రేషన్ పంపిణీ నుంచి మొదలుకొని, రాష్ట్ర నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న వివరాలపై పారదర్శకత లేకపోవడం వరకు, అనేక సమస్యలపై గుజ్జర్ పశుపోషకుడైన అబ్దుల్ రషీద్ షేక్ ఆర్టిఐ (సమాచార హక్కు) పిటిషన్లను దాఖలు చేస్తున్నారు. ప్రతియేటా 50కి పైగా గొర్రెలు, సుమారు 20 మేకలు ఉన్న తన పశువుల మందతో కశ్మీర్‌లోని హిమాలయాలకు వెళ్ళే ఈ 50 ఏళ్ల పశువుల కాపరి, గత దశాబ్దంలో రెండు డజన్లకు పైగా సమాచార హక్కు పిటిషన్లను దాఖలు చేశారు.
"గతంలో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు తెలియదు, మా హక్కుల గురించి మాకూ అవగాహన ఉండేదికాదు," దూధ్‌పథరీలో తన కొఠా (మట్టి, రాయి, కలపతో కట్టిన సాంప్రదాయిక ఇల్లు) బయట నిలబడి ఉన్న అబ్దుల్ అన్నారు. ప్రతి వేసవిలో ఆయన, ఆయన కుటుంబం అక్కడికి వలస వస్తుంది. వాళ్లు బడ్గామ్ జిల్లా, ఖాన్సాహిబ్ బ్లాక్‌లోని స్వగ్రామం ముజ్‌పథరీ నుండి ఇక్కడికి వచ్చారు.
"ప్రజలకు చట్టాలు, తమ హక్కుల గురించి అవగాహన కల్పించడంలో ఆర్టిఐలను దాఖలు చేయడం చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది; అధికారులతో ఎలా వ్యవహరించాలో కూడా మేం నేర్చుకున్నాం,” అని అబ్దుల్ అన్నారు. మొదట్లో అధికారులకే సమాచార హక్కు చట్టం గురించి తెలిసేదికాదు. "సంబంధిత పథకాలు, నిధుల పంపిణీ గురించి సమాచారం ఇవ్వమని అడిగినప్పుడు వాళ్లు తరచుగా ఆశ్చర్యపోయేవాళ్లు."
ఇలా అడగడం గ్రామంలోని ప్రజలను వేధింపులకు గురిచేయడానికి దారితీసింది - పోలీసులు బ్లాక్ అధికారులతో కుమ్మక్కై తప్పుడు ఎఫ్ఐఆర్లు (ప్రాథమిక సమాచార నివేదికలు) దాఖలు చేశారు. వాళ్లు సమాచార హక్కు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న అబ్దుల్లాంటి విషయాలు తెలిసిన పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు.
“అవినీతిపరులు అధికారులే. ఇప్పుడు వాళ్ల ఆస్తులను చూడండి,” అంటూ తన అభిప్రాయాన్ని గట్టిగా నొక్కిచెప్పే ప్రయత్నం చేశారు అబ్దుల్. ఆర్టిఐలను దాఖలు చేయడంతో పాటు, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల (FCSCA విభాగం) నుంచి, ముజ్‌పథరీలోని సుమారు 50 మందికి రేషన్ కార్డులు జారీ చేయాలని కూడా అబ్దుల్ డిమాండ్‌ను లేవనెత్తారు.
సాధారణ గడ్డి మైదానాల మీద ఆధారపడే పశుపోషకుడయిన అబ్దుల్ ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు, ఇతర అటవీ వాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 పై దృష్టి సారించారు. "మనం అడవులను అటవీ శాఖకు అప్పగించేస్తే, రక్షించడానికిక అడవులు ఉండవు," అన్నారతను. ఎఫ్ఆర్ఎ కింద సాముదాయిక అటవీ హక్కులను పరిరక్షించేందుకు పనిచేస్తోన్న స్థానిక బృందమైన జమ్మూ కశ్మీర్ అటవీ హక్కుల కూటమి మద్దతుతో, అటవీ భూములపై గుజ్జర్, బకర్వాల్ పశుపోషకులకు ఉన్న హక్కుల కోసం అబ్దుల్ ఆర్టిఐలను దాఖలు చేశారు.
ముజ్‌పథరీ గ్రామసభ 2022లో అటవీ పరిరక్షణ కమిటీ (FRC)ని ఏర్పాటు చేసింది. ఇది ప్రతి సంవత్సరం గడ్డి భూములను, వ్యక్తిగత భూములను గుర్తించడం వంటి నియమ నిబంధనలను సమీక్షించే వ్యవస్థను నిర్వహిస్తోంది. ఆ కమిటీ అటవీ హక్కుల చట్టం (2006) కింద తమ అడవిలోని 1,000 చదరపు కిలోమీటర్లను కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్(CFR)గా ప్రకటించే తీర్మానాన్ని 2023, ఏప్రిల్ 28న ఆమోదించింది.
“అడవి అందరికీ చెందినది. నాది, నా పిల్లలది, మీది. జీవనోపాధులను మనం పరిరక్షణతో కలిపితే కొత్త తరానికి మేలు జరుగుతుంది. అటవీ నిర్మూలన చేస్తే, మనం వారికి ఏమి మిగిలిస్తున్నట్టు!” ముజ్పథరీకి సిఎఫ్ఆర్ హోదా మంజూరు విషయం నెమ్మదిగా సాగుతున్నందుకు అబ్దుల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2020లో ఎఫ్ఆర్ఎ, 2006ను జమ్మూకశ్మీర్‌కు కూడా విస్తరించింది.
"అప్పటి వరకు ఎఫ్ఆర్ఎ గురించి ఎవరికీ తెలియదు," అన్నారు అబ్దుల్. ఇంటర్నెట్ సౌకర్యం విస్తరించటంతో లోయలోని ప్రజలకు వివిధ పథకాలు, చట్టాల గురించి అవగాహన కూడా పెరిగింది. “దిల్లీలో ప్రారంభించిన వివిధ పథకాలు, విధానాల గురించి మాకు అవగాహన కల్పించడంలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషించింది. అంతకుముందు మాకు ఏమీ తెలిసేదికాదు,” అని అబ్దుల్ వివరించారు.
2006లో అబ్దుల్, ప్రస్తుత సర్పంచ్ నజీర్ అహ్మద్ డిండాతో సహా ముజ్‌పథరీలోని మరికొంతమంది గ్రామస్తులతో కలిసి, ఆ సమయంలోని జమ్మూకశ్మీర్ అటవీ హక్కుల కూటమి అధ్యక్షుడు, బడగామ్ ప్రాంత వైద్యాధికారి అయిన డాక్టర్ షేక్ గులామ్ రసూల్‌ను కలిశారు. ఆ అధికారి తన పనిలో భాగంగా తరచుగా గ్రామాన్ని సందర్శించటమే కాక, ఈ ప్రాంతంలో ఆర్టిఐ ఉద్యమాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర వహించారు. “డా. షేక్ చట్టాలు, విధానాల గురించి చర్చిస్తారు. మేం వాటి గురించి మరింత ఎక్కువ తెలుసుకోవలసిన అవసరాన్ని గురించి ఆయన వివరించేవారు,” అని అబ్దుల్ అన్నారు.
ఇది గ్రామస్థులు ఇతర పథకాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి దారితీసింది. “క్రమంగా మేం సమాచార హక్కు చట్టం, దాన్ని దాఖలు చేసే ప్రక్రియ గురించి తెలుసుకున్నాం. మా గ్రామంలో అనేకమంది ఆర్‌టిఐలు దాఖలు చేయడం ప్రారంభించారు, అదొక ఉద్యమంగా మారింది,” అని అబ్దుల్ వివరించారు.
ముజ్పథరీలో డా. షేక్‌తో జరిగిన సంభాషణలో మొదట్లో గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించడం, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం వంటి పనులను ఆయన గుర్తుచేసుకున్నారు. "అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అవినీతిపరుడు కావటంతో, ప్రజలకు పథకాలు చేరలేద"ని ఆయన అన్నారు. "పోలీసులు తరచుగా గ్రామస్థులను వేధిస్తారు, వారి హక్కుల గురించి వారికి అవగాహన ఉండదు."
ముజ్‌పథరీ నివాసి పీర్ జి. ఎచ్. మొహిదీన్, చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న ప్రజల గృహనిర్మాణం కోసం ప్రభుత్వం ఏకమొత్తంలో ఆర్థిక సహాయం అందించే ఇందిరా ఆవాస్ యోజన (IAY) పథకం గురించి తెలుసుకోవడానికి 2006లో మొదటి ఆర్టిఐని దాఖలు చేశారు. ఇందిరా ఆవాస్ యోజన లబ్ధిదారుల సమాచారాన్ని కోరుతూ సర్పంచ్ నజీర్, 2013లో మరొక ఆర్టిఐ దరఖాస్తు సమర్పించారు.
గ్రామంలో సంభాషణలు, చర్చలు జరిగిన తర్వాత నజీర్‌కు అడవుల సంరక్షణ, పారదర్శకతల ఆవశ్యకత గురించి అర్థంకావటంతో, అది ఆర్టిఐ దాఖలుకు దారితీసింది. "మా కోసం ప్రభుత్వం చేపట్టిన విధానాలను గురించి, వాటిని పొందటం గురించి మేం తెలుసుకోవాలి," అని అతను అన్నారు. "2006 వరకు మేం ఇతర జీవనోపాధి అవకాశాలు లేనందువల్ల అడవుల నుంచి మూలికలు, కంద మూలాలు, దుంపలతో పాటు కలపను, గుచ్ఛీలు (ఒక రకమైన పుట్టగొడుగులు), ధూప్ వంటి కలపేతర అటవీ ఉత్పత్తులను (NTFPs) దొంగిలించేవాళ్లం" అని 45 ఏళ్ల ఈ గుజ్జర్ చెప్పారు. "అడవులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నేను 2009లో దూధ్‌పథరీలో ఒక దుకాణాన్ని ప్రారంభించి తేనీరు, కుల్చాలను అమ్మడం మొదలుపెట్టాను," అని అతను తెలిపారు. మేం అతనితో పాటు శాలిగంగా నది వెంట ఎత్తైన పచ్చిక బయళ్ల వేపుగా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు, అతను గత కొన్నేళ్లుగా తాను దాఖలు చేసిన వివిధ ఆర్టిఐల జాబితాను వివరించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింద బియ్యం కేటాయింపులో తారతమ్యాల గురించి ఎఫ్సిఎస్సిఎ శాఖను వివరాలు కోరుతూ నజీర్ 2013లో ఆర్టిఐ దాఖలు చేశారు. దానితో పాటు, 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర శిక్షా పథకం కింద ఉపకారవేతనాలు పొందిన విద్యార్థుల గురించి తెలుసుకోవడానికి కూడా అతను ఆర్టిఐ ద్వారా వివరాలు కోరారు.
నజీర్‌తో కలిసి మేం శాలిగంగా నది వెంట ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు, దూరంగా ఉన్న కొన్ని గుడారాలను చూశాం. వాళ్లు మమ్మల్ని నూన్ చాయ్ తాగటం కోసం ఆహ్వానించారు. అక్కడ మేం బకర్వాల్ పశువుల కాపరి మహమ్మద్ యూనుస్‌ను కలిశాం. ఏప్రిల్‌లో జమ్మూ డివిజన్లోని రజౌరి జిల్లా నుంచి దూద్పథరీకి వచ్చిన ఆయన అక్టోబర్ వరకు ఇక్కడే ఉంటారు. దానివల్ల 40కి పైగా గొర్రెలు, 30 మేకలతో కూడిన అతని పశువుల మందకు మేత దొరుకుతుంది.
"ఈ రోజు మేమిక్కడ ఉన్నాం, కానీ 10 రోజుల తర్వాత మేం తాజా పచ్చిక బయళ్ళు ఉన్నచోటికి, మరింత పైకి వెళ్ళాలి," అని అతను చెప్పారు. బకర్వాల్ సముదాయానికి చెందిన 50 ఏళ్ల వయసున్న ఆయన తన చిన్నప్పటి నుండి క్రమం తప్పకుండా కశ్మీర్‌కు వలస వస్తున్నారు.
“ఒక మేక లేదా గొర్రెను అమ్మితే సగటున 8,000 నుండి 10,000 [రూపాయలు] వస్తాయి. ఈ కొంచం డబ్బుతో నెల రోజులు మేం ఎలా బతకాలి?” జమ్మూకశ్మీరులో తేయాకు, నూనె ధరలను గురించి మాట్లాడుతూ యూనుస్ అడిగారు. ఇక్కడ తేయాకు కిలో రూ. 600–700 కాగా, లీటరు నూనె ధర రూ. 125.
ప్రజా పంపిణీ వ్యవస్థను సరిగ్గా అమలుచేయని ఫలితంగా యూనుస్, అతని సముదాయానికి చెందిన ఇతర సభ్యులు రేషన్‌లో కొంతభాగాన్ని తీసుకోలేకపోతున్నారు. "ప్రభుత్వం మాకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బియ్యం, గోధుమలు, పంచదార ఇవ్వాలి. కానీ అవేవీ మాకు దొరకటంలేదు," అని యూనుస్ చెప్పారు.
"మొదటిసారిగా మేం ఈ సంవత్సరమే ట్యాక్సీ సేవను ఉపయోగించుకున్నాం, ఆ ట్యాక్సీ మమ్మల్ని యుస్మర్గ్లో వదిలి వెళ్లింది, మా పిల్లలు మాత్రం పశువులతో పాటు వచ్చారు," అని యూనుస్ చెప్పారు. ఈ పథకం 2019 నుండి అమలులో ఉన్నప్పటికీ, అది రజౌరి నుండి వచ్చిన బకర్వాల్లకు చేరడానికి నాలుగేళ్లు పట్టిందని అతనన్నారు. సంచార పాఠశాలల కోసం కూడా ఒక ఏర్పాటు ఉంది కానీ ఆ పాఠశాలలు సరిగా పనిచేయవు. "వాళ్లు మా కోసం సంచార పాఠశాలలను ఏర్పాటు చేశారు, కానీ కనీసం 10-15 చుల్హాలు [సంసారాలు] ఉండాలి, అప్పుడే ఒక [పాఠశాల] ఉపాధ్యాయుడు ఉంటారు," అని యూనుస్ చెప్పారు.
" కాగితంపై ప్రతి పథకం ఉంటుంది, కానీ ఏదీ మాకు చేరదు," అని అతను నిరాశగా అన్నారు.
అనువాదం: రవికృష్ణ