స్థానిక తపాలా కార్యాలయం కిటికీ తలుపులు కిర్రుమంటూ తెరచుకోగానే ఆ కిటికీలోంచి స్వయంగా తపాలా ఉద్యోగి (పోస్ట్‌మ్యాన్)గారే తనను సమీపిస్తోన్న మమ్మల్ని చూశారు.
రేణుకా మమ్మల్ని ఆ తపాలా కార్యాలయం లోపలికి రమ్మన్నట్టు చిరునవ్వుతో సంజ్ఞ చేశారు. కార్యాలయం ఒక గదిలో ఉంది. ఇంటి వసారాలోంచి ఆ గదిలోకి దారితీసే ఒక తలుపు ఉంది. ఆయన పనిచేసుకుంటోన్న ఆ చిన్న గదిలోకి అడుగుపెట్టగానే సిరా, కాగితాల వాసన మాకు స్వాగతం పలికింది. ఆ రోజుటి చివరి తపాలాను ఆయన కుప్పపోశారు. నవ్వుతూ మమ్మల్ని కూర్చోమని సైగచేశారు. "రండి, రండి! దయచేసి కూర్చోండి."
బయటిలా కాకుండా ఆ తపాలా కార్యాలయం, ఇంటి లోపల చల్లగా ఉంది. ఆ గదికి ఉన్న ఒకటే కిటికీలోంచి పిల్లగాలి లాలనగా వీస్తోంది. తెల్లగా సున్నంకొట్టివున్న గోడలపై చేతితయారీ పోస్టర్లు, మ్యాపులు, జాబితాలు అనేకం వేలాడుతున్నాయి. ఆ చిన్న గది చక్కగానూ, మంచి అమరికతోనూ అంత ముఖ్యమైన ప్రదేశం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంది. ఒక ఏటవాలు రాతబల్ల, కొన్ని అరమరలున్న ప్రాంతం గదిలో ఎక్కువభాగాన్ని ఆక్రమించినప్పటికీ, అక్కడ ఇరుగ్గా ఉన్నట్టు అనిపించడంలేదు.
64 ఏళ్ళ రేణుకప్ప తుమకూరు జిల్లాలోని దేవరాయపట్టణానికి చెందిన గ్రామీణ్ డాక్ సేవక్ (గ్రామీణ తపాలా ఉద్యోగి). ఆయన అధికార పరిధిలో ఆరు గ్రామాలున్నాయి.
దేవరాయపట్టణలోని ఈ గ్రామీణ తపాలా కార్యాలయం అధికారిక పనివేళలు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. కానీ రేణుకా ప్రసాద్ ఒక్కరే ఉద్యోగి కావటంతో ఈయన తరచుగా ఉదయం 7 గంటలకే తన పని మొదలుపెడతారు. అది అలా సాయంత్రం 5 గంటలవరకూ కొనసాగుతుంది. "నా పనంతా పూర్తవడానికి నాలుగున్నర గంటలు చాలవు," అని ఆయన వివరించారు.
తుమకూరు జిల్లా, బెళగుంబ నుంచి ఉదయాన్నే తపాలా సంచిలో ఉత్తరాలు, పత్రికలు, పత్రాలు రావటంతోనే ఈ తపాలా ఉద్యోగి పని మొదలవుతుంది. వచ్చిన టపానంతా మొదట జాబితా చేసి, ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలకల్లా అవన్నీ బట్వాడా అయ్యేలా ఏర్పాటుచేసుకుంటారు. దేవరాయపట్టణ, మారనాయకపాళ్య, ప్రశాంతనగర, కుందూరు, బందెపాళ్య, శ్రీనగర - ఆరు కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఉండే ఈ ఆరు గ్రామాలలో అయన టపా బట్వాడా చేస్తారు. అయన తన భార్య రేణుకాంబతో కలిసి జీవిస్తుంటారు; ఎదిగిన ఆయన ముగ్గురు కుమార్తెలు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారు.
ఆయన తన రాత బల్లకు వెనుక గోడకు వేలాడుతోన్న చేతితో తయారుచేసిన చిన్న పటాన్ని మాకు చూపించారు. అందులో ఆయన టపా ఇవ్వడానికి వెళ్ళాల్సిన అన్ని గ్రామాలు, అవి ఎంతెంత దూరంలో ఉన్నదీ, కన్నడ భాషలోలో నాలుగు దిక్సూచి పాయింట్లతో, పూర్తి వివరాలతో గుర్తించి ఉన్నాయి. అన్నిటికంటే సమీప గ్రామమైన మారనాయకపాళ్యం, తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతనగర పశ్చిమాన 2.5 కి.మీ, కుందూరు, బందెపాళ్య వరుసగా ఉత్తర దక్షిణాలుగా 3 కి.మీ దూరాన, శ్రీనగర్ 5 కి.మీ. దూరానా ఉన్నాయి.
మండే వేసవిలోనైనా, జడివానల వర్షాకాలంలోనైనా ఎల్లప్పుడూ టపా బట్వాడా చేసే తపాలా ఉద్యోగి రేణుకప్ప.
తన బైక్‌పై గ్రామంలోకి వెళ్ళి, తనను స్వాగతించడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవారిని ఉల్లాసంగా పలకరించే మూసకథల పోస్ట్‌మ్యాన్‌లా కాకుండా ఈ సుదూర ప్రాంతాలకు ఆయన తన పాత సైకిల్‌పై ప్రయాణిస్తుంటారు.
"రేణుకప్పా, మా ఇంట్లో ఈ రోజు పూజ ఉంది. మీరు రండి," ఆయన ఇంటిముందుగా నడచివెళ్తోన్న ఒక మహిళ ఆయనను కేకవేసి పిలిచి చెప్పారు. ఆయన ఆమెవైపు సంతోషంగా చూస్తూ, సరేనన్నట్టుగా తలవూపారు. అటుగా వెళ్తోన్న మరో గ్రామస్థుడు అభివాద సూచకంగా ఆయనకు చెయ్యి ఊపారు. రేణుకప్ప నవ్వుతూ బదులుగా అతనివైపు చెయ్యి ఊపారు. గ్రామస్థులకూ వారి పోస్ట్‌మ్యాన్‌కూ ఉన్న అనుబంధం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూవుంది.
టపాను బట్వాడా చేస్తూ ఆయన రోజుకు పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. ఆ రోజు పని నుంచి విరామం తీసుకునే ముందు ఆయన ఒక మందపాటి, అరిగిపోయిన నోట్‌పుస్తకంలో తాను బట్వాడా చేసిన ప్రతిదాన్నీ లెక్కగా రాసుకుంటారు.
ఆన్‌లైన్ సమాచార సంబంధాలు అభివృద్ధి అయిన కారణంగా ఉత్తరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందనీ, "కానీ పత్రికలు, బ్యాంకు పత్రాలు మొదలైనవాటిని బట్వాడా చేసే పని గత కొన్నేళ్ళుగా రెట్టింపవడంతో నా పని మరింత పెరిగింద"నీ రేణుకప్ప చెప్పారు.
ఆయన లాంటి గ్రామీణ డాక్ సేవకులను 'అదనపు డిపార్ట్‌మెంటల్ వర్కర్లు'గా పరిగణిస్తారు. పింఛను సంగతి అటుంచి జీతభత్యాల విషయంలో కూడా వారు లెక్కలోకి రారు. స్టాంపుల, స్టేషనరీల విక్రయం, తపాలా రవాణా, బట్వాడా, ఇంకా ఏదైనా ఇతర తపాలా సంబంధిత విధుల వంటి అన్ని విధుల్లో వారు పాల్గొంటారు. అయితే వారు సాధారణ పౌర సేవలలో భాగమైనందున, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 పరిధిలోకి రారు. ప్రస్తుతం, 01/04/2011 నుండి అమల్లోకి వచ్చే సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ పథకం మినహా వారికి ఎలాంటి పింఛను సంబంధిత ప్రయోజనాలను మంజూరు చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు.
పదవీ విరమణ చేసిన తర్వాత రేణుకప్పకు ఇప్పుడు వస్తోన్న నెలకు రూ. 20 వేల జీతం ఆగిపోతుంది, ఆయనకు పింఛను కూడా రాదు. "నావంటి తపాలా ఉద్యోగులమందరం ఏదైనా మార్పు జరుగుతుందేమోనని అనేక సంవత్సరాలుగా ఎదురుచూశాం. మా శ్రమను ఎవరైనా గుర్తిస్తారేమోనని ఎదురుచూశాం. మిగతా పింఛను తీసుకునేవారికిచ్చే దాంట్లో ఒక చిన్న భాగమంతైనా, వెయ్యో రెండు వేలో, మాకిచ్చినా అంతే చాలు. అలాంటి మార్పేమైనా జరిగేసరికి నేను పదవీ విరమణ చేసివుంటాను," పేలవంగా నవ్వుతూ అన్నారాయన.
చిన్న చిన్న కత్తిరింపులు అతికించి, లామినేట్ చేసి, గోడపై తగిలించి ఉన్న పోస్టర్ గురించి నేను ఆయనను అడిగినప్పుడు, ఆయన మొహం వెలిగిపోయింది. “నాకున్న చిన్న చిన్న సంతోషాల్లో ఆ పోస్టర్ ఒకటి. నేను దానిని అంచెచీటి (ಅಂಚೆಚೀಟಿ /తపాలా బిళ్ళ) పోస్టర్ అని పిలుస్తాను,” అని ఆయన చెప్పారు.
"ఇది నాకొక అభిరుచి (హాబీ) అయిపోయింది. రెండేళ్ళ క్రితం ప్రసిద్ధ కవులను, స్వాతంత్ర్య సమరయోధులను, ఇంకా ఇతర గొప్ప వ్యక్తులను గౌరవించడం కోసం వార్తాపత్రికలో ఈ తపాలా బిళ్ళలను విడుదల చేయటం మొదలయింది." దాంతో రేణుకా వార్తాపత్రికలలో ఆ తపాలా బిళ్ళల బొమ్మలు రాగానే వాటిని కత్తిరించి పెట్టుకోవటం మొదలుపెట్టారు. "మరో తపాలా బిళ్ళ వచ్చేవరకూ దాని కోసం ఎదురుచూడటం బాగుంటుంది."
ఈ కథనాన్ని సమన్వయం చేయటంలో సహాయపడినందుకు తుమకూరు టివిఎస్ అకాడెమీలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న శ్వేతా సత్యనారాయణ్‌కు మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా PARI ఎడ్యుకేషన్ ఈ కింది విద్యార్థులతో కలిసి పనిచేసింది: ఆస్తా ఆర్. శెట్టి, దృతి యు., దివ్యశ్రీ ఎస్., ఖుషీ ఎస్. జైన్, నేహ జె., ప్రణీత్ ఎస్. హులుకాడి, హనీ మంజునాథ్, ప్రణతి ఎస్., ప్రాంజల పి.ఎల్., సంహిత ఇ.బి., పరిణీత కల్మత్, నిరుత ఎమ్, గుణోత్తమ్ ప్రభు, ఆదిత్య ఆర్. హరిస్తా, ఉత్సవ్ కె.ఎస్.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి