శశి రుపేజా మరీ కచ్చితంగా చెప్పలేకపోవచ్చు కానీ, తాను కుట్టుపని చేస్తూ అతని కంటపడినప్పుడే తన భర్తను ఆకర్షిం చివుంటానని ఆమె భావన. "అతను నన్ను ఫుల్‌కారీ ని కుట్టేటప్పుడు చూసి, నేను చాలా కష్టజీవినని అనుకొని ఉండాలి," ఆ ఆనందకరమైన జ్ఞాపకాన్ని నవ్వుతూ చెప్పారు శశి. ఆమె చేతుల్లో సగం పూర్తయిన ఫుల్‌కారీ ఉంది.

అది పంజాబ్‌లో ఒక చల్లని శీతాకాలపు రోజు. శశి తన పొరుగింటి స్నేహితురాలైన బిమలతో కలిసి కూర్చొని చలికాలపు నులివెచ్చని సూర్యకాంతిని అనుభవిస్తున్నారు. తమ రోజువారీ జీవితాల గురించి చర్చించుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటోన్న వారి చేతులు మాత్రం తీరికలేకుండా ఉన్నాయి. అయితే వారు తాము పట్టుకొని ఉన్న రంగుదారాలు ఎక్కించివున్న పదునైన సూదుల మీది నుంచి దృష్టి మరల్చటంలేదు. అవి వస్త్రం మీద ఫుల్‌కారీ నమూనాలను రూపొందిస్తున్నాయి.

"ప్రతి ఇంటిలోని మహిళలు ఫుల్‌కారీ కుట్టుపని చేసిన సమయమొకటి ఉండేది," అన్నారు పటియాలా నగరంలో నివసించే ఆ 56 ఏళ్ళ మహిళ. ఆమె ఒక ఎర్రని దుపట్టాపై తాను కుడుతోన్న పువ్వుకు జాగ్రత్తగా మరో కుట్టును జతచేస్తున్నారు.

ఫుల్‌కారీ అనేది దుపట్టాలు, సల్వార్ కమీజ్, చీరల వంటి వస్త్రాలపై పువ్వులను కుట్టే ఒక ఎంబ్రాయిడరీ శైలి. ముందుగా ఆకృతులు చెక్కివున్న కొయ్య అచ్చుదిమ్మకు సిరా పూసి, వస్త్రంపై ముద్రిస్తారు. కళాకారులు ఆ ఆకృతి పైనా, చుట్టూ రంగు రంగుల పట్టు, నూలు దారాలను ఉపయోగించి కుట్టుపని చేస్తారు. ఈ దారాలు వారికి స్థానికంగా పటియాలా నగరంలోనే దొరుకుతాయి.

PHOTO • Naveen Macro
PHOTO • Naveen Macro

తన నేస్తం బిమలతో కలిసి ఫుల్‌కారీ పని చేస్తోన్న శశి రుపేజా (కళ్ళద్దాలు పెట్టుకున్నవారు)

PHOTO • Naveen Macro
PHOTO • Naveen Macro

ఫుల్‌కారీ అనేది రంగురంగుల దారాలతో పూల నమూనాలను కుట్టుపని చేసే ఒక కళ. ముందుగా ఆకృతులు చెక్కివున్న కొయ్య అచ్చుదిమ్మకు (కుడి) సిరా పూసి, వస్త్రంపై ముద్రిస్తారు

"మా త్రిపురి ప్రాంతం ఎల్లప్పుడూ ఫుల్‌కారీ కి ప్రసిద్ధి చెందింది," అన్నారు శశి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం తన పెళ్ళయ్యాక, పొరుగునే ఉన్న హరియాణా నుంచి పంజాబ్‌లోని పటియాలా జిల్లాకు ఆమె తరలివచ్చారు. "త్రిపురిలో ఉన్న మహిళలను గమనిస్తూ నేను ఈ నైపుణ్యాన్ని అలవరచుకున్నాను." ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్ళాడిన తన సోదరిని చూసేందుకు వచ్చినప్పుడు శశికి మొదటిసారిగా ఈ ఫుల్‌కారీ కళపై ఆసక్తి ఏర్పడింది. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్ళు. ఆ తర్వాత ఒక ఏడాదికి స్థానికంగా నివాసముండే వినోద్ కుమార్‌తో ఆమెకు పెళ్ళయింది.

పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లకు 2010లో భౌగోళిక గుర్తింపు (GI) లభించిన ఈ కళ, ఇంటి నుండి పని చేయాలనుకునే ఈ ప్రాంతపు మహిళల్లో ఒక వాడుక. సాధారణంగా వారు 20-50 మంది కళాకారులతో సమష్టి బృందాలను ఏర్పరచుకొని అప్పగించిన ఎంబ్రాయిడరీ పనిని తమలో తాము విభజించుకుంటారు

"ఈ రోజుల్లో చాలా కొద్దిమంది మాత్రమే చేతి ఫుల్‌కారీ పనిని చేస్తున్నారు," అన్నారు శశి. దాని స్థానాన్ని చవకగా లభించే మెషీన్ ఎంబ్రాయిడరీ ఆక్రమించింది. అయినప్పటికీ, ఈ కళతో తయారైన వస్త్రాలు బజార్లను ముంచెత్తుతున్నాయి. త్రిపురిలో ఫుల్‌కారీ వస్త్రాలను అమ్మే దుకాణాలు విరివిగా ఉన్నాయి.

శశి 23 ఏళ్ళ వయసులో ఈ కళ ద్వారా తన మొదటి సంపాదనను అందుకున్నారు. ఆమె పది సల్వార్ కమీజ్ సెట్లను కొని, వాటిపై పూలు కుట్టి, వాటిని స్థానికంగా వినియోగదారులకు అమ్మింది. ఆమెకు దీనివలన మొత్తం రూ. 1000 ఆదాయం వచ్చింది. ఫుల్‌కారీ కుట్టుపని కష్టకాలాల్లో ఆమె కుటుంబాన్ని ఆదుకొంది. "పిల్లల్ని చదివించుకోవటంతో పాటు ఇంకా అనేక ఖర్చులుంటాయి," అన్నారు శశి.

చాణన్ దీ ఫుల్‌కారీ చిత్రాన్ని చూడండి

శశి ఈ పనిని ప్రారంభించినప్పుడు ఆమె భర్త దర్జీగా పనిచేసేవారు. ఆయన ఆరోగ్యం పాడైపోయి, పనిచేయటం తగ్గించాల్సివచ్చినప్పుడు శశి ఆ బాధ్యతను చేపట్టారు. "నా భర్త ఒక తీర్థయాత్రకు వెళ్ళివచ్చేసరికి, అతని దర్జీ దుకాణాన్ని నేనెలా మార్చేశానో చూసి చాలా ఆశ్చర్యపోయాడు," అతని కుట్టు మెషీన్‌ని తీసేసి, దారాలను, డిజైన్లు వేసుకునేందుకు బ్లాకులను ఎలా జతచేసిందో గుర్తుచేసుకుంటూ అన్నారు శశి. తాను పొదుపుచేసుకున్న రూ. 5000తో ఆమె వీటన్నిటినీ సమకూర్చుకున్నారు.

ఫుల్‌కారీ కుట్టుపని చేసిన వస్తువులను అమ్మేందుకు పటియాలా నగరంలోని లాహోరీ గేట్ వంటి జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు తాను చేసిన ప్రయాణాల గురించి ఈ సాహసిక కుట్టుపని కళాకారిణి గుర్తుచేసుకున్నారు. ఇంటింటికీ తిరిగి అమ్మేందుకు ఆమె 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాలా జిల్లాకు రైలులో వెళ్ళేవారు. "నా భర్తతో కలిసి జోధ్‌పుర్, జైసల్మేర్, కర్నాల్‌లలో ఫుల్‌కారీ వస్త్రాల ప్రదర్శనలను నిర్వహించాను," అన్నారామె. చివరకు ఊపిరి సలపని పనితో అలసిపోయిన ఆమె తన అమ్మకాలకు స్వస్తి చెప్పి, కుట్టుపనిని తన అభిరుచిగా చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కొడుకు 35 ఏళ్ళ దీపాంశు రుపేజా ఫుల్‌కారీ వస్త్రాలను అమ్మే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు, పటియాలా అంతటా ఉన్న కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు.

"మెషీన్ ఎంబ్రాయిడరీ వస్త్రాలు వచ్చినప్పటికీ, చేతి కుట్టుపని చేసిన ఫుల్‌కారీ వస్త్రాలకు గిరాకీ ఎక్కువగానే ఉంది," అని దీపాంశు పేర్కొన్నారు. ఈ రెండు శైలుల మధ్య ఉన్న తేడా వాటి ధరలలో కూడా కనిపిస్తుంది. చేతి కుట్టుపని చేసిన ఫుల్‌కారీ దుపట్టా రూ. 2,000కి అమ్ముడవుతుండగా, మెషీన్ ఎంబ్రాయిడరీ చేసినదాని ధర రూ.500- రూ.800 మధ్య ఉంటుంది.

"కుట్టుపని చేసిన పువ్వుల సంఖ్య, ఆ డిజైన్ సంక్లిష్టత ఆధారంగా మేం డబ్బు చెల్లిస్తాం," అని దీపాంశు వివరించారు. ఇది కళాకారుల నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది - ఒక పువ్వుకు రూ. 3 నుండి రూ. 16 వరకు.

దీపాంశు కలిసి పనిచేసే కళాకారులలో 55 ఏళ్ళ బల్వీందర్ కౌర్ ఒకరు. పటియాలా జిల్లా మియాల్ గ్రామానికి చెందిన బల్వీందర్ 30 కిలోమీటర్ల దూరంలోని త్రిపురిలో ఉన్న దీపాంశు దుకాణానికి నెలలో 3-4 సార్లు వెళుతుంటారు. అక్కడ నుంచి ఆమె కుట్టుపని చేయటం కోసం సిరా పూసిన ఫుల్‌కారీ డిజైన్లతో ఉన్న వస్త్రాలను, దారాలను తెచ్చుకుంటారు.

PHOTO • Naveen Macro
PHOTO • Naveen Macro

శశి రుపేజా తన భర్తతో కలిసి జోధ్‌పుర్, జైసల్మేర్, కర్నాల్‌లలో ఫుల్‌కారీ వస్త్రాల ప్రదర్శనలను నిర్వహించేవారు. ప్రస్తుతం వారి వ్యాపారాన్ని ఆమె కొడుకు దీపాంశు (ఎడమ) నిర్వహిస్తున్నారు

PHOTO • Naveen Macro
PHOTO • Naveen Macro

ఆరితేరిన ఫుల్‌కారీ కళాకారిణి బల్విందర్ కౌర్ ఒక సల్వార్ కమీజ్ మీద కేవలం రెండు రోజులలో వంద పువ్వులను ఎంబ్రాయిడరీ చేస్తారు

ఆరితేరిన కుట్టుపని కళాకారిణి బల్విందర్ రెండు రోజులలో ఒక సల్వార్ కమీజ్ మీద 100 పువ్వులను కుడతారు. "ఎవరూ నాకు పనిగట్టుకొని ఫుల్‌కారీలు కుట్టడాన్ని నేర్పలేదు," తనకు 19 ఏళ్ళ వయసప్పటి నుండి ఈ పని చేస్తోన్న బల్విందర్ అన్నారు. "నా కుటుంబానికి భూమి లేదు, ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు," అంటారు ముగ్గురు బిడ్డల తల్లి బల్విందర్. ఆమె భర్త దినసరి కూలీగా పనిచేసేవారు. ఆమె ఈ పని ప్రారంభించేనాటికి ఆయనకు ఎలాంటి పనీ లేదు.

తన తల్లి అంటుండే మాటలను బల్విందర్ గుర్తుచేసుకున్నారు, " హూ జో తేరీ కిస్మత్ హై తేను మిల్ గెయ్ హై. హూ కుఛ్ న కుఛ్ కర్, తే ఖా [నీకు రాసిపెట్టి ఉన్నదే నీకు దక్కింది. ఇప్పుడు నీకు దొరికిన పని చేసి, నిన్ను నువ్వు పోషించుకో]." ఆమె పరిచయస్తులు కొందరు త్రిపురి వస్త్ర వ్యాపారుల నుండి ఫుల్‌కారీ కుట్టుపని కోసం పెద్దమొత్తంలో ఆర్డర్లు తీసుకుంటారు. "నాకు డబ్బు అవసరమని నేను వారితో చెప్పాను. ఎంబ్రాయిడరీ చేసేందుకు ఒక దుపట్టాను ఇవ్వమని వారిని అడిగితే, వారు ఇచ్చారు."

మొదట్లో ఫుల్‌కారీ పని చేయటానికి బల్విందర్‌కు వస్త్రాలను ఇచ్చేటపుడు అమ్మకందారులు ధరావతుగా ఆమె దగ్గర నుంచి కొంత సొమ్ము కట్టించుకునేవారు. ఆమె ఎక్కువగా రూ. 500 వరకూ జమకట్టాల్సి వచ్చేది. కానీ త్వరలోనే, "నా నైపుణ్యంపై వారికి నమ్మకం ఏర్పడింది," అన్నారు బల్విందర్. ఇప్పుడు త్రిపురిలోని ఫుల్‌కారీ వస్త్రాలను అమ్మే పెద్ద వ్యాపారులందరికీ తాను తెలుసునని ఆమె చెప్పారు. "పనికి కరవేమీ లేదు," అంటారామె. తనకు ప్రతినెలా కుట్టుపని చేయటం కోసం 100 వస్త్రాలను ఇస్తారని ఆమె చెప్పారు. ఆమె ఫుల్‌కారీ కళాకారుల సమష్టి బృందాన్ని కూడా ఏర్పరచారు. తరచుగా తన పనిలో కొంతభాగాన్ని ఆమె వారికి పంపుతుంటారు. "నాకు ఎవరిపైనా ఆధారపడటం ఇష్టం ఉండదు," అని ఆమె అన్నారు.

సుమారు 35 సంవత్సరాల క్రితం ఆమె ఈ పని చేయడం మొదలుపెట్టినప్పుడు, ఒక దుపట్టా ఎంబ్రాయిడరీ చేసినందుకు బల్విందర్‌కు రూ. 60 లభించేవి. ఇప్పుడొక సంక్లిష్టమైన డిజైన్‌పై పనిచేస్తే, ఆమెకు రూ. 2,500 లభిస్తోంది. బల్విందర్ చేతి ఎంబ్రాయిడరీ చేసిన కొన్ని వస్త్రాలను విదేశాలకు వెళ్ళే వ్యక్తులు తమవారికి బహుమతులుగా ఇవ్వడానికి తీసుకువెళుతుంటారు. "నా పని అమెరికా, కెనడా వంటి దేశాలకు ప్రయాణిస్తుంది. నేను వెళ్ళకపోయినా, నా పని విదేశాలకు వెళ్ళడం నాకు మంచిగా అనిపిస్తుంది,” అని గర్వంగా చెప్పారామె.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sanskriti Talwar

সংস্কৃতি তলওয়ার নয়া দিল্লি-ভিত্তিক স্বতন্ত্র সাংবাদিক এবং ২০২৩ সালের পারি-এমএমএফ ফেলোশিপ প্রাপক রিপোর্টার।

Other stories by Sanskriti Talwar
Naveen Macro

নবীন ম্যাক্রো দিল্লি-ভিত্তিক স্বতন্ত্র চিত্রসাংবাদিক, তথ্যচিত্র নির্মাতা এবং ২০২৩ সালের পারি-এমএমএফ ফেলোশিপ প্রাপক রিপোর্টার।

Other stories by Naveen Macro
Editor : Dipanjali Singh

দীপাঞ্জলি সিং পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার একজন সহকারী সম্পাদক। এছাড়াও তিনি পারি লাইব্রেরির জন্য নথিপত্র সংক্রান্ত গবেষণা ও অনুসন্ধান করেন।

Other stories by Dipanjali Singh
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli