“ఓసబ్ వోట్-టోట్ ఛడో. సంధ్యా నమార్ ఆగే అనేక్ కాజ్ గో... [ఏంటీ వోటూ గీటూ! చీకటి పడేలోగా పూర్తిచేయాల్సినవి వెయ్యిన్నొక్క పనులున్నాయి...] రా, ఈ కంపు భరించగలిగితే వచ్చి మాతో కూర్చో," తన పక్కనే ఉన్న నేలను చూపిస్తూ అన్నారు మాలతి మాల్. వేడినీ ధూళినీ లెక్కచేయకుండా, ఒక పెద్ద ఉల్లిపాయ గుట్ట చుట్టూ కూర్చుని పని చేస్తూన్న మహిళల సమూహంలోకి వచ్చి చేరమని ఆమె నన్ను ఆహ్వాని స్తున్నారు. నేను దాదాపు వారం రోజులుగా గ్రామంలోనే తిరుగుతూ, ఈ మహిళలను వెంబడిస్తూ, రాబోయే ఎన్నికల గురించి వారికి ప్రశ్నలు వేస్తున్నాను.
అది ఏప్రిల్ నెల ప్రారంభం. పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్‌లోని ఈ ప్రాంతంలో పాదరసం ప్రతిరోజూ 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. సాయంత్రం 5 గంటలకు కూడా ఈ మాల్ పహాడియా గుడిసెలో వేడిగా ఉంది. చుట్టుపక్కల ఉన్న కొద్దిపాటి చెట్లకున్న ఆకు కూడా కదలటంలేదు. బరువుగా, ఘాటుగా ఉన్న తాజా ఉల్లిపాయల వాసన గాలిలో తేలాడుతూ ఉంది.
తాత్కాలికంగా నిర్మించుకున్న తమ ఇళ్ళకు 50 మీటర్ల దూరంలో ఉన్న ఆ బహిరంగ ప్రదేశం మధ్యలో ఉన్న ఉల్లిపాయల గుట్ట చుట్టూ ఈ మహిళలు అర్ధచంద్రాకారంలో కూర్చునివున్నారు. కొడవలితో కాడల నుండి ఉల్లిపాయలను వేరు చేయడంలో వారు నిమగ్నమై ఉన్నారు. పెరిగిపోతోన్న మధ్యాహ్నపు వేడిలో వారు పడుతోన్న శ్రమ, పచ్చి ఉల్లిపాయల ఆవిరితో కలిసి వారి ముఖాలకొక ప్రకాశాన్నిస్తోంది.
"ఇది మా దేశ్ [స్వగ్రామం] కాదు. గత ఏడెనిమిదేళ్ళుగా మేం ఇక్కడకు వస్తున్నాం," 60 ఏళ్ళ వయసు దాటిన మాలతి అన్నారు. ఆమెతో సహా ఆ బృందంలోని మహిళలంతా మాల్ పహాడియా ఆదివాసీ సముదాయానికి చెందినవారు. అధికారికంగా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న ఈ సముదాయం అత్యంత దుర్బలమైన ఆదివాసీ సమూహాలలో ఒకటిగా పేరుపొందింది.
"మా ఊరు గొవాస్ కాళికాపూర్‌లో మాకు పనులు లేవు," అన్నారామె. ముర్షిదాబాద్ జిల్లా రాణినగర్ 1 బ్లాక్‌లోని గొవాస్‌కు చెందిన 30కి పైగా కుటుంబాలు ఇప్పుడు బిషుర్‌పుకూర్ గ్రామం అంచుల వద్ద నిర్మించుకున్న తాత్కాలిక గుడిసెల సమూహంలో నివసిస్తూ, స్థానికుల పొలాల్లో పని చేస్తున్నాయి.
మే 7న జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయడానికి వారు తమ గ్రామానికి తిరిగి వెళ్ళాల్సి ఉందని వారు నాతో చెప్పారు. గొవాస్ కాళికాపూర్ బిషుర్‌పుకూర్ కుగ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాణినగర్ 1 బ్లాక్ నుండి బేల్‌డాంగా 1 బ్లాక్‌లోని వారి ప్రస్తుత స్థావరానికి సాగుతోన్న మాల్ పహాడియాల అంతర్- తాలూకా వలసలు, జిల్లాలో కార్మికుల వలసలు ఎంత అనిశ్చితంగా ఉన్నాయో చూపిస్తున్నాయి
మాల్ పహాడియా ఆదివాసులు పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో చెల్లాచెదురుగా స్థావరాలను ఏర్పాటుచేసుకున్నారు. ఒక్క ముర్షిదాబాద్‌లోనే 14,064 మంది నివసిస్తున్నారు. “రాజ్‌మహల్ కొండల పరిసర ప్రాంతాలలో మా సముదాయపు అసలు నివాస స్థలం జాడలున్నాయి. మా ప్రజలు ఝార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు [రాజ్‌మహల్ కొండలు ఉన్నచోట], పశ్చిమ బెంగాల్‌కు వలస వెళ్లారు,” అని ఝార్ఖండ్‌లోని దుమ్కాకు చెందిన ఈ సముదాయానికి చెందిన విద్యావేత్త, కార్యకర్త రామ్‌జీవన్ అహరి చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లోలా కాకుండా ఝార్ఖండ్‌లో మాల్ పహాడియాలను ప్రత్యేకించి దుర్బలురైన ఆదివాసీ వర్గం (పివిజిటి)గా జాబితా చేశారని రామ్‌జీవన్ ధృవీకరించారు. "ఒకే సముదాయానికి రెండు వేరు వేరు రాష్ట్రాలలో ఉన్న విభిన్న స్థాయిలు ఆ సముదాయపు దుర్బలత్వం గురించి ఆయా ప్రభుత్వాలు తీసుకునే వైఖరిని ప్రతిబింబిస్తాయి," అన్నారాయన.
"ఇక్కడి జనాలకు వాళ్ళ పొలాల్లో పనిచేయడానికి మేం అవసరం," తాము ఇంటికి దూరంగా ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారో వివరించారు మాలతి. "నాట్లు, కోతల సమయంలో మేం రోజుకు 250 రూపాయలు సంపాదిస్తాం." అప్పుడప్పుడూ ఎవరైనా ఉదారుడైన రైతు నుండి ఒక భాగం తాజా పంట కూడా లభిస్తుంటుందని ఆమె చెప్పారు.
ముర్షిదాబాద్ జిల్లా నుంచి పని కోసం వెతుక్కుంటూ అనేకమంది దినసరి కూలీలు బయటికి వెళ్ళిపోవటంతో ఇక్కడ పనిచేసేందుకు వ్యవసాయ కూలీల కరవు తీవ్రంగా ఉంది. ఆదివాసీ రైతులు ఆ లోటును కొంతవరకూ పూడ్చగలుగుతున్నారు. బేల్‌డాంగా 1 బ్లాక్‌కు చెందిన వ్యవసాయ శ్రామికులు రోజుకు రూ. 600 కూలిగా తీసుకుంటుండగా, అంతర్- తాలూకా ఆదివాసీ వలస శ్రామికులు, అందులోనూ ఎక్కువమంది మహిళలు, అందులో సగం కూలికే పనిచేస్తారు.
"కోసిన ఉల్లిపాయలను పొలం నుంచి గ్రామానికి తీసుకువెళ్ళగానే, ఆ తర్వాత చేయాల్సిన పనిని మేం చేస్తాం," ఉల్లిపాయలు కోసే అంజలి మాల్ చెప్పింది. బక్కపలుచగా ఉన్న అంజలి వయసు 19 ఏళ్ళు.
రాష్ట్రమంతటితో పాటు దూర ప్రదేశాలకు కూడా ఉల్లిపాయలను రవాణా చేసి ఫరియాల కు (మధ్య దళారులు) అమ్మేందుకు వారు వాటిని సిద్ధంచేస్తారు. "కొడవలితో కోసి ఉల్లిపాయలను కాడల నుంచి వేరు చేసి, ఊడివచ్చిన ఉల్లితొక్కునీ, వాటికి అంటివుండే మట్టినీ వేర్లనూ తీసిపారేస్తాం. ఆ తర్వాత శుభ్రంచేసిన వాటన్నిటినీ బస్తాలకు నింపుతాం." 40 కిలోగ్రాముల బరువుండే బస్తాకు వారికి 20 రూపాయలు వస్తాయి. "మేం ఎంత ఎక్కువ పనిచేస్తే అంత ఎక్కువ సంపాదిస్తాం. అందుకే మేం రోజంతా పనిచేస్తూనే ఉంటాం. ఇది పొలం పని కంటే వేరుగా ఉంటుంది," పొలం పనిలో నిర్ణీత గంటలపాటు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.
సాధన్ మండల్, సురేశ్ మండల్, ధను మండల్, రాఖోహరి బిశ్వాస్- వీరంతా బిషుర్‌పుకూర్‌లో ఆదివాసీలను పనిలోకి పెట్టుకునే రైతులు. ఏడాది పొడవునా "అప్పుడో ఇప్పుడో" వ్యవసాయ పనులు చేసేవారి అవసరం ఉంటుందని వారంటారు. పంట కోతల కాలంలో వారి అవసరం ఎక్కువగా ఉంటుంది. గ్రామాలలోని ఈ ప్రాంతాలలో పనిచేయటానికి మాల్ పహాడియా, సంథాల్ ఆదివాసులైన మహిళలు ఎక్కువగా వస్తుంటారని ఈ రైతులు మాతో చెప్పారు. ఈ విషయంలో వారంతా ఏకాభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు: "వాళ్ళు లేకుండా మేం వ్యవసాయం చేయగలిగేవాళ్ళం కాదు."
ఈ పని నిజంగా తీరిక చిక్కకుండా ఉంటుంది. "మాకు మధ్యాహ్నం వంట చేసుకోవటానికి కూడా సమయం చిక్కదు..." ఉల్లిపాయల పని చేస్తూనే అన్నారు మాలతి. " బేళా హోయె జాయ్. కొనొమొతే దుతో చాఁల్ ఫుటియే ని. ఖాబార్ దాబారేర్ అనేక్ దామ్ గో [తినడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఎలాగో కొంచెం బియ్యాన్ని ఉడకేసుకుంటాం. తిండి వస్తువులు ఇప్పుడు చాలా ఖరీదుగా ఉన్నాయి]." ఆ రోజుకి పొలంలో పని అయిపోయాక మహిళలు ఇంటిపనులు చేసుకోవాలి: ఊడవటం, స్నానానికి వెళ్ళే ముందు ఉతకటం, గిన్నెలు శుభ్రం చేయటం, ఆ తర్వాత చటచటమని రాత్రి భోజనం తయారుచేయటం.
"మాకెప్పుడూ బలహీనంగా అనిపిస్తుంటుంది," అన్నారామె. అందుకు కారణమేమిటో ఇటీవలి దేశీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) మనకు చెప్తోంది. ఈ జిల్లాలోని మొత్తం మహిళల్లో పిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోందని ఈ సర్వే మనకు చూపిస్తోంది. ఇంకా, ఐదేళ్ళ లోపు పిల్లల్లో 40 శాతం మంది సరైన ఎదుగుదల లేక గిడసబారిపోయారు.
వాళ్ళకిక్కడ రేషన్ వస్తోందా?
"లేదు, మా రేషన్ కార్డులు మా గ్రామం వరకే. మా కుటుంబ సభ్యులు మా రేషన్ తీసుకుంటారు. మేం మా ఇళ్ళకు వెళ్ళినప్పుడు, కొన్ని తిండిగింజల్ని మాతో ఇక్కడకు తెచ్చుకుంటాం," మాలతి వివరించారు. ఆమె ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా తమకు వచ్చే సరుకుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. "మేమిక్కడ సాధ్యమైనంతవరకూ ఏమీ కొనకుండా, మిగిల్చిన ఆ డబ్బుని ఊళ్ళో ఉన్న మా కుటుంబాలకు పంపే ప్రయత్నం చేస్తాం," అన్నారామె.
ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ (ONORC) వంటి దేశవ్యాప్త ఆహార భద్రతా పథకాలు తమలాంటి అంతర్గత వలసదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని తెలుసుకుని ఈ మహిళలు ఆశ్చర్యపోయారు. “దీని గురించి మాకెవరూ చెప్పలేదు. మేం చదువుకోలేదు. మాకెలా తెలుస్తుంది?" అని మాలతి అడిగారు.
"నేనెప్పుడూ బడికి వెళ్ళలేదు," చెప్పింది అంజలి. "నాకు ఐదేళ్ళ వయసప్పుడే మా అమ్మ చనిపోయింది. ముగ్గురు కూతుళ్ళను మా నాన్న వదిలేసిపోయాడు. మా పొరిగింటివాళ్ళే మమ్మల్ని పెంచారు," అందామె. ముగ్గురు తోబుట్టువులు వ్యవసాయ కూలీలుగా చాలా చిన్న వయసునుంచే పనిచేయటం మొదలెట్టారు, యుక్తవయసు రాగానే ముగ్గురికీ పెళ్ళిళ్ళయ్యాయి. 19 ఏళ్ళ అంజలికి మూడేళ్ళ కూతురు అంకిత ఉంది. "నేనెప్పుడూ చదువుకోలేదు. ఎలాగో నామ్-సొయి (సంతకం పెట్టటం) నేర్చుకున్నాను," అందామె. తమ సముదాయంలోని అనేకమంది టీనేజర్లు మధ్యలో బడి మానేసినవారేననీ, తన తరం వాళ్ళెవరికీ అక్షరాలు కూడా తెలియవనీ చెప్పిందామె.
"నా కూతురు కూడా నాలాగే అవ్వాలని నేను అనుకోవటంలేదు. వచ్చే ఏడాది ఆమెను బడిలో వేయగలననుకుంటున్నాను. లేదంటే ఆమె ఏమీ నేర్చుకోలేదు." ఆమె మాటల్లో ఆదుర్దా స్పష్టంగా కనిపిస్తోంది.
ఏ బడి? బిషుర్‌పుకూర్ ప్రాథమిక పాఠశాలా?
"కాదు. మా పిల్లలు ఇక్కడి బడులకు వెళ్ళరు. మరీ చిన్నపిల్లలు కూడా ఖిచురీ బడికి ( అంగన్‌వాడీ ) వెళ్ళరు," చెప్పిందామె. విద్యాహక్కు చట్టం (RTE) ఉన్నప్పటికీ, సమాజంలో వారు ఎదుర్కొంటోన్న వివక్ష, న్యూనతాభావం అంజలి మాటల్లో దాగి ఉంది. “ఇక్కడ మీరు చూస్తోన్న పిల్లల్లో చాలామంది బడికి వెళ్ళరు. వారిలో కొందరు గొవాస్ కాళికాపూర్‌కు తిరిగివెళ్తారు. కానీ మాకు సహాయం చేయడం కోసం మళ్ళీ ఇక్కడకు వస్తూనే ఉంటారు, దాంతో వారు తరగతులను కోల్పోతారు.”
మొత్తంగా మాల్ పహాడియాలలో 49.10 శాతం, ప్రత్యేకించి వారి మహిళలలో 36.50 శాతం - చాలా తక్కువ - అక్షరాస్యత ఉందని 2022 నాటి ఒక అధ్యయనం చెప్తోంది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆదివాసీలలో అక్షరాస్యతా శాతం పురుషులలో 68.17 గానూ, స్త్రీలలో 47.71 గానూ ఉంది.
ఐదారేళ్ళున్న పసిపాపలు కూడా ఉల్లిపాయలను ఏరి, పేము బుట్టల్లో పెట్టడంలో వాళ్ళ అమ్మలకూ అమ్మమ్మలకూ నాయనమ్మలకూ సాయం చేయడాన్ని నేను చూశాను. ఇద్దరబ్బాయిలు పేము బుట్టల్లోని ఉల్లిపాయలను పెద్ద ప్లాస్టిక్ గోతాల్లోకి తిరగబోస్తున్నారు. వయస్సు, జెండర్, పనికి అవసరమైన శారీరక బలాన్ని బట్టి శ్రమ విభజన జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. " జొతో హాత్, తొతో బొస్తా, తొతో టాకా (ఎక్కువ చేతులుంటే ఎక్కువ సంచులు నింపుతాం, ఎక్కువ డబ్బు వస్తుంది)," అని అంజలి నా కోసం కొద్ది మాటల్లో వివరించింది.
అంజలి లోక్‌సభ ఎన్నికలలో మొదటిసారిగా వోటు వేయబోతోంది. "నేను గ్రామ పంచాయతీ ఎన్నికలలో వోటు వేశాను. కానీ పెద్ద ఎన్నికలకు వేయటం ఇదే మొదటిసారి!" నవ్వింది అంజలి. "నేను వెళ్తాను. ఈ బస్తీ లోని అందరూ వోటు వేయటానికి గ్రామానికి వెళ్తారు. లేదంటే వాళ్ళు మమ్మల్ని మర్చిపోతారు..."
మీ పిల్లలకు విద్య కోసం మీరు డిమాండ్ చేస్తారా?
"ఎవర్ని డిమాండ్ చేస్తాం?" కొద్దిసేపు ఆగి, తన ప్రశ్నకు తనే జవాబిచ్చింది అంజలి. "మాకిక్కడ [బిషుర్‌పుకూర్‌లో] వోట్లు లేవు. అందుకని, ఇక్కడ మమ్మల్నెవరూ పట్టించుకోరు. మేం ఏడాది పొడవునా అక్కడ [గొవాస్‌లో] ఉండం కాబట్టి, అక్కడా మేమేమీ అడగలేం. అమ్రా నా ఎఖనేర్, నా ఒఖనేర్ [మేం అక్కడికీ, ఇక్కడికీ కూడా చెందనివాళ్ళం]."
ఎన్నికలలో అభ్యర్థుల నుంచి ఏమి అపేక్షించాలో తనకు తెలియదని ఆమె చెప్పింది. "ఐదేళ్ళు వచ్చేసరికి అంకితను బడిలో చేర్చాలని, ఆ సమయానికి ఆమెతో పాటు మా ఊరిలోనే ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి తిరిగి రావాలని లేదు నాకు. ఏమో ఎవరికి తెలుసు?" నిట్టూర్చింది అంజలి.
"పని లేకపోతే మాకు బతుకు లేదు," అంజలి అనుమానాలనే తానూ వ్యక్తం చేస్తూ చెప్పింది 19 ఏళ్ళ మధుమిత మాల్. "మా పిల్లలను బడిలో వెయ్యకపోతే వాళ్ళు మాలాగే ఉండిపోతారు," ఆమె మాటల్లో బాధ నిండిన ఖచ్చితత్వం ధ్వనించింది. ఆదివాసీ పిల్లలలో విద్యను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆశ్రమ హాస్టల్ , లేదా శిక్షాశ్రీ వంటి ప్రత్యేక పథకాల గురించి కానీ; కేంద్రం నడిపిస్తోన్న ఏకలవ్య మోడల్ డే బోర్డింగ్ స్కూల్స్ (EMDBS) వంటివాటి గురించి గానీ ఈ యువ తల్లులకు తెలియదు.
బహరమ్‌పూర్ నియోజకవర్గంలో 1999 నుంచీ కాగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఆ నియోజకవర్గం కిందికే వచ్చే బిషుర్‌పుకూర్ గ్రామంలోని ఆదివాసీ పిల్లల విద్య కోసం ఆ పార్టీ చేసిందేమీ లేదు. కేవలం వారి 2024 మేనిఫెస్టోలో మాత్రమే ప్రతి బ్లాక్‌లోనూ పేద వర్గాల పిల్లలకు, ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలకూ, షెడ్యూల్డ్ తెగలకూ చెందినవారికి, ఆశ్రమ పాఠశాలలను నెలకొల్పుతామని వారు వాగ్దానం చేశారు. కానీ ఈ మహిళలకు వీటి గురించి ఏమీ తెలియదు.
"వాటి గురించి ఎవరైనా మాకు చెప్పకపోయుంటే, మాకెప్పటికీ తెలిసేదే కాదు," మధుమిత చెప్పింది.
"అక్కా, మాకు అన్ని కార్డులూ ఉన్నాయి - వోటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి కార్డు, స్వాస్థ్య సాథీ బీమా కార్డు, రేషన్ కార్డు," చెప్పింది 19 ఏళ్ళ సోనామణి మాల్. ఈమె కూడా తన ఇద్దరు పిల్లలను బడిలో చేర్చాలని తహతహలాడుతోన్న ఒక యువ తల్లి. " నేను వోటు వేసేదాన్నే, కానీ ఈసారి వోటర్ల జాబితాలో నా పేరు లేదు."
" వోట్ దియే అబార్ కీ లాభ్ హోబే? [వోటేస్తే నీకేం వస్తుంది?] నేను ఎన్నేళ్ళ నుంచో వోటు వేస్తూనే ఉన్నాను," అక్కడున్న మహిళలందరిలో నవ్వులు పూయిస్తూ ప్రతివాదం చేశారు, 80 ఏళ్ళకు చేరువవుతోన్న సావిత్రీ మాల్ (అసలు పేరు కాదు)
"నాకు వచ్చేదల్లా వెయ్యి రూపాయల వృద్ధాప్య పంఛను. ఇంకేం లేదు. మా ఊళ్ళో పని లేదు, కానీ మా వోట్లు మాత్రం అక్కడే ఉన్నాయి," అన్నారామె. "మూడేళ్ళ నుండి వాళ్ళు మా ఊర్లో ఏక్‌షో దినేర్ కాజ్ కూడా ఇవ్వలేదు," ఆక్షేపించారు సావిత్రి. ఆమె మాటలకర్థం, 'వంద రోజుల పని' అని. ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ పథకాన్ని స్థానికంగా అలానే అంటారు.
"ప్రభుత్వం నా కుటుంబానికి ఒక ఇల్లు ఇచ్చింది," ప్రధాన్ మంత్రి యోజన పథకాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది అంజలి. "కానీ మాకక్కడ పనులేమీ లేకపోవడం వలన మేమక్కడ ఉండలేకపోతున్నాం. మాకు ఏక్‌షో దినేర్ కాజ్ ఉండివుంటే నేనిక్కడకు వచ్చేదాన్నే కాదు," అంటుందామె
చాలా పరిమితమైన జీవనోపాధి అవకాశాలు ఉండటం ఈ భూమిలేని సముదాయాన్ని అనేక దూరాలకు వలసపోయేలా చేస్తోంది. గొవాస్ కాళికాపూర్‌కు చెందిన చాలామంది యువకులు పని కోసం వెతుక్కుంటూ బెంగళూరు, కేరళ వంటి సుదూర ప్రాంతాలకు వలసపోతారని సావిత్రి మాతో చెప్పారు. ఒక నిర్దిష్ట వయసుకు వచ్చిన మగవాళ్ళు తమ ఊరికి దగ్గరలోనే పనులు చేయాలని కోరుకుంటారు, కానీ వారికి అక్కడ తగినన్ని వ్యవసాయ పనులు ఉండవు. చాలామంది వారి రాణీనగర్ 1 బ్లాక్‌లో ఉన్న ఇటుక బట్టీలలో పనిచేసి సంపాదిస్తుంటారు.
"ఇటుక బట్టీలలో పనిచేయడానికి సిద్ధపడని మహిళలు తమ చంటిపిల్లలతో కలిసి ఇతర గ్రామాలకు వెళ్తుంటారు," చెప్పారు సావిత్రి. "ఈ వయసులో నేను భాటా [భట్టీలు]లలో పనిచేయలేను. నా కడుపులో ఇంత పడేసుకోవడానికి నేనిక్కడకు రావటం మొదలెట్టాను. మా మకాంలో ఉన్న నాలాంటి ముసలివారి వద్ద కొన్ని మేకలు కూడా ఉన్నాయి. నేను వాటిని మేపుకు తీసుకువెళ్తాను," అన్నారామె. వారి బృందం నుంచి ఎవరైనా వీలుచేసుకున్నపుడు, వాళ్ళు "తిండిగింజలను తీసుకురావడానికి గొవాస్‌కు వెళ్తారు. మేం పేదవాళ్ళం; ఏమీ కొనలేం."
ఉల్లిపాయల పంటకాలం ముగిసిన తర్వాత వాళ్ళేం చేస్తారు? గొవాస్‌కు తిరిగివెళ్తారా?
"ఉల్లిపాయలను కోసి, మూటలు కట్టిన తర్వాత, ఇక అది నువ్వులు, జనపనార, కొద్దిగా ఖొరార్ ధాన్ [పొడి కాలంలో పండించే ధాన్యం] విత్తే సమయం," చెప్పింది అంజలి. నిజానికి, "పిల్లలతో సహా ఎక్కువమంది ఆదివాసీలు చురుగ్గా డబ్బు చేసుకునేందుకు తమ సాముదాయిక మకాంలకు చేరుకొంటారు" సంవత్సరంలో ఇప్పటి నుండి జూన్ మధ్య వరకు, వ్యవసాయ పనులకు బాగా డిమాండ్ పెరుగుతుందని ఆమె చెప్పింది.
పంటకీ పంటకీ మధ్య వ్యవసాయ ఉపాధి చాలా తక్కువ గా ఉండటం వలన వారికి కూలీ పని తక్కువ రోజుల పాటు ఉంటుందని ఈ యువ వ్యవసాయ కూలీ వివరించింది. కానీ సంచార వలసదారుల మాదిరిగా కాకుండా, వారు అక్కడే ఉంటారు తప్ప వారి స్వగ్రామానికి తిరిగి వెళ్ళరు. “మేం జోగాడేర్ కాజ్, ఠీకేర్ కాజ్ [తాపీ పనివారికి సహాయకులుగా, కాంట్రాక్ట్ పని చేస్తాం], ఏది దొరికితే అది చేస్తాం. గుడిసెలు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాం. ఒక్కో గుడిసెకు నెలకు 250 రూపాయలు ఈ భూమి యజమానికి చెల్లిస్తాం," అని అంజలి చెప్పింది.
"ఎవరూ ఎప్పుడూ ఇక్కడకు వచ్చి మేమెలా ఉన్నామో చూడలేదు. ఏ నాయకుడూ, ఎవరూ... నువ్వెళ్ళి చూసిరా," అన్నారు సావిత్రి.
నేను గుడిసెల వైపుకు దారితీసే ఇరుకైన గతుకుల దారివెంట నడిచాను. 14 ఏళ్ళ సోనాలీ నాకు దారిచూపుతోంది. ఆమె తన గుడిసెకు 20 లీటర్ల బకెట్‌తో నీటిని మోసుకువెళుతోంది. “నేను చెరువులో స్నానానికి వెళ్ళి ఈ బకెట్ నింపాను. మా బస్తీలో నీళ్ళు లేవు. చెరువు మురికిగా ఉంటుంది. కానీ ఏం చేయాలి?" ఆమె చెప్తోన్న నీటి తావు సెటిల్‌మెంట్ నుండి 200 మీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో జనపనార పంటను కోసిన తర్వాత నార తీసేందుకు ఈ చెరువులోనే ఊరబెడతారు. ఆ నీటిలో బ్యాక్టీరియా, మనుషులకు హానిచేసే రసాయనాలు ఉన్నాయి.
"ఇదే మా ఇల్లు. ఇక్కడ నేను మా బాబా (తండ్రి)తో కలిసి ఉంటాను," పొడి బట్టల్లోకి మారటానికి గుడిసె లోపలికి వెళ్తూ చెప్పిందామె. నేను బయటే నిలబడ్డాను. వెదురు చువ్వలనూ, జనపనార కర్రలనూ వదులుగా కలిపికట్టి, దానికి లోపలివైపున ఒక పొర మట్టినీ ఆవు పేడనూ మెత్తి, గోడలుగా కట్టిన ఆ చిన్న గుడిసె ఎలాంటి చాటునూ ఇవ్వలేకపోతోంది. వెదురు బొంగుల ఆధారంగా నిలబడి ఉన్న పైకప్పును వెదురు బద్దెలతోనూ, గడ్డితోనూ కట్టి, టార్పాలిన్ పట్టాలను కప్పారు.
"లోపలికి రావాలనుకుంటున్నావా?" జుట్టు దువ్వుకుంటూ బిడియంగా అడిగింది సోనాలీ. పైకప్పు కర్రల మధ్య ఖాళీల గుండా లోపలికి పాకుతోన్న పలుచని పగటి వెలుగులో ఆ 10x10 అడుగుల గుడిసె బోసిగా కనిపిస్తోంది. "అమ్మ నా తోబుట్టువులతో కలిసి గొవాస్‌లోనే ఉంటుంది," అందామె. ఆమె తల్లి రాణీనగర్ 1 బ్లాక్‌లోని ఒక ఇటుక బట్టీలో పనిచేస్తారు.
"నాకు మా ఇంటి మీద బెంగగా ఉంటుంది. మా అత్త కూడా తన కూతుళ్ళతో కలిసి ఇక్కడకు వచ్చింది. రాత్రుళ్ళు నేను ఆమె దగ్గర పడుకుంటాను," పొలం పని చేయటానికి 8వ తరగతి చదువును మధ్యలో ఆపేసిన సోనాలీ చెప్పింది.
చెరువు దగ్గర ఉతికి తెచ్చిన బట్టలను ఆరవేయడానికి సోనాలీ బయటకు వెళ్ళటంతో నేను ఆ గుడిసెనంతా కలయజూశాను. మూలన తాత్కాలింగా ఏర్పాటు చేసిన ఒక బల్లపై కొన్ని పాత్రలు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను ఎలుకల నుంచి రక్షించటానికి గట్టి మూత ఉన్న ఒక ప్లాస్టిక్ బక్కెట్, రకరకాల సైజులలో ఉన్న ప్లాస్టిక్ నీళ్ళ డబ్బాలు, వంట చేసుకోవటానికి మట్టినేలలో ఉన్న ఒక మట్టి పొయ్యి.
కొన్ని బట్టలు అక్కడా ఇక్కడా వేలాడదీసి ఉన్నాయి, మరో మూలన గోడకు ఒక అద్దం, దువ్వెన బిగించి ఉన్నాయి, చుట్టిపెట్టిన ప్లాస్టిక్ చాప, ఒక దోమతెర, ఒక పాత దుప్పటి - ఇవన్నీ వాలుగా పెట్టివున్న ఒక వెదురు గడ మీద వేసివున్నాయి. ఇక్కడ కష్టపడి పనిచేయటమనేది ఖచ్చితంగా విజయానికి కీలకం కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది. పుష్కలంగా ఉన్న ఒకే ఒక వస్తువు- ఒక తండ్రి, అతని యుక్తవయస్సులో ఉన్న కూతురు కష్టానికి సాక్ష్యంగా నేలపైనా, పైనుంచీ వేలాడుతూ ఉన్న ఉల్లిపాయలు.
"నేను మీకు మా మరుగుదొడ్డిని చూపిస్తాను," అని సోనాలీ లోపలికి నడిచింది. నేను ఆమెను అనుసరించాను. కొన్ని గుడిసెలు దాటిన తర్వాత, సెటిల్‌మెంట్‌లో ఒక మూలన ఉన్న 32 అడుగుల ఇరుకైన ప్రదేశానికి చేరుకున్నాం. ధాన్యం నిలవ చేసే ప్లాస్టిక్ సంచులను కుట్టి తయారుచేసిన పట్టాలు ఆ 4 x 4 అడుగుల 'టాయిలెట్'ను గోడలా కప్పుతున్నాయి. "ఇక్కడే మేం మూత్ర విసర్జన చేస్తాం. మలవిసర్జన చేయడానికి ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశాలను ఉపయోగిస్తాం," అని ఆమె చెప్పింది. నేను ఒక అడుగు ముందుకు వేయబోతుండగా, మరింత ముందుకు వెళ్ళవద్దని, నా పాదాలు మల పదార్థంపై పడవచ్చని ఆమె నన్ను హెచ్చరించింది.
ఆ బస్తీలో కానరాని పారిశుద్ధ్యం, ఈ మాల్ పహాడియా సెటిల్‌మెంట్‌కి వచ్చేటపుడు నేను చూసిన మిషన్ నిర్మల్ బాంగ్లా రంగురంగుల చిత్రాలతో కూడిన సందేశాలను నాకు గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశుద్ధ్య ప్రాజెక్టుతో పాటు మాడ్డా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామపంచాయతీ అంటూ ఆ పోస్టర్లు ప్రగల్భాలు పలుకుతున్నాయి.
“పీరియడ్స్ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. మాకు తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. నీళ్ళు లేకుండా మనం ఎలా జరుపుకోగలం? చెరువు నీరు మురికిగా, బురద నిండి ఉంటాయి,” సిగ్గునూ, సంకోచాన్నీ పక్కన పెట్టిన సోనాలీ చెప్పింది.
తాగటానికి నీరు మీరెక్కడ నుంచి తెచ్చుకుంటారు?
"ప్రైవేటుగా నీటిని సరఫరాచేసేవాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. 20 లీటర్ల నీళ్ళ డబ్బాకు అతను 10 రూపాయలు వసూలు చేస్తాడు. అతను సాయంత్రంవేళల్లో వచ్చి మెయిన్ రోడ్డు మీద వేచివుంటాడు. ఆ పెద్ద పెద్ద డబ్బాలను మేం మా గుడిసె వరకూ మోసుకెళ్ళాల్సిందే."
"మీరు నా స్నేహితురాలిని కలుస్తారా?" హఠాత్తుగా సంతోషం నిండిన గొంతుతో అడిగిందామె. "ఈమె పాయల్. ఈమె నాకంటే పెద్దదే కానీ మేం స్నేహితులం." కొత్తగా పెళ్ళయిన 18 ఏళ్ళ తన స్నేహితురాలిని సోనాలీ నాకు పరిచయం చేసింది. పాయల్ వంట చేసే ప్రదేశంలో నేల మీద కూర్చొని రాత్రి భోజనాన్ని తయారుచేస్తూవుంది. పాయల్ మాల్ భర్త బెంగళూరు నగరంలోని నిర్మాణ స్థలాల వద్ద వలస కార్మికుడిగా పనిచేస్తాడు.
"నేను వస్తూ పోతూ ఉంటాను. ఇక్కడ మా అత్తగారు ఉంటారు," చెప్పింది పాయల్. " గొవాస్‌లో ఒంటరిగా అనిపిస్తుంది. అందుకని నేనిక్కడికి వచ్చి ఆమెతో ఉంటాను. నా భర్త వెళ్ళి ఇప్పటికే చాలాకాలమయింది. ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. బహుశా ఎన్నికలప్పుడు రావొచ్చు," అందామె. పాయల్ గర్భంతో ఉందనీ, అప్పుడే ఐదో నెల అనీ సోనాలీ రహస్యం బయటపెట్టింది. పాయల్ సిగ్గుపడింది.
నీకిక్కడ మందులు, సప్లిమెంట్లు దొరుకుతున్నాయా?
"అవును, ఇక్కడి ఒక ఆశా దీదీ నుంచి నాకు ఐరన్ మాత్రలు వచ్చాయి," ఆమె జవాబిచ్చింది. "మా అత్తగారు నన్ను కేంద్రానికి (ఐసిడిసి) తీసుకువెళ్ళింది. వాళ్ళు నాకు కొన్ని మందులిచ్చారు. నా కాళ్ళు తరచుగా వాస్తున్నాయి, బాగా నొప్పులు పెడుతున్నాయి. ఇక్కడ పరీక్ష చేయటానికి ఎవరూ లేరు. ఈ ఉల్లిపాయల పని అయిపోయిన తర్వాత నేను గొవాస్‌కు తిరిగి వెళ్ళిపోతాను.”
ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే మహిళలు బేల్‌డాంగా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరం పరిగెత్తాల్సిందే. సాధారణ వైద్యం, ప్రథమ చికిత్స అవసరాల కోసం మకరమ్‌పూర్ బజార్ ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పాయల్, సోనాలీల కుటుంబాలకు స్వాస్థ్య సాథీ (ప్రభుత్వ ఆరోగ్య కార్డు) ఉంది, కానీ ఇద్దరూ "అత్యవసర సమయంలో చికిత్స పొందడానికి చాలా కష్టాలు పడాలి," అనే చెప్పారు.
మేం మాట్లాడుతుండగా, అక్కడుండే పిల్లలంతా మా చుట్టూ పరుగెడుతూనే ఉన్నారు. మూడేళ్ళ వయసున్న అంకిత, మిలన్‌లు, ఆరేళ్ళ దేవరాజ్ మాకు తమ బొమ్మల్ని చూపెట్టారు. జుగాడ్ బొమ్మలు- ఈ చిన్న తాంత్రికులు తమ కొత్త ఆలోచనల మాంత్రిక శక్తిని ఉపయోగించి తమ చేతితో వీటిని తయారుచేశారు. "మాకిక్కడ టివి లేదు. అప్పుడప్పుడూ మా బాబా మొబైల్‌లో ఆటలు ఆడతాను. కార్టూన్లు అస్సలు చూడలేకపోతున్నాను," అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు చెందిన నీలం, తెలుపు టి-చొక్కాని వేసుకుని ఉన్న దేవరాజ్ ఫిర్యాదు చేశాడు.
బస్తీలో ఉన్న పిల్లలంతా పోషకాహార లోపంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. "వీళ్ళెప్పుడూ జ్వరం, కడుపునొప్పి సమస్యలతో బాధపడుతుంటారు," చెప్పింది పాయల్. "ఇక్కడ దోమలు మరో సమస్య," అంది సోనాలీ. మేం ఒకసారి దోమతెర లోపలికి దూరిపోయాక, మిన్ను ఊడి మీదపడినా బయటికి రాము." స్నేహితులిద్దరూ పగలబడి నవ్వారు. మధుమిత కూడా వారితో చేరింది.
మరోసారి వాళ్ళను ఎన్నికల గురించి అడిగే ప్రయత్నం చేశాను. "మేం వెళ్తాం. కానీ మమ్మల్ని కలిసేందుకు ఇక్కడికి ఎవరూ రారు. అయినా మేం ఎందుకు వెళ్తామంటే, వోటు వెయ్యటం చాలా ముఖ్యమని మా పెద్దవాళ్ళు భావిస్తారు." మధుమిత నిక్కచ్చిగా మాట్లాడింది. ఆమెకు కూడా వోటు వేయటం ఇదే మొదటిసారి. పాయల్‌కు ఇప్పుడే 18 ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఆమె పేరు ఇంకా వోటర్ల జాబితాలోకి ఎక్కలేదు. "నాలుగేళ్ళ తర్వాత నేను కూడా వీళ్ళలాగే," చెప్పింది సోనాలీ. "అప్పుడు నేను కూడా వోటు వేస్తాను. కానీ వీళ్ళకులాగా నేను అంత తొందరగా పెళ్ళి చేసుకోను." మరోసారి అంతా పగలబడి నవ్వారు.
నేనా ప్రదేశాన్ని విడచి బయటికి వస్తుండగా, ఈ యువతుల నవ్వులు, ఆటలాడునే పిల్లల కేరింతలు సన్నగిల్లిపోతూ వాటి స్థానంలో ఉల్లిపాయలు కోసే మహిళల గొంతులు పెద్దగా వినవస్తున్నాయి. వాళ్ళు ఈ రోజు పనిని ముగించారు.
"మీ బస్తీ లో మాల్ పహాడియా భాషను మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అడిగాను.
"కొంచం హాఁరియా (సంప్రదాయంగా తయారుచేసే బియ్యపు సారా), కొన్ని వేపుళ్ళు తీసుకురా. నేనొక పహాడియా పాటను పాడి వినిపిస్తాను," ఆటపట్టిస్తున్నట్టు అన్నారు భాను మాల్. భర్తను కోల్పోయిన ఆ 65 ఏళ్ళ వ్యవసాయ కూలీ తన భాషలో కొన్ని పంక్తులు చెబుతూ, “మా భాషను వినాలనుకుంటే నువ్వు మా గొవాస్ గ్రామానికి రా,” అన్నారు ఆప్యాయంగా.
"నువ్వు కూడా మాట్లాడుతావా?" తన భాష గురించి ఇంత అసాధారణమైన ప్రశ్న వేసినందుకు కొద్దిగా చకితురాలైన అంజలి వైపు తిరిగి అడిగాను. “మా భాష? లేదు. మా గొవాస్‌లో ముసలివాళ్ళే మా భాషలో మాట్లాడతారు. ఇక్కడి జనం మమ్మల్ని చూసి నవ్వుతారు. మేం మా భాషను మరిచిపోయాం. మేమిప్పుడు బాంగ్లా మాత్రమే మాట్లాడతాం.
బస్తీ వైపు నడుస్తోన్న మిగిలిన మహిళలతో కలిసి వెళ్తూ అంజలి ఇలా అంది: “గొవాస్‌లో మాకు ఇల్లు, అన్నీ ఉన్నాయి, ఇక్కడ పని ఉంది. ఆగే భాత్… వోటు, భాష సబ్ తార్ పొరే [మొదట అన్నం... ఆపైనే వోటు, భాష, మిగతావన్నీ].”
అనువాదం: సుధామయి సత్తెనపల్లి