తన ఇంటి బయట ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొనివున్న సరూ విచారంగా కనిపిస్తోంది. ఆమె ఒళ్ళో ఉన్న చంటిబిడ్డ అశాంతిగా కదులుతూ, వచ్చీరాని మాటలాడుతున్నాడు. "నాకు ఏ రోజైనా బహిష్టు రావొచ్చు," అంటుందామె. "అప్పుడు నేను కుర్మా ఘర్ కి వెళ్ళాల్సివుంటుంది." 'బహిష్టు గుడిసె' అయిన ఈ కుర్మా ఘర్ లోనే ఆమె ఋతుస్రావం జరిగే ఆ నాలుగైదు రోజులు ఉంటుంది.
దగ్గరపడుతోన్న ఆ రోజు సరూను (అసలు పేరు కాదు) కలవరపెడుతోంది. " కుర్మా ఘర్ లో ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది, నేను నా పిల్లలకు దూరంగా అస్సలు నిద్రపోలేను కూడా," తన తొమ్మిది నెలల కొడుకును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ అందామె. ఆమెకు కోమల్ (అసలు పేరు కాదు) అనే కూతురు కూడా ఉంది. మూడున్నర సంవత్సరాల వయస్సున్న కోమల్ నర్సరీ పాఠశాలలో చదువుతోంది. “ఆమె పాళీ [ఋతు చక్రం] కూడా ఏదో ఒక రోజు మొదలవుతుంది; ఇది నన్ను భయపెడుతోంది,” తన కూతురు కూడా తమ మాడియా తెగ సంప్రదాయ పద్ధతులను భరించవలసి వస్తుందనే ఆదుర్దాతో ఉన్న 30 ఏళ్ళ సరూ చెప్పింది.
సరూవాళ్ళ గ్రామంలో నాలుగు కుర్మా గుడిసెలున్నాయి. అందులో ఒకటి ఆమె ఇంటికి 100 మీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఉంది. వీటిని ప్రస్తుతం గ్రామంలో ఋతుక్రమం సాగే 27 మంది తరుణ వయస్కులైన బాలికలు, మహిళలు ఉపయోగిస్తున్నారు. “నేను మా అమ్మనీ, అమ్మమ్మనీ కుర్మా ఘర్ కి వెళ్ళడం చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. ఈ పద్ధతి వలన కోమల్ బాధపడటం నాకు ఇష్టం లేదు,” అని సరూ చెప్పింది.
మాడియా ఆదివాసీ తెగలో ఋతుక్రమంలో ఉన్న స్త్రీలను అపవిత్రులుగానూ అంటరానివారుగానూ భావిస్తారు. బహిష్టు వచ్చినప్పుడు వారిని ఇంటి నుంచి దూరంగా పంపించివేస్తారు. "నాకు 13 ఏళ్ళప్పటి నుండి కుర్మా ఘర్ కి వెళుతున్నాను," అని సరూ చెప్పింది. అప్పుడామె మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తూర్పు ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండేది. ప్రస్తుతం ఆమె నివాసముంటోన్న ఇంటికి ఆ గ్రామం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గత 18 సంవత్సరాలలో, సరూ తన జీవితంలో దాదాపు 1,000 రోజులు - ప్రతి నెలా దాదాపు ఐదు రోజులు - స్నానాల దొడ్డి లేని, మంచినీరు, విద్యుత్తు, మంచం, ఫ్యాన్ లాంటివి ఏమీ లేని ఆ గుడిసెలో గడిపింది. “ఇక్కడ లోపలంతా చీకటిగా ఉండి, రాత్రివేళలు భయానకంగా ఉంటాయి. చీకటి నన్ను తినేస్తుందేమోనని అనిపిస్తుంటుంది,” అని ఆమె చెప్పింది. "నా ఇంటికి వేగంగా పరిగెత్తిపోయి నా పిల్లలను గట్టిగా గుండెకు హత్తుకోవాలనిపిస్తుంది... కానీ అలా చేయలేను."
కుర్మా ఘర్ లోపల - ఆమె గ్రామంలోని ఇతర మహిళలు కూడా దీనిని ఉపయోగిస్తారు - ఒక శుభ్రమైన గది, నొప్పితో బాధపెడుతున్న శరీరానికి విశ్రాంతినిచ్చే మెత్తని పడక, తన ప్రియమైనవారి వెచ్చదనాన్ని తలపింపజేసే ఒక దుప్పటి ఉండాలని సరూ ఆరాటపడుతుంది. కానీ మట్టి గోడలతో, వెదురు బొంగుల ఆధారం పైన మట్టిపెంకుల పైకప్పుతో ఉండే ఆ శిథిలమైన గుడిసె ఒక నిరుత్సాహాన్ని కలిగించే ప్రదేశం. ఆమె నిద్రపోవాల్సిన నేల కూడా ఎగుడుదిగుడుగా ఉంటుంది. “నేను వాళ్ళు [భర్త లేదా అత్తగారు] పంపే పల్చటి దుప్పటి పరచుకొని పడుకుంటాను. నేను వెన్నునొప్పి, తలనొప్పి, తిమ్మిర్లతో బాధపడుతున్నాను. ఆ పల్చటి దుప్పటి మీద పడుకోవడం అస్సలు సౌకర్యంగా ఉండదు,” అని ఆమె చెప్పింది.
సరూకి తన పిల్లల నుండి దూరంగా ఉండటం వల్ల కలిగే ఒంటరితనం, బాధల వల్ల అసౌకర్యం, నొప్పి మరింత పెరిగిపోతాయి. “నా దగ్గరివారు కూడా నా వేదనను అర్థం చేసుకోలేకపోవడం నాకు చాలా బాధను కలిగిస్తుంది,” అని ఆమె చెప్పింది.
ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక లక్షణాల పెరుగుదల మహిళల్లో ఋతుక్రమానికి ముందు, ఋతుక్రమ దశలకు అనుగుణంగా ఉంటుందని ముంబైకి చెందిన సైకోథెరపిస్ట్ డాక్టర్ స్వాతి దీపక్ చెప్పారు. “వీటి తీవ్రత ఒక మహిళ నుండి మరో మహిళకు భిన్నంగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు,” అని ఆమె అన్నారు. వివక్షకు గురికావడం, ఒంటరితనం చాలా బాధాకరమైనవి కాబట్టి, ఆ సమయంలో మహిళలు తమ కుటుంబం నుండి ఆప్యాయతనూ, సంరక్షణనూ పొందడం చాలా ముఖ్యం అని డాక్టర్ దీపక్ చెప్పారు.
మాడియా మహిళలు ఋతుస్రావం జరిగే సమయంలో వాడే బట్టతో చేసిన ప్యాడ్‌లను ఇంట్లో భద్రం చేసుకోవడానికి కూడా వారిని అనుమతించరు. "మేమంతా వాటిని గుడిసెలోనే వదిలేస్తాం," అని సరూ చెప్పింది. వాడేసిన లోపలి లంగాల నుంచి తయారుచేసిన గుడ్డ ముక్కలతో నిండిన ప్లాస్టిక్ సంచులను కుర్మా ఘర్ లో వదిలేస్తారు. వాటిని ఆ గుడిసె గోడల పగుళ్ళలో దూర్చటమో, లేదా వెదురు బద్దెకు వేలాడదీయటమో చేస్తారు "అక్కడ బల్లులు, ఎలుకలు తిరుగుతుంటాయి, అవి ఈ ప్యాడ్‌లపై కూర్చుంటాయి." కలుషితమైన ప్యాడ్‌లు చికాకు కలిగిస్తాయి, అంటువ్యాధికి కారణమవుతాయి.
గుడిసెకు కిటికీలు ఉండవు. దీంతో గాలీ వెలుతురూ లోపలికి ప్రవేశించకపోవటంతో గుడ్డతో చేసిన ప్యాడ్‌లు వాసన వస్తుంటాయి. "వానలు కురుస్తున్నపుడు ఇది మరీ అధ్వాన్నంగా ఉంటుంది," అని సరూ చెప్పింది. "నేను వర్షాకాలంలో (శానిటరీ) ప్యాడ్‌లను ఉపయోగిస్తాను, ఎందుకంటే గుడ్డతో చేసినవి సరిగ్గా ఆరవు," అంటుందామె. 20 ప్యాడ్‌లు ఉండే ఒక పొట్లం కోసం సరూ రూ. 90 ఖర్చుపెడుతుంది. అవి ఆమెకు రెండు నెలల పాటు ఉపయోగపడతాయి.
ఆమె వెళ్ళే కుర్మా ఘర్ కు కనీసం 20 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కానీ దాన్నెవరూ పట్టించుకోవటం లేదు. పైనున్న వెదురు చట్రంలోని బొంగులు చీలిపోయి మట్టి గోడలు బీటలువారాయి. “దీన్నిబట్టి ఈ గుడిసె ఎంత పాతదో మీరు ఊహించుకోవచ్చు. బహిష్టులో ఉండే స్త్రీల వల్ల ఇది కలుషితమవుతుంది కాబట్టి దీన్ని బాగుచేయడానికి ఏ మగవాడూ ఇష్టపడడు,” అని సరూ చెప్పింది. ఏదైనా మరమ్మతులు చేయాల్సిన అవసరం వస్తే మహిళలే చేయాల్సివుంటుంది
*****
గత నాలుగు సంవత్సరాల నుండి ఆమె ప్రజారోగ్య కార్యకర్త - గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ASHA)- అయినప్పటికీ సరూ బహిష్టు సమయంలో విడిగా ఉండటం నుండి తప్పించుకోలేకపోయింది. "నేను ఆశాగా పనిచేస్తాను, కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడి స్త్రీ, పురుషుల ఆలోచనలను మార్చలేకపోయాను," అని ఆమె చెప్పింది. ఋతుస్రావం గురించి ఉన్న మూఢనమ్మకాలే ప్రజలు ఈ ఆచారాన్ని విశ్వసించడానికి ప్రధాన కారణం అని సరూ వివరించింది. "ఇది [బహిష్టు అయిన స్త్రీలు ఇంట్లో ఉండటం] గ్రామదేవి (గ్రామ దేవత)కి కోపం తెప్పిస్తుందని, గ్రామం మొత్తం మా దేవుడి శాపానికి గురవుతుందని పెద్దలు చెబుతారు." ఆమె భర్త కళాశాల గ్రాడ్యుయేట్, "కానీ అతను కూడా కుర్మా వ్యవస్థకు మద్దతు ఇస్తాడు."
కుర్మా ఆచారాన్ని పాటించటంలో విఫలమైనప్పుడు గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి ఒక కోడినో మేకనో జరిమానాగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని పరిమాణంపై ఆధారపడి, ఒక మేక ఖరీదు రూ. 4000-5000 వరకూ ఉంటుందని సరూ చెప్పింది.
విడ్డూరమైన విషయం ఏమిటంటే, ఆమె బహిష్టు అయినప్పుడు ఇంట్లో ఉండకూడదు, కానీ సరూ ఆ రోజుల్లో కుటుంబానికి చెందిన పొలంలో పని చేయాలని, పశువులను మేపాలని ఆశిస్తారు. ఈ కుటుంబానికి రెండు ఎకరాల వర్షాధార వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వారు జిల్లాలో ప్రధాన పంట అయిన వరిని సాగు చేస్తారు. “ఇలా ఉండటం వల్ల నాకేదో విశ్రాంతి దొరికినట్లు కాదు. నేను ఇంటి బయటి పనులు చేస్తుంటాను; ఇది బాధిస్తుంది," అని ఆమె చెప్పింది. దీనిని ఆమె కపటత్వం అని పిలుస్తుంది, “కానీ దాన్ని ఆపడానికి ఏం చేయాలో? నాకు తెలియదు."
ఆశాగా పనిచేయడం ద్వారా సరూ నెలకు రూ. 2000-2,5000 వరకూ సంపాదిస్తోంది. కానీ, దేశమంతటా పనిచేసే ఆశాల లాగే ఆమెకు కూడా ఆ డబ్బులు అందవలసిన సమయానికి అందవు. చదవండి: ఆరోగ్య అనారోగ్య సమయాల్లోనూ గ్రామాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ఆశాలు . "ఆ డబ్బులు మూడు నాలుగు నెలల తర్వాత నా బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి," చెప్పిందామె.
ఈ ఆచారం సరూకీ, మిగిలిన మహిళలకూ చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ పురాతన కుర్మా పద్ధతిని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందని జిల్లాలలో ఒకటైన గడ్చిరోలిలోని దాదాపు అన్ని గ్రామాలలోనూ అనుసరిస్తారు. ఇక్కడి జనాభాలో మాడియాలతో సహా మొత్తం ఆదివాసీ సముదాయాల జనాభా 39 శాతంగా ఉంది. ఈ జిల్లా భూభాగంలో 76 శాతం భూమిలో అడవులు వ్యాపించి ఉన్నాయి. పరిపాలనా పరంగా ఈ జిల్లాను 'వెనుకబడినది’గా వర్గీకరించారు. నిషేధిత మావోయిస్టు దళాలు చురుగ్గా పనిచేసే ఈ కొండల ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా పహరా కాస్తుంటాయి.
జిల్లాలోని ఎన్ని గ్రామాలలో ఈ కుర్మా పద్ధతిని పాటిస్తున్నారనే దానిపై గడ్చిరోలీకి సంబంధించిన పత్రాలలో ఎటువంటి అధ్యయనం అందుబాటులో లేదు. "ఈ ఆచారాన్ని పాటిస్తోన్న 20 గ్రామాలను మేం గుర్తించగలిగాం," అన్నారు సమాజ్‌బంధ్ వ్యవస్థాపకులు సచిన్ ఆశా సుభాష్. పుణేకు చెందిన ఈ లాభాపేక్ష లేని సంస్థ 2016 నుండి గడ్చిరోలీలోని భామ్రాగడ్ తాలూకా లో పనిచేస్తోంది. సమాజ్‌బంద్ వాలంటీర్లు ఋతుక్రమం గురించిన శాస్త్రాన్నీ, పరిశుభ్రతను గురించీ ఆదివాసీ స్త్రీలకు; అలాగే కుర్మా గుడిసెల ద్వారా స్త్రీల ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి వయోజనులైన స్త్రీ పురుషులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది సవాళ్ళతో కూడుకున్న పని అని సచిన్ ఒప్పుకున్నారు. వారి అవగాహనా కార్యక్రమాలు, కార్యశాలలు (వర్క్‌షాప్‌లు) గట్టి వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. "వారిని ఒక్కసారిగా కుర్మా వ్యవస్థను ఆపేయాలని చెప్పటం సులభమేమీ కాదు. అది తమ సంస్కృతిలో భాగమనీ, బయటివాళ్ళు కల్పించుకోరాదనీ వాళ్ళు చెప్తారు." గ్రామాల్లోని పలుకుబడి ఉన్న భూమియా (గ్రామ పెద్ద) నుంచీ పెర్మా (ప్రధాన పూజారి) నుంచీ వీరి బృందానికి హెచ్చరికలూ బెదిరింపులూ వచ్చాయి. "మేం వారికి తెలియజెప్పే ప్రయత్నం చేశాం, ఎందుకంటే ఏ నిర్ణయంలోనూ మహిళలు తమ మాటను చెప్పుకోలేరు," అంటూ సచిన్ వివరించారు.
కాల క్రమేణా, కుర్మా గుడిసెలలో విద్యుత్తు, నీరు, టేబుల్ ఫ్యాన్లు, పడకలు ఏర్పాటు చేసేలా సచిన్, ఆయనతోటి వాలంటీర్లు కొంతమంది భూమియా లను ఒప్పించగలిగారు. మహిళలు తమ గుడ్డ ప్యాడ్‌లను ఇంట్లోనే మూసివుండే పెట్టెలలో భద్రపరచుకోవడానికి కూడా వారి సమ్మతిని పొందగలిగారు. "కొంతమంది భూమియాలు రాతపూర్వకంగా వీటిని అంగీకరించారు. కానీ కుర్మా ఘర్ కు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలను ఏకాకులను చేయరాదని వారిని ఒప్పించడానికి ఇంకా చాలా కాలం పడుతుంది," అన్నారతను.
*****
బెజుర్‌లో 10x10 అడుగుల కుర్మా గుడిసెలో పార్వతి తన పడకను సిద్ధం చేసుకుంటోంది. "నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు," ఇబ్బందిగా చెప్పింది ఆ 17 ఏళ్ళ బాలిక. 35 కుటుంబాలు, 200 మంది కంటే కొంచం తక్కువగా జనాభా ఉండే బెజుర్, భామ్రాగడ్ తాలూకా లోని ఒక చిన్న గ్రామం. అయితే ఆ గ్రామంలో తొమ్మిది బహిష్టు గుడిసెలున్నాయని అక్కడి మహిళలు చెప్పారు.
రాత్రివేళ, గోడలకు ఉన్న పగుళ్ళలోంచి పడే మసక వెన్నెల వెలుగులే కుర్మా ఘర్ లో ఉండే రోజుల్లో పార్వతికి సాంత్వన కలిగించేది. "అర్ధరాత్రి ఒక్కసారిగా లేచి కూర్చుంటాను. అడవిలోంచి వచ్చే జంతువుల శబ్దాలు నన్ను భయపెడతాయి," అంటుందామె.
విద్యుత్ సౌకర్యం కూడా ఉండి చక్కగా కట్టిన ఆమె ఒంటి అంతస్తు ఇల్లు ఈ గుడిసె నుంచి 200 మీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఉంది. "నేను నా ఇంట్లోనే సురక్షితంగా ఉన్నట్టు భావిస్తాను, ఇక్కడ కాదు. కానీ నా తల్లిదండ్రులు కీడు జరుగుతుందేమోనని భయపడతారు," దీర్ఘంగా నిట్టూరుస్తూ చెప్పింది పార్వతి. "మరో అవకాశం లేదు. ఈ నిబంధనల పట్ల గ్రామంలోని పురుషులు చాలా కఠినంగా ఉంటారు," అంటుందామె.
పార్వతి బెజుర్ గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో, గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా లో ఉన్న భగవంతరావ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 11వ తరగతి చదివే విద్యార్థిని. ఆమె అక్కడ ఒక వసతి గృహంలో ఉంటూ సెలవలప్పుడు ఇంటికి వస్తుంటుంది. "ఇంటికి రావాలంటే నాకు ఇష్టం ఉండదు. వేసవికాలంలో ఇక్కడ చాలా తీవ్రమైన వేడిగా ఉంటుంది. ఈ చిన్న గుడిసెలో నేను రాత్రంతా చెమటలుకక్కుతూనే ఉంటాను," అంటుందామె.
కుర్మా ఘర్ లో మహిళలు ఎదుర్కొనే కష్టాలలో మరుగుదొడ్లు, నీరు లేకపోవటం అత్యంత కఠినమైనవి. తన అవసరాలు తీర్చుకోవడానిక్ పార్వతి ఆ గుడిసె వెనుక ఉన్న పొదల్లోకి వెళ్ళాల్సొస్తోంది. "రాత్రివేళల్లో అక్కడ పూర్తిగా చీకటిగా ఉంటుంది, ఒంటరిగా వెళ్ళటం కూడా క్షేమమనిపించదు. పగటివేళల్లో అటువైపు ఎవరైనా వస్తారేమోనని గమనించుకుంటూ ఉండాలి," అంటోంది పార్వతి. శుభ్రంచేసుకోవడం కోసం, ఉతుక్కోవడం కోసం ఒక బక్కెట్ నీళ్ళను పార్వతి ఇంట్లోవాళ్ళు అక్కడికి తెచ్చిపెడతారు. ఒక స్టీలు కలశి (చెంబు)లో తాగటానికి నీరు ఉంచుతారు. "కానీ నేను స్నానం చేయలేను," చెప్పింది పార్వతి.
ఆమె తన ఆహారాన్ని గుడిసె బయట ఉన్న ఒక చుల్‌హా (మట్టి పొయ్యి) మీద వండుకుంటుంది. చీకట్లో వంట చేయటం అంత సులభమేమీ కాదని అంటుందామె. "ఇంట్లో మేం ఎక్కువగా ఎర్రమిరప పొడి, ఉప్పుతో కలిపి అన్నం తింటాం. లేదంటే మేక మాంసం, కోడి మాంసం, నది చేపలు..." తాము వాడుకగా తినే పదార్థాల జాబితాను చెప్పింది పార్వతి. ఆమె బహిష్టు అయినప్పుడు కూడా ఇవే తింటుంది కానీ అప్పుడు వీటిని ఆమే వండుకోవాల్సి ఉంటుంది. "ఆ రోజుల్లో ఇంటి దగ్గర నుంచి పంపిన వేరే వంట పాత్రలను ఉపయోగిస్తాం," అంది పార్వతి.
కుర్మా ఘర్ లో ఉన్నప్పుడు స్నేహితులతో గాని, ఇరుగుపొరుగువారితో గాని, కుటుంబ సభ్యులతో గాని మాట్లాడటం, కలవటం చేయకూడదు. "పగటివేళల్లో నేను గుడిసెలోంచి బయటకు రావటం, గ్రామంలో తిరగటం, ఎవరితోనైనా మాట్లాడటం లాంటివి చేయలేను," ఆంక్షల జాబితాను ఏకరువు పెట్టింది పార్వతి.
*****
బహిష్టు అయిన మహిళలను అపవిత్రులుగా భావించి, వారిని ఏకాంతంగా ఉంచటం భామ్రాగడ్‌లో ప్రమాదాలకూ మరణాలకూ దారితీస్తోంది. "గత ఐదేళ్ళలో కుర్మా ఘర్ లో ఉండగా పాము, తేలు కాటుల వలన నలుగురు మహిళలు మరణించారు," భామ్రాగడ్ శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి (సిడిపిఒ) ఆర్.ఎస్. చవాన్ తెలిపారు. ఆయన రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి విభాగానికి ప్రతినిధిగా ఉన్నారు.
కూలిపోతోన్న కుర్మా నిర్మాణాలకు బదులుగా, 2019లో జిల్లా అధికార యంత్రాంగం ఏడు 'ఇళ్ళను’ నిర్మించిందని చవాన్ చెప్పారు. ప్రతి గుడిసె ఒక్కసారే పదిమంది బహిష్టులో ఉన్న మహిళలు ఉండేందుకు సరిపోతుంది. గుండ్రటి ఆకారంలో నిర్మించిన ఈ ఇళ్ళకు గాలీ వెలుతురు చొరబడటం కోసం కిటికీలున్నాయి; వాటిలో స్నానాల గదులు, పడకలు, నీటి సరఫరా, విద్యుత్తు కూడా ఉంటాయి.
గడ్చిరోలీలో కుర్మా ఘర్‌ల స్థానంలో 23 మహిళల విశ్రాంతి కేంద్రాలు లేదా మహిళా విసావా కేంద్ర లను నిర్మిచినట్లు 2022 జూన్‌లో వెలువడిన ఒక ప్రభుత్వ పత్రికా ప్రకటన తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ సహాయం, మహారాష్ట్ర యునిసెఫ్ సాంకేతిక సహకారంతో రానున్న రెండేళ్ళలో 400 కేంద్రాల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసిందని ఈ ప్రకటన తెలిపింది.
కానీ మే, 2023లో భామ్రాగడ్‌లో ప్రభుత్వం నిర్మించిన మూడు కుర్మా గృహాలను – కృష్ణార్, కియార్, కుమార్‌గూడ గ్రామాలలో – PARI సందర్శించినప్పుడు అవి సగం మాత్రమే పూర్తయి, నివాసయోగ్యంగా లేకుండా కనిపించాయి. ఏడు కుర్మా గృహాలలో ఏదైనా పని చేస్తుందో లేదో ధృవీకరించలేకపోయిన సిడిపిఒ చవాన్, “ఇది ఖచ్చితంగా చెప్పడం కష్టం. అవును, నిర్వహణ దరిద్రంగా ఉంది. వాటిలో రెండింటి పరిస్థితి ఘోరంగా ఉంది. కొన్ని చోట్ల నిధుల కొరత కారణంగా వాటి నిర్మాణం పూర్తవలేదు," అన్నారు.
అయితే, కుర్మా వ్యవస్థని నిర్మూలించడానికి ఇటువంటి ప్రత్యామ్నాయం ఎలా సహాయపడుతుందనేది ప్రశ్న. "దీనిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది," అంటారు సమాజ్‌బంధ్‌కు చెందిన సచిన్ ఆశా సుభాష్. "ప్రభుత్వ కుర్మా గృహాలు ఇందుకు పరిష్కారం కాదు. ఒక విధంగా అది ప్రోత్సాహమివ్వటం."
బహిష్టుకు సంబంధించి వేరుగా ఉంచటమనేది ఏ రూపంలోని అంటరానితనాన్నయినా నిషేధించాలనే భారత రాజ్యాంగంలోని 17వ అధికరణాన్ని అతిక్రమిస్తోంది. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ కేసుకు సంబంధించి 2018లో సుప్రీంకోర్టు తన తీర్పులో ఇలా చెప్పింది: “ఋతుక్రమ స్థితి ఆధారంగా మహిళలను సామాజికంగా వెలివేయడమనేది అంటరానితనానికి ఒక రూపం. రాజ్యాంగ విలువలకు వెలి. వ్యక్తులకు కళంకాన్ని ఆపాదించే ‘స్వచ్ఛత, కాలుష్యం’ అనే భావనలకు రాజ్యాంగ క్రమంలో స్థానం లేదు.
అయినప్పటికీ, వివక్షతో కూడిన ఈ ఆచారం పితృస్వామిక క్రమం నీడలో మనుగడ సాగిస్తూనే ఉంది.
"ఇది దేవునికి సంబంధించిన విషయం. మా దేవుడు దీన్ని (ఈ ఆచారాన్ని) అనుసరించాలని కోరుకుంటాడు, మేం వాటికి అవిధేయంగా ఉంటే, వచ్చే పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది," భామ్రాగడ్ తాలూకా గోలాగూడా గ్రామానికి చెందిన పెర్మా - పారంపరిక ప్రధాన పూజారి - లక్ష్మణ్ హొయామి అన్నారు. "మాకు అనేక సంస్యలు వస్తాయి, ప్రజలు నష్టాల పాలవుతారు. జబ్బులు పెరిగిపోతాయి. మా గొర్రెలూ కోళ్ళూ చనిపోతాయి... ఇది మా సంప్రదాయం. మేం దీన్ని అనుసరించడాన్ని ఆపలేం. కరవు, వరద, ఇంకా మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు మమ్మల్ని శిక్షించే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకోలేం. ఈ సంప్రదాయం ఎప్పటికీ కొనసాగుతుంది..." దృఢంగా చెప్పాడాయన.
హొయామి వంటి అనేకమంది కుర్మా వ్యవస్థను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నా, కొందరు యువతులు మాత్రం ఆ బాటలో నడవకూడకూడదని నిశ్చయించుకున్నారు. కృష్ణార్ గ్రామానికి చెందిన 20 ఏళ్ళ అశ్విని వెళాంజే లాగా. “నేను కుర్మా ని అనుసరించబోను అనే షరతుతో పెళ్ళి చేసుకున్నాను. ఇది ఆగిపోవాల్సిందే,” అని 2021లో 12వ తరగతి పూర్తి చేసిన అశ్విని చెప్పింది. ఈ ఏడాది మార్చిలో 22 ఏళ్ళ అశోక్‌ను, తన షరతును అంగీకరించిన తర్వాత మాత్రమే, ఆమె వివాహం చేసుకుంది.
అశ్విని తనకు 14 ఏళ్ళ వయసప్పటి నుంచి కుర్మా ఆచారాన్ని పాటించింది. "నేను నా తల్లిదండ్రులతో వాదించేదాన్ని, కానీ సామాజిక ఒత్తిడి కారణంగా వాళ్ళు ఏం చేయలేకపోయేవారు," అన్నదామె. వివాహం తర్వాత అశ్విని తన బహిష్టు రోజులను ఇంటి వరండాలో గడుపుతోంది. తన కుటుంబంపై ఎక్కుపెట్టిన ఎత్తిపొడుపులను ఏమీ పట్టించుకోకుండా ఆమె ఈ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. "నేను కుర్మా ఘర్ నుంచి వరండా వరకూ వచ్చాను; త్వరలోనే నా బహిష్టు సమయాన్ని ఇంటి లోపలనే గడుపుతాను," అంటోంది అశ్విని. "నేను తప్పకుండా నా కుటుంబంలో మార్పు తెస్తాను."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి