ప్రకాశ్ బుందీవాల్ తన పాన్వారీ (తమలపాకు తోట) లో నిల్చొనివున్నారు. దట్టమైన వరుసలుగా ఉన్న సన్నని తమలపాకు తీగలకు హృదయాకారంలో ఉండే పాన్ (తమలం) ఆకులు కాస్తాయి; వీటిని తీక్ష్ణమైన వేడిమి నుంచీ, గాలుల నుంచీ కాపాడేందుకు ఒక సింథటిక్ వల పైకప్పుగా వేసివుంది.
పాన్ ఆకులు (తమలపాకులు) భారతదేశమంతటా ప్రజలు భోజనానంతరం వేసుకునే పాన్ (తాంబూలం) తయారీకి కీలకమైనవి. ఈ తాంబూలానికి ఒక తాజా పరిమళాన్నీ, రుచినీ అందించేందుకు సోఁఫ్ (సోంపు), సుపారి (పోకచెక్కలు), గుల్కంద్ (గులాబీరేకులతో చేసే తీపి పదార్థం) వంటి విత్తనాలు, ఎండు గింజలతో పాటు పచ్చటి తమలపాకులో చూనా (సున్నం), కత్థా (కాచు పొడి) వేసి చుడతారు.
11,956 మంది జనాభా ఉండే ఈ గ్రామం మంచి నాణ్యత కలిగిన పాన్ ఆకులకు పెట్టింది పేరు. కుక్దేశ్వర్లోని ఇతర కుటుంబాలకు లాగే ప్రకాశ్ కుటుంబం కూడా గుర్తున్నప్పటి కాలం నుంచీ ఈ ఆకులను సాగుచేస్తోంది. వీరు మధ్యప్రదేశ్లో ఒబిసి (ఇతర వెనకబడిన తరగతి) వర్గానికి చెందిన తంబోలి సముదాయానికి చెందినవారు. ప్రస్తుతం 60 ఏళ్ళు పైబడిన ప్రకాశ్, తనకు తొమ్మిదేళ్ళ వయసప్పటి నుంచీ ఈ పాన్వారీ లో పనిచేస్తున్నారు.
కానీ బుందీవాల్లకు చెందిన 0.2 ఎకరాల పొలంలో అంతా సజావుగా ఏంలేదు. 2023 మే నెలలో వచ్చిన బిపర్జాయ్ తుఫాను వలన వచ్చిన భారీ గాలులు ఈ చిన్న రైతుకు పెద్ద ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయి. "మాకు ఎటువంటి బీమా సౌకర్యాన్ని అందించలేదు సరికదా, ఈ తుఫాను గాలికి మొత్తం పంట నాశనమైపోయినా ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయాన్నీ ప్రకటించలేదు," అన్నారు ప్రకాశ్.
కేంద్రప్రభుత్వం దేశీయ వ్యవసాయ బీమా పథకం (NAIS) కింద వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు వాతావరణ సంబంధిత బీమాను అందిస్తోంది, అయితే ఆ పథకం కిందకు రాని ఉత్పత్తులలో తమలపాకులు కూడా ఒకటి.
తమలపాకులను పెంచటం చాలా శ్రమతో కూడుకున్న పని: " పాన్వారీ లో చాలా పని ఉంటుంది. మా సమయాన్నంతా అదే తినేస్తుంది," అన్నారు ప్రకాశ్ భార్య ఆశాబాయి బుందీవాల్. ఈ దంపతులు ప్రతి మూడు రోజులకు ఒకసారి తమ పొలానికి నీళ్ళు పెడుతుంటారు. "కొంతమంది రైతులు సాంకేతికంగా మెరుగైన కొత్త పద్ధతులను (పొలాలను సాగుచేయడానికి) ఉపయోగిస్తున్నారు, కానీ మాలో చాలామందిమి ఇంకా సంప్రదాయ పద్ధతి అయిన కుండతో నీరు పోసే పద్ధతి మీదనే ఆధారపడుతున్నాం," అన్నారు ప్రకాశ్.
పాన్ ను ప్రతి ఏడాది మార్చి నెలలో నాటుతారు. "ఇంటిలోనే దొరికే మజ్జిగ, ఉరాద్ దాల్ (మినప్పప్పు), సోయా చిక్కుళ్ళ పిండి వంటి పదార్థాలను మట్టిలో కలుపుతాం. మేం నెయ్యి కూడా కలిపేవాళ్ళం, కానీ ఇప్పుడది బాగా ఖరీదు అయిపోవడంతో కలపలేకపోతున్నాం," చెప్పారు ప్రకాశ్.
పాన్వారీ లో బేల్ (తీగలు)ను కత్తిరించే పనిని, ప్రతిరోజూ 5,000 వరకూ ఆకులను తెంపే పనిని ప్రధానంగా మహిళలే చేస్తారు. సింథటిక్ వలలకు మరమ్మత్తులు చేయటం, తీగలకు దన్నుగా వెదురు కర్రలను నిలబెట్టడం వంటి పనులను కూడా మహిళలే చేస్తారు.
"మగవాళ్ళు చేసే పనికి రెట్టింపు పనిని ఆడవాళ్ళు చేస్తారు," అంటారు వారి కోడలైన రాణు బుందీవాల్. 30 ఏళ్ళ వయసున్న ఈమె తన పదకొండవ ఏట నుంచి పాన్ తోటల్లో పనిచేస్తున్నారు. "మేం పొద్దున్నే 4 గంటలకంతా లేచి ఇంటిపనులను చేసుకొని, మొత్తం శుభ్రం చేసి వంటపని ముగించుకోవాలి." వాళ్ళు మధ్యాహ్న భోజనాన్ని కూడా తమతో తీసుకువెళ్ళాల్సివుంటుంది.
ఆ కుటుంబం 2000 ప్రారంభ సంవత్సరాల్లో తమ పాన్వారీ ని వేరేచోటికి మార్చుకున్నారు. "నీటి కొరత, భూమిలో నాణ్యత లేకపోవటంతో మేం మా తోటను మా ఇంటి నుంచి 6-7 కిలోమీటర్ల ఉన్న మరో ప్రదేశానికి మార్చుకున్నాం," అన్నారు ప్రకాశ్.
విత్తనం కోసం, నీటి పారుదల కోసం, అప్పుడప్పుడూ ఉపయోగించే పనివారి కోసం వాళ్ళు ఆ తోట మీద 2 లక్షల రూపాయల వరకూ ఖర్చుపెడతారు. "కొన్నిసార్లు రూ. 50,000 (ఒక ఏడాదిలో) రావటం కూడా కష్టమవుతుంది," అంటారు ప్రకాశ్. దీనితో పాటు వారికి ఇంకో 0.1 ఎకరం భూమి ఉంది. అందులో వాళ్ళు గోధుమలను, కొద్దిపాటి పళ్ళూ కూరగాయలను అదనపు ఆదాయం కోసం పెంచుతుంటారు.
మండీ లో అమ్మటం కోసం కోసిన ఆకుల నుండి పాడైపోయినవాటిని వేరుచేసి, మంచి ఆకులను కట్టలుగా కడతామని రాణు చెప్పారు. " పాన్ ఆకులను సరిచూసి కట్టలుగా కట్టడానికి ప్రతిరోజూ అర్ధరాత్రి దాటుతుంటుంది, ఒకోసారి తెల్లవారుఝాము 2 గంటల వరకూ కూడా మేం పనిచేస్తాం," అంటారు ఆశాబాయి.
