పేరు: వజేసింగ్ పార్గీ. జననం: 1963. గ్రామం: ఇతవా. జిల్లా: దాహోద్, గుజరాత్. సముదాయం: ఆదివాసీ పంచమహాలీ భీల్. కుటుంబ సభ్యులు: తండ్రి, చిస్కా భాయి. తల్లి, చతుర బెన్. ఐదుగురు తోబుట్టువులు. వీరిలో వజేసింగ్ పెద్దవారు. కుటుంబ జీవనాధారం: వ్యవసాయ కూలీ.
నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టిన తన వారసత్వం గురించి వజేసింగ్ మాటల్లోనే: 'అమ్మ కడుపులోని అంధకారం.' 'ఎడారి వంటి ఒంటరితనం.' 'బావి నిండేంత చెమట.' దుఃఖంతో నిండిన 'ఆకలి,' 'మిణుగురుల కాంతి.' పుట్టుకతోనే వచ్చిన పదాల పట్ల ప్రేమ కూడా ఉంది.
ఒకసారి, అనుకోకుండా ఒక పోరాటం మధ్యలోకి వెళ్ళటంతో అప్పటికి యువకుడిగా ఉన్న ఈ ఆదివాసీ కవి దవడనూ మెడనూ చీల్చుకుంటూ ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఏడు సంవత్సరాల చికిత్స, 14 శస్త్రచికిత్సలు, తీర్చలేని అప్పుల తర్వాత కూడా ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోయారు. ఆ గాయం వలన ఆయన గొంతు కూడా దెబ్బతిన్నది. అది ఆయనకు రెట్టింపు దెబ్బ. ఒక స్వరమేలేని సమాజంలో పుట్టిన ఆయనకు, వ్యక్తిగా ఒక బహుమతిగా పొందిన స్వరం కూడా ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్నది. ఆయన కళ్ళు మాత్రమే ఎప్పటిలాగే తీక్షణంగా ఉన్నాయి. ఎంతోకాలానికి గుజరాతీ సాహిత్యం చూసిన అత్యుత్తమ ప్రూఫ్ రీడర్ వజేసింగ్. అయితే, ఆయన స్వంత రచనలు మాత్రం అంతగా వాటికి రావలసిన ప్రాచుర్యాన్ని పొందలేకపోయాయి.
తన సందిగ్ధావస్థను ప్రతిబింబిస్తూ వజేసింగ్, మూల భాష అయిన పంచమహాలీ భీలీని గుజరాతీ లిపిలో రాసిన కవితకు ఇది తెలుగు అనువాదం.
મરવું હમુન ગમતું નથ
ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો
પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્યાં હમું વહવાયાં
હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય
કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્યા
ઉનાળે હમહમતા ર્યા
સુમાહે લદબદતા ર્યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો
નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં
વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ
રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.
నాకు చావాలని లేదు
కొండ చరియలు నేలకూలినప్పుడు,
కనమ లోయలు ఎండిపోయినప్పుడు
పల్లె పల్లె అడవుల పైకి దండయాత్రకు దిగినప్పుడు,
గాండ్రింపుల, కూతల ఘడియలు
గతమై పాయె,
గాలితో, ఒకటైపాయె
కొన ఊపిరి కూడ నిలవకపాయె,
మురళిని మోగించే నా రొమ్ములో;
అయినా, ఈ కడుపు గుహలో మిగిలింది ఖాళీయే.
అప్పుడే, నా ఊరిని వెనకిడిచా,
నన్ను నేను వెలి వేసుకున్న.
పరాయి ప్రాంతంలో,
గుర్తు తెలియని వెర్రి పట్టణంలో,
గతి లేక, గత్యంతరం లేక,
దిగబడ్డ మేము,
మా అడవి మూలాలను లోతుగా
నాటుతామనే భయంతో
నగర-నాగులు మాకు ఏ చోటూ ఇవ్వకపాయె
గవ్వంత నేల విడువకపాయె,
కాలైన ఆననివ్వకపాయె.
ప్లాస్టిక్ పరదాల నడుమ బతుకులు మావి,
చలికి జడుస్తూ
ఎండకి చమటోడుస్తూ
వానకి నానుతూ.
మా చేతులార కట్టిన మేడల్లో
మాకు తావు లేకపాయె.
కూడలి తోవల్లో వేలం పాడే,
చెమటోడ్చిన మా శ్రమను అమ్ముకునే
గొడ్డుల వోలె,
మమ్మల్ని కొంచానికి అమ్మి పారేసే.
నా వెన్నును చొచ్చుకుంటూ,
తేలు కాటులాగా, ముళ్ళలాగా,
మామా, లంగోటియా
-
వికారమైన, గోచిపాతల ఆదివాసులు
అనే ఎగతాళి కుచ్చుకుపాయె,
ఆ విషం నా తలకెక్కే
ఈ నరకయాతనను
ఈ దినసరి తలవంపులను
ఈ దిక్కుమాలిన బతుకును వదిలెల్లాలనిపించే.
ఊరు తిరిగెల్లాలని
దాని ఒడిలో తల వాల్చాలనిపించే,
కానీ, అక్కడొక పాము దాపరించింది,
ఆకలి దప్పుల బుసలు కొడుతున్నది
మింగివేయ వేచి చూస్తున్నది
కానీ నాకు,
నాకు చావాలని లేదు...
కవి వజేసింగ్ పార్గీ ప్రస్తుతం దాహోద్‌లోని కైజర్ మెడికల్ నర్సింగ్ హోమ్‌లో నాలుగవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
అనువాదం:
పాఠ్యం: సుధామయి
సత్తెనపల్లి
పద్యం: నీహారికా
రావ్ కమలం