97 ఏళ్ళ వయస్సులో కూడా లక్ష్మీకాంత మహతోకు గాయకుడికుండే స్పష్టమైన, ప్రతిధ్వనించే స్వరం ఉంది. ఆకట్టుకునే నడత ఉన్న ఈ అందమైన వ్యక్తి స్వరూపం మనకు ఒక్కసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్‌ను గుర్తుకుతెస్తుంది.
మేమాయన్ని 2022 మార్చిలో కలిసినప్పుడు, పశ్చిమ బెంగాల్‌లోని పీర్రా గ్రామంలో ఒక శిథిలావస్థలో ఉన్న ఒంటిగది కచ్చా ఇంటిలో, తన ప్రియమైన స్నేహితుడు ఠేలూ మహతో పక్కన ఒక చార్‌పాయ్ (మంచం) మీద కూర్చొనివున్నారు.
అప్పటికి ఠేలూ మహతో వయసు 103 ఏళ్ళు. ఆయన 2023లో మరణించారు. చదవండి: ఠేలూ మహతో నిర్మించిన బావి
ఠేలూ దాదూ (తాతయ్య) ఈ ప్రాంతంలోని చిట్టచివరి స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. ఎనభై సంవత్సరాల క్రితం ఆయన పురూలియా (పురూర్‌లియా అని కూడా పిలుస్తారు) జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌పైకి కవాతు చేశారు. అది 1942వ సంవత్సరం, ఆయన తిరుగుబాటు చర్య క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన స్థానిక అధ్యాయంలోని ఒక భాగం.
ఘెరావ్‌లో పాల్గొనడానికి నాయకులు నిర్ణయించిన 17 ఏళ్ళ వయసు పరిమితి కంటే తక్కువ వయస్సు ఉన్నందున చిన్నవాడైన లక్ష్మీ ఆ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సంఘటనలలో పాల్గొనలేదు.
ఠేలూ గానీ లక్ష్మీ గానీ స్వాతంత్ర్య సమరయోధుని మూస పద్ధతులకు అనుగుణంగా ఎప్పుడూ లేరు. ఖచ్చితంగా రాజ్యం, లేదా కులీన సమాజం సృష్టించిన మూసలో మాత్రమైతే లేరు. నిరసన కార్యక్రమాలలో వాళ్ళు ఏదో సంఖ్య కోసం పాల్గొన్న వ్యక్తులు కూడా కాదు. ఇద్దరూ తమ విషయాలపై పూర్తి అవగాహనతో మాట్లాడతారు: ఠేలూ వ్యవసాయం గురించీ, ఆ ప్రాంత చరిత్ర గురించీ మాట్లాడితే, లక్ష్మీ సంగీతం గురించీ, సంస్కృతి గురించీ.
లక్ష్మీ ప్రతిఘటన కార్యక్రమాలలోని సాంస్కృతిక విభాగంలో పాల్గొన్నారు. ఆయన ధంసా (పెద్ద నగారా), మాదోల్ (చేతి డప్పు) వంటి ఆదివాసీ వాయిద్యాలతో ప్రదర్శనలిచ్చే బృందాలలో భాగంగా ఉండేవారు. ఈ వాయిద్యాలను సాధారణంగా సంతాలులు, కుర్మీలు, బీర్‌హోరులు, ఇంకా ఇతర ఆదివాసీ సమూహాలు ఉపయోగించేవారు. ఆయన బృందాలు కూడా ఒక స్థాయిలో అమాయకమైన జానపద పాటలుగా అనిపించే పాటలను పాడాయి. అయితే ఆనాటి సందర్భంలో ఆ పాటలు వేరే అర్థాన్ని సంతరించుకున్నాయి.
"మేం కూడా అప్పుడప్పుడూ 'వందేమాతరం' అని అరుస్తూ ఉండేవాళ్ళం," అని లక్ష్మీ చెప్పారు, డోలు వాయిస్తూ వార్తాహరులు, గాయకులు కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సందేశాన్ని ఎలా వ్యాప్తి చేశారనే దాని గురించి చెప్తూ. అరుపు పట్ల గానీ, పాట పట్ల గానీ వారికి నిజమైన అనుబంధం ఏమీలేదు. "కానీ అది ఆంగ్లేయులకు కోపం తెప్పించేది," అతను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
వీరిద్దరికీ స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పింఛనును నిరాకరించారు. పింఛను పొందడానికి ప్రయత్నించడాన్ని ఇద్దరూ చాలాకాలం క్రితమే విరమించుకున్నారు. ఠేలూ 1,000 రూపాయల వృద్ధాప్య పింఛనుతో జీవిస్తున్నారు. లక్ష్మీ తన వృద్ధాప్య పింఛనును ఒక నెల మాత్రం అందుకున్నారు. ఆ తర్వాత అది కూడా ఎందుకో ఆగిపోయింది.
ఠేలూ, లక్ష్మీల వంటి - విశ్వాసాల ద్వారా వామపక్షవాది, వ్యక్తిత్వం ద్వారా గాంధేయవాది - యువకులతో సహా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి ముందుకు వచ్చారు. వారు కుర్మీ సముదాయానికి చెందినవారు, ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో మొదటివారు కూడా.
కుర్మీ సముదాయానికి చెందిన టుసు లేదా పంటల పండుగకు ముడిపడి ఉన్న టుసు గాన్ ను లక్ష్మీ మాకోసం పాడారు. టుసు అనేది లౌకిక పండుగ, మతపరమైన పండుగ కాదు. ఇవి ఒకప్పుడు పెళ్ళికాని అమ్మాయిలు మాత్రమే పాడే పాటలు, కానీ ఆ సమూహాన్ని మించి అనుసరించేవారిని పెంచుకున్న పాటలు. లక్ష్మీ పాడే పాటలలో, టుసు ఒక యువ మహిళ ఆత్మగా కనిపిస్తుంది. రెండవ పాట పండుగ ముగిసిపోవడాన్ని సూచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
টুসু নাকি দক্ষিণ যাবে
খিদা লাগলে খাবে কি?
আনো টুসুর গায়ের গামছা
ঘিয়ের মিঠাই বেঁধে দি।
তোদের ঘরে টুসু ছিল
তেই করি আনাগোনা,
এইবার টুসু চলে গেল
করবি গো দুয়ার মানা।
టుసు దక్షిణానికి వెళ్తోందని విన్నాను
ఆకలేస్తే ఆమె ఏం తింటుంది?
టుసు గాంచా*ను ఇలా తీసుకురండి
కొన్ని నేతి మిఠాయిలను మూటగట్టి ఇస్తాను.
అక్కడ టుసు నివసిస్తోందని
నీ ఇంటికి వస్తూ ఉండేవాడిని
ఇప్పుడు టుసు వెళ్ళిపోయింది కదా
నీ ఇంటికి రావాల్సిన అవసరమిక లేదు.
*సంప్రదాయకంగా తువ్వాలుగా, కండువాగా, తలపాగాగా కూడా ఉపయోగించే ఒక సన్నని, ముతక నూలు వస్త్రం. గాంచా కుట్టుపని చేసుకోవడానికి కూడా అనుకూలమైన వస్త్రం.
ముఖ చిత్రం: స్మితా ఖటోర్
అనువాదం: సుధామయి సత్తెనపల్లి