ఉదయం 6.30 నుండి 7.30 వరకూ మండీ లో ఒక్కోటీ వంద పాన్ ఆకులతో కట్టిన కట్టలను అమ్ముతారు. "అమ్మేవాళ్ళు సుమారు వందమంది ఉంటే కొనేవాళ్ళు మాత్రం 8-10 మందే ఉంటారు," మండీ లో పాన్ ఆకులను అమ్మేందుకు వచ్చిన సునీల్ మోది అన్నారు. సాధారణంగా ఈ ఆకులు 2-3 రోజులకు పాడైపోతాయి, అందుకని "మేం తొందరతొందరగా వీటన్నిటిని అమ్మేయాలనే ఒత్తిడికి లోనవుతాం," అన్నారు 32 ఏళ్ళ సునీల్.
"ఈరోజు అంత చెడ్డగా ఏం లేదు, ఒక కట్ట 50 [రూపాయలు]కి అమ్మింది; మామూలు కంటే ఎక్కువే," అన్నారు సునీల్. "ఈ ఆకులను శుభప్రదమైనవిగా భావిస్తారు కాబట్టి వీటిని పెళ్ళిళ్ళలో పూజల లో ఉపయోగించటం వలన ఈ వృత్తి పెళ్ళిళ్ళకాలంలో లాభసాటిగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో జనం పాన్ కోసం దుకాణాలకు వెళ్తుండటం కొంత అవకాశాన్ని కలిగిస్తుంది, కానీ ఇది మందకొడి వ్యాపారమే," అంటారు సునీల్. ఇది సీజన్ మీద ఆధారపడి ఉంటుంది.
తమలపాకులకు వస్తోన్న మరో ఒత్తిడి చిన్న పొట్లాలలో లభిస్తోన్న పొగాకు. "ఇప్పుడెవరూ పాన్ (కిళ్ళీ, తాంబూలం)ని కొనాలనుకోవటంలేదు," ప్రకాశ్ పేర్కొన్నారు. ఒక పాన్ ధర రూ. 25-30 వరకూ ఉంటుంది, ఆ డబ్బుతో ఐదు పొగాకు పొట్లాలు వస్తాయి. " పాన్ వలన మరిన్ని ఆరోగ్య లాభాలు ఉన్నప్పటికీ, జనం చవగ్గా లభిస్తాయని పొగాకు పొట్లాలనే తింటున్నారు," అన్నారతను.
సౌరభ్ తోడావాల్ ఒకప్పుడు పాన్ రైతు. ఒడిదుడుకుల ఆదాయంతో విసిగిపోయిన ఆయన 2011లో తమలపాకు సాగును వదిలిపెట్టి ఇప్పుడొక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుకుంటున్నారు. ఈ దుకాణం ద్వారా ఆయన ఏడాదికి రూ. 1.5 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మొత్తం పాన్ రైతుగా ఆయన సంపాదించిన దానికంటే దాదాపు రెట్టింపు.
విష్ణుప్రసాద్ మోదీ పదేళ్ళ క్రితం
పాన్
సాగును వదిలిపెట్టి కంప్యూటర్ నిర్వహణను చేస్తున్నారు.
పాన్
సాగు లాభదాయకమైనది కాదని ఆయన అంటున్నారు: "ఈ (
పాన్
) సాగుకు తగిన సమయమంటూ లేదు. వేసవికాలంలో
ఆకులు
లూ
(తీవ్రమైన వడగాడ్పులు) వలన దెబ్బతింటాయి,
చలికాలంలో (తీగల) ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో పడే భారీ వర్షాలకూ, తుఫాను
గాలులకూ ఆకులు దెబ్బతినిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది."
ఏప్రిల్ 2023లో వారణాసి పాన్ కు జిఐ (భౌగోళిక గుర్తింపు) రావటం చూసిన ప్రకాశ్ కుమారుడు ప్రదీప్, "ప్రభుత్వం మాకు కూడా జిఐ ఇవ్వాలని కోరుకుంటున్నా. అలా ఇస్తే అది మా వ్యాపారానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది," అన్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి