"ఏదో ఒకరోజు నేను ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాన్ని సాధిస్తాను," తన స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళే తారు రోడ్డు మీద చాలా దూరం పరుగెత్తిన తర్వాత వస్తోన్న ఆయాసాన్ని అణచుకోవడానికి ఊపిరి తీసుకుంటూ చెప్పిందామె. నాలుగు గంటల కఠోర శిక్షణ తర్వాత అలసిన, గాయపడిన ఆమె దిసపాదాలు చివరకు ఆ క్రీడామైదానం పై విశ్రాంతి తీసుకుంటున్నాయి.

ఎక్కువ దూరాలు పరుగులు తీసే (లాంగ్ డిస్టెన్స్ రన్నెర్) ఈ పదమూడేళ్ళ క్రీడాకారిణికి దిస పాదాలతో పరుగులు పెట్టడమనేది ఈ ఆధునిక కాలపు వేలంవెర్రి వంటిదేమీ కాదు. "నేనెందుకలా పరుగెడతానంటే, అంత ఖరీదైన రన్నింగ్ షూ కొనగల స్తోమత నా తల్లిదండ్రులకు లేదు," అంటోందీమె.

కరవు పీడిత ప్రాంతమైన మరఠ్వాడాలోని అతి పేద జిల్లాలలో ఒకటైన పర్‌భణీకి చెందిన వ్యవసాయ కూలీలైన విష్ణు, దేవశాలల కుమార్తె, వర్షా కదమ్. ఆమె కుటుంబం మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులాల జాబితాకు చెందిన మాతంగ్ సముదాయానికి చెందినది.

"నాకు పరుగెత్తడమంటే చాలా ఇష్టం," మెరుస్తోన్న కళ్ళతో చెప్పింది వర్ష. "2021లో జరిగిన ఐదు కిలోమీటర్ల బుల్‌ఢాణా అర్బన్ ఫారెస్ట్ మారథాన్ నా మొదటి పరుగు. అందులో నేను రెండవస్థానంలో వచ్చినందుకు నాకా చాలా బాగా అనిపించింది. అదే నేను గెల్చుకున్న మొదటి పతకం కూడా. నేను మరిన్ని పోటీలలో గెలవాలనుకుంటున్నాను," నిశ్చయంగా చెప్పింది ఈ బాలిక.

ఆమెకు ఎనిమిదేళ్ళ వయసప్పుడే ఆమెలోని తీవ్ర ఉత్సాహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. "మా మామ (మేనమామ) పారాజీ గాయక్వాడ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు. ఆయనిప్పుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. ఆయన్ని చూశాకే నేను కూడా పరుగు తీయడాన్ని మొదలుపెట్టాను," అంటోంది వర్ష. 2019లో జరిగిన అంతరపాఠశాల రాష్ట్ర స్థాయి పోటీలలో నాలుగు కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగుపందెంలో ఆమె రెండవ స్థానాన్ని పొందింది. "ఇది పరుగును కొనసాగించడానికి నాకు మరింత విశ్వాసాన్ని ఇచ్చింది."

arsha Kadam practicing on the tar road outside her village. This road used was her regular practice track before she joined the academy.
PHOTO • Jyoti Shinoli
Right: Varsha and her younger brother Shivam along with their parents Vishnu and Devshala
PHOTO • Jyoti Shinoli

ఎడమ: తన గ్రామం వెలుపల ఉన్న తారు రోడ్డుపై ప్రాక్టీస్ చేస్తోన్న వర్షా కదమ్. అకాడమీలో చేరకముందు ఆమె ఈ రోడ్డు మీదనే రోజూ ప్రాక్టీస్ చేసేది. కుడి: తల్లిదండ్రులైన విష్ణు, దేవశాలలతో వర్ష, ఆమె తమ్ముడు శివమ్

మార్చి 2020లో వచ్చిన మహావిపత్తు వలన ఆమెకు బడి లేకుండాపోయింది. "నా తల్లిదండ్రుల వద్ద ఆన్‌లైన్ తరగతులకు అవసరమైన ఫోన్ (స్మార్ట్ ఫోన్) లేదు," అంది వర్ష. ఆ సమయంలో ఆమె పొద్దునా సాయంత్రం రెండేసి గంటల పాటు పరుగులు పెట్టేది.

అప్పటికి పదమూడేళ్ళ వయసున్న ఆమె, అక్టోబర్ 2020లో మహారాష్ట్రలోని పర్‌భణీ జిల్లా, పింపళ్‌గావ్ ఠోంబరే శివార్లలో ఉన్న శ్రీ సమర్థ్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ రెసిడెన్షియల్ అకాడమీలో చేరింది.

అక్కడ శిక్షణ పొందినవారిలో సామాజికంగా ఆర్థికంగా దిగువ స్థాయి సముదాయాలకు చెందిన ఎనిమిదిమంది బాలురు, ఐదుగురు బాలికలు - మొత్తం 13 మంది కూడా ఉన్నారు. వీరిలో కొందరు రాష్ట్రంలో ప్రత్యేకించి అట్టడుగుస్థాయికి చెందిన ఆదివాసీ సముదాయాలకు (పివిటిజి) చెందినవారు. వీరి తల్లిదండ్రులు రైతులుగా, చెరకు నరికేవారుగా, వ్యవసాయ కూలీలుగా, వలస శ్రామికులుగా పనిచేస్తారు. వీరంతా కరవు ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన మరఠ్వాడా ప్రాంతానికి చెందినవారు.

ఇక్కడ శిక్షణ పొందిన ఈ చిన్నారి క్రీడాకారులలో రాష్ట్ర, దేశీయ స్థాయిలలో జరిగిన పరుగుపందేలలో చివరి అంకం వరకూ వచ్చిన వారున్నారు; మరికొంతమంది అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించినవారు కూడా ఉన్నారు.

ఈ అకాడమీకి చెందిన క్రీడాకారులు ఏడాది మొత్తం ఇక్కడే ఉంటూ అక్కడికి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్‌భణీలోని పాఠశాలలకూ కళాశాలలకూ వెళ్తుంటారు. సెలవు దినాలలో మాత్రమే వాళ్ళు ఇళ్ళకు తిరిగివెళ్తారు. "కొంతమందికి ఉదయంపూట బడి ఉంటే మరి కొంతమంది మధ్యాహ్నం బడులకు వెళ్తారు. ఆ బడివేళలను బట్టి మేం ప్రాక్టీస్ చేసే సమయాన్ని నిర్ణయిస్తాం," అకాడమీ వ్యవస్థాపకుడైన రవి రాసకాటలా చెప్పారు.

"ఇక్కడి పిల్లలకు వివిధ రకాల క్రీడలకు అవకాశాలున్నాయి. కానీ రెండు పూటలా భోజనానికే కష్టపడే కుటుంబాలకు చెందిన వీరికి వాటిని వృత్తిగా స్వీకరించడం చాలా కష్టమవుతుంది," అంటారు రవి. ఈ అకాడమీని 2016లో స్థాపించడానికి ముందు ఈయన జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఆటలు నేర్పించేవారు. "నేను అటువంటి (గ్రామీణ ప్రాంత) పిల్లలకు చాలా చిన్న వయసు నుంచే ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను." అంటారు 49 ఏళ్ళ వయసున్న రవి. కోచింగ్, శిక్షణ, ఆహారం, బూట్ల కోసం ఈయన ఎప్పుడూ స్పాన్సర్ల కోసం వెతుకుతూవుంటారు.

Left: Five female athletes share a small tin room with three beds in the Shri Samarth Athletics Sports Residential Academy.
PHOTO • Jyoti Shinoli
Right: Eight male athletes share another room
PHOTO • Jyoti Shinoli

ఎడమ: శ్రీ సమర్థ్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ రెసిడెన్షియల్ అకాడమీలో ఐదుగురు మహిళా అథ్లెట్లు మూడు పడకలు ఉండే చిన్న తగరపురేకు గదిలో ఉంటారు. కుడి: మరొక గదిలో ఎనిమిదిమంది పురుష అథ్లెట్లు ఉంటారు

The tin structure of the academy stands in the middle of fields, adjacent to the Beed bypass road. Athletes from marginalised communities reside, study, and train here
PHOTO • Jyoti Shinoli

బీడ్ బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండే పొలాల మధ్యలో ఉన్న తగరపు రేకులతో నిర్మించిన అకాడమీ. అట్టడుగు వర్గాలకు చెందిన క్రీడాకారులు ఇక్కడ చదువుకుంటూ, శిక్షణ పొందుతూ, నివసిస్తుంటారు

అకాడమీ అనేది నీలం రంగు వేసివున్న ఒక తాత్కాలిక తగరపు రేకుల నిర్మాణం. ఇది బీడ్ బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న పొలాల మధ్యలో ఉంది. ఇది పర్‌భణీకి చెందిన అథ్లెట్ జ్యోతి గవతే తండ్రి శంకరరావుకు చెందిన ఒకటిన్నర ఎకరాల భూమిలో ఉంది. ఆయన రాష్ట్ర రవాణా కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేసేవాడు; జ్యోతి తల్లి వంటమనిషిగా పనిచేస్తున్నారు.

"మేం ఒక తగరపు రేకులు కప్పిన ఇంట్లో నివసించేవాళ్ళం. నా దగ్గర పెట్టుబడి కోసం కొంత డబ్బు కూడటంతో మేం సొంతానికి ఒక అంతస్తు ఇంటిని కట్టుకోగలిగాం. ఇప్పుడు మా అన్న (మహారాష్ట్ర పోలీస్ కాన్‌స్టేబుల్) కూడా ఇంతకుముందుకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు," పరుగుకే తన జీవితాన్ని అంకితం చేసిన జ్యోతి చెప్పారు. స్పోర్ట్స్ అకాడమీ కోసం 'రవి సర్'కి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఒప్పుకున్నారు. "ఇది పరస్పర అవగాహనతో చేసిన పని," అని ఆమె చెప్పారు.

అకాడమీలో ఉన్న స్థలాన్ని ఒక్కొక్కటి 15 x 20 అడుగుల పరిమాణంలో ఉన్న రెండు గదులుగా రేకులతో విభజించారు. అందులో ఒకటి బాలికల కోసం. వారు ఐదుగురూ అకాడమీకి దాతలు ఇచ్చిన మూడు పడకలను పంచుకుంటారు. మరొక గది అబ్బాయిల కోసం. వారి కోసం గచ్చు నేలపై వరుసగా పరుపులు పరచి ఉంటాయి.

రెండు గదులలోనూ ఒక్కో ట్యూబ్ లైట్, ఫ్యాన్ ఉన్నాయి; అరుదుగా తప్ప విద్యుత్ సరఫరా ఉండని ఆ ప్రదేశంలో అవి విద్యుత్ ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు వేసవిలో 42 డిగ్రీలకు పైగానూ, చలికాలంలో 14 డిగ్రీలకూ దిగిపోతుంటాయి.

మహారాష్ట్ర స్టేట్ స్పోర్ట్స్ పాలసీ 2012 , క్రీడాకారుల పనితీరును మెరుగుపరచడం కోసం క్రీడా సముదాయాలను, అకాడమీలను సమకూర్చటాన్ని, క్యాంపులు నిర్వహించడాన్ని, క్రీడా పరికరాలను అందించడాన్ని రాష్ట్రానికి తప్పనిసరి చేసింది.

"పది సంవత్సరాల ఆ విధానం కాగితాల మీదే మిగిలిపోయింది. దానిని నిజంగా అమలుపరచిందేమీ లేదు. ఇటువంటి ప్రతిభను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. క్రీడల అధికారులలో చాలా ఉదాసీనత ఉంది," అని రవి పేర్కొన్నారు.

భారతదేశ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ 2017లో దాఖలు చేసిన ఆడిట్ నివేదిక కూడా తాలూకా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ క్రీడలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే క్రీడా విధానం లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదని అంగీకరించింది.

Left: Boys showing the only strength training equipments that are available to them at the academy.
PHOTO • Jyoti Shinoli
Right: Many athletes cannot afford shoes and run the races barefoot. 'I bought my first pair in 2019. When I started, I had no shoes, but when I earned some prize money by winning marathons, I got these,' says Chhagan
PHOTO • Jyoti Shinoli

ఎడమ: అకాడమీలో తమకు అందుబాటులో ఉన్న కండరాల శక్తిని పెంచే ఏకైక శిక్షణా పరికరాలను చూపిస్తోన్న అబ్బాయిలు. కుడి: చాలామంది క్రీడాకారులు బూట్లు కొనలేరు, దాంతో దిసపాదాలతోనే పరుగు పందేలలో పాల్గొంటారు. 'నేను నా మొదటి బూట్ల జతను 2019లో కొన్నాను. నేను పరుగును ప్రారంభించినప్పుడు నా వద్ద బూట్లు లేవు, కానీ మారథాన్‌లలో గెలుపొంది కొంత ప్రైజ్ మనీ సంపాదించిన తర్వాత, నేను వీటిని కొనుక్కున్నాను' అని ఛగన్ చెప్పాడు

Athletes practicing on the Beed bypass road. 'This road is not that busy but while running we still have to be careful of vehicles passing by,' says coach Ravi
PHOTO • Jyoti Shinoli

బీడ్ బైపాస్ రోడ్డులో ప్రాక్టీస్ చేస్తోన్న క్రీడాకారులు. ‘ఇదేమంత రద్దీగా ఉండే రోడ్డు కాదు, కానీ పరుగెట్టేటపుడు పక్కనుంచి సాగిపోయే వాహనాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి,' అని కోచ్ రవి చెప్పారు

అకాడమీకి అయ్యే రోజువారీ ఖర్చులను ప్రైవేట్‌గా శిక్షణనివ్వడం ద్వారా జరుపుకొస్తానని రవి చెప్పారు. "ప్రస్తుతం ఉన్నతస్థాయి మారథాన్ పరుగులవీరులుగా ఉన్న నా విద్యార్థులలో చాలామంది తమకు బహుమతిగా వచ్చిన డబ్బును అకాడమీకి దానంగా ఇచ్చేస్తారు."

ద్రవ్య వనరులు, సౌకర్యాలు పరిమితంగానే ఉన్నప్పటికీ, అకాడమీ క్రీడాకారులకు పోషకాహారం అందుబాటులో ఉండేలా చూస్తుంది. వారానికి మూడు నుంచి నాలుగుసార్లు చికెన్ లేదా చేపలు అందిస్తారు. ఇతర రోజుల్లో, ఆకుపచ్చ కూరగాయలు, అరటి, జ్వారీ (జొన్న), బజ్రీ (సజ్జ) భాకరీలు (రొట్టెలు), మొలకెత్తిన మట్కీ , మూంగ్ (పెసర), చనా (శనగ) వంటి విత్తనాలు, గుడ్లు ఇస్తారు.

అథ్లెట్లు ఉదయం 6 గంటలకు తారు రోడ్డు మీద ప్రాక్టీస్ మొదలుపెట్టి 10 గంటలకు ముగిస్తారు. సాయంత్రం 5 గంటలకు అదే రహదారిపై వేగంగా పరుగెట్టడం (స్పీడ్ వర్క్) చేస్తారు. "ఇదేమంత రద్దీగా ఉండే రోడ్డు కాదు, కానీ పరుగెట్టేటపుడు పక్కనుంచి సాగిపోయే వాహనాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. నేను వారి భద్రత కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాను," అని వారి కోచ్ వివరించారు. "స్పీడ్ వర్క్ అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరం పరుగెట్టడం. రెండు నిముషాల 30 సెకండ్లలో ఒక కిలోమీటర్ దూరం పరుగెట్టడంలాంటిది."

జాతీయ స్థాయి క్రీడాకారిణి కావాలని కలలు కనే తమ కుమార్తె కలలు నెరవేరే రోజు కోసం వర్ష తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వర్ష 2021 నుండి మహారాష్ట్ర అంతటా జరిగే అనేక మారథాన్‌లలో పాల్గొంటోంది. “ఆమె పరుగులో రాణించాలని మేం కోరుకుంటున్నాం. మా అందరి సహకారాన్ని ఆమెకు అందిస్తాం. మాతో పాటు దేశం కూడా గర్వించేలా చేస్తుందామె," అని ఆమె తల్లి ఆనందంగా చెబుతున్నారు. "ఆమె పోటీల్లో పరుగెత్తడాన్ని చూడటమంటే మాకు చాలా ఇష్టం. ఇదంతా ఆమె ఎలా చేస్తుందో అని నాకు ఆశ్చర్యం,” అని వర్ష తండ్రి విష్ణు చెప్పారు.

2009లో వారికి వివాహమైన కొత్తల్లో ఈ జంట క్రమం తప్పకుండా వలస వెళ్ళేది. వారి పెద్ద బిడ్డ వర్షకు మూడేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు చెరకు కోత కూలీ పనుల కోసం తమ గ్రామం నుంచి వలస వెళ్ళేవారు. వారి కుటుంబం గుడారాల్లో నివాసముంటూ, నిత్యం పనుల కోసం తిరుగుతూ ఉండేది. "ట్రక్కుల్లో నిరంతరం ప్రయాణం చేయడం వల్ల వర్ష అనారోగ్యం పాలవుతోంది. దాంతో మేం అలా వెళ్ళడం మానేశాం," అని దేవశాల గుర్తుచేసుకున్నారు. బదులుగా వాళ్ళు తమ గ్రామం చుట్టుపక్కల పని కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడ "మహిళలకు రోజుకు 100 రూపాయలు, పురుషులకు 200 రూపాయలు లభిస్తాయి," అని విష్ణు చెప్పారు. అతను సంవత్సరంలో ఆరు నెలలు నగరానికి వలస వెళ్తారు. "నేను నాసిక్‌, పుణేలకు వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డుగానో, లేదా నిర్మాణ స్థలాల్లోనో పని చేస్తుంటాను. కొన్నిసార్లు నర్సరీలలో కూడా పనిచేస్తాను." విష్ణు ఐదారు నెలల్లో రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు సంపాదిస్తారు. దేవశాల ఇంట్లోనే ఉండి, వారి మిగతా పిల్లలు -  ఒక అమ్మాయి, ఒక అబ్బాయి - సరిగ్గా బడికి వెళ్ళేలా చూసుకుంటారు.

వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వర్ష తల్లిదండ్రులు వర్షకు సరైన బూట్లు కొనివ్వలేకపోయారు. కానీ ఈ చిన్నారి క్రీడాకారిణి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, "నేను నా వేగం పైనా, పరుగెత్తడంలోని సాంకేతికతపైనా ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను," అంటోంది.

Devshala’s eyes fills with tears as her daughter Varsha is ready to go back to the academy after her holidays.
PHOTO • Jyoti Shinoli
Varsha with her father. 'We would really like to see her running in competitions. I wonder how she does it,' he says
PHOTO • Jyoti Shinoli

ఎడమ: సెలవులు పూర్తయిన తర్వాత అకాడమీకి తిరిగివెళ్ళేందుకు వర్ష సిద్ధమవుతున్నపుడు కళ్ళనీరు పెట్టుకుంటోన్న వర్ష తల్లి దేవశాల. కుడి: తన తండ్రితో వర్ష. 'ఆమె పోటీలలో పరుగుపెడుతుండగా చూడటమంటే మాకు నిజంగా చాలా ఇష్టం. ఆమె ఇదంతా ఎలా చేస్తుందా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది,' అంటారు విష్ణు

*****

ఛగన్ బోంబలే ఒక మారథాన్ రన్నర్. అతను ఒక జత బూట్లు కొనుక్కోవడానికి తన మొదటి పోటీలో గెలిచేంతవరకూ వేచి ఉండాల్సి వచ్చింది. "నేను నా మొదటి జతను 2019లో కొనుగోలు చేశాను. నేను పరుగు ప్రారంభించినప్పుడు, నా వద్ద బూట్లు లేవు. కానీ మారథాన్‌లలో గెలుపొంది కొంత ప్రైజ్ మనీ సంపాదించిన తర్వాత, నేను వీటిని కొనుక్కోగలిగాను," అప్పుడే తాను ధరిస్తోన్న చిరిగిపోయిన బూట్ల జతను మాకు చూపిస్తూ చెప్పాడతను.

22 ఏళ్ళ ఛగన్ ఆంధ్ తెగకు చెందిన వ్యవసాయ కూలీల కుమారుడు. అతని కుటుంబం హింగోలి జిల్లాలోని ఖంబాళాలో నివసిస్తోంది.

అతని వద్ద ఇప్పుడు బూట్లు ఉన్నప్పటికీ, సాక్స్ కొనుక్కునే స్తోమత లేకపోవడంతో, అతని అరిగిపోయిన అరికాళ్ళు తారు రహదారి కఠినత్వాన్ని అనుభవిస్తూ ఉంటాయి. "అవును, ఇది బాధిస్తుంది. సింథటిక్ ట్రాక్‌లు, మంచి బూట్లు రెండూ రక్షణను అందివ్వడంతో పాటు తక్కువగా గాయాలవుతాయి,” అని అతను ఈ విలేఖరికి వాస్తవాన్ని తెలియజేశాడు. “మాకు నడవడం, చుట్టుపక్కల పరుగెత్తడం, ఆడుకోవడం, కొండలు ఎక్కడం, మా తల్లిదండ్రులతో కలిసి చెప్పులు లేకుండా పొలంలో పనిచేయడం వంటివి అలవాటే. కాబట్టి, ఇదేమంత పెద్ద విషయం కాదు,” అంటూ అతను సాధారణంగా తగిలే గాయాలు, కోతలను గురించి అంతగా పట్టించుకోవలసినవి కానట్టు తోసేస్తూ చెప్పాడు.

ఛగన్ తల్లిదండ్రులైన మారుతి, భాగీరతలకు సొంత భూమి లేదు. వ్యవసాయపు పనులు చేయడం ద్వారా వచ్చే కూలిపై ఆధారపడినవారు. "కొన్నిసార్లు మేం పొలంలో పనిచేస్తాం. కొన్నిసార్లు రైతుల ఎద్దులను మేపడానికి తోలుకుపోతాం. మా దగ్గరకు వచ్చిన ప్రతి పనినీ చేస్తాం," అంటారు మారుతి. వారిద్దరూ కలిసి రోజుకు రూ. 250 సంపాదిస్తారు. అయితే, నెలలో 10-15 రోజులు మాత్రమే వారికి పని దొరుకుతుంది.

కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం పరుగులు తీసే వారి కొడుకైన ఛగన్, నగర, తాలూకా , రాష్ట్ర, దేశ స్థాయిలలో జరిగే మారథాన్‌లలో పాల్గొంటూవుంటాడు. "మొదటి ముగ్గురు విజేతలకు డబ్బు బహుమతిగా లభిస్తుంది. కొన్నిసార్లు రూ. 10,000, మరికొన్నిసార్లు రూ. 15,000," చెప్పాడతను. "నేను ఏడాదిలో 8 నుంచి 10 వరకూ మారథాన్‌లలో పాల్గొంటుంటాను. అన్ని పోటీలనూ గెలవటం కష్టం. 2022లో నేను రెండింట్లో గెలిచాను, మరో మూడింటిలో రన్నర్-అప్‌గా నిలిచాను. అప్పుడు రూ. 42,000 వరకూ సంపాదించాను."

Left: 22-year-old marathon runner Chhagan Bomble from Andh tribe in Maharashra
PHOTO • Jyoti Shinoli
Right: Chhagan’s house in Khambala village in Hingoli district. His parents depend on their earnings from agriculture labour to survive
PHOTO • Jyoti Shinoli

ఎడమ: మహారాష్ట్రలోని ఆంధ్ తెగకు చెందిన 22 ఏళ్ళ మారథాన్ రన్నర్ ఛగన్ బోంబలే. కుడి: హింగోలి జిల్లాలోని ఖంబాళా గ్రామంలో ఉన్న ఛగన్ ఇల్లు. వ్యవసాయకూలీలుగా వారికి వచ్చే ఆదాయమే అతని తల్లిదండ్రులకు జీవనాధారం

ఖంబాళా గ్రామంలోని ఛగన్ ఒంటిగది ఇంటి నిండా పతకాలు, ట్రోఫీలే. అతనికి వచ్చిన పతకాల గురించీ, సర్టిఫికేట్ల గురించీ అతని తల్లిదండ్రులు చాలా గర్వపడతారు. "మేము అనారి (చదువురాని) జనాలం. మా కొడుకు పరుగు ద్వారా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడు," అంటారు 60 ఏళ్ళ మారుతి. "ఇది ఏ బంగారం కంటే కూడా గొప్పదే," తమ మట్టి ఇంటిలో నేలపై పరచివున్న పతకాలనూ సర్టిఫికెట్లనూ చూపించి మురిసిపోతూ చెప్పారు ఛగన్ తల్లి, 56 ఏళ్ళ వయసున్న భాగీరత.

"నేను పెద్ద పోటీలకు తయారవుతున్నాను. ఒలింపిక్ క్రీడాకారుడిని కావాలనుకుంటున్నాను," అంటాడు ఛగన్. అతని స్వరంలో స్పష్టమైన పట్టుదల ఉంది. కానీ అతనికి అసమానతల గురించి తెలుసు. “మాకు కనీసంగానైనా ప్రాథమిక క్రీడా సౌకర్యాలు కావాలి. పరుగు తీసేవారికి తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ దూరం పరుగెత్తడం ఉత్తమ స్కోరు. మట్టి లేదా తారు రోడ్లపై పరుగెత్తే సమయానికీ, సింథటిక్ ట్రాక్‌లపై పరుగు తీసే సమయానికీ తేడా ఉంటుంది. ఫలితంగా, దేశీయ, అంతర్జాతీయ పరుగు పోటీలకు లేదా ఒలింపిక్స్‌కు ఎంపిక కావడం కష్టమవుతుంది,” అని వివరించాడు.

పర్‌భణీ యువ క్రీడాకారులు తమ కండరాల బలాన్ని పెంచుకోవడానికి రెండు డంబెల్స్, ఒక కడ్డీతో ఉన్న నాలుగు పివిసి జిమ్ ప్లేట్‌లతో శిక్షణ తీసుకోవాల్సివస్తోంది. "పర్‌భణీలోనే కాకుండా, మొత్తం మరాఠ్వాడాలోనే ఒక్క రాష్ట్ర అకాడమీ కూడా లేదు" అని రవి ధృవీకరించారు.

వాగ్దానాలు, విధానాలు విరివిగా ఉన్నాయి. ఇప్పటికి 10 సంవత్సరాల కంటే ఎక్కువే పాతదైన 2012 రాష్ట్ర క్రీడా విధానం, తాలూకా స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇచ్చింది. ఖేలో ఇండియా కార్యక్రం కింద ప్రతి జిల్లాలోనూ ఒకటి చొప్పున 36 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.3.6 కోట్ల నిధులను అందించారు.

Left: Chhagan participates in big and small marathons at city, taluka, state and country level. His prize money supports the family. Pointing at his trophies his mother Bhagirata says, 'this is more precious than any gold.'
PHOTO • Jyoti Shinoli
Right: Chhagan with his elder brother Balu (pink shirt) on the left and Chhagan's mother Bhagirata and father Maruti on the right
PHOTO • Jyoti Shinoli

ఎడమ: నగరం, తాలూకా, రాష్ట్ర, దేశ స్థాయిలలో జరిగే చిన్నా పెద్దా మారథాన్‌లన్నింటిలో ఛగన్ పాల్గొంటాడు. అతను గెల్చుకునే నగదు బహుమతి అతని కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. అతని ట్రోఫీలవైపు చూపిస్తూ తల్లి భాగీరత, 'ఏ బంగారం కంటే కూడా ఇవి చాలా విలువైనవి,' అంటారు. కుడి: ఎడమవైపున తన అన్న బాలు (పింక్ చొక్కా)తోనూ, కుడివైపున తల్లిదండ్రులైన భాగీరత, మారుతిలతోనూ ఛగన్

జనవరి 2023లో మహారాష్ట్ర రాష్ట్ర ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించినట్లుగా, భారతదేశపు ‘స్పోర్ట్స్ పవర్‌హౌస్’గా పేరొందిన గ్రామీణ మహారాష్ట్రకు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 122 కొత్త క్రీడా సముదాయాలు ఇంకా రావలసివుంది.

పర్‌భణీ జిల్లా క్రీడల అధికారి నరేంద్ర పవార్ టెలిఫోన్‌లో మాట్లాడుతూ, "మేం అకాడమీని నిర్మించేందుకు స్థలం కోసం చూస్తున్నాం. ఒక తాలూకా స్థాయి క్రీడా సముదాయం కూడా నిర్మాణంలో ఉంది," అని చెప్పారు.

ఏది నమ్మాలో అకాడమీ వద్దనున్న అథ్లెట్లకు తెలియటంలేదు. "ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినప్పుడే రాజకీయ నాయకులు, పౌరులు కూడా మా ఉనికిని గుర్తించడం అనేది చాలా విచారకరం" అన్నాడు ఛగన్. “అయితే అప్పటి వరకు ఎవరికీ కనిపించం; ప్రాథమిక క్రీడా మౌలిక సదుపాయాల కోసం మేం చేసే పోరాటం కనిపించదు. న్యాయం కోసం పోరాడుతోన్న మన ఒలింపియన్ రెజ్లర్లు మద్దతుకు బదులుగా క్రూరత్వాన్ని చవిచూడటాన్ని చూసినప్పుడు నాకు ఇది మరింత ఎక్కువగా అనిపించింది."

“కానీ క్రీడాకారులు పోరాటయోధులు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌ల కోసమైనా, నేరాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం చేసే పోరాటం అయినా, మా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాం," నవ్వుతూ చెప్పాడతను.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jyoti Shinoli

জ্যোতি শিনোলি পিপলস্‌ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার বরিষ্ঠ প্রতিবেদক। এর আগে তিনি 'মি মারাঠি' মহারাষ্ট্র ১' ইত্যাদি সংবাদ চ্যানেলে কাজ করেছেন।

Other stories by জ্যোতি শিনোলী
Editor : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli