ఒక జీవశాస్త్రవేత్త, ఒక సైనికుడు, ఒక గృహిణి, ఒక భూగోళశాస్త్ర పట్టభద్రుడు.
రాంచీలో రద్దీగా ఉండే రహదారికి దూరంగా, ఈ ఒకరితో ఒకరికి పోలికలేని వ్యక్తుల సమూహం ఒక వెచ్చని వేసవి రోజున ఒకచోటకు కలిసివచ్చారు. వీరంతా ప్రత్యేకించి దుర్బలమైన ఆదివాసీ సమూహాల (PVTG) సభ్యులు. ఝార్ఖండ్ రాజధానీ నగరంలోని ఆదివాసీ పరిశోధనా సంస్థ (TRI)లో జరుగుతోన్న లేఖన కార్యశాలలో పాల్గొనేందుకు వచ్చారు.
"నా పిల్లలు తమ మాతృభాషలో చదవాలని నేను కోరుకుంటున్నాను," మాల్ పహారియా సముదాయానికి చెందిన మావ్‌ణో భాషను మాట్లాడే జగన్నాథ్ గిరహీ అన్నారు. 24 ఏళ్ళ వయసున్న జగన్నాథ్ తన అంతరించిపోతోన్న మాతృభాష మావ్‌ణోకు వ్యాకరణం రాయటానికి దుమ్‌కా లోని తమ గ్రామం నుంచి 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి రాంచీలోని TRIకి వచ్చాడు.
అతనికి చాలా ప్రణాళికలున్నాయి: "మేం మావ్‌ణో భాషలో ఒక పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటున్నాం," అని జగన్నాథ్ చెప్పాడు. స్వగ్రామం బలియాఖోడాలో జీవశాస్త్రంలో ఎమ్మెస్సీ డిగ్రీ సంపాదించిన మొదటి, ఏకైక వ్యక్తి జగన్నాథ్. ఈయన ఈ డిగ్రీని హిందీ మాధ్యమంలో చదివాడు. "విశ్వవిద్యాలయంలో ఎక్కువమంది ఉన్న సముదాయానికి చెందిన భాషలోనే బోధన జరుగుతుంది," అని అతను పేర్కొన్నాడు. "ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) సిలబస్ కూడా ఖొరఠా, సంథాలీ వంటి [ఆదివాసీ] భాషల్లో అందుబాటులో ఉంటుంది, కానీ మా భాషలో [మావ్‌ణో] మాత్రం లేదు."
"ఇదే [ప్రాముఖ్యాన్నివ్వకపోవటం] కొనసాగితే, నా భాష నెమ్మదిగా అదృశ్యమవుతుంది." మాల్‌పహారియా భాషను మాట్లాడేవారిలో దాదాపు 15 శాతం మంది ఝార్ఖండ్‌లో నివసిస్తున్నారు; మిగిలినవారు పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నారు
వారి భాష మావ్‌ణో ద్రావిడ ప్రభావాలు కలిగిన ఇండో-ఆర్యన్ భాష. 4000 కంటే తక్కువమంది మాట్లాడే అంతరించిపొతోన్న ఈ భాషకు అధికారిక భాష హోదా లేదు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (LSI), ఝార్ఖండ్ ప్రకారం, మావ్‌ణోని పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఉపయోగించలేదు, దానికి ప్రత్యేకమైన లిపి కూడా లేదు.
మాల్ పహారియా సముదాయం వ్యవసాయం పైనా, అటవీ ఉత్పత్తుల పైనా ఆధారపడి జీవిస్తుంది. ఝార్ఖండ్‌లో పివిటిజి కింద వర్గీకరించి ఉన్న వీరిలో ఎక్కువమంది దుమ్‌కా, గోడ్డా, సాహిబ్‌గంజ్, పాకూర్ జిల్లాలలో నివసిస్తారు. వీరు ఇంటిదగ్గర మాత్రమే మావ్‌ణో మాట్లాడతారు. అధికారిక సంభాషణలన్నీ ఇతర ఆధిపత్య భాషలైన హిందీ, బెంగాలీ వంటి భాషలలో జరుగుతుండటంతో తమ భాష అంతరించిపోవచ్చునని వారు భావిస్తున్నారు.
మావ్‌ణో మాట్లాడే మరో వ్యక్తి, మనోజ్ కుమార్ దెహ్రీ జగన్నాథ్‌తో ఏకీభవిస్తాడు. పాకూర్ జిల్లా శహర్‌పుర్‌కు చెందిన 23 ఏళ్ళ మనోజ్ భూగోళశాస్త్ర పట్టభద్రుడు. "హిందీ బంగ్లాలకు విద్యా మాధ్యమాలుగా రాష్ట్రం ప్రాధాన్యమివ్వడం మావ్‌ణోకు మేలు కంటే ఎక్కువగా కీడునే చేస్తోంది," అంటాడతను. ఝార్ఖండ్‌లోని అనేక పాఠశాలలు, కళాశాలలలో హిందీయే విద్యా మాధ్యమంగా ఉంది, ఉపాధ్యాయులు కూడా హిందీ మాట్లాడేవారే.
ఆధిపత్య భాషలే కాకుండా, ఆదివాసులు ఇతరులతో సంభాషించడానికి ఉపయోగించే 'అనుసంధాన భాషల' సమస్య కూడా ఉంది. ఈ భాషలు తరచుగా స్థానిక భాషకూ, ఈ ప్రాంతంలోని ఆధిపత్య భాషలకూ మధ్య వారధిగా ఉపయోగపడుతుంటాయి.
"సాధారణంగా అందరికీ అర్థమయ్యే అనుసంథాన భాషలోనే పిల్లలు మాట్లాడాలనే ఒక ఆకాంక్ష తెలియకుండానే వ్యక్తమవుతోంది. ఇది ఆ పిల్లల్ని తమ మాతృభాషకు దూరం చేస్తుంది," అని పివిజిటిలకు సహాయపడేందుకు టిఆర్ఐ నియమించిన ప్రమోద్ కుమార్ శర్మ అనే విశ్రాంత ఉపాధ్యాయుడు అన్నారు.
మావ్‌ణో విషయానికే వస్తే, తక్కువగా మావ్‌ణోను మాట్లాడేవారిని కూడా దాని అనుసంథాన భాషలైన ఖోర్‌ఠా, ఖేత్రీలు ప్రభావితం చేస్తున్నాయి. "బలమైన సముదాయాలకు చెందిన భాషల ప్రభావంలో పడి మనం మన మాతృభాషను మర్చిపోతున్నాం," అంటారు మనోజ్.
రెండు నెలలకు పైగా కొనసాగిన కార్యశాల ముగింపుకు వచ్చేసరికి ఈ అంతరించిపోతోన్న భాషలను మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒక మొదటిపాఠ పుస్తకాన్ని (ప్రైమర్) - వారి వారి మాతృభాషలలో ఒక ప్రాథమిక వ్యాకరణ నమూనా - రూపొందిస్తారు. ఆ విధంగా ఇది భాషావేత్తలు రాసింది కాకుండా ఆ సముదాయానికి చెందిన వ్యక్తులు రాసిన మొదటి పుస్తకం అవుతుంది. తమ ప్రయత్నాలు పరిస్థితిని కాపాడతాయని వారు ఆశిస్తున్నారు.
“ఇతర [పివిటిజి కానివారు] సముదాయాలకు వారి భాషలో రాసిన పుస్తకాల సౌలభ్యం ఉంది. తమ భాషలో చదవటం వలన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి,” అని జగన్నాథ్ అభిప్రాయపడ్డాడు. కానీ అతని సముదాయానికి చెందినవారు తమ భాషలో మాట్లాడటాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. “ఈరోజు నా తాతలు, తల్లిదండ్రులు మాత్రమే మావ్‌ణోను అనర్గళంగా మాట్లాడగలరు. మా పిల్లలు ఇంట్లో ఆ భాషను నేర్చుకున్నప్పుడే దాన్ని మాట్లాడగలుగుతారు.”
*****
భారతదేశంలో 19,000కు పైగా నిర్దిష్టమైన మాతృభాషలు ఉన్నాయని 2011 నాటి జనగణన జాబితా చేసింది. ఇందులో కేవలం 22 మాత్రమే షెడ్యూల్ VIII కింద అధికారికంగా గుర్తింపు పొందినవి. అనేక మాతృభాషలకు లిపి లేకపోవటం వలన, దానిని మాట్లాడేవారు తగ్గిపోతుండటం వలన ‘భాష’ హోదాను పోందలేకపోయాయి.
రాష్ట్రంలో 31 కి పైగా మాతృభాషలకు అధికారికంగా భాష హోదా లేకపోవటంతో, షెడ్యూల్ VIIIకి చెందిన రెండు భాషలు - హిందీ, బెంగాలీ - ఝార్ఖండ్‌లో ఆధిపత్య భాషలుగా కొనసాగాయి. రాష్ట్రంలోని పాఠశాలలలో ఇవే బోధనా భాషలుగా ఉన్నాయి, అధికారిక సంభాషణలలో కూడా వీటినే ఉపయోగిస్తారు. ఝార్ఖండ్ నుండి షెడ్యూల్ VIII భాషగా జాబితా అయిన ఏకైన ఆదివాసీ భాష, సంథాలీ.
రాష్ట్రంలో 31 ఇతర భాషలను మాట్లాడేవారికి, ప్రత్యేకించి పివిటిజిలు మాట్లాడేవాటికి భాష నష్టం జరిగే ప్రమాదం ఉంది.
" హమారీ భాషా మిక్స్ హోతీ జా రహీ హై [మా మాతృభాష కలగాపులగపు భాషగా మారిపోతోంది]," సబర్ సముదాయానికి చెందిన సైనికుడు మహదేవ్ (అసలు పేరు కాదు) అంటాడు.
ఝార్ఖండ్‌లో, 32 విభిన్న మాతృభాషలు ఉన్నప్పటికీ, సంథాలీ మాత్రమే అధికారికంగా షెడ్యూల్ VIII భాషగా జాబితా అయింది. అయితే రాష్ట్రంలో వాడుకలో ఉన్న హిందీ, బెంగాలీ భాషలు ఆధిపత్య భాషలుగా కొనసాగుతున్నాయి
గ్రామపంచాయతీల వంటి చోట్ల సామాజిక ప్రాతినిధ్యం లేకపోవటంలో కూడా తమ భాషకు ఉన్న అట్టడుగు స్థానానికి అద్దం పడుతోందని ఆయన అంటున్నాడు. “సబరులు చాలా చెల్లాచెదురుగా ఉన్నారు. మేం నివసించే గ్రామంలో [జంషెడ్‌పూర్ సమీపంలో], 8-10 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి." మిగిలినవారు ఇతర ఆదివాసీ సముదాయాలకు చెందినవారు, ఇంకా కొందరు ఆదివాసీయేతరులు కూడా ఉన్నారు. "నా భాష అంతరించిపోవడాన్ని చూడటం చాలా బాధాకరం," అని అతను PARIతో చెప్పాడు.
తన మాతృభాష అయిన సబర్‌ను ఒక భాషగా చెప్పుడోవడానికిలేదని మహదేవ్ పేర్కొన్నాడు, "రాత రూపంలో ఉన్న భాష గొంతుక మాత్రమే ఎప్పుడైనా మొదటగా వినబడుతుంది."
*****
వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలను పరిశోధించడం ద్వారా 'ఆదివాసీ సముదాయాలను ఇతర సముదాయాలతో అనుసంధానించే లక్ష్యంతో' 1953లో TRI ఏర్పాటయింది.
2018 నుండి అసుర్, బిరిజియాతో సహా అనేక దుర్బల ఆదివాసీ సమూహాల భాషా ప్రైమర్‌లను TRI ప్రచురించింది. ఈ పుస్తకాల శ్రేణిలో భాషలోని సామెతలు, యాసలు, జానపద కథలు, పద్యాలను ప్రచురించడం కూడా ఉంటుంది.
ఈ చొరవతో సముదాయం స్వయంగా రూపొందించిన భాషా ప్రైమర్‌లను ప్రచురించినప్పటికీ, అది పెద్దగా విజయం సాధించలేదు. "టిఆర్‌ఐ పుస్తకాలు పాఠశాలలకు చేరినట్లయితే మా పిల్లలు మాతృభాషలో చదవగలుగుతారు," అని జగన్నాథ్ చెప్పాడు.
టిఆర్ఐ మాజీ సంచాలకులు రణేంద్ర కుమార్ తన పదవీకాలంలో ఈ ప్రైమర్‌ల ప్రచురణను ప్రారంభించడంలో ముందంజలో ఉన్నారు. అయితే అతను కూడా ఇలా చెప్పారు, “పివిటిజిల పిల్లలు చదివే పాఠశాలలకు ఈ పుస్తకాలు చేరాలి, అప్పుడే ఈ పని అసలు ప్రయోజనం నెరవేరుతుంది."
భాషని అనర్గళంగా మాట్లాడేవారిని గుర్తించడం అతిపెద్ద సవాలు. ప్రమోద్ మాట్లాడుతూ, "తమ మాతృభాషను అనర్గళంగా మాట్లాడే వ్యక్తులకు తరచుగా రాయటం రాదు," అన్నారు. కానీ వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో, అంత గొప్పగా మాట్లాడలేకపోయినా, మిశ్రమ భాషను ఉపయోగించగలిగి, రాయగలిగిన వ్యక్తులను వ్యాకరణ ప్రైమర్‌లను సిద్ధంచేయడానికి పిలుస్తారు.
"ఈ పని చేయటం కోసం భాషా పండితులు కావాలనే షరతును మేం పెట్టలేదు." భాష తెలిసివుండటమొక్కటే అవసరం. "మాట్లాడే భాషలో వ్యాకరణం తయారుచేస్తే, అది మరింత ఉపయోగ్యంగా ఉంటుందని మా నమ్మకం," ఝార్ఖండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ (జె ఏఅర్‌సి) మాజీ ఫాకల్టీ సభ్యుడైన ప్రమోద్ అన్నారు.
భాషా ప్రైమర్‌లు, వ్యాకరణ పుస్తకాలు, పివిటిజిల భాషల వనరులు దేవనాగరి లిపిని ఉపయోగిస్తాయి. ఒక అక్షరం లేదా శబ్దం హిందీలో ఉండి, తమ భాషలో లేకుంటే, వారు ఆ నిర్దిష్ట భాష వర్ణమాల వ్యవస్థ నుండి ఆ ధ్వనిని తీసివేస్తారు. “మావ్‌ణో భాషలో‘ణ’ అక్షరం ఉంది, కానీ సబర్‌లో లేదు. కాబట్టి, మేం సబర్ వర్ణమాలలో ‘ణ’రాయకుండా ‘న’అని మాత్రమే రాసేలా నిర్ధారిస్తాం," అని ప్రమోద్ వివరించారు. అదేవిధంగా, ఒక ధ్వని లేదా అక్షరం హిందీలో లేనప్పుడు, డాక్యుమెంటేషన్ చేస్తోన్న ఆదివాసీ భాషకు అది ప్రత్యేకమైనది అయినప్పుడు, వారు తర్వాతి అక్షరాన్ని పరిచయం చేసి వివరణను అందిస్తారు.
"అయితే మేం ఒక లిపిని మాత్రమే అరువు తీసుకుంటాం. అక్షరాలు, పదాలు చివరకు వారి మాతృభాష ఉచ్చారణ ప్రకారమే రాయటం జరుగుతుంది," అన్నారు 60 ఏళ్ళ ప్రమోద్.
*****
సాయంత్రం అయింది. జగన్నాథ్, మనోజ్, మహదేవ్‌లు, కార్యశాలలో పాల్గొన్న ఇతరులతో కలిసి మోరాబాదీ చౌక్‌లో ఒక చిన్న తేనీటి విరామం కోసం బయలుదేరారు. భాష గురించిన చర్చ ఇప్పుడు మాతృభాషలో మాట్లాడటానికి సంకోచించడంతో సహా ఇతర అంశాలను తాకడం ప్రారంభించింది.
వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ, అన్నిసార్లూ వారికి అర్థంకాదనేది 8వ తరగతితో చదువు మానేసిన పరహియా సముదాయానికి చెందిన రింపూ కుమారి అనుభవం చెప్తోంది. రోజంతా మౌనంగా ఉన్న ఆమె, చివరకు సందేహిస్తూనే తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టింది,"నేను పరహియాలో మాట్లాడినప్పుడు జనం నవ్వుతారు," తన సముదాయానికి చెందని వ్యక్తిని పెళ్ళిచేసుకున్న 26 ఏళ్ళ కుమారి చెప్పింది. "నా స్వంత అత్తమామలే నన్ను ఎగతాళి చేస్తుంటే, నేనింక ప్రపంచానికి ఏం చెప్పగలను?"
తానూ, తన సముదాయంవారూ తమ మాతృభాషను మాట్లాడేటప్పుడు ‘సిగ్గు’ పడటం మానేయాలని ఆమె కోరుకుంటున్నారు. "దీని గురించి నేనిక్కడ మాట్లాడాలనుకోవటంలేదు. మీరింకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, మా ఊరికి రండి," అంటూ ముగించిందామె.
ఈ కథనం రూపొందటంలో సాయపడినందుకు రణేంద్ర కుమార్‌కు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
PARI అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్ (ELP) భారతదేశంలోని హానికి లోనవుతోన్న భాషలను ఆ భాషలను మాట్లాడే వ్యక్తుల స్వరాల, ప్రత్యక్ష అనుభవాల ద్వారా డాక్యుమెంట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి