ముదురు నీలం రంగు కుర్తా, ఎంబ్రాయిడరీ చేసిన లుంగీ, కొప్పు చుట్టూ చుట్టిన సువాసనల మల్లెపూల దండతో, ఎం.పి. సెల్వి తాను నడుపుతోన్న పెద్ద వంటగది - కరుంబుకడై ఎం.పి. సెల్వి బిర్యానీ మాస్టర్ - లోకి ప్రవేశించారు. ఆమె క్యాటరింగ్ యూనిట్‌లో పనిచేస్తోన్న సిబ్బంది తలలు పైకెత్తి చూశారు, అక్కడక్కడా వినిపిస్తోన్న కబుర్ల సందడి సద్దుమణిగింది. ఒక శ్రామికుడు వచ్చి ఆమెను పలకరించి, ఆమె చేతిలోని సంచి తీసుకున్నారు.

'బిర్యానీ మాస్టర్' సెల్వి అంటే 60 మందికి పైగా పనిచేస్తోన్న ఆ పెద్ద వంటగదిలో అందరికీ ఎనలేని గౌరవం. కొన్ని నిమిషాలలోనే వాళ్ళు మళ్ళీ తమ పనుల్లో మునిగిపోయారు. చాలా వేగంగా, నేర్పుగా అటూ ఇటూ తిరిగే వారు, మంటల నుంచి వచ్చే పొగను, నిప్పురవ్వలను పట్టించుకోరు.

చాలా పేరొందిన ఈ బిర్యానీని సెల్వి, ఆమె తోటి వంటవాళ్ళు మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నారు. దమ్ మటన్ బిర్యానీని మాంసం, బియ్యాన్ని కలిపి వండుతారు. ఇతర బిర్యానీలలో ఈ రెండు ప్రధాన దినుసులను విడివిడిగా వండుతారు.

"నేను కోయంబత్తూరు దమ్ బిర్యానీ స్పెషలిస్టుని," అని 50 ఈ ఏళ్ళ ట్రాన్స్‌ మహిళ చెప్పారు. “నేను దీన్నంతా ఒంటరిగా నిర్వహిస్తాను. నాకు అన్నీ గుర్తుంటాయి. చాలాసార్లు, మమ్మల్ని ఆరు నెలలు ముందుగానే బుక్ చేసుకుంటారు.’’

ఆమె మాతో మాట్లాడుతుండగానే, బొట్లు బొట్లుగా బిర్యానీ మసాలా కారుతోన్న సట్టువం (పెద్ద గరిటె)ను ఆమెకు అందించారు. సెల్వి ఆ మసాలాను రుచి చూసి, “సరిపోయింది” అన్నట్లు తల ఊపారు. అది వంటకంలో చివరి, అత్యంత ముఖ్యమైన రుచి పరీక్ష. ప్రధాన వంటపెద్ద (చెఫ్) ఆ వంటకాన్ని ఆమోదించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

“అందరూ నన్ను ‘సెల్వి అమ్మా ’ అని పిలుస్తుంటారు. ఒక ‘ తిరునంగై ’ [ట్రాన్స్‌మహిళ]కి ‘ అమ్మా ’ అని పిలిపించుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది,” ఆమె సంతోషంగా నవ్వుతూ అన్నారు.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: వంటకాన్ని రుచి చూసి, తన తుది ఆమోదాన్ని తెలుపుతోన్న సెల్వి అమ్మ. కుడి: ఆహారాన్ని వండుతుండగా వేచి చూస్తోన్న బిర్యానీ మాస్టర్

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: సెల్వి అమ్మ సహోద్యోగులు కడిగిన బియ్యాన్ని ముందుగా తయారుచేసిన మసాలాతో కలుపుతారు. కుడి: వంటను పర్యవేక్షిస్తున్న సెల్వి అమ్మ

ఆమె తన క్యాటరింగ్ సర్వీస్‌ను పుల్లుక్కాడులోని తన ఇంటి నుంచే నడుపుతున్నారు. ఇది నగరంలో తక్కువ ఆదాయం ఉన్నవారు నివసించే గృహ సముదాయ ప్రాంతంలో ఉంటుంది. ఆమె కింద 15 మంది ట్రాన్స్ వ్యక్తులతో సహా 65 మంది పని చేస్తారు. ఒక వారంలో, వీళ్లంతా కలిసి 1,000 కిలోల వరకు బిర్యానీ ఆర్డర్‌లను సిద్ధం చేస్తారు. కొన్నిసార్లు కొన్ని పెళ్ళిళ్ళు కూడా దీనికి తోడవుతాయి. ఒకసారి సెల్వి నగరంలోని ఒక పెద్ద మసీదు కోసం 20,000 మందికి సరిపోయేలా 3,500 కిలోల బిర్యానీని వండి పంపారు.

“నాకు వంట చేయడం ఎందుకు ఇష్టం అంటారా? ఒకసారి నా బిర్యానీ తిన్నాక, అబుదిన్ అనే కస్టమర్ నాకు ఫోన్ చేసి, ‘ఏం రుచి! ఎముక నుంచి మాంసం మంచులా వీడిపోతోంది’ అన్నాడు." అయితే ఇది కేవలం రుచి వల్ల మాత్రమే కాదు: “నా కస్టమర్లు ఒక ట్రాన్‌జెండర్ వ్యక్తి చేతులతో చేసిన ఆహారాన్ని తింటున్నారు. అది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు.”

మేం వెళ్ళిన రోజున అక్కడ ఒక పెళ్ళిలో వడ్డించడానికి 400 కిలోల బిర్యానీ తయారుచేస్తున్నారు. "నా సుప్రసిద్ధ బిర్యానీలో ఎలాంటి 'రహస్య' మసాలా లేదు!" అన్నారు సెల్వి అమ్మ . తను ప్రతి చిన్న విషయంపై దృష్టి పెట్టడం వల్లనే ఆ రుచి వస్తుందని ఆమె నొక్కిచెప్పారు. “నా మనసెప్పుడూ ఆ బిర్యానీ కుండపైనే ఉంటుంది. దనియాల పొడి, గరం మసాలా, ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాలను స్వయంగా కలపటమంటే నాకు ఇష్టం,” అంటూ వేలాదిమందికి ఆహారాన్ని అందించిన తన చేతులను చూపించారామె.

పెళ్ళి బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలను ఆమె దగ్గర పనిచేసే తమిళరసన్, ఇళవరసన్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ సోదరులిద్దరి వయసు ముప్ఫైలలో ఉంటుంది. వాళ్ళు కూరగాయలు కోయడం, మసాలాలు కలపడం, కట్టెల మంటలను సరిచేయడం వంటివి చేస్తున్నారు. అదే ఒక పెద్ద కార్యక్రమానికైతే, బిర్యానీ చేయడానికి మొత్తం పగలూ, రాత్రీ కూడా పట్టవచ్చు.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: ఇక్కడ మటన్‌ను శుభ్రం చేస్తున్నారు. దానిని నీళ్లతో పాటు మసాలా, బియ్యం మిశ్రమంతో కలుపుతారు. కుడి: బిర్యానీలో మసాలాలు కలుపుతున్న వంటవాళ్ళు

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: వంటవాళ్ళలో ఒకరితో కలిసి పనిచేస్తోన్న సెల్వి అమ్మ. కుడి: ప్రతి వంటకంలో ఉప్పు వేసేది మాత్రం ఆమె ఒక్కరే

సెల్వి అమ్మ క్యాలెండర్ సెలవుల సమయమైన ఏప్రిల్, మే నెలల్లో తీరికలేకుండా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు 20 ఆర్డర్‌ల వరకూ వస్తాయి. ఆమె ఖాతాదారులు ఎక్కువగా ముస్లిమ్ సముదాయానికి చెందినవారు. ఆమె తరచుగా వివాహాలు, నిశ్చితార్థాలకు వంటకాలు తయారుచేసి ఇస్తుంటారు. "వాళ్ళు ఎంతటి పెద్ద కోటీశ్వరులైనా నన్ను ' అమ్మా ' అనే పిలుస్తారు," అన్నారామె.

మటన్ బిర్యానీ అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. అయితే సెల్వి చికెన్, బీఫ్ బిర్యానీలను కూడా అందిస్తారు. కిలో బిర్యానీని సుమారు నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు తినవచ్చు. కిలో బిర్యానీ వండడానికి ఆమె రూ.120 తీసుకుంటారు. దానిలో కలిపే దినుసుల ధర మళ్ళీ వేరుగా ఉంటుంది.

నాలుగు గంటల పాటు బిర్యానీని తయారుచేసిన తర్వాత, సెల్వి అమ్మ బట్టలు ఆమె ఉపయోగించిన నూనెలు, మసాలాల కారణంగా మరకలు పడిపోతాయి; వంటగది వేడికి ఆమె ముఖం చెమటతో మెరుస్తుంది. ఆమె వెనుక ఉన్న బూడిదరంగు గది, మండుతున్న పొయ్యిల మీద ఉన్న పెద్ద డేగిశా లతో (వంట పాత్రలు) వెలిగి పోతుంటుంది.

“నా వంటగదిలో మనుషులు ఎక్కువసేపు ఉండలేరు. మేం చేసేలాంటి పనులు చేసే మనుషులు దొరకడం అంత సులభం కాదు,” అని ఆమె వివరించారు. “మేం బరువులు ఎత్తుతాం, మంటల ముందు నిలబడతాం. ఎవరైనా నా దగ్గర పని చేయాలనుకుంటే చాలా కష్టపడాలి. అలా చేయలేం అనుకునేవాళ్ళు పారిపోతారు.”

కొన్ని గంటల తర్వాత, అందరూ కలిసి సమీపంలోని రెస్టరెంట్ నుంచి తీసుకొచ్చిన అల్పాహారం – పరోటా , బీఫ్ కుర్మా - తినడానికి కూర్చున్నారు.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ, కుడి: వంటవాళ్ళ పాదాలు, చేతులపై కనిపిస్తోన్న కాలిన కట్టెల బూడిద

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: మంటను సరిచేస్తోన్న సెల్వి అమ్మ. కుడి: ఆహారాన్ని తయారుచేసిన తర్వాత, అందరూ కలిసి కూర్చుని ఉదయపు అల్పాహారం తింటారు

బాల్యంలో, పెరిగే వయస్సులో సెల్వి అమ్మ తిండి కొరతతో బాధపడేవారు. “మా కుటుంబానికి ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉండేది. మేం మొక్కజొన్న, జొన్నలను తినేవాళ్ళం,” అని ఆమె చెప్పారు. "ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వరి అన్నం తినేవాళ్ళం."

ఆమె 1974లో కోయంబత్తూరులోని పుల్లుక్కాడులో ఒక వ్యవసాయ కూలీల కుటుంబంలో జన్మించింది. తానొక ట్రాన్స్‌ జెండర్ (పుట్టుక మగవాడిగా అయినా, మహిళగా తనను తాను గుర్తించడం) అని తెలుసుకున్న ఆమె హైదరాబాద్ వెళ్ళి, అక్కడి నుంచి ముంబై, దిల్లీలకు వెళ్ళారు. “నాకు అలా తిరగటం ఇష్టంలేక తిరిగి కోయంబత్తూరుకు వచ్చాను, మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కోయంబత్తూరులో ట్రాన్స్‌ జెండర్ మహిళగా గౌరవంగా జీవించగలుగుతున్నాను," అని ఆమె చెప్పారు.

సెల్వి దత్తత తీసుకున్న 10 మంది ట్రాన్స్ కుమార్తెలు ఆమెతో పాటు నివసిస్తూ, పనిచేస్తున్నారు. “ట్రాన్స్ మహిళలే కాదు, ఇతర పురుషులూ మహిళలూ కూడా తమ మనుగడ కోసం నాపై ఆధారపడతారు. అందరూ తినాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.”

*****

సెల్వి అమ్మకు ఒక పెద్దవయసు ట్రాన్స్ వ్యక్తి వంట నేర్పారు. 30 ఏళ్ళ క్రితం నేర్చుకున్న ఆ నైపుణ్యాలను ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. “మొదట్లో నేను సహాయకురాలిగా పనిచేయటానికి వెళ్ళాను. ఆ తర్వాత ఆరేళ్ళు అసిస్టెంట్‌గా పనిచేశాను. రెండు రోజుల పనికి నాకు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది చిన్న మొత్తమే. కానీ నేను దానితోనే సంతోషపడేదాన్ని.”

ఆమె తన నైపుణ్యాన్ని ఇతరులకు అందించారు. సెల్వి అమ్మ దత్తపుత్రిక సరో, తల్లి నుంచి వంట నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఈ రోజు సరో కూడా బిర్యానీ తయారీలో మాస్టర్‌గా మారారు. సెల్వి గర్వంగా చెప్పుకునేటట్లు, సరోకు "వేల కిలోల బిర్యానీని తయారుచేయగల సామర్థ్యం ఉంది."

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: సెల్వి అమ్మతోపాటు నివసించే ట్రాన్స్ మహిళ కనిగ. కుడి: వెన్న చేయడానికి ఇంటివద్ద పచ్చి పాలను చిలుకుతోన్న సెల్వి అమ్మ కూతురు మాయక్క (అదిర)

“ట్రాన్స్‌ జెండర్ సముదాయానికి కూడా కూతుళ్ళు, మనవరాళ్ళు ఉంటారు. మనం వాళ్ళకి ఒక నైపుణ్యం నేర్పితే, వాళ్ళ జీవితాలు సంపన్నమవుతాయి," అని సెల్వి చెప్పారు. తమ మీద తమకు నమ్మకం కలిగివుండేలా చేయటమే ఇతర ట్రాన్స్‌ జెండర్ వ్యక్తులకు తాను ఇవ్వగల అతిపెద్ద బహుమతిగా సెల్వి భావిస్తారు. "లేకపోతే మనం దందా [సెక్స్ వర్క్] లేదా యాసకం [అడుక్కోవటం] చేయవలసి ఉంటుంది."

ట్రాన్స్ మహిళలు మాత్రమే కాకుండా పురుషులు, మహిళలు కూడా తనపై ఆధారపడ్డారని ఆమె తెలిపారు. వల్లి అమ్మ , సుందరి ఆమెతో కలిసి 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. "సెల్వి అమ్మ ను కలిసినప్పుడు నేను యుక్తవయసులో ఉన్నాను," అని తన యజమాని కంటే వయసులో పెద్దదైన వల్లి అమ్మ చెప్పారు. “నా పిల్లలు చిన్నవాళ్ళు. అప్పట్లో ఇదొక్కటే నాకు సంపాదనా మార్గం. ఇప్పుడు నా పిల్లలు పెరిగి పెద్దగై సంపాదిస్తున్నారు కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవాలని వాళ్ళ కోరిక. కానీ నాకు పని చేయడమంటే చాలా ఇష్టం. నేను సంపాదించే డబ్బు నాకు స్వేచ్ఛనిస్తుంది. నా ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు, యాత్రలకు పోవచ్చు!’’

తన ఉద్యోగులకు రోజుకు రూ.1,250 చెల్లిస్తానని సెల్వి అమ్మ చెప్పారు. కొన్నిసార్లు, ఆర్డర్‌లు చాలా పెద్దవైనప్పుడు, ఈ బృందం 24 గంటల పాటూ పని చేయాల్సివుంటుంది. "మేం ఉదయం ఫంక్షన్ కోసం వంట చేయవలసి వస్తే, రాత్రి నిద్రపోము," అని ఆమె చెప్పారు. అప్పుడు వాళ్ళకు ఆమె రూ. 2,500 వేతనం ఇస్తారు. “వాళ్ళకు అంతమాత్రం చెల్లించాల్సిందే. ఇది మామూలుగా చేసే పని కాదు. మేం మంటలతో పనిచేస్తాం!” నిశ్చితంగా చెప్పారామె.

వాళ్ళు పనిచేసే పెద్ద వంటగదిలో, దాదాపు ప్రతి మూలలో మంటలు వెలుగుతుంటాయి. బిర్యానీ మగ్గేటప్పుడు మండే కట్టెలను డేగిశాల మూతల పైన కూడా ఉంచుతారు. "మంటలకు భయపడితే పని కాదు," అన్నారు సెల్వి అమ్మ. వాళ్ళకు గాయాలు కావని కాదు. "మాకు ఒంటి మీద కాలిన గాయాలవుతాయి. మేం జాగ్రత్తగా ఉండాలి," అని ఆమె హెచ్చరించారు. "ఆ వేడికి బాధపడతాం. కానీ ఒక వంద రూపాయలు సంపాదించి వారం రోజుల పాటు ఆనందంగా తినవచ్చని అనుకున్నప్పుడు ఆ బాధ మాయమైపోతుంది.”

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: బిర్యానీని ఒక పెద్ద మట్టి కుండలో నెమ్మదిగా వండుతారు, దానిపై మూత పెట్టి పిండితో మూసేస్తారు. కుడి: మంటలను సరిచేస్తోన్న వంటవాళ్ళు

PHOTO • Akshara Sanal

వంట దినుసులను కలుపుతోన్న సెల్వి అమ్మ

*****

వంట చేసేవారి రోజు త్వరగా ప్రారంభమవుతుంది. సెల్వి అమ్మ ఉదయం 7 గంటలకు తన సంచి తీసుకొని బయలుదేరతారు. ఒక 15 నిమిషాల ప్రయాణం కోసం, కరుంబుకడైలోని తన ఇంటి దగ్గర ఆమె ఆటో ఎక్కుతారు. అయితే ఆమె తన ఆవులను, మేకలను, కోళ్ళను, బాతులను చూసుకోవడానికి ఉదయం 5 గంటల కంటే ముందే నిద్ర లేస్తారు. సెల్వి అమ్మ దత్తపుత్రికలలో ఒకరైన 40 ఏళ్ళ మాయక్క ఆ జంతువులకు, పక్షులకు మేత వేయడం, పాలు పితకడం, గుడ్లు సేకరించడంలో సెల్వి అమ్మకు సహాయం చేస్తారు. సెల్వికి తన జంతువులకు ఆహారాన్నందించడం అంటే చాలా ఇష్టం. "ఆ పని చేయటం వలన నా మనస్సు తేలికపడుతుంది. ముఖ్యంగా వంటగదిలో చాలా ఒత్తిడితో పనిచేసి వచ్చిన తర్వాత."

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ మాస్టర్ బిర్యానీ చెఫ్‌ పని పూర్తి కాదు. ఆమె తన నమ్మకమైన స్నేహితులైన డైరీ, కలంతో అన్ని బుకింగ్‌లను చూసుకుంటారు. మరుసటి రోజు వంటకు కావాల్సిన కిరాణా సామాగ్రిని కూడా ముందు రోజే ఏర్పాటు చేసుకుంటారు.

"నన్ను నమ్మే వ్యక్తుల పనిని మాత్రమే నేను ఒప్పుకుంటాను," సెల్వి అమ్మ తన రాత్రి భోజనాన్ని వండుకోవడానికి వెళుతూ చెప్పారు. "ఏమీ చేయకుండా ఉత్తినే తినడం, నిద్రపోవడం నాకు ఇష్టం ఉండదు."

కోవిడ్ ప్రబలిన సమయంలో మూడేళ్ళపాటు పనిని నిలిపి వేసినట్లు సెల్వి చెప్పారు. "మాకు బతకడానికి వేరే మార్గం లేదు. అందుకని పాల కోసం ఒక ఆవును కొన్నాం. ఇప్పుడు మాకు రోజూ మూడు లీటర్ల పాలు కావాలి. అదనంగా ఏమైనా మిగిలితే వాటిని అమ్ముతాం,” అని ఆమె చెప్పారు.

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఉదయాన్నే తన పశువులకు ఆహారం ఇస్తున్న సెల్వి (ఎడమ), తనకు వచ్చే ఆర్డర్లను నమోదు చేసుకునే డైరీలో రాసుకుంటూ (కుడి)

PHOTO • Akshara Sanal
PHOTO • Akshara Sanal

ఎడమ: తన కుక్క అప్పుతో సెల్వి. కుడి: తమిళనాడు పట్టణ నివాస అభివృద్ధి మండలి క్వార్టర్లలో నివసించే సెల్వి అమ్మ. 'ఇక్కడి ప్రజలు మమ్మల్ని గౌరవంగా చూస్తారు,' అన్నారామె

సెల్వి అమ్మ ఇల్లు తమిళనాడు పట్టణ నివాస అభివృద్ధి మండలి క్వార్టర్లలో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చాలా కుటుంబాలు షెడ్యూల్డ్ కులాలకు చెందినవి, వాళ్ళంతా రోజువారీ కూలీలు. “ఇక్కడ ధనవంతులు ఎవరూ లేరు, అందరూ శ్రామిక వర్గమే. తమ పిల్లలకు మంచి పాలు కావాలంటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు."

“మేం 25 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. రోడ్డు నిర్మాణం కోసం మా భూమిని సేకరించిన ప్రభుత్వం, దానికి బదులుగా మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చింది,” అని ఆమె వివరించారు. “ఇక్కడి ప్రజలు మమ్మల్ని గౌరవంగా చూస్తారు.”

అనువాదం: రవి కృష్ణ

Poongodi Mathiarasu

পুঙ্গুড়ি মাথিয়ারাসু তামিলনাড়ুর একজন স্বতন্ত্র লোকশিল্পী। তিনি গ্রামাঞ্চলের লোকশিল্পী এবং এলজিবিটিকিউআইএ+ গোষ্ঠীর সঙ্গে নিবিড়ভাবে কাজ করেন।

Other stories by Poongodi Mathiarasu
Akshara Sanal

অক্ষরা সানাল চেন্নাইনিবাসী একজন স্বাধীন চিত্রসাংবাদিক। তিনি সাধারণ মানুষজনের কাহিনি নথিবদ্ধ করতে আগ্রহী।

Other stories by Akshara Sanal
Editor : PARI Desk

আমাদের সম্পাদকীয় বিভাগের প্রাণকেন্দ্র পারি ডেস্ক। দেশের নানান প্রান্তে কর্মরত লেখক, প্ৰতিবেদক, গবেষক, আলোকচিত্ৰী, ফিল্ম নিৰ্মাতা তথা তর্জমা কর্মীদের সঙ্গে কাজ করে পারি ডেস্ক। টেক্সক্ট, ভিডিও, অডিও এবং গবেষণামূলক রিপোর্ট ইত্যাদির নির্মাণ তথা প্রকাশনার ব্যবস্থাপনার দায়িত্ব সামলায় পারি'র এই বিভাগ।

Other stories by PARI Desk
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna