పాలస్తీనాకు చెందిన మా తోటి అనువాదకుడు, కవి, రచయిత, విద్యావేత్త కాలమిస్ట్, కార్యకర్త రెఫాత్ అల్అరీర్, గాజాలో కొనసాగుతోన్న జాతి విధ్వంసంలో భాగంగా లక్ష్యంగా చేసుకుని చేసిన బాంబు దాడిలో డిసెంబర్ 7, 2023న మరణించారు. ఆయన గొంతును నొక్కవేసిన రోజునే, ఆయన రాసిన ఒక కవిత డజనుకు పైగా భాషల్లో ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది.
ఇలాంటి ప్రపంచంలో, ఇటువంటి సమయంలో మేం PARIలోని భాషల ప్రపంచంలో మా పనినీ, మేం నిర్వహించిన పాత్రనూ తిరిగి చూసుకుంటాం! రెఫాత్ మాటలను గుర్తుకు తెచ్చుకోవడంతో ప్రారంభిస్తాం:
మన పోరాటాన్ని వినిపించడానికీ, తిరిగి పోరాడటానికీ మనకున్నది భాష ఒక్కటే. మనల్ని మనం చైతన్యపరచుకోవడానికీ, ఇతరులకు అవగాహన కల్పించడానికి మనం ఉపయోగించుకునే అత్యంత విలువైన నిధి మన పదాలే. ఈ పదాలను వీలైనన్ని ఎక్కువ భాషల్లో తెలియజేయాల్సివుంది. వీలైనంత ఎక్కువ మంది హృదయాలనూ మనస్సులనూ తాకే భాషని నేను నమ్ముతాను... మానవాళికి లభించిన గొప్ప వరం అనువాదం. అనువాదం అడ్డంకులను ఛేదిస్తుంది, వంతెనలను నిర్మిస్తుంది, అవగాహనను సృష్టిస్తుంది. అయితే ‘చెడు’ అనువాదాలు అపార్థాలను కూడా సృష్టించగలవు.
ప్రజలను ఒకచోటకు చేర్చి, కొత్త అవగాహనను పెంపొందించడంలో అనువాదానికి గల సామర్థ్యంపై ఈ నమ్మకమే PARIభాష చేసే పనిలో ఉంది
ఆ విధంగా మాకు 2023 చాలా విశిష్టమైన సంవత్సరం
ఛత్తీస్‌గఢీ, భోజ్‌పురి - ఈ రెండు కొత్త భాషలను చేర్చడంతో PARI ప్రచురితమయ్యే భాషల సంఖ్య 14కు చేరింది.
మాకు PARIభాష అనే పేరు వచ్చినందుకు కూడా ఈ సంవత్సరం మాకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆంగ్ల కంటెంట్‌ను అనువాదం చేయటానికి మించి, మేం చేసే ప్రతి పనిని కవర్ చేయడంలో మా పాత్ర ప్రాధాన్యాన్ని పెంచుకోవటం ద్వారా PARIని గ్రామీణ జర్నలిజానికి నిజమైన బహుభాషా వేదికగా మార్చాం.
మన దేశంలోని ప్రజల రోజువారీ జీవితాల్లో మాటల, భాషల పాత్రను అన్వేషించడాన్ని మేం కొనసాగించాం. అనువాదం, భాషల చుట్టూ అల్లిన కథనాలు , సంభాషణల ద్వారా మేం PARI చేసిన కృషిని ఇక్కడ ఉంచుతున్నాం
PARIలోని మెరుగైన వ్యవస్థలతో, విభిన్న బృందాల మధ్య ఏర్పరచుకున్న సమన్వయంతో, మేం మా భాషల్లోని కథనాలను వీలైనంత చక్కగా, ఖచ్చితమైనవిగా, పెరిగిన పనికి అనుగుణంగా - ప్రతి వారం గతంలో కంటే ఎక్కువగా భారతీయ భాషలలో కథనాలను ప్రచురిస్తున్నాం! ఆంగ్లేతర పదాల సరైన ఉచ్చారణ కోసం ఆడియో ఫైల్లు, ఖచ్చితమైన శీర్షికలను ఇవ్వడం కోసం ఫోటోలతో కూడిన పిడిఎఫ్లు – మా అనువాదాలకు, భాషా వినియోగానికి కొత్త కోణాలను జోడించడం కోసం ఇవన్నీ చాలా అవసరమైన అడుగులు. ఒక కొత్త భాషలో ఒక కథనాన్ని సజీవంగా తీసుకురావడం ద్వారా ఖాళీలను తగ్గించడమే మా లక్ష్యం.
PARIభాష ప్రజల తమవైన పదాలకు ఖచ్చితమైన ఆంగ్ల అనువాదంతో తోడ్పాటునిస్తుంది. కథనంలో ఉపయోగించిన వీడియో చిత్రాలు, లేదా ఉటంకింపుల(quotes) ఉపశీర్షికలను, భారతీయ భాషలలోని స్థానిక పదాలను/ప్రస్తావనలను సమీక్షించడం వాటి ప్రత్యేక రుచినీ, సరైన నుడికారాన్నీ నిలుపుకోవడం ద్వారా ఆంగ్లంలో వారి స్వరాలకు ప్రామాణికతను అందించింది.
సమయానికి తగిన మంచి అనువాదాలు, స్థానిక భాషకు ప్రాధాన్యం, ఆంగ్లంలోనే కాకుండా ఇతర భాషలలో అందుబాటులో ఉన్న డిజిటల్ కంటెంట్‌ను చదివేవారు పెరగటం, మా అనువాద కథనాలకు ఒరిపిడినిచ్చి పునాదిపై భౌతిక ప్రభావాన్ని చూపింది
స్మితా ఖటోర్ కథనం, పొగచూరిపోతున్న మహిళా బీడీ కార్మికుల ఆరోగ్యం బంగ్లా అనువాదం ( ঔদাসীন্যের ধোঁয়াশায় মহিলা বিড়ি শ্রমিকদের স্বাস্থ্য ) విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళి, ఆ కార్మికుల వేతనాలు పెరిగాయి. అదేవిధంగా ప్రీతి డేవిడ్ కథనం, In Jaisalmer: gone with the windmills తో పాటు ఉర్జా వీడియో, ఆ కథనానికి ప్రభాత్ మిళింద్ చేసిన హిందీ అనువాదం ( जैसलमेर: पवनचक्कियों की बलि चढ़ते ओरण ) - వీటిని స్థానికులు ఒక నిరసన కార్యక్రమంలో ఉపయోగించారు. ఇది రాజ్యం ఆ 'బంజరు భూమి'ని దెగ్రేలోని ఒరాఁన్ లకు తిరిగి ఇచ్చేలా చేసింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే
అనేక PARI అనువాదాలు ప్రాంతీయ గ్రామీణ పోర్టల్స్‌లోనూ, భూమిక, మాతృక, గణశక్తి, దేశ్ హితైషి, ప్రజావాణి వంటి ముద్రిత పత్రికలలోనూ తిరిగి ప్రచురితమయ్యాయి. మహిళల సమస్యలకే అంకితమైన మరాఠీ మాసపత్రిక మిలున్ సర్యాజాని , తన జనవరి 2023 సంచికలో PARI గురించి పరిచయ భాగాన్ని ప్రచురించింది. రానున్న సంవత్సరాల్లో మహిళల సమస్యలపై దృష్టి సారించిన PARI కథనాలకు మరాఠీ అనువాదాలను తీసుకువస్తుంది.
తన స్థిరమైన, సున్నితమైన పని విధానం కారణంగా PARIభాష అనువాద రంగంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోగలిగింది. ఇది వివిధ భారతీయ భాషలను ఉపయోగించి బహుభాషా వేదికలను రూపొందించడంలో వివిధ నిర్మాణాలకు, సంస్థలకు పరిజ్ఞానాన్నీ సహకారాన్నీ అందించింది
PARI అనువాదాలు నుంచి PARIభాష వరకు
ఈ సంవత్సరం మేం భారతీయ భాషలలో మౌలిక కంటెంట్‌ను సేకరించటం ప్రారంభించి, దానికి ఆంగ్లంలో తుది సవరణలు చేయడానికి ముందు మూల భాషలో ప్రాథమిక సవరణలు చేయడం మొదలుపెట్టాం. భారతీయ భాషలలో నివేదించబడిన కథనాలు ముందుగా మూల భాషలోనే సవరించిన తర్వాత చివరికి ఆంగ్లంలోకి అనువదించేలా మా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకేసారి రెండు భాషల్లో పనిచేస్తోన్న కొంతమంది ద్విభాషా భాషా సంపాదకులు ఈ దిశలో చాలా పురోగతిని సాధించారు.
తమ కథలను/సృజనాత్మక రచనలను లేదా చిత్రాలను PARIలో తీసుకువచ్చేందుకు అనేకమంది రిపోర్టర్లు PARIభాషతో కలిసి పనిచేశారు: జితేంద్ర వాసవ, జితేంద్ర మైద్, ఉమేశ్ సోలంకి, ఉమేశ్ రే, వాజేసింగ్ పార్గీ, కేశవ్ వాఘ్మారే, జైసింగ్ చవాన్, తర్పణ్ సర్కార్, హిమాద్రి ముఖర్జీ, శాయన్ శంకర్, లావణి జంగి, రాహుల్ సింగ్, శిశిర్ అగర్వాల్, ప్రకాశ్ రణ్‌సింగ్, సవిక అబ్బాస్, వాహిదుర్ రహిమాన్, అర్షదీప్ ఆర్షి.
PARI ఎడ్యుకేషన్ టీమ్, PARIభాష సహకారంతో భారతీయ భాషలలో అసలైన విద్యార్థి కథనాలను ప్రచురిస్తోంది . ఆంగ్లేతర నేపథ్యాలకు చెందిన యువ రిపోర్టర్లు తమకు తెలిసిన భాషలో రాస్తున్నారు; రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి నైపుణ్యాలను PARI ద్వారా నేర్చుకుంటున్నారు. ఈ కథనాల అనువాదాలు విస్తృతంగా పాఠకుల వద్దకు చేరుతున్నాయి.
PARIలోని ఆదివాసీ పిల్లల పెయింటింగ్‌ల ప్రత్యేకమైన ఆర్కైవ్‌ను అనువదించడంలో PARIభాష ఒడియా బృందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ ప్రాజెక్ట్ ఒడియా భాషలో నివేదించబడింది
మహారాష్ట్రకు చెందిన విసుర్రాయి పాటలు , గుజరాత్‌కు చెందిన కచ్చి పాటలు వంటి సాంస్కృతిక నిధులను సంరక్షించటంలోనూ ప్రదర్శించడంలోనూ PARI ఘనమైన స్థానాన్ని సంపాదించుకుంది. న్యూస్ పోర్టల్స్, ఎన్‌జిఒలతో సహా అనేక బృందాలు ప్రాంతీయ భాషలలో సహకారం కోసం, కలిసి పనిచేసేందుకు PARIని సంప్రదించాయి
PARIని ప్రజల భాషల్లో ప్రజల ఆర్కైవ్‌గా మార్చడానికి PARIభాష కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం రానున్న సంవత్సరాల్లో మరిన్ని ప్రయత్నాలను చూస్తారు
కవర్ డిజైన్: రికిన్ సంక్లేచా
మేం చేసే పని మీకు ఆసక్తి కలిగిస్తే, మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి [email protected]కు మాకు రాయండి. మాతో కలిసి పనిచేయడానికి ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర రచయితలు, రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, చిత్ర నిర్మాతలు, అనువాదకులు, సంపాదకులు, ఇలస్ట్రేటర్లు, పరిశోధకులను మేం స్వాగతిస్తున్నాం
PARI లాభాపేక్ష లేనిది. మా బహుభాషా ఆన్లైన్ జర్నల్ను, ఆర్కైవ్‌ను అభిమానించే వ్యక్తుల నుండి వచ్చే విరాళాలపై మేం ఆధారపడతాం. మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి DONATE పై క్లిక్ చేయండి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి