'అంబేద్కర్ లేకుండా
తాము చట్టాలనూ రాజ్యాంగాన్నీ రచించలేమని గాంధీ నెహ్రూలు గ్రహించారు. అంబేద్కర్ ఒక్కరే
అందుకు సమర్థుడైన వ్యక్తి. ఆ పాత్ర కోసం ఆయన ఎవరినీ అడుక్కోలేదు.'
శోభారామ్ గెహెర్‌వార్,
జాదూగర్ బస్తీ (మెజీషియన్ కాలనీ), అజ్మేర్, రాజస్థాన్
'మేము బాంబులు తయారుచేస్తోన్న ప్రదేశాన్ని ఆంగ్లేయులు చుట్టుముట్టారు. ఇది అజ్మేర్ సమీపంలోని ఒక అడవిలో ఉన్న కొండపై జరిగింది. అక్కడికి దగ్గరలోనే ఒక పులి నీరు తాగడానికి వచ్చే నీటి తావు ఉంది. ఆ పులి వస్తూ పోతూ ఉండేది. మేం కొన్నిసార్లు పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరుపుతామనే వాస్తవం నుండి, ఆ పులి అక్కడికి వచ్చి నీరు తాగేసి వెళ్ళిపోవాలనే సంగతిని నేర్చుకుంది. లేకపోతే మేం గాలిలోకి కాకుండా సరాసరి తనపైకే కాల్పులు జరుపుతాం మరి.
'కానీ ఆ రోజు ఆ స్థావరాన్ని గురించి తెలుసుకున్న ఆంగ్లేయులు దానిని సమీపిస్తున్నారు. అవి ఆంగ్లేయులు పరిపాలిస్తోన్న రోజులు మరి. దాంతో మేం కొన్ని పేలుడు పదార్థాలను పేల్చాం - నేను కాదు, నేను మరీ చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దవారైన నా స్నేహితులు - అదే సమయంలో నీళ్ళు తాగడానికి పులి వచ్చింది.
'ఆ పులి నీళ్ళు తాగలేదు, పారిపోలేదు. సరాసరి ఆంగ్లేయ పోలీసుల వెంటపడింది. వాళ్ళంతా పరుగులుతీయటం మొదలెట్టారు. వారి వెనకే ఎక్కడో పులి. కొందరు కొండ పైనుంచి, మరికొందరు రోడ్డుపైనా పడ్డారు. ఆ అల్లరిలో ఇద్దరు పోలీసులు చనిపోయారు. అక్కడికి తిరిగి వచ్చేంత ధైర్యం పోలీసులకు లేదు. వాళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డారు. వో తోభా కర్తే థే (వాళ్ళు పశ్చాత్తాపపడి ఉంటారు).’
పులి ఆ గందరగోళం నుంచి క్షేమంగా బయటపడింది. మరో రోజు నీరు తాగడానికి జీవించే ఉంది.
ఆయనే స్వాతంత్ర్య సమరయోధుడు శోభారామ్ గెహెర్‌వార్. 96 ఏళ్ళ వయసున్న ఆయన ఏప్రిల్ 14, 2022న అజ్మేర్‌లోని తమ ఇంటివద్ద మాతో మాట్లాడుతున్నారు. దాదాపు వందేళ్ళ క్రితం తాను పుట్టిన దళిత బస్తీలోనే ఆయన నివాసముంటున్నారు. రెండుసార్లు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన ఆయన అనుకుంటే సులభంగా చేయగలినప్పటికీ, మరింత సౌకర్యంగా ఉండే ఇంటికోసం ఈ ప్రదేశాన్ని ఎన్నడూ విడిచిపెట్టాలనుకోలేదు. ఆయన బ్రిటిష్ రాజ్‌తో 1930లు, 1940లలో తాను చేసిన పోరాటాల గురించి స్పష్టమైన చిత్రాన్ని మా కళ్ళముందుంచారు.
ఆయన మాట్లాడుతున్నది ఏదైనా బాంబులు తయారుచేసే రహస్య కర్మాగారం గురించా?
'అర్రే, అదొక అడవి. కర్మాగారం కాదు... ఫ్యాక్టరీ మే తో కెంచీ బన్తీ హైఁ (కర్మాగారాల్లో కత్తెరలు తయారుచేస్తారు). ఇక్కడ మేం (రహస్య ప్రతిఘటనోద్యమానికి చెందినవారు) బాంబులు తయారుచేస్తాం.'
'ఒకసారి చంద్రశేఖర్ ఆజాద్ మా దగ్గరకు వచ్చారు,' చెప్పారతను. అది బహుశా 1930 చివరి రోజులు గానీ, 1931 ప్రారంభ దినాలు గానీ అయుండొచ్చు. తేదీలు ఖచ్చితంగా తెలియదు. 'ఖచ్చితమైన తేదీల కోసం నన్ను అడగొద్దు,' అన్నారు శోభారామ్. 'ఒకప్పుడు నాదగ్గర అన్నీ ఉన్నాయి, నా మొత్తం పత్రాలు, మొత్తం నోట్స్, రికార్డులు, అన్నీ ఇదే ఇంట్లో ఉండేవి. 1975లో వచ్చిన వరదలో నేను వాటన్నిటినీ పోగొట్టుకున్నాను.'
భగత్ సింగ్‌తో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను 1928లో పునర్వ్యవస్థీకరించిన వారిలో చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఒకరు. ఫిబ్రవరి 27, 1931న అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌లో బ్రిటిష్ పోలీసులతో జరిగిన ఒక కాల్పుల సంఘటనలో ఆజాద్ తన ఆయుధంలో మిగిలివున్న చివరి తూటాతో తనని తాను కాల్చుకొని మరణించారు. ప్రాణాలతో ఎప్పటికీ శత్రువుకు పట్టుపడకూడదనీ, ఎప్పటికీ ఆజాద్‌గా, అంటే స్వేచ్ఛగా ఉండాలని తాను తీసుకున్న ప్రతిజ్ఞను గౌరవిస్తూ ఆయనలా చేశారు. మరణించే నాటికి ఆజాద్ వయసు 24 సంవత్సరాలు.
స్వతంత్రం వచ్చాక, ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చంద్రశేఖర్ ఆజాద్ పార్క్‌గా పేరుపెట్టారు.
98 ఏళ్ళ ఈ స్వాతంత్ర్య సమరయోధుడు తనను తాను గాంధీ, అంబేద్కర్‌ల అనుచరునిగా భావిస్తారు. 'నాకు అంగీకారం ఉన్న ఆదర్శాలనే నేను అనుసరిస్తాను,' అంటారాయన
'ఆజాద్ ఆ ప్రదేశానికి (బంబులు తయారు చేసే శిబిరం) వచ్చాడు,' మళ్ళీ అజ్మేర్‌లోకి (ప్రస్తుతానికి) వచ్చిన శోభారామ్ చెప్పారు. మరింత శక్తివంతంగా పనిచేసేలా బాంబులను ఎలా తయారుచేయాలో ఆయన మాకు సూచనలు ఇచ్చాడు. మేం చేసేదానికన్నా మెరుగైన సూత్రాన్ని అందించాడు. స్బాతంత్ర్య సమరయోధులు పనిచేస్తోన్న ఆ ప్రదేశానికి ఆయన తిలకం కూడా దిద్దాడు. ఆ తర్వాత, తాను పులిని చూడాలనుకొంటున్నానని ఆయన అన్నారు. ఆ రాత్రికి అక్కడే ఉంటే పులిని చూడవచ్చని మేమాయనకు చెప్పాం.
'అలాగే పులి వచ్చి వెళ్ళింది, మేం గాలిలోకి కాల్పులు జరిపాం. మేం కాల్పులు జరపడమెందుకని చంద్రశేఖర్‌జీ అడిగాడు. మేం తనకు హాని చేయగలమని గ్రహించిన పులి వెళ్ళిపోతుంది అని మేం చెప్పాం. అది పులి తన నీళ్ళు తాను తాగి వెళ్ళిపోవటానికీ, అదేవిధంగా పోరాటకారులు తమ భద్రతను కాపాడుకోవటానికీ చేసుకున్న ఒక ఏర్పాటు.
‘అయితే ఆ మరుసటి రోజు, బ్రిటిష్ పోలీసులు పులికంటే ముందుగా అక్కడికి చేరుకున్నారు. మొత్తం అల్లకల్లోలం, గందరగోళం అయింది.’
ఆ విచిత్రమైన యుద్ధం లేదా దానికి సంబంధించిన దొమ్మీలో తన వ్యక్తిగత పాత్ర ఏమీ లేదని శోభారామ్ పేర్కొన్నారు. అయినా వీటన్నింటికీ ఆయనే సాక్షిగా ఉన్నారు. ఆజాద్ వచ్చినప్పుడు తనకు ఐదేళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండదని అతను చెప్పారు. ‘అతను మారువేషంలో ఉన్నాడు. మా పని అతన్ని అడవిలోకి, కొండపైన బాంబులు తయారు చేస్తున్న ప్రదేశానికి తీసుకెళ్ళడం మాత్రమే. మాలో ఇద్దరు అబ్బాయిలం అతనిని, అతని సహచరుడినీ క్యాంపుకు తీసుకెళ్ళాం.
ఇది నిజానికి, ఒక తెలివైన ఏమార్చే ఆట. అమాయకంగా కనిపించే మామ తన మేనల్లుళ్ళతో కలిసి తిరుగుతున్నట్టు కనిపించే దృశ్యం.
‘ఆజాద్ వర్క్‌షాప్‌ని చూసి-అది ఫ్యాక్టరీ కాదు-మా వెన్ను తట్టాడు. మా పిల్లలతో ఇలా అన్నాడు: “ ఆప్ తో షేర్ కే బచ్చే హైఁ (మీరు సింహం పిల్లలు). మీరు ధైర్యవంతులు, చావుకు భయపడరు.” మా కుటుంబ సభ్యులు కూడా “నువ్వు చనిపోయినా ఫర్వాలేదు. మీరు ఏం చేసినా స్వాతంత్ర్యం కోసమే చేస్తున్నారు కదా,” అన్నారు.
*****
‘ఆ బుల్లెట్ నన్ను చంపలేదు, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చేలా కూడా చేయలేదు. అది నా కాలికి తగిలి బయటకు వెళ్ళిపోయింది. చూశారా?’ అంటూ అతను దెబ్బ తగిలిన ప్రదేశాన్ని మనకు చూపిస్తారు. అది అతని కుడి కాలు మీద, మోకాలికి కొంచెం దిగువన తగిలింది. అది అతని కాలులోనే ఉండిపోలేదు. కానీ అది చాలా బాధాకరమైన దెబ్బ. 'నేను స్పృహతప్పి పడిపోయాను, వారు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళారు,' అని అతను చెప్పారు.
ఇది 1942 ప్రాంతాల్లో - ఆయన ‘బాగా పెద్దయిన’ తర్వాత - అంటే ఆయనకు పదహారేళ్ళుండగా - ఒక ప్రత్యక్ష చర్యలో పాల్గొన్నప్పుడు జరిగింది. ఈరోజున, 96 ఏళ్ళ వయస్సులో కూడా శోభారామ్ గెహెర్‌వార్ చాలా మంచి శరీరాకృతి కలిగి ఉన్నారు - ఆరడుగులు దాటిన ఎత్తు, ఆరోగ్యంగా, ఇనుప కడ్డీలా నిటారుగా, చురుకుగా ఉన్నారు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లోని ఆయన ఇంట్లో ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు. తొమ్మిది దశాబ్దాలుగా సాగిన ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం, అతను తనకు తుపాకీ తూటా తగిలినప్పటి సంగతి గురించి మాట్లాడుతున్నారు.
‘ఒక సమావేశం జరిగింది, బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా ఎవరో “కొంచెం అదుపు తప్పి”మాట్లాడారు. దీంతో పోలీసులు కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎదురుదాడి చేసి పోలీసులను కొట్టడం ప్రారంభించారు. ఇది స్వతంత్రతా సేనాని భవన్ (స్వాతంత్ర్య సమరయోధుల కార్యాలయం)లో జరిగింది. సహజంగానే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మేం ఆ భవనానికి ఆ పేరు పెట్టాం. ఆ రోజుల్లో దానికి ప్రత్యేకంగా పేరంటూ ఏమీ లేదు.
‘అక్కడ జరిగే బహిరంగ సభల్లో స్వాతంత్ర్య సమరయోధులు క్విట్ ఇండియా ఉద్యమంపై ప్రతిరోజూ ప్రజలకు అవగాహన కల్పించేవారు. వారు ఆంగ్లేయుల పరిపాలనను బట్టబయలు చేశారు. అజ్మేర్ నలుమూలల నుండి ప్రజలు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకునేవారు. మేం ఎవరినీ పిలవవలసిన అవసరం లేదు- వాళ్ళే వచ్చేవారు. అక్కడే పరుషంగా ప్రసంగాలు చేయటంతో, పోలీసులు కాల్పులు జరిపారు.
‘ఆసుపత్రిలో నేను స్పృహలోకి వచ్చాక, పోలీసులు నన్ను పరామర్శించారు. వాళ్ళు తమ పని తాము చేశారు; ఏదో రాసుకున్నారు. కానీ వాళ్ళు నన్ను అరెస్టు చేయలేదు. వాళ్ళిలా అన్నారు: “అతనికి బుల్లెట్ తగిలింది. అతనికి ఆ శిక్ష సరిపోతుంది."
ఆ పోలీసులు తన మీద జాలిపడి అలా చేయలేదని అతను చెప్పారు. ఆయనపై పోలీసులు కేసు పెట్టి ఉంటే శోభారామ్‌పై బుల్లెట్ పేల్చినట్లు వాళ్ళు అంగీకరించాల్సి ఉంటుంది. స్వయంగా అతను ఎటువంటి ఆవేశపూరిత ప్రసంగం చేయలేదు, అలాగే ఎవరిపైనా హింసాత్మకంగా ప్రవర్తించలేదు కూడా.
'ఆంగ్లేయులు వారి మొహాన్ని కాపాడుకోవాలనుకున్నారు,' అని ఆయన చెప్పారు. 'నిజంగా మేం చనిపోయుంటే వాళ్ళకేం బాధ ఉండేదికాదు. కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మంది చనిపోయారు, అప్పుడే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కురుక్షేత్రంలో లాగ, సూర్య కుండం యోధుల రక్తంతో నిండిపోయింది. మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. మనకు అంత తేలికగా స్వాతంత్ర్యం లభించలేదు. దాని కోసం రక్తాన్ని చిందించాం. కురుక్షేత్రంలో చిందినదానికంటే ఎక్కువ రక్తం. ఉద్యమం ఒక్క అజ్మేర్‌లోనే కాదు, ప్రతిచోటా పోరాటం సాగింది. ముంబైలో, కలకత్తాలో (ప్రస్తుతం కొల్‌కతా)...
'ఆ బుల్లెట్ దెబ్బ తగిలిన తర్వాతే నేను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను,' చెప్పారతను. 'నేను పోరాటం నుంచి బతికి వస్తానో లేదో ఎవరికి తెలుసు? నన్ను నేను సేవ (సంఘ సేవ)కు అర్పించుకొని కుటుంబాన్ని నడపలేను.' శోభారామ్ తన చెల్లెలు శాంతితోనూ, ఆమె పిల్లలు, మనవ సంతానంతోనూ కలిసి ఉంటున్నారు. 75 ఏళ్ళ శాంతి ఆయన కంటే 21 ఏళ్ళు చిన్నవారు.
‘మీకో విషయం చెప్పనా?’ శాంతి మమ్మల్ని అడిగారు. ఆమె ప్రశాంతంగానూ, పూర్తి భరోసాతోనూ మాట్లాడుతున్నారు. ‘నా వల్లే ఈ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. నేను, నా పిల్లలే అతని జీవితమంతా అతన్ని చూసుకున్నాం. నాకు 20 సంవత్సరాల వయస్సులో పెళ్ళయింది, కొన్నేళ్ళకు నా భర్తను కోల్పోయాను. చనిపోయేటప్పటికి నా భర్త వయసు 45 ఏళ్ళు. శోభారామ్‌ను ఎప్పుడూ చూసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు నా మనుమలు, వారి భార్యలు కూడా అతన్ని చక్కగా చూసుకుంటారు.
‘కొంతకాలం క్రితం అతను చాలా జబ్బుపడ్డాడు. దాదాపు ప్రాణం పోయినంత పనైంది. నేనతన్ని నా చేతుల్లో పెట్టుకుని అతనికోసం ప్రార్థించాను. ఇప్పుడు మీరతన్ని ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండటాన్ని చూస్తున్నారు.'
*****
ఇంతకూ రహస్య స్థావరంలో తయారుచేసిన ఆ బాంబులతో ఏం జరిగింది?
'వాటి అవసరం ఉన్న చోటికల్లా మేం వాటిని తీసుకొని ప్రయాణించేవాళ్ళం. అలాంటి అవసరం చాలా ఎక్కువగా ఉండేది. నేననుకోవటం, బాంబుల్ని తీసుకొని నేను దేశం నలుమూలలకూ తిరిగివుంటానని. స్టేషన్ల నుంచీ, ఇంకా ఇతర రవాణా సాధనాల ద్వారా. బ్రిటిష్ పోలీసులు కూడా మేమంటే బెదిరిపోయేవారు.'
ఆ బాంబులు చూడ్డానికి ఎలా ఉండేవి?
'ఇలా (తన చేతులతో చిన్న గోళాకార ఆకారాలు చేశారు). వాటి పరిమాణం గ్రెనేడ్ అంత ఉండేది. వాటిని పేల్చడానికి పట్టే సమయాన్ని బట్టి అనేక రకాలు ఉండేవి. కొన్ని వెంటనే పేలేవి; కొన్ని నాలుగు రోజులకు పేలేవి. మా నాయకులు వాటిని ఎలా ఏర్పాటు చేయాలో అన్నీ వివరించి మమ్మల్ని పంపించేవారు.
'ఆ సమయంలో మాకు చాలా గిరాకీ (డిమాండ్) ఉండేది! నేను కర్నాటక వెళ్ళేవాడిని. మైసూరు, బెంగళూరు, అన్ని ప్రదేశాలకూ వెళ్ళాను. చూడండి, క్విట్ ఇండియా ఉద్యమానికి, పోరాటానికి అజ్మేర్ చాలా ముఖ్యప్రదేశంగా ఉండేది. అలాగే బెనారస్ (వారణాసి) కూడా. గుజరాత్‌లోని బరోడా, మధ్య ప్రదేశ్‌లోని దమోహ్ వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఉద్యమం ఈ పట్టణంలో బలంగా ఉందనీ, ఇక్కడి సమరయోధుల అడుగుజాడలనే అనుసరించాలనీ జనం అజ్మేర్ వైపు చూసేవారు. నిజానికి ఇంకా చాలామంది ఉన్నారనుకోండీ.'
కానీ వాళ్ళు రైళ్ళలో ఎలా ప్రయాణించగలిగారు? పట్టుబడకుండా ఎలా తప్పించుకునేవారు? తపాలా సెన్సార్‌షిప్‌ను తప్పించడానికి వీరు, నాయకులకు చేరవేసేందుకు రహస్య ఉత్తరాలను తీసుకువెళ్తుంటారని ఆంగ్లేయులు అనుమానించేవారు. అలాగే కొందరు యువకులు బాంబులు తీసుకెళ్తున్నట్లు కూడా వాళ్ళకు తెలుసు.
'ఆ రోజుల్లో తపాలా శాఖ ద్వారా వెళ్ళే ఉత్తరాలను తనిఖీ చేసేవారు, విప్పి చదివేవారు. దీన్ని తప్పించడానికి మా నాయకులు కొంతమంది యువకులను ఒక బృందంగా చేసి, నిర్దిష్ట ప్రదేశాలకు ఉత్తరాలను ఎలా చేరవేయాలో శిక్షణనిచ్చేవారు. "నువ్వు ఈ ఉత్తరాన్ని బరోడాలో ఉన్న డా. అంబేద్కర్‌కు చేరవేయాలి." లేదంటే ఇంకో ప్రదేశంలో ఉండే మరో వ్యక్తికి. వాటిని మేం మా లోదుస్తులలో, పంగలలో దాచిపెట్టేవాళ్ళం.
‘బ్రిటిష్ పోలీసులు మమ్మల్ని ఆపి ప్రశ్నలు అడిగేవారు. వాళ్ళు మమ్మల్ని రైలులో చూస్తే, ఇలా అడగవచ్చు: "మీరు ఆ చోటకి వెళ్తున్నామని మాతో చెప్పారు, కానీ ఇప్పుడు వేరే చోటికి వెళ్తున్నారు." అయితే ఇలా జరుగుతుందని మాకూ, మా నాయకులకూ తెలుసు. కాబట్టి మేం బెనారస్ వెళ్ళాలంటే, ఆ నగరానికి కొంత దూరం ముందే దిగిపోయేవాళ్ళం.
' డాక్ (ఉత్తరాలు) తప్పనిసరిగా బెనారస్ చేరాలని మాకు ముందే చెప్పేవాళ్ళు. "ఆ నగరం రావడానికి కొద్ది దూరం ముందే మీరు గొలుసు లాగి, రైలు దిగిపొండి," అని మా నాయకులు మాకు సూచనలిచ్చేవారు. మేం అలాగే చేసేవాళ్ళం.
'ఆ రోజుల్లో రైళ్ళకు ఆవిరి యంత్రాలుండేవి. మేం ఇంజిన్ గదిలోకి వెళ్ళి పిస్టల్ చూపించి రైలు డ్రైవర్‌ని బెదిరించేవాళ్ళం. "నిన్ను చంపిన తర్వాతనే మేం చస్తాం," అని అతన్ని హెచ్చరించేవాళ్ళం. అతను మా కోసం ఏదో ఒక చోటు చూసేవాడు. ఒకోసారి సిఐడి, పోలీసులు అంతా వచ్చి తనిఖీ చేసేవారు. మామూలు ప్రయాణీకులు మాత్రమే వారికి రైలు పెట్టెల్లో కూర్చొని కనిపించేవారు.
'ముందే చెప్పినట్టు, మేం ఒక నిర్దిష్ట సమయంలో గొలుసు లాగి దిగిపోయాం. రైలు చాలాసేపు నిలిచిపోయింది. చీకటి పడగానే కొందరు స్వాతంత్ర్య సమరయోధులు గుర్రాలను తీసుకొచ్చారు. మేం వాటిపైకి ఎక్కి స్వారీ చేస్తూ తప్పించుకున్నాం. నిజానికి, రైలు చేరకముందే మేం బెనారస్ చేరుకున్నాం!
'అప్పట్లో నా పేరుమీద వారంట్ ఉండేది. పేలుడు పదార్థాలను తీసుకువెళ్తూ పట్టుబడ్డాం. కానీ మేం వాటిని విసిరిపారేసి తప్పించుకున్నాం. అవి పోలీసులకు దొరికాయి, మేం ఎలాంటి పేలుడు పదార్థాలు వాడుతున్నామో తెలుసుకోవడానికి వాళ్ళు వాటిని అధ్యయనం చేశారు. వాళ్ళు మమ్మల్ని వెంటాడటం మొదలెట్టారు. దాంతో మేం అజ్మేర్ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయమయింది. నన్ను బొంబాయి (అప్పటి) పంపించారు.'
ముంబైలో ఆయనకు ఆశ్రయమిచ్చి దాచిపెట్టిందెవరు?
'పృధ్వీరాజ్ కపూర్,' సగర్వంగా చెప్పారాయన. 1941కల్లా ఆ గొప్ప నటుడు తారాపథంలోకి దూసుకువెళ్తున్నారు. నిర్ధారించడం కష్టతరమైనప్పటికీ, అతను 1943లో ఏర్పాటైన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడని నమ్ముతారు. కపూర్‌తో పాటు ఇంకా కొంతమంది బొంబాయిలోని రంగస్థల, చలనచిత్ర ప్రపంచానికి చెందిన ఇతర ప్రముఖులు స్వాతంత్ర్య పోరాటానికి చాలా మద్దతుగా ఉండటమే కాక, అందులో పాలుపంచుకున్నారు కూడా.
'ఆయన మమ్మల్ని త్రిలోక్ కపూర్ అనే తన బంధువు వద్దకు పంపించాడు. ఆయన తర్వాత హర హర మహదేవ్ అనే సినిమాలో నటించినట్లున్నాడు.' శోభారామ్‌కు తెలియనప్పటికీ నిజానికి త్రిలోక్, పృధ్వీరాజ్‌కు తమ్ముడు. ఆ కాలంలో ఆయన కూడా చాలా విజయవంతమైన నటుడు. హర హర మహదేవ్ అనే సినిమా 1950లో చాలా పెద్ద ఎత్తున వసూళ్ళను రాబట్టింది.
'పృధ్వీరాజ్ కొద్దికాలం పాటు మాకు ఒక కారు ఇచ్చాడు. మేం అందులో బొంబాయి అంతా తిరిగేవాళ్ళం. నేను ఆ నగరంలో దాదాపు రెండు నెలలు ఉన్నాను. ఆ తర్వాత మేం తిరిగి వెళ్ళిపోయాం. మరికొన్ని చర్యల కోసం మా అవసరం ఉంది. ఆ వారంట్ ఇప్పుడు ఉంటే బాగుండేది, మీకు చూపించేవాడిని. ఆ వారంట్ నా పేరున ఉంది. ఇంకా ఇతర యువకుల పేరు మీద కూడా వారంట్లు ఉండేవి.
'కానీ 1975లో వచ్చిన ఆ వరద మొత్తం అంతటినీ నాశనం చేసేసింది,' అన్నారతను చాలా విచారంగా. 'నా పత్రాలన్నీ పోయాయి. అనేక సర్టిఫికేట్లు, జవహర్‌లాల్ నెహ్రూ నుంచి వచ్చినవాటితో సహా. ఆ పత్రాలన్నీ చూసుంటే మీరు పిచ్చెక్కిపోయేవారు. కానీ అంతా కొట్టుకుపోయింది.'
*****
'నేనెందుకు గాంధీ, అంబేద్కర్‌లలో ఒకరినే ఎంచుకోవాలి? ఇద్దర్నీ ఎంచుకోవచ్చు, కాదంటారా?'
మేం అజ్మేర్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఆ రోజు ఆ మహనీయుడి 131వ జయంతి, మేం శోభారామ్ గెహర్‌వార్‌ను కూడా మాతోపాటు తీసుకువచ్చాం. వృద్ధుడైన ఆ గాంధేయవాది అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి తనను ఆ ప్రదేశానికి తీసుకుపొమ్మని మమ్మల్ని కోరారు. ఇద్దరు మూర్తులలో ఆయన ఎవరి వైపున ఉంటారని మేం అడిగినప్పుడు.
ఆయన ఇంతకుముందు తన ఇంటిలో ఉండగా మాకు చెప్పినదాన్ని తిరిగి ఈ విధంగా చెప్పారు: ‘చూడండి, అంబేద్కర్, గాంధీలిద్దరూ చాలా మంచి పని చేశారు. కారును కదిలించాలంటే దానికి ఇరువైపులా రెండేసి చక్రాలుండటం అవసరం. వైరుధ్యం ఎక్కడ ఉంది? మహాత్ముని కొన్ని సూత్రాలు నాకు శ్రేష్ఠంగా అనిపిస్తే, నేను వాటిని అనుసరించాను. అంబేద్కర్ బోధనలలో యోగ్యత ఉన్నచోట, నేను వాటిని కూడా అనుసరించాను.'
గాంధీ, అంబేద్కర్‌లిద్దరూ అజ్మేర్‌ను సందర్శించారని ఆయన చెప్పారు. అంబేద్కర్ విషయానికొస్తే, ‘మేం రైల్వే స్టేషన్‌లో ఆయన్ని కలుసుకుని పూలమాల వేసేవాళ్ళం. అంటే ఆయన ఎక్కడికో వెళ్తుండగా ఆయన ఎక్కిన రైలు ఇక్కడ ఆగిన సందర్భాలలో.’ శోభారామ్ చాలా చిన్నతనంలో వారిద్దరినీ కలిశారు.
1934లో, నేనింకా చిన్నపిల్లవాడిగా ఉండగానే, మహాత్మా గాంధీ ఇక్కడకు వచ్చారు. ఇక్కడికే, సరిగ్గా మనం ఇప్పుడు కూర్చొని ఉన్న చోటుకే. ఈ జాదూగర్ బస్తీ (మెజీషియన్స్ కాలనీ)కే.' అప్పటికి శోభారామ్‌కు ఎనిమిదేళ్ళ వయసుండవచ్చు.
అంబేద్కర్ విషయంలోనైతే, మా నాయకుల వద్దనుండి 'ఆయనకోసం కొన్ని ఉత్తరాలను బరోడా (ఇప్పటి వడోదరా)కు తీసుకువెళ్ళాను. తపాలా కార్యాలయాల్లో అయితే పోలీసులు మా ఉత్తరాలను విప్పి చూసేవారు. అందుకని ముఖ్యమైన పత్రాలనూ ఉత్తరాలనూ మేమే తీసుకువెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆయన (అంబేద్కర్) నా తల మీద తట్టి, "నువ్వు అజ్మేర్‌లో ఉంటావా?" అని అడిగారు.'
శోభారామ్ కొలీ సముదాయానికి చెందినవాడని ఆయనకు తెలుసా?
'తెలుసు. నేనే ఆయనకు చెప్పాను. అయితే ఆయన దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అలాంటి విషయాలు ఆయన అర్థంచేసుకుంటారు. ఆయన ఉన్నత చదువులు చదివిన వ్యక్తి. నాకేమైనా అవసరమైతే తనకు ఉత్తరం రాయమని ఆయన నాతో చెప్పారు.'
శోభారామ్‌కు రెండు పేర్లతోనూ - దళిత్, హరిజన్ - పేచీ లేదు. అలాగే, ‘ఒకరు కొలీ అయితే అవనివ్వండి. మన కులాన్ని మనం ఎందుకు దాచుకోవాలి? హరిజన అన్నా, దళితుడు అన్నా తేడా ఏమీలేదు. చివరికి, మీరు వారిని ఏమని పిలిచినా, వారంతా షెడ్యూల్డ్ కులాలుగానే మిగిలిపోతారు.'
శోభారామ్ తల్లిదండ్రులు కూలిపనులు చేసుకునేవారు. ఎక్కువగా రైల్వే ప్రాజెక్టుల పనులు.
'అందరూ రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు," చెప్పారాయన. 'ఈ కుటుంబంలో మద్యం అనే మాటే ఎన్నడూ లేదు.’ తాను కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడినని ఆయన మాకు గుర్తు చేశారు, 'భారత రాష్ట్రపతి (ఇప్పుడు పూర్వ) రామ్‌నాథ్ కోవింద్ సామాజిక వర్గం. ఆయన ఒకప్పుడు మా అఖిల భారతీయ కొలీ సమాజ్ అధ్యక్షుడు కూడా.’
శోభారామ్ సముదాయాన్ని విద్యకు దూరం చేశారు. బహుశా అతను ఆలస్యంగా బడిలో ప్రవేశించడానికి అదే ప్రధాన కారణం కావచ్చు. హిందుస్థాన్‌లో అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు, జైనులు, ఇంకొంతమంది, ఆంగ్లేయులకు బానిసలుగా మారారు. వీరే ఎల్లప్పుడూ అంటరానితనాన్ని పాటించేవారు.'
‘నేను చెప్తున్నా వినండి, ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆర్యసమాజ్ లేకుంటే ఇక్కడ చాలామంది షెడ్యూల్డ్ కులాలవారు ఇస్లామ్ మతంలోకి మారిపోయి ఉండేవారు. మనం పాత పద్ధతుల్లోనే కొనసాగి ఉంటే, మనకు స్వాతంత్ర్యం వచ్చేదే కాదు.
'చూడండీ, ఆ కాలంలో అంటరానివారిని ఎవరూ బడుల్లో చేర్చుకునేవారు కాదు. వాడు కంజార్ అనో డోమ్ అనో, ఈ విధంగా అనేవారు. మమ్మల్ని చదువునుంచి మినహాయించారు. నాకు 11 ఏళ్ళ వయసప్పుడు ఒకటో తరగతికి వెళ్ళాను. ఎందుకంటే అప్పటి ఆర్య సమాజ్ వాళ్ళు క్రైస్తవులను నిలవరించాలనుకున్నారు. లింక్ రోడ్డుకు సమీపంలో ఉండే మా కులానికి చెందిన అనేకమంది క్రైస్తవులుగా మారారు. దాంతో కొన్ని హిందూ వర్గాలు మమ్మల్ని అంగీకరించడం ప్రారంభించాయి. దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలలో (DAV) చేరటానికి మమ్మల్ని ప్రోత్సహించేవారు కూడా.'
అయినా వివక్ష మాసిపోలేదు, కొలీ సమాజం తమ స్వంత బడిని ప్రారంభించింది.
‘అప్పుడే గాంధీ, సరస్వతీ బాలికా విద్యాలయానికి వచ్చారు. అది మా సముదాయానికి చెందిన పెద్దవారు ప్రారంభించిన పాఠశాల. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. మా పనిని చూసి గాంధీ విస్మయం చెందారు. “మీరు చాలా మంచిపని చేశారు. నేను ఊహించిన దానికంటే మీరు చాలా ముందున్నారు,” అని ఆయన చెప్పాడు.
'మా కొలీ వర్గమే ఆ బడిని ప్రారంభించినప్పటికీ మిగిలిన కులాల వారుకూడా బడిలో చేరారు. మొదట్లో అలా చేరినవాళ్ళంతా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే. ఆ తర్వాత, అనేక ఇతర సముదాయాల నుంచి కూడా పిల్లలు బడిలో చేరారు. కాలక్రమేణా, అగర్వాల్‌లు (అగ్ర కులం) బడిని స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం మాతోనే ఉంది. కానీ వాళ్ళు నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకున్నారు.' ఆయన ఇప్పటికీ ఆ బడిని సందర్శిస్తారు. కోవిడ్-19 దాడిచేసి బడులన్నీ మూసివేసేంతవరకూ వెళ్తూనే ఉండేవారు.
'అవును, నేను ఇప్పటికీ వెళ్తుంటాను. కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు (అగ్రకులంవాళ్ళు) నడిపిస్తున్నారు. వాళ్ళు ఒక బి.ఎడ్. కళాశాలను కూడా ప్రారంభించారు.
'నేను కేవలం 9వ తరగతి వరకే చదివాను. అందుకు నాకు చాలా విచారంగా ఉంటుంది. కొంతమంది నా స్నేహితులు స్వతంత్రం వచ్చాక ఐఎఎస్ అధికారులు కూడా అయ్యారు. ఇంకొంతమంది ఉన్నత శిఖరాలను అందుకున్నారు. కానీ నేను సేవ కే అంకితమయ్యాను.'
శోభారామ్ ఒక దళితుడు, తనను తాను గాంధేయవాదిగా ప్రకటించుకున్నవారు. ఆయన డా. అంబేద్కర్‌ను కూడా గాఢంగా అభిమానిస్తారు. ఆయన మాతో ఇలా చెప్పారు: నేను ఆ రెండు వాదాలతోనూ ఉన్నాను, గాంధీవాద్, క్రాంతివాద్ (గాంధీ మార్గం, విప్లవోద్యమం). రెండూ చాలా దగ్గరగా జతపడినవి.' ప్రాథమికంగా గాంధేయవాది అయినప్పటికీ ఆయన మూడు రాజకీయ ధారలతో కలిసివున్నారు.
శోభారామ్ గాంధీని ఎంతగానో ప్రేమిస్తారు, అభిమానిస్తారు, అయితే గాంధీని ఆయన విమర్శలకు అతీతంగా చూడరు. ముఖ్యంగా అంబేద్కర్‌కు సంబంధించి.
‘అంబేద్కర్ సవాలును ఎదుర్కొన్నప్పుడు గాంధీ భయపడ్డారు. షెడ్యూల్డ్ కులాల వారంతా బాబాసాహెబ్‌తో వెళ్తున్నారని గాంధీ భయపడ్డారు. అలాగే నెహ్రూ కూడా. దీంతో పెద్దఎత్తున జరుగుతోన్న ఉద్యమం బలహీనపడుతుందని వాళ్ళు ఆందోళన చెందారు. అయినప్పటికీ, ఆయన చాలా సామర్థ్యం ఉన్న వ్యక్తి అని వారిద్దరికీ తెలుసు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, ఈ సంఘర్షణ గురించి ప్రతి ఒక్కరూ ఉద్రిక్తులయ్యారు.
‘అంబేద్కర్ లేకుండా తాము చట్టాలను, రాజ్యాంగాన్ని రాయలేమని వారు గ్రహించారు. ఆయన ఒక్కరే అందుకు సమర్థుడు. ఆ పాత్ర కోసం ఆయన ఎవరినీ అడుక్కోలేదు. మన చట్టాల చట్రాన్ని రాయమని ఆయననే అందరూ వేడుకున్నారు. ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ వంటివాడు. తెలివైన, సూక్ష్మబుద్ధి కలిగిన వ్యక్తి. అయినప్పటికీ, మనం హిందుస్థానీ జనాలం చాలా భయంకరమైనవాళ్ళం. 1947కి ముందు, తరువాత కూడా మనం ఆయన పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాం. స్వాతంత్ర్య ఉద్యమ గాథ నుండి కూడా ఆయనను మినహాయించారు. అవును, నేటికీ ఆయనే నాకు స్ఫూర్తి.’
శోభారామ్ ఇంకా ఇలా చెప్పారు, "నేను నా మనసులో పూర్తిగా కాంగ్రెస్ వ్యక్తిని, నిజమైన కాంగ్రెస్ మనిషిని.' అంటే ఆయన ఆ పార్టీ ప్రస్తుత దిశను విమర్శిస్తున్నారని అర్థం. ప్రస్తుత భారత నాయకత్వం ఈ దేశాన్ని నియంతృత్వంగా మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి 'కాంగ్రెస్ పునరుజ్జీవం పొంది రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించాలి'. అతను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను చాలా అభినందిస్తున్నారు. 'అతను ప్రజల పట్ల అక్కఱతో ఉంటారు. మా స్వాతంత్ర్య సమరయోధుల కోసం ఆయన ఆరాటపడుతుంటారు.’ ఈ రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పింఛను దేశంలోనే అత్యధికం. గెహ్లాట్ ప్రభుత్వం మార్చి 2021లో ఆ పింఛనును రూ. 50,000కి పెంచింది. స్వాతంత్ర్య సమరయోధులకు అత్యధికంగా ఇచ్చే కేంద్ర పింఛను రూ. 30,000.
తాను గాంధేయవాదినని శోభారామ్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కిందకు దిగేటప్పుడు కూడా.
'చూడండి, నేను ఇష్టపడినవారిని నేను అనుసరిస్తాను. వారిద్దరి ఆలోచనలలో నాకు అంగీకారం ఉన్నవాటిని నేను అనుసరిస్తాను. అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా చేయడంలో నాకు ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. వారిద్దరితో కూడా.'
*****
శోభారామ్ గెహెర్‌వార్ మమ్మల్ని స్వతంత్రతా సేనాని భవన్‌కు - అజ్మేర్‌లోని వృద్ధులైన స్వాతంత్ర్య సమరయోధుల సమావేశ స్థలం - వద్దకు తీసుకెళ్తున్నారు. ఇది రద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో ఉంది. రౌడీ ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ, సందుల్లోకి దూసుకెళ్ళే ఆ వృద్ధుడైన పెద్దమనిషి వేగాన్ని అందుకునేందుకు నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఆయన చేతి కర్ర ఉపయోగించరు, చాలా వేగంగా అడుగులేస్తూ దూసుకుపోతారు.
ఆయన కొంచెం అసంబద్ధంగా కనిపించడం, దానిని ఎదుర్కోవటానికి ప్రయత్నించడం అనేది ఒకే ఒక్కసారి జరగడాన్ని మనం తర్వాత చూస్తాం. మేం ఆయన ఎంతగానో గర్వించే పాఠశాలను సందర్శించాం. గోడపై రాసినదాన్ని ప్రతి అక్షరం అక్షరాన్నీ చదవటం. ‘ సరస్వతి స్కూల్ బంద్ పడా హైఁ ’ అని చేతితో చిత్రించిన ఆ నోటీసు (‘సరస్వతి పాఠశాల మూసివేయబడింది) తెలియజేస్తోంది. ఈ పాఠశాల, కళాశాల కూడా మూతబడ్డాయి. శాశ్వతంగా అంటూ వాచ్‌మెన్, ఇంకా చుట్టుపక్కలవాళ్ళు చెప్పారు. ఇది త్వరలో విలువైన రియల్ ఎస్టేట్‌గా మారవచ్చు.
అయితే స్వతంత్రతా సేనాని భవన్‌లో ఆయన మరింత ధ్యాసతోనూ, వ్యాకులతతోనూ ఉంటారు.
‘1947 ఆగస్టు 15న వారు ఎర్రకోటలో భారతదేశ జెండాను ఎగురవేసినప్పుడు మేం ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. ఈ భవనాన్ని నవ వధువులా అలంకరించాం. స్వాతంత్ర్య సమరయోధులమందరం అక్కడున్నాం. అప్పటికి మేమంతా ఇంకా చిన్నవాళ్లమే. అందరం ఆనందకరమైన మానసిక స్థితిలో ఉన్నాం.'
'ఈ భవనం ప్రత్యేకమైనది. దీనికి ఏ ఒక్కరూ స్వంతదారు కాదు. అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులున్నారు, మేమంతా మా ప్రజలకోసం చాలా పనులు చేశాం. మేం కొన్నిసార్లు దిల్లీ వెళ్ళి నెహ్రూను కలిసేవాళ్ళం. ఆ తర్వాత ఇందిరా గాంధీని కలిశాం. ఇప్పుడు వాళ్ళెవరూ జీవించిలేరు.
'మనకు అనేక మంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధులున్నారు. నేను క్రాంతి (విప్లవం) వైపు, సేవ వైపు కూడా కలిసి పనిచేసిన అనేకమంది ఉన్నారు.' అంటూ గడగడా పేర్లు చదివారు.
'డా. శారదానంద్, వీర్ సింగ్ మెహతా, రామ్ నారాయణ్ చౌధురి. రామ్ నారాయణ్, దైనిక్ నవజ్యోతి సంపాదకుడైన దుర్గా ప్రసాద్ చౌధురికి అన్నగారు. అజ్మేర్‌కు చెందిన భార్గవ్ కుటుంబం ఉంది. అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలో ముకుట్ బిహారీ భార్గవ్ సభ్యుడు. వారంతా ఇప్పుడు లేరు. మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన గోకుల్‌భాయ్ భట్ ఉన్నారు. ఆయన రాజస్థాన్ కే గాంధీజీ .’ భట్ చాలా కొద్దికాలం పాటు సిరోహీ రాచరిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే సామాజిక సంస్కరణ, స్వతంత్రం కోసం పోరాడటం కోసం దానిని వదులుకున్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన ఎవరికీ ఎలాంటి పాత్ర లేదని శోభారామ్ నొక్కి చెప్పారు.
వో? ఉన్‌హోంనే తో ఉంగ్లీ భీ నహీ కటాయీ' (వాళ్ళా? వాళ్ళ వేలి మీద చిన్న గాటైనా పడలేదు).
స్వతంత్రతా సేనాని భవన్ భవితవ్యం ఆయనను ఇప్పుడు చాలా ఆందోళనకు గురిచేస్తోంది
‘ఇప్పుడు నేను ముసలివాడ్నయాను. ప్రతిరోజూ ఇక్కడకు రాలేను. కానీ నేను బాగానే ఉంటే, ఇక్కడకు వచ్చి కనీసం ఒక గంట పాటు కూర్చొనివెళ్తాను. ఇక్కడకు సమస్యలతో వచ్చిన ప్రజలను కలుస్తాను, వీలైనప్పుడల్లా వారి సమస్యల కోసం వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను.
‘ఇప్పుడు నాతో ఎవరూ లేరు. ఈ రోజుల్లో నేను ఒంటరిగా ఉన్నాను. ఇతర స్వాతంత్ర్య సమరయోధులలో చాలామంది మరణించారు. ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది అశక్తులుగానూ, చాలా అనారోగ్యంతోనూ ఉన్నారు. కాబట్టి స్వతంత్రతా సేనాని భవన్‌ను నేను ఒక్కడిని మాత్రమే చూసుకుంటున్నాను. ఈ రోజుకు కూడా నేను దానిని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాను, దానిని భద్రపరిచే ప్రయత్నం చేస్తాను. కానీ అది నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎందుకంటే నాతో ఇంకెవరూ లేరు.
‘నేను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశాను. ఈ భవన్‌ను ఎవరైనా లాక్కోకముందే దానిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాను.
‘ఈ స్థలం విలువ కోట్లాది రూపాయలుంటుంది. ఇది నగరం మధ్యలో ఉంది. చాలామంది నాకు ఎరవేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు, “శోభారామ్‌జీ, నువ్వు ఒంటరిగా ఏం చేయగలవు? దీనిని (ఈ ఆస్తిని) మాకు ఇవ్వండి. మీకు కోట్లాది రూపాయల నగదు ఇస్తాం,” అంటారు. నేను చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ భవనంతో వాళ్ళకు ఇష్టమొచ్చినట్టు చేయగలరని నేను వారికి చెప్తున్నాను. నేనేం చెయ్యగలను? వాళ్ళు అడిగినట్లు నేను ఎలా చేయగలను? ఇందుకోసం, మన స్వతంత్రం కోసం లక్షలాదిమంది చనిపోయారు. ఆ డబ్బుతో నేనేం చేస్తాను?
'నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఎవరూ అడగరు. స్వాతంత్ర్యం కోసం మనం ఎలా పోరాడి సాధించుకున్నామో పాఠశాల విద్యార్థులకు చెప్పే ఒక్క పుస్తకం కూడా లేదు. మన గురించి ప్రజలకు ఏమి తెలుస్తుంది?’
అనువాదం: సుధామయి సత్తెనపల్లి