట్ (పౌర సమాజం) భాగస్వామ్య పద్దతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పనిచేస్తుంది. కానీ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్న ఈ ప్రేరణ ప్రాజెక్ట్, 2022లో విజయ్ తన తండ్రిని కోల్పోయే సమయానికి పూర్తిగా విఫలమైంది.
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న సుప్రసిద్ద మానసిక వైద్యుడు ప్రశాంత్ చక్కర్వార్ ఏమంటారంటే, “మేం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బహుముఖ వ్యూహాన్ని అందించాం. మేం దీన్ని ఎదుర్కొనే విధానాలపై దృష్టి సారించాం. కేసుల తీవ్రతను గుర్తించి, వాటిని జిల్లా కమిటీకి నివేదించి, శిక్షణ పొందిన మానసిక విద్యా కార్యకర్తలు, సమాజంతో దగ్గరగా పనిచేసే ఆశాలను ఈ కార్యక్రమంలో చేర్చుకున్నాం. మా చికిత్సా విధానంలో మందులివ్వడం, కౌన్సెలింగ్ కూడా ఉన్నాయి.“
ఈ ప్రణాళిక 2016లో యవత్మాల్లో సానుకూల ఫలితాలను చూపించింది. ఇక్కడ ఇతర సంక్షోభ ప్రాంతాలతో పోల్చితే ఆత్మహత్య కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2016 మొదటి మూడు నెలల్లో జిల్లాలో ఆత్మహత్యల సంఖ్య, అంతకు ముందరి ఏడాది ఇదే సమయంలో ఉన్న 96 నుండి 48కి తగ్గినట్లు రాష్ట్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇతర ప్రభావిత జిల్లాలలో, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, లేదంటే అంతే సంఖ్యలో జరిగాయి. యవత్మాల్ సాధించిన విజయం అదే సంవత్సరం 13 ఇతర ప్రభావిత జిల్లాల్లో ప్రేరణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి దారితీసింది.
కానీ ఈ ప్రాజెక్ట్, దాని విజయాలు ఎక్కువ కాలం నిలవలేదు, అతి త్వరలోనే దాని విజయం మసకబారటం మొదలైంది.
"ఈ ప్రాజెక్టుకు మంచి ఆరంభం ఎందుకు లభించిందంటే పౌర సమాజానికి ప్రభుత్వ యంత్రాంగపు మద్దతు దొరికింది," అని చక్కర్వార్ చెప్పారు. "ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభమైంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే కొద్దీ పరిపాలన, సమన్వయ సమస్యలు పెద్దవికావడం మొదలయ్యాయి. చివరికి పౌర సమాజ సంస్థలు తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో ప్రాజెక్ట్ ప్రేరణ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కార్యక్రమంగా మారి, సమర్థవంతంగా అమలు కాలేదు.”
మానసిక వత్తిడి, అందోళనతో బాధపడుతున్నవారిని గుర్తించి, వారి సమాచారాన్ని అందించే పనిని ఆశాలకు అప్పగించారు. ఈ అదనపు పని చేసినందుకు వారికి అదనంగా పరిహారం, ఇతర ప్రయోజనాలు అందిస్తామని వాగ్దానం చేశారు. అయితే ప్రభుత్వం ఈ అదనపు ప్రయోజనాలను చెల్లించడం ఆలస్యం చేస్తుండటంతో ఆశాలు ఈ పనిచేయడంలో ఆసక్తిని కోల్పోయారు. "దీంతో వాళ్లు నిజమైన క్షేత్ర పరిశీలన చేయడానికి బదులు అబద్దపు కేసులను నివేదించేవాళ్లు." అని చక్కర్వార్ తెలిపారు.
2022లో ఘనశ్యామ్ మరోత్తర్ ఆత్మహత్య చేసుకుని మరణించే సమయానికి, ప్రేరణ ప్రాజెక్ట్ విఫలమైన ప్రభుత్వ ప్రాజెక్ట్‌గా మారింది - మానసిక వైద్యనిపుణులు, స్థానిక వాలంటీర్లు, శిక్షణ పొందిన ఆశాల కొరత పెరిగిపోయింది. మళ్ళీ యవత్మాల్లో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం పెరిగింది. ఆ సంవత్సరంలో జరిగిన 355 మంది రైతుల ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ.
మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వ అసమర్థత కారణంగా ఒకటి కంటే ఎక్కువ లాభాపేక్షలేని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. టాటా ట్రస్ట్, యవత్మాల్, ఘాటంజీ తాలూకా లలోని 64 గ్రామాలలో విదర్భ సైకలాజికల్ సపోర్ట్ అండ్ కేర్ ప్రోగ్రామ్ అనే పైలట్ ప్రాజెక్ట్‌ను మార్చి 2016 నుండి జూన్ 2019 మధ్య నిర్వహించింది."మా చొరవ వల్ల ప్రజలలో సహాయం కోరే మనస్తత్వం పెరిగింది" అని ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన ప్రఫుల్ కాప్సే చెప్పారు. "ఎక్కువమంది రైతులు తమ సమస్యలతో ముందుకు రావడం ప్రారంభించారు, అయితే గతంలో వారు మానసిక ఆరోగ్య రుగ్మతలను నయం చేసుకునేందుకు తాంత్రికుల వద్దకు వెళ్లేవారు."
2018 నాటి ఖరీఫ్ పంటకాలంలో, టాటా ట్రస్ట్‌తో కలిసి పనిచేస్తున్న ఒక సైకాలజిస్ట్, శంకర్ పాతంగవార్ను సంప్రదించారు. ఘాటంజీ తాలూకా లోని హాత్గావ్ గ్రామంలో మూడెకరాల భూమి ఉన్న ఈ 64 ఏళ్ల రైతు ఆత్మహత్య ఆలోచనలతో మానసిక వేదనకు గురయ్యారు. "నేను ఒక నెల పాటు నా వ్యవసాయ భూమిని చూడలేదు," అంటూ అతను గుర్తుచేసుకున్నారు. “నేను నా గుడిసెలో నిద్రపోతూ రోజులు గడిపేసేవాడిని. నేను నా జీవితమంతా రైతుగానే బ్రతికాను. నా భూమిని చూడకుండా ఇంత కాలం ఉండగలని నేనసలు అనుకోనేలేదు. మనం మన సర్వస్వాన్నంతటినీ ధారపోసి మన పొలంలో పనిచేసినప్పుడు ప్రతిఫలంగా ఏమీ దక్కకపోతే నిరాశపడకుండా ఎలా ఉంటాం?”
శంకర్ వరుసగా రెండు, మూడు పంటకాలాలు తన పొలంలో పత్తి, తూర్ (కంది) సాగుచేసి తీవ్ర నష్టాలను చవిచూశారు. దాంతో, 2018 మేలో మరోసారి రాబోయే పంటకాలానికి సిద్దం అవ్వాల్సి వచ్చినప్పుడు అది ఆయనకు భారంగా తోచింది, ఏ ప్రయోజనమూ కనిపించలేదు. “ఆశను కోల్పోకూడదని నాకు నేను చెప్పుకున్నాను. నేను కూలిపోతే, నా కుటుంబం కూడా కూలిపోతుంది," అని శంకర్ చెప్పారు.
వాతావరణ పరిస్థితులు వ్యవసాయాన్ని మరీ అస్థిరంగా మార్చివేయడంతో, శంకర్ భార్య అనసూయ (60) రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె రేణుక (22) వివాహిత కాగా, వారి 20 ఏళ్ల కుమారుడికి మానసిక వైకల్యం ఉంది. వీరందరి గురించి ఆలోచించిన శంకర్, 2018 ఖరీఫ్ పంటకాలం సమీపించేసరికి తన అంతర్గత శత్రువులతో పోరాడాలని నిర్ణయించుకున్నారు.
మనస్తత్వవేత్త శంకర్‌ను కలిసింది ఇటువంటి సమయంలోనే. "వాళ్ళు వచ్చి మూడు-నాలుగు గంటలు నాతో కూర్చునేవారు," అని అతను గుర్తుచేసుకున్నారు. "నా కష్టాలన్నీ వారితో పంచుకున్నాను. వారితో మాట్లాడి నా కష్ట సమయం నుంచి బయటపడ్డాను." తర్వాత కొన్ని నెలల పాటు సాగిన సాధారణ సమావేశాలు ఆయనకు అత్యంత అవసరమైన ఉపశమనాన్ని అందించాయి. “నేను వారితో స్వేచ్చగా మాట్లాడగలను. ఎలాంటి సంకోచం లేకుండా ఎవరితోనైనా మాట్లాడటం చాలా ఉపశాంతినిస్తుంది," అని ఆయన వివరించారు. "ఈ విషయాలను నేను నా కుటుంబంతో కానీ, స్నేహితులతో కానీ పంచుకుంటే వాళ్లు కూడా వత్తిడికి లోనైతారు. నేనెందుకు వాళ్లను ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి?" అన్నారు శంకర్. మాటమాత్రమైనా వివరణ లేకుండా హఠాత్తుగా ఆగిపోయే ముందు వరకూ, ప్రతి రెండు నెలలకొకసారి జరిగే ఈ సమావేశాలవల్ల శంకర్ తన సాధారణ దినచర్యలోకి జారిపోయారు. ఆ సమావేశాలు ఇలా ఆగిపోవడానికి "పాలనాపరమైన కారణాలు" ఉన్నాయని ఈ ప్రాజెక్ట్ హెడ్ కాప్సే చెప్పారు.
వారి చివరి సమావేశం నాటివరకూ శంకర్‌కు గానీ, ఆ మనస్తత్వవేత్తలకు గానీ అదే వారి చివరి సమావేశమనీ, ఇక ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవచ్చుననీ తెలీదు. ఆ సమావేశాలు లేకపోవడం వల్ల శంకర్ చాలా కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. అప్పటి నుండీ చాలా ఒత్తిడిలో ఉన్న ఆయన, ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి నుండి నెలకు నూటికి రూ.5, లేదా సంవత్సరానికి 60 శాతం వడ్డీకి రూ 50,000 అప్పుచేశారు. మాట్లాడటానికి ఎవరైనా ఉంటే బాగుండునని ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడాయన వద్ద మిగిలివున్న ఏకైక అవకాశం- 2014లో ప్రభుత్వం మానసిక ఆరోగ్య సమస్యల కోసం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 104కు కాల్ చేయడం. కానీ ఇప్పుడు అది కూడా ఇప్పటికే ఉన్న ఇతర వాటిలాగానే పనిచేయడంలేదు.
సెప్టెంబరు 2022లో, ప్రాంతీయ దినపత్రిక దివ్య మరాఠీ విలేఖరి ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న రైతుగా నటిస్తూ 104కి కాల్ చేసినప్పుడు, కౌన్సిలర్ మరొక రోగితో మాట్లాడుతున్నారని చెప్పారు. కాల్ చేసిన వ్యక్తి పేరు, తాలూకా, జిల్లా వంటి వివరాలు తీసుకుని మరో అరగంట తర్వాత కాల్ చేయమని కోరారు. "కొన్నిసార్లు సహాయం కోరే వ్యక్తి, అవతలి వైపు నుంచి ప్రతిస్పందన విన్న తర్వాత ప్రశాంతంగా మారిన సందర్భాలు ఉన్నాయి," అని కాప్సే వ్యాఖ్యానించారు. “కానీ సహాయం కోరే వ్యక్తి తీవ్రమైన బాధలో ఉండి, ఆత్మహత్య చేసుకుంటాడని కౌన్సెలర్ భావించినట్లయితే, సహాయం కోసం 108 అబులెన్స్‌కు కాల్ చేసేలా ఆ వ్యక్తిని ఒప్పించడం ముఖ్యం. అలాంటి కేసులను నిర్వహించే సామర్థ్యం ఉండేలా కౌన్సెలర్లకు శిక్షణ ఇవ్వాలి,” అని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, హెల్ప్‌లైన్‌కు 2015-16లో మహారాష్ట్ర నలుమూలల నుండి అత్యధికంగా 13,437 కాల్స్ వచ్చాయి. తర్వాతి నాలుగు సంవత్సరాలలో కాల్స్ సగటు ఏడాదికి 9,200గా ఉంది. అయితే, 2020-21లో కోవిడ్-19 విజృంభించి, మానసిక ఆరోగ్య సంక్షోభం గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఆశ్చర్యకరంగా వచ్చిన కాల్స్ సంఖ్య 61శాతం (సంవత్సరానికి 3,575 కాల్స్) తగ్గింది. మరుసటి సంవత్సరం, ఇది మరింత క్షీణించింది (1,963 కాల్స్). గత నాలుగు సంవత్సరాల సగటుతో పోలిస్తే 78 శాతం తగ్గుదల నమోదైంది.
మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభం అత్యధికంగా ఉంది. మహారాష్ట్ర అంతటా రైతుల ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022 జూలై నుండి 2023 జనవరి మధ్యకాలంలో 1,023 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జూలై 2022కి ముందు రెండున్నరేళ్ల కాలంలో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 1,660 మంది కంటే ఇది చాలా ఎక్కువ.
అక్టోబర్ 30, 2022న, 104ను నెమ్మదిగా తప్పించడానికి కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 14416ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పడే కొత్త హెల్ప్‌లైన్ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. ఏదేమైనా సంక్షోభం మాత్రం కొనసాగుతూనే ఉంది.
సెప్టెంబరు 2022 నాటి అధిక వర్షపాతం శంకర్ పంటను పూర్తిగా తుడిచిపెట్టేసింది. అతనింకా లక్షరూపాయల అప్పు తీర్చాల్సి ఉంది. కూలీగా పనిచేయటం మొదలుపెట్టాలని, తన భార్య సంపాదనకు తనకు వచ్చేదాన్ని కూడా కలిపితే, రాబోయే 2023 ఖరీఫ్ పంటకాలానికి కావాల్సిన పెట్టుబడి సమకూరుతుందని ఆయన ప్రణాళిక వేసుకుంటున్నారు..
అక్పురికి మళ్లీ వస్తే, విజయ్ ఇప్పటికే వ్యవసాయం నించి నిష్క్రమించే ప్రణాళికను రూపొందించుకున్నాడు. అతను పత్తి పంటను వేయడాన్ని దశలవారీగా మానేసి, దాని స్థానంలో చిన్నపాటి వాతావరణ మార్పులను తట్టుకోగలిగే సోయాబీన్, శనగ వంటి మరింత సౌకర్యవంతమైన పంటలను వేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎంఎ చదువుకుంటూనే, నెలకు రూ. 10,000 జీతానికి ఒక హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. విజయ్ అధ్యయనం చేయకుండా, పనిచేయకుండా ఉన్న సమయాలలో చదువుకోవటం, టివి చూడటం, వంట చేయడంలో సమయాన్ని గడుపుతాడు.
వ్యవసాయ భూమిని, ఇంటిని స్వయంగా నిర్వహించాల్సి రావడంతో తనకున్న పాతికేళ్ళ వయసు కంటే ఎక్కువ పరిణతిని విజయ్ సాధించాడు. తాను ఎదుర్కోవడానికి సిద్దంగా లేని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో విజయ్, తన మనసుని అలా వదిలేయకుండా తన అదుపులో ఉంచుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు.
"నేను కేవలం డబ్బు కోసం మాత్రమే ఉద్యోగం చేయటం లేదు. అది నా మనసును ఎదో ఒక పనిమీద నిమగ్నమయ్యేలా చేస్తుంది. నేను కష్టపడి చదివి స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటున్నాను, అలా చేస్తేనే నేను వ్యవసాయాన్ని వదిలేయగలను. నాన్న చేసిన పని నేను చేయను. కానీ ఎల్లకాలం ఇలా ఒక అనూహ్యమైన వాతావరణంలో నేను జీవించలేను," అన్నాడు విజయ్.
ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి అందే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా పార్థ్ ఎం . ఎన్ . ప్రజారోగ్యం , పౌర హక్కులపై నివేదిస్తున్నారు . ఈ నివేదికలోని అంశాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ కు ఎలాంటి సంపాదకీయ నియంత్రణా లేదు . .
మీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినా, లేదా ఎవరైనా అటువంటి మానసిక వేదనలో ఉన్నారని తెలిసినా, దయచేసి కిరణ్ అనే జాతీయ హెల్ప్‌లైన్ 1800-599-0019కి (24/7 టోల్ ఫ్రీ), లేదా మీకు సమీపంలో ఉన్న హెల్ప్లైన్లలో దేనికైనా కాల్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల, సేవల గురించిన సమాచారం కోసం, దయచేసి ఎస్పిఐఎఫ్ (SPIF) మానసిక ఆరోగ్య డైరెక్టరీ ని సందర్శించండి.
అనువాదం: పి. పావని