సైలా నృత్యం ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా, జశ్‌పుర్ జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందినది. రాజ్వాడే, యాదవ్, నాయక్, మానిక్పురీ సముదాయాలకు చెందినవారు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. "ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలోని మిగిలిన ప్రాంతాలలో ఛెర్ఛెరా అని పిలిచే ఈ సేత్ పండుగ మొదలైన రోజునుంచే మేమీ నృత్యాన్ని చేస్తాం," సర్గుజా జిల్లా, లహపత్ర గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ రాజ్వాడే అన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతోన్న ప్రభుత్వ ప్రాయోజిత హస్తకళల పండుగ కోసం 15 మందితో కూడిన సైలా నృత్య కళాకారుల బృందం ఇక్కడకు వచ్చింది. కృష్ణ కుమార్ వారిలో ఒకరు.
ఈ నృత్యాన్ని ప్రదర్శించే కళాకారులు వెలిగిపోయే రంగురంగుల దుస్తులను, అలంకరించిన తలపాగాలను, చేతిలో కర్రలను ధరించి వుండటంతో, నృత్యమంతా రంగులమయంగా మారిపోయింది. ఈ నృత్యంలో బాఁసురీ, మాందర్, మాహురి, ఝాల్ అనే వాద్య విశేషాలను ఉపయోగిస్తారు.
ఈ నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. ఈ నాట్య బృందంలో నెమళ్ళు కూడా ఒక భాగం అనేందుకు గుర్తుగా కొంతమంది ప్రదర్శనకారులు తమ దుస్తులకు నెమలీకలను అలంకరించుకుంటారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ జనాభా ఎక్కువగా ఉంది. వీరిలో ఎక్కువమంది వ్యవసాయం చేసేవారే కావటంతో ఆ ప్రాంతంలోని సంగీత నృత్యాలలో వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రతిఫలిస్తాయి. పంట కోతల కాలం ముగిశాక, గ్రామంలో ఒక మూల నుంచి మరో మూలకు కదులుతూ ప్రజలు నృత్యం చేస్తూ ఆనందిస్తారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి