నా జీవితమంతా నేను జంతుసంరక్షణ చేస్తూనేవున్నాను. ఇదే మా పని; రాయీకాలుగా మేం జంతువులకు సేవ చేస్తాం
నా పేరు సీతాదేవి, నా వయసు 40 ఏళ్ళు. చరిత్రాత్మకంగా మా సముదాయం జంతుసంరక్షణను - ప్రధానంగా ఒంటెలను, ఇటీవలి కాలం నుంచి గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలను - బాధ్యతగా తీసుకుంది. మేం రాజస్థాన్‌లో పాలీ జిల్లాలోని జైతారణ్ బ్లాక్‌లో ఉన్న కుర్కీ గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉండే తారామగరీ శివారుగ్రామంలో నివసిస్తున్నాం
నాకు హరిరామ్ దేవాసీతో (46) వివాహమయింది. మేం మా ఇద్దరు కుమారులైన సవాయి రామ్ దేవాసీ, జామతా రామ్ దేవాసీలతో పాటు వారి భార్యలైన ఆచూ దేవి, సంజూ దేవిలతో కలిసి నివసిస్తున్నాం. ఆచూ, సవాయి దంపతుల 10 నెలల కుమారుడు, మా అమ్మ శాయరీ దేవి (64), కూడా మాతోనే ఉంటారు.
నేను గానీ, నా కోడళ్ళలో ఎవరైనా గానీ తయారుచేసిన ఒక కప్పు మేక పాల టీతో ఉదయం 6 గంటలకు నా రోజు మొదలవుతుంది. ఆ తర్వాత మేం వంట చేసి, మా గొర్రెలనూ మేకలనూ ఉంచే బాడా (పశువుల చావడి)కి వెళ్తాం. ఇక్కడ నేను బురదగా ఉండే మట్టి నేలను ఊడ్చి శుభ్రం చేసి, జంతువుల పెంటికలను సేకరించి, తరువాతి ఉపయోగం కోసం ఒక పక్కన పెడతాను.
బాడా మా ఇంటి వెనుక భాగంలో ఉంటుంది, ఇందులో మా 60 గొర్రెలూ మేకలూ నివసిస్తాయి. ఇందులోనే ఉన్న ఒక చిన్న ఆవరణలో మా గొర్రెపిల్లలనూ, మేకపిల్లలనూ ఉంచుతాం. బాడా లో ఒక చివరన పొడి మేతను - ఎక్కువగా ఎండిన గ్వార్ (గోరు చిక్కుడు) దుబ్బులు - నిల్వ చేస్తాం. గొర్రెలు, మేకలతో పాటు మాకు రెండు ఆవులు కూడా ఉన్నాయి. వాటి కోసం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర విడిగా ఒక చావడి ఉంది.
మాకేదైనా అవసరమైతే - కిరాణా సామాన్లు, ఆసుపత్రులు, బ్యాంకులు, బడులు, మరేవైనా - మేం కుర్కి గ్రామానికి వెళ్ళాలి. ఇంతకుముందు మేం మా మందలతో కలిసి జమునాజీ (యమునా నది) వరకు వెళ్ళి, ఆ దారిలో గుడారం వేసేవాళ్ళం. ఇప్పుడు మందలు చిన్నవైపోయాయి కాబట్టి అంత దూరం ప్రయాణించడం లాభదాయకం కాదు. అదీకాక మేం కూడా వృద్ధులమవుతున్నాం. అందుకని మేం జంతువులను మరీ అంత దూరం కాకుండా మేతకు తీసుకువెళతాం.
నేను బాడాను శుభ్రం చేస్తుండగా, నా కోడలు సంజు మేకల నుంచి పాలు తీస్తుంది. మేకలు తెలివైనవి, వారి పట్టు నుండి తప్పించుకొని పారిపోతుంటాయి కాబట్టి, చిన్నవాళ్ళు జంతువుల పాలు పితికేటప్పుడు వాటిని ఎవరైనా పట్టుకోవడం అవసరం. నా భర్తగానీ, నేను గానీ ఆమెకు సహాయం చేయటమో, లేదంటే మేమే మేకల నుండి పాలు తీయటమో చేస్తాం. జంతువులు మా దగ్గర కుదురుగా ఉంటాయి.
నా భర్త జంతువులను మేతకు తీసుకెళ్తాడు. మేం ఇక్కడికి దగ్గరలోనే ఉన్న పొలాన్ని అద్దెకు తీసుకున్నాం, కొన్ని చెట్లను కూడా కొనుగోలు చేశాం. మా మందలు ఇందులోనే మేయడానికి వెళతాయి. నా భర్త కూడా చెట్ల నుండి కొమ్మలను నరికి, జంతువులు తినడం కోసం వాటిని దూరదూరంగా పరిచిపెడతాడు. మా మందలు ఖేజ్రీ ( ప్రొసోపిస్ సినరేరియా - జమ్మి చెట్టు) ఆకులను తినడానికి ఇష్టపడతాయి.
చిన్నపిల్లలు మందతో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది వాటికి సురక్షితం కాదు. కాబట్టి జంతువులు బాడా లోపలికి, వెలుపలికి వెళ్ళే సమయంలో అవి దారి మళ్ళకుండా సరైన దారిలో వెళ్ళేందుకు మేం నోటితో రకరకాల శబ్దాలు చేస్తాం. కొన్నిసార్లు పిల్ల మేక తన తల్లిని వెంబడిస్తే, మేం దానిని ఎత్తుకొని లోపలికి తీసుకువస్తాం. మాలో ఎవరో ఒకరు బాడా తలుపు దగ్గర నిలబడి చేతులు ఊపుతూ, జంతువులు మళ్ళీ బాడా లోకి తిరిగి పోకుండా శబ్దాలు చేస్తాం. ఇలా సుమారు 10 నిమిషాలు జరిగిన తర్వాత, జంతువులు ప్రధాన ద్వారం నుండి బయటికి వచ్చి మేతకు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాయి.
కొత్తగా తల్లులయినవి, జబ్బుపడినవి, లేదా చిన్నపిల్లలు మాత్రమే మిగిలి ఉన్నందున, ఇప్పుడు కొద్దిగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. నేను వాటి పెంటికలను మరోసారి ఊడ్చి, మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న స్థలానికి తీసుకువెళతాను. మేం వాటిని అమ్మేవరకు ఇక్కడ వాటిని సేకరించి ఉంచుతాం - ఇది విలువైన ఎరువు. మేం ఈ ఎరువును సంవత్సరానికి రెండు ట్రక్కుల వరకూ అమ్ముతాం. ఒక ట్రక్కు లోడుకు మాకు 8,000-10,000 రూపాయల మధ్య వస్తుంది.
గొర్రెలను అమ్మడం మాకున్న ఇతర ప్రధాన ఆదాయ వనరు. ఒక్కో జంతువుకు దాదాపు 12,000 నుండి 15,000 (రూపాయలు) వస్తుంది. గొర్రెపిల్లల్నీ, మేక పిల్లలనూ అమ్మడం ద్వారా ఒక్కోదానికి దాదాపు 6,000 (రూపాయలు) వస్తుంది. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వాటిని అమ్ముతాం. వాటిని కొన్న వ్యాపారి దిల్లీ వరకు వాటిని తీసుకువెళ్ళి పెద్ద పెద్ద హోల్‌సేల్ మార్కెట్‌లలో అమ్ముతాడు.
గొర్రెల ఉన్ని మాకు ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది. కానీ ఉన్ని ధరలు కొన్ని చోట్ల కిలో రెండు రూపాయల వరకు పడిపోయాయి, ఇప్పుడు మాకు ఎక్కువమంది కొనుగోలుదారులు కూడా కనిపించడంలేదు.
నేను మీంగణీ (పెంటికలు)ని పోగులో వేసి, ఆకలితో తెరుచుకున్న చిన్న నోళ్ళూ, ఏమైనా పెడుతుందేమో అని ఎదురుచూసే కళ్ళూ ఉన్న బాడా కు తిరిగి వస్తాను. వచ్చేటపుడు జంతువుల కోసం డాలీ (ఆకుపచ్చని కొమ్మలు) - చలికాలంలో కొన్ని రోజుల పాటు నీమ్‌రా (వేప - అజాడిరక్టా ఇండికా ), ఇతర రోజులలో బోర్‌డీ (రేగు - జీజిఫస్ నమ్యులేరియా ) - తెస్తాను. నేను కూడా పొలానికి వెళ్ళి కట్టెలు ఏరి తెచ్చుకుంటాను.
డాలీ ని (పచ్చి కొమ్మలు) నా కొడుకులు గానీ, భర్త గానీ నరికి తెస్తుంటారు. కానీ కొన్నిసార్లు నేనే వెళ్ళి వాటిని తీసుకొస్తాను. ఇంటి బయటి ఏ పనులనైనా పురుషులే ఎక్కువగా చేస్తుంటారు. మేత కోసం చెట్లను కొనడం, వ్యవసాయ భూములను కౌలుకు తీసుకోవడం, ఎరువులకు రావలసిన ధరలను గురించి చర్చించడం, మందులు తేవడం వంటివన్నీ వారిదే బాధ్యత. పొలంలో మంద తినడం కోసం కొమ్మలను నరకడం, గాయపడిన జంతువులను చూసుకోవడం కూడా వారి పనే.
ఏవైనా జంతువులు జబ్బుపడి ఉంటే, నేను వాటిని చూసుకుంటాను. ఆవులకు ఎండు మేతను తినిపిస్తాను, వంటగది నుంచి వచ్చే వ్యర్థాలను కూడా వాటి ఆహారంలో చేరుస్తాం. ఈ పని చేయడంలో మా అమ్మ కూడా నాతో కలిసివస్తుంది. గ్రామంలోని దుకాణం నుండి రేషన్ తీసుకురావడంలో కూడా ఆమె నాకు సహాయం చేస్తుంది.
జంతువులకు ఆహారం ఇచ్చిన తర్వాత, మేం తినడానికి కూర్చుంటాం. మా ఆహారంలో ఎక్కువగా ఏదో ఒక రూపంలో బజ్రా (సజ్జలు), గోధుమలు (రేషన్ దుకాణం నుండి తెచ్చినవి) మూంగ్ (పెసర పప్పు), లేదా మరొక పప్పు, కాలానుగుణంగా పండే కూరగాయలు, బక్రీ కే దూద్ కా దహీ (మేక పాల పెరుగు) ఉంటాయి. మేం ఇంట్లో తినే మూంగ్ , బజ్రా లను పండించేందుకు మాకు రెండు బిఘాల భూమి ఉంది.
కుర్కీ నుంచి, మా శిబిరంలోంచి వెళ్ళే ఇతర స్త్రీల లాగానే నేను కూడా ఎన్ఆర్ఇజిఎ (NREGA) పనిప్రదేశానికి వెళ్తాను. మాకు ఎన్ఆర్ఇజిఎ ద్వారా వారానికి రెండువేల రూపాయలు వస్తాయి. ఈ డబ్బు మాకు ఇంటి ఖర్చులను జరుపుకోవడంలో సహాయపడుతుంది
నేను విశ్రాంతి తీసుకోవడానికీ, ఇతర పనులను పూర్తి చేయడానికీ - బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం - ఇది సమయం. తరచుగా, సమీపంలోని ఇళ్ళ నుండి కూడా మహిళలు వస్తుంటారు. మేమంతా కలిసి కూర్చుని పనులు చేసుకుంటాం. కొన్ని శీతాకాలపు రోజులలో, మేం ఖీచియా (బియ్యపు పిండి అప్పడాలు), రాబొడీ (మొక్కజొన్న పిండిని మజ్జిగలో ఉడికించి తయారుచేసే అప్పడాలు)ని తయారుచేస్తాం.
చాలామంది యువకులకు ఈ (పశుపోషణ) పనిని కొనసాగించడానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. బాగా చదువుకోవాలని నేను చిన్న పిల్లలకు చెబుతూనే ఉంటాను. చివరికి, మేం మా మందలను అమ్ముకోవలసి రావచ్చు, ఆపైన వారేమో పనికోసం వెతుక్కోవలసి ఉంటుంది. ఇప్పటి కాలం వేరు.
సాయంత్రమయ్యేసరికి నేను అందరి కోసం వంట చేసి, మా జంతువులు తిరిగి రావటం కోసం ఎదురుచూస్తాను. సంధ్యాకాలపు మసక చీకటి వేళకు మా మంద ఇంటికి తిరిగిరావడంతో బాడా కు మళ్ళీ ప్రాణం వస్తుంది. నేను రోజులో చివరిసారి జంతువుల పాలు పితికి, వాటికి ఎండు మేత వేస్తాను. ఆ విధంగా నా రోజు ముగుస్తుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి