మలియామాలోని ఈ మారుమూల బౌద్ధ పల్లెలో, నిశ్శబ్ద మధ్యాహ్న సమయంలో ఉత్సాహంతోనూ, కేరింతలు కొడుతూనూ ఒక 'ఊరేగింపు' చొరబడుతుంది. అవును, ఇది అక్టోబ‌ర్ నెలే అయినా ఇంకా పూజ‌లు లేవు, ప‌ండాల్‌లు లేవు. ఆ 'ఊరేగింపు'లో 2 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎనిమిది నుండి పది మంది మోన్పా పిల్లలు ఉన్నారు, బడులకు దుర్గాపూజ సెలవులు ప్రకటించడంతో వారంతా ఇళ్ళల్లోనే ఉన్నారు.

రెండు ప్రైవేట్ బడులు, సమీప ప్రభుత్వ బడి కూడా 7 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిరాంగ్‌లో ఉన్నాయి. పిల్లలు రోజూ నడిచిపోయే ఈ బడులన్నిటినీ, సెలవుల కారణంగా దాదాపు పది రోజుల పాటు మూసివేశారు. కానీ సాపేక్షంగా స్వేచ్ఛ ఉన్న ఈ రోజులలో ఆటలాడే సమయం ఏదో పిల్లలకు అలవోకగా తెలిసిపోతుంది. అంటే మధ్యాహ్న భోజనం అయిన తర్వాత 2 గంటల సమయంలో. సముద్ర మట్టానికి 1,800 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ పల్లెలో ఈ సమయంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అధ్వాన్నంగా ఉంటుంది, వారు తమ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌లను వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నిరవధికంగా మంఖా లైదా (అక్షరాలా 'అక్రోటుల ఆట') ఆడేందుకు ప్రధాన వీధిలో గుమికూడే సమయం అది.

ఈ కుగ్రామం చుట్టుపక్కల ఉన్న అడవులలో అక్రోటులు విస్తారంగా పెరుగుతాయి. భారతదేశంలో ఈ ఎండు ఫలాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్‌ది నాలుగవ స్థానం. పశ్చిమ కమెంగ్‌ జిల్లాకు చెందిన ఈ అక్రోటులు ప్రత్యేకించి వాటి 'ఎగుమతి' నాణ్యతకు ప్రసిద్ధిచెందాయి. కానీ ఈ కుగ్రామంలో ఎవరూ వాటిని సాగు చేయడంలేదు. పిల్లలకివి అడవి నుండి లభిస్తాయి. మలియామాలో నివాసముండే 17 నుండి 20 మోన్పా కుటుంబాలు, సంప్రదాయకంగా టిబెట్ నుండి వచ్చిన పశుపోషకులు, వేటగాళ్ళ బృందాలు. వీళ్ళు తమ ఇంటి అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. "గ్రామస్థులు ప్రతి వారం గుంపులుగా అడవిలోకి వెళ్ళి పుట్టగొడుగులు, గింజపిక్కలు (nuts), బెర్రీలు, కట్టెలు, ఇతర ఉత్పత్తులను తీసుకువస్తారు," అని 53 ఏళ్ళ రిన్చిన్ జోంబా చెప్పారు. పిల్లలు ప్రతిరోజూ మధ్యాహ్నం వీధుల్లో ఆటలకు దిగే ముందు తమ పిడికిళ్ళనూ జేబులనూ అక్రోటుకాయలతో నింపుకుంటారు.

వీడియో చూడండి: మోన్పా పల్లెలో చిట్టి పిల్లలు ఆడే ఆటలు

అక్రోటులను వీధిలో ఒకే వరుసలో అమర్చుతారు. ఆటాడే ప్రతివారు మూడేసి కాయలను ఆ వరుసలో ఉంచుతారు. ఆ తర్వాత వారు ఒకరి తర్వాత ఒకరు తమ చేతుల్లో పట్టుకున్న అక్రోటుతో వరుసలో ఉన్న కాయలకు గురిపెట్టి విసురుతారు. మీరు ఎన్ని కాయలను చెదరగొట్టగలిగితే అన్నిటినీ గెలుచుకుంటారు. బహుమతిగా మీరు ఆ కాయలను తినవచ్చు! అనేకసార్లు ఈ ఆటను ఆడిన తర్వాత, వాళ్ళకు సరిపోయినన్ని అక్రోటులను గెలుచుకున్న తర్వాత, వాళ్ళు మరొక ఆటకు - థా ఖ్యాందా లైదా (టగ్ ఆఫ్ వార్) - వెళతారు.

ఈ ఆటకు ఒక ఆనిక కావాలి - తాడులా పనిచేసే ఒక గుడ్డ ముక్క. ఇక్కడ కూడా పిల్లలు తమ సృజనాత్మకతను అత్యుత్తమంగా ప్రదర్శిస్తారు. ఈ గుడ్డముక్కలు తమ కుటుంబాల దీర్ఘాయువు కోసం ఏటేటా సమర్పించే పూజ తర్వాత ఇళ్ళపైన ఎగరేసే జెండాల అవశేషాలు.

ప్రతి కొన్ని గంటలకు వాళ్ళు ఆడే ఆటలు మారిపోతుంటాయి. ఖో- ఖో, కబడ్డీ , పరుగు, బురదనీటి గుంటల్లోకి దూకటం. MGNREGS స్థలాలలో ‘జాబ్ కార్డ్ పనుల’ కోసం వెళ్ళినప్పుడు, తమ తల్లిదండ్రులు మట్టిని తవ్వే మాదిరిగానే పిల్లలు కూడా బొమ్మ జెసిబి (తవ్వేయంత్రం)తో మట్టి తవ్వే ఆటలాడే రోజులు కూడా ఉంటాయి.

కొంతమంది పిల్లలకు సమీపంలోనే ఉన్న చిన్న ఛుగ్ సంఘారామానికి వెళ్ళటంతో రోజు ముగుస్తుంది, మరికొంతమందికి పొలంలో పనిచేసే తమ తల్లిదండ్రులకు చేతిసాయం అందించటంతో ముగుస్తుంది. సాయంసంధ్యా సమయానికి దారిలో ఉండే చెట్ల నుండి నారింజపండ్లనో, తునికి పండ్ల (persimmons)నో తెంపుకొని తింటూ ఆ 'ఊరేగింపు' తిరిగివస్తుంది. ఆ విధంగా ఆ రోజు ముగుస్తుంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sinchita Parbat

সিঞ্চিতা পার্বত পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার একজন সিনিয়র ভিডিও এডিটর। এরই পাশাপাশি তিনি একজন ফ্রিল্যান্স ফটোগ্রাফার এবং ডকুমেন্টারি ফিল্মমেকার। পূর্বে প্রকাশিত তাঁর প্রতিবেদনগুলি ‘সিঞ্চিতা মাজি’ এই বাইলাইনের অধীনে পারিতে পড়া যেতে পারে।

Other stories by Sinchita Parbat
Editor : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli