మా అమ్మ నాతో తరచూ అంటుండేది: “కుమార్, నేను ఆ చేపల కుండను పట్టుకోకుండా ఉంటే, మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు.” నేను పుట్టిన ఏడాది తరువాత, అమ్మ చేపలు అమ్మడం ప్రారంభించింది. అప్పటి నుండి నా జీవితమంతా చేపలతోనే నిండిపోయింది.
మా ఇల్లంతా చేపల వాసనతో నిండిపోయి ఉంటుంది. ఒక మూల ఎప్పుడూ ఎండు చేపల మూట వేలాడదీసి ఉంటుంది మరి. తొలకరి జల్లులు పడగానే అమ్మ గండు (carp) చేపలను వండుతుంది. అదొక రుచికరమైన వంటకం; జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇక అమ్మ వాలుగ చేపలు (cat fish), మోసులు (spotted snakehead), లేదా సెలాప్పి (గుల్ల చేప) చేపలతో కూర చేస్తే, ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది.
నా చిన్నతనంలో, చేపలు పట్టడం కోసం నేను తరచుగా బడి ఎగ్గొట్టేవాడిని. మదురైలోని జవహర్‌లాల్‌పురం ప్రాంతంలో అన్ని ప్రదేశాలూ నీళ్ళతో కళకళలాడుతుండే రోజులవి; మా జిల్లా అంతటా బావులు, నదులు, సరస్సులు, చెరువులే ఉండేవి. నేనూ మా తాతయ్యతో కలిసి ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళేవాడిని. మేం ఒక ఊయల బుట్టను తీసుకెళ్ళేవాళ్ళం. దానిని నీటిలో ముంచి పైకెత్తి చేపలను పట్టుకునేవాళ్ళం. అలాగే, వాగులో నీటి ప్రవాహమున్న చోటికి వెళ్ళి, ఎరను ఉపయోగించి చేపలు పట్టేవాళ్ళం.
నీటి ప్రవాహం దగ్గరికి మేం వెళ్ళకుండా ఉండడానికి, అమ్మ మాకు దెయ్యాల కథలు చెప్పి భయపెట్టేది. కానీ చెరువుల గుండా నీళ్ళెప్పుడూ ప్రవహిస్తూనే ఉండేవి; మేమెప్పుడూ ఆ నీటి చుట్టూనే ఉండేవాళ్ళం. నేను మా ఊరిలో ఉండే ఇతర అబ్బాయిలతో కలిసి చేపలు పట్టేవాడిని. నేను పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది; చెరువుల నీటి మట్టాలు పడిపోయాయి; వ్యవసాయం కూడా దెబ్బతింది.
మా ఊరు జవహర్‌లాల్‌పురంలో మూడు చెరువులు ఉన్నాయి – ఒకటి పెద్దది, మరొకటి చిన్నది, ఇంకోటి మారుతంకుళం చెరువు. మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద, చిన్న చెరువులను వేలం వేసి, గ్రామంలోని వ్యక్తులకు గుత్తకు ఇచ్చారు. వాళ్ళు ఆ చెరువులలో చేపలను పెంచుతారు; అదే వారి జీవనాధారం. తయ్ (మధ్య-జనవరి నుండి మధ్య-ఫిబ్రవరి వరకు) నెలలో, ఆ రెండు చెరువులలో విరివిగా చేపలు పడతారు – ఈ కాలాన్ని చేపలవేట కాలంగా పరిగణిస్తారు.
చెరువుల నుండి చేపలు కొనడానికి మా నాన్న వెళ్తోంటే, నేను కూడా ఆయన వెంట వెళ్ళేవాడిని. సైకిల్ వెనుక చేపలను నిల్వచేసే ఒక పెట్టె కట్టివుండేది. మేం చేపలను కొనేందుకు చాలా గ్రామాలు తిరిగేవాళ్ళం; కొన్నిసార్లు 20-30 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించేవాళ్ళం.
మదురై జిల్లాలోని అనేక చెరువులలో చేపల వేట వేడుకలు ఘనంగా జరుగుతాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు వస్తారు. మంచిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని వీరంతా ప్రార్థిస్తారు. చేపలు పట్టడం వల్ల మంచి వర్షాలు కురుస్తాయని, చేపల వేట వేడుకలను నిర్వహించకుంటే కరువు కాటకాలు తప్పవని ప్రజల నమ్మకం.
ఆ సమయంలో, చేపల బరువు ఎక్కువగా ఉంటుంది; అంటే మంచి లాభాలు వస్తాయని అమ్మ ఎప్పుడూ చెప్తుంది. ప్రజలు ఎక్కువగా బతికున్న చేపలను ఇష్టపడతారు. అదనుతప్పిన కాలంలో, చేపల బరువు తక్కువగా ఉంటుంది; తగినన్ని చేపలు కూడా దొరకవు.
చేపల అమ్మకం వల్ల మా గ్రామంలో చాలామంది మహిళలు బతకగలుగుతున్నారు. ముఖ్యంగా, భర్తను కోల్పోయిన వారికి ఇదే జీవనోపాధిని కల్పించింది.
చేపలు నన్ను మంచి ఫోటోగ్రాఫర్‌గా మార్చాయి. 2013లో, నేను కెమెరా కొన్నాక, చేపలు కొనడానికి వెళ్లినప్పుడల్లా దాన్ని నా వెంట తీసుకెళ్ళేవాడిని. కొన్నిసార్లు చేపలు కొనడం మరచిపోయి, చేపల వేటని ఫోటోలు తీయడంలో మునిగిపోయేవాడిని. ఆలస్యమైనందుకు ఫోన్ చేసి, అమ్మ నన్ను తిట్టే వరకూ అన్నీ మర్చిపోయేవాడిని. తన దగ్గర చేపలు కొనడానికి జనాలు ఎదురుచూస్తున్నారని ఆమె నాకు గుర్తు చేయగానే, చేపలు కొనడానికి పరిగెత్తేవాడిని.
చెరువుల్లో మనుషులు మాత్రమే కాక, ఆ చుట్టుపక్కల పక్షులు, పశువులు కూడా ఉండేవి. నేను ఒక టెలి లెన్స్‌ని కొన్నాను; జల, వన్యప్రాణుల ఫోటోలు తీయడం ప్రారంభించాను – కొంగలు, బాతులు, చిన్న చిన్న పక్షులు లాంటివన్నమాట. పక్షులను చూడటం, వాటి ఫోటోలు తీయడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది.
ఇప్పుడైతే సరిగ్గా వర్షాలు పడడం లేదు; చెరువులలో నీళ్ళు ఉండటంలేదు; చేపలు కూడా ఉండటంలేదు.
*****
నాకు సొంతంగా కెమెరా వచ్చాక చెరువుల్లో వలలు విసిరే మత్స్యకారుల – పిచ్చయ్య అన్న, మొక్క అన్న, కార్తీక్, మరుదు, సెంథిల్ కలై – ఫోటోలు కూడా తీయడం ప్రారంభించాను. వాళ్ళతో పాటు నేను కూడా వల విసిరి చేపలు పడుతూ చాలా నేర్చుకున్నాను. వీరంతా మదురై తూర్పు బ్లాక్‌లోని పుదుపట్టి గ్రామం సమీపంలో ఉన్న ఒక పల్లెకు చెందినవారు. దాదాపు 600 మంది జనాభా ఉన్న ఈ పల్లెలో, 500 మంది చేపల వేటపై ఆధారపడినవారు; ఇదే వారి ప్రాథమిక జీవనోపాధి.
సి. పిచ్చయ్య 60 ఏళ్ళ మత్స్యకారుడు. ఆయన తిరునల్వేలి, రాజపాళయం, తెన్‌కాశీ, కారైక్కుడి, దేవకోట్టై వంటి ప్రాంతాలలోని చెరువుల్లో చేపలు పట్టడానికి చాలా దూరాలు ప్రయాణించారు. తన 10 ఏళ్ళ వయసులో తండ్రి దగ్గర చేపలు పట్టే విద్య నేర్చుకున్న ఈయన చేపల వేటలో భాగంగా తండ్రితో పాటు తిరిగేవారు. కొన్నిసార్లు ఎక్కువగా చేపలు పట్టడం కోసం కొన్ని రోజుల పాటు ఆ ప్రదేశాల్లో ఉండిపోయేవారు.
"మేం ఏడాదిలో ఆరు నెలలు చేపలు పడతాం. ఆ ఆరు నెలల్లో పట్టిన చేపలలో వీలైనన్ని చేపలను అమ్మి, మిగిలిన వాటిని ఎండబెడతాం. అలా ఏడాది పొడవునా మాకు ఆదాయం ఉండేలా చూసుకుంటాం,” పిచ్చయ్య నాతో అన్నారు.
నేలలో కప్పిపెట్టిన గుడ్ల నుంచి దేశవాళీ చేపలు పుడతాయని, వర్షాల ద్వారా వాటికి పోషణ లభిస్తుందని అతను చెప్పారు. “ కెలుతి (జెల్లలు) కొరవ (మట్టగిడసలు), వరా, పంపుపిడి కెందపుడి, వెలిచి వంటి దేశవాళీ చేపలు గతంలో ఉన్నంత పెద్ద సంఖ్యలో ఇప్పుడు లేవు. పొలాల్లో వాడే పురుగుమందుల వల్ల కలుషితమైన నీరు చెరువుల్లోకి చేరుతోంది. ఇప్పుడైతే అన్ని రకాల చేపల్ని పెంచుతున్నారు; వాటికి కృత్రిమంగా ఆహారాన్ని అందిస్తున్నారు. దీని వల్ల చెరువుల సారం మరింత తగ్గిపోతోంది,” అని ఆయన వివరించారు.
చేపలు పట్టే పని లేనపుడు, స్థానికంగా, నూర్ నాళ్ పని గా పిలిచే, NREGA (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) కింద కాల్వలు నిర్మించడం వంటి రోజువారీ కూలీపనికి వెళ్తారు పిచ్చయ్య; లేదా, తాను చేయగలిగిన పని ఏదైనా సరే చేస్తారు..
చేపలవేట కాలం ముగిశాక తాను కూడా రోజువారీ కూలీ పనికి వెళ్ళాల్సిందేనని మత్స్యకారుడైన 30 ఏళ్ళ మొక్కా చెప్పారు. అతని భార్య హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తోంది, వారి పిల్లలు 3వ తరగతి, 2వ తరగతి చదువుతున్నారు.
చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగిన ఈయన, “నాకు చదువుపై ఆసక్తి లేకపోవడంతో, పొలం పనులతోపాటు ఇతర చిన్నాచితకా పనులు కూడా చేశాను. కానీ నా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చేలా మంచిగా చదివించాలని కోరుకుంటున్నా,” అని చెప్పారు.
*****
చేపలు పట్టే వలలను చేతితో తయారుచేస్తారు మాల్‌కలై. ఈ పనిని ఆయన తన పూర్వీకుల నుండి నేర్చుకున్నారు. “ఇప్పటికీ, మా ఊరు ఓత్తకడైలో మాత్రమే చేపలు పట్టడానికి చేతితో తయారుచేసిన వలలను ఉపయోగిస్తాం. ఇప్పటి వలలు మా తాత ఉపయోగించిన దానికంటే చాలా భిన్నంగా ఉంటాయి. అప్పట్లో వాళ్ళు కొబ్బరి చెట్ల నుండి నార తీసుకొని, దానిని మెలితిప్పి వల నేసేవాళ్ళు. మా ఊరిలో మంచి గుర్తింపు ఉన్న వలలను నేయడానికి కొబ్బరి పీచు కోసం వెతుకుతూ వాళ్ళు చాలా దూరాలు వెళ్ళేవారు. చేపల వేటకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మత్స్యకారులు ఆ వలలను తమ వెంట తీసుకెళ్ళేవారు,” అని 32 ఏళ్ళ మాల్‌కలై వివరించారు.
"చేపలు, చేపలు పట్టడం మా జీవితంలో ముఖ్యమైన భాగాలు. మా గ్రామంలో చాలామంది మత్స్యకారులు ఉన్నారు. నేర్పరియైన జాలరి ఎవరైనా చనిపోతే, మా గ్రామస్థులు అతని అంత్యక్రియల కోసం ఏర్పాచేసిన పాడె నుండి ఒక వెదురు కర్రను తీసుకొని, దాన్ని ఆధారంగా పెట్టి కొత్త వలను నేసి, అతని వారసత్వాన్ని గౌరవిస్తారు. మా ఊరిలో ఈ పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తూనేవున్నాం.
“ఒక చెరువులోని నీటిని చూసి, అందులో చేపల పరిమాణం ఎంత ఉంటుందో మావాళ్ళు చెప్పగలరు. తమ చేతుల్లోకి నీటిని తీసుకొని చూసి, అవి బురదగా ఉంటే పెద్ద చేపలున్నాయని, తేటగా ఉంటే చేపల సంఖ్య తక్కువగా ఉందని చెబుతారు.
“చేపలు పట్టడానికి మేం మదురై జిల్లా అంతటకూ వెళ్ళేవాళ్ళం - తొండి, కరైకుడి, కన్యాకుమారిలో ఉన్న సముద్రం (హిందూ మహాసముద్రం) వరకు. మేం తెన్‌కాశీలోని అన్ని చెరువులకూ వెళ్తాం; అన్ని ఆనకట్టలను చూశాం. కొన్నిసార్లు ఐదు లేదా పది టన్నుల చేపలను కూడా పట్టుకుంటాం. కానీ, మేం పట్టుకున్న చేపల పరిమాణం ఎంత ఉన్నా, మా వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయి.
“మదురైలో ఒకప్పుడు దాదాపు 200 చెరువులు ఉండేవి. కానీ, పట్టణీకరణ పుంజుకోవడంతో ఈ చెరువులు కనుమరుగవుతున్నాయి. అందుకే, చేపల వేట కోసం మేం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోంది. చెరువులు కనుమరుగవుతున్నందున మాలాంటి సంప్రదాయక మత్స్యకారుల జీవితాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చేపల వ్యాపారులు కూడా నష్టపోతున్నారు.”
“మా నాన్నకు ముగ్గురు తోబుట్టువులు. నాకూ ముగ్గురు తోబుట్టువులు. మేమంతా చేపల వేటలోనే ఉన్నాం. నాకు వివాహమైంది; ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మా ఊరిలోని కుర్రవాళ్ళు బడులకు, కళాశాలలకు వెళుతున్నా, చేపల వేటపై ఇంకా ఆసక్తిగానే ఉన్నారు. బడి, లేదా కళాశాలలకు వెళ్ళే సమయం పోను, వాళ్ళు తమ మిగిలిన సమయాన్ని చేపలు పట్టడానికే వెచ్చిస్తారు.”
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